
చీరలు కొనుగోలు చేస్తున్న మహిళలు(ఫైల్)
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులందరూ సంప్రదాయ దుస్తులలో రావాలని చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. అమ్మవారి సన్నిధిలో ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తులను ధరించాలనే నిబంధనతో పాటు ఆలయంలోకి సెల్‌ఫోన్లు తీసుకువెళ్లడం నిషేధం. ఈ రెండు దుర్గగుడి దేవస్థానంలో అమలు కావడం లేదు. సెల్‌ఫోన్ల నిషేధం మూడేళ్ల కిందట నుంచి అమలు చేస్తుండగా, జనవరి 1వ తేదీ నుంచి డ్రస్ కోడ్‌ను అమలు చేస్తున్నారు. సెల్‌ఫోన్ కౌంటర్ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్‌పై కొన్ని ఆరోపణలు రావడంతో దేవస్థానమే స్వయంగా కౌంటర్లు నిర్వహిస్తుంది.
ఆలయంలోకి సెల్‌ఫోన్లు తీసుకువెళ్లకుండా దేవస్థాన సిబ్బంది నియంత్రించలేకపోతున్నారు. కొంత మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బోర్డులను చూసి తమ సెల్‌ఫోన్లను కౌంటర్లలో భద్రపరుస్తున్నారు. వీఐపీలు, రూ.100, రూ.300 టికెటుపై వచ్చిన భక్తుల వద్ద సెల్‌ఫోన్లు కనిపించడం, దర్శనం తర్వాత వారు ఆలయ ప్రాంగణంలోనూ, రాజ గోపురం వద్ద అమ్మవారి ప్రతిమల వద్ద ఫొటోలు దిగుతూ కనిపించడంతో కౌంటర్లలో సెల్‌ఫోన్లు పెట్టిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని కౌంటర్‌లలోని సిబ్బందిని ప్రశ్నిస్తే క్యూలైన్ల వద్ద తనిఖీలు లేవని, కౌంటర్లలో ఫోన్లు పెట్టిన వారివే తాము భద్రపరుస్తామని పేర్కొం టున్నారు. ఆలయ అధికారులలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో, ఆలయంలో అమలు చేసే ని యమ నిబంధనలను సాధారణ భక్తులకే అమలుచేయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు.
క్యూలైన్‌లో వచ్చే వారికే డ్రస్ కోడ్
దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో జనవరి 1వ తేదీ నుంచి డ్రస్ కోడ్ అమలు చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే సాధారణ భక్తులకే డ్రస్ కోడ్ అమలు చేయడంపై భక్తుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. ఘాట్‌రోడ్డు, మమా మండపం మెట్లు, లిప్టు ద్వారా వచ్చే భక్తులకు ఖచ్చితంగా డ్రస్‌కోడ్ అమలు చేస్తున్నారు. డ్రస్‌కోడ్ కోసం దేవస్థానం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి రూ.100 చీరలను విక్రయిస్తుంది. కొంతమంది ప్రముఖులు, వీఐపీలు, ప్రొటోకాల్ ఉన్న వారు డ్రస్ కోడ్ పాటించడకుండా ఆలయానికి చేరుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ వంటి శాఖలతో పాటు మరి కొన్ని శాఖలకు చెందిన అధికారులు అమ్మవారి దర్శనానికి విచ్చేసినప్పుడు వారి సిబ్బంది దగ్గర ఉండి మరీ దర్శనాలు చేయిస్తున్నారు.
ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు ఎటువంటి డ్రస్ కోడ్ అమలు కాదా అంటూ ఆలయ సిబ్బందిపై మహిళా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఫిర్యాదులు చేసే వరకు వెళ్లుతున్నారు. తాజాగా గురువారం ఓ భక్తురాలు డ్రస్ కోడ్ పాటించడం లేదని వెనక్కి పంపిన సెక్యూరిటీ సిబ్బంది, కొద్ది నిమిషాలలోనే ప్రొటోకాల్ ఉన్న వారికి ఎటువంటి డ్రస్ కోడ్ పాటించడకుండా అమ్మవారి దర్శనానికి పంపడం ఆ భక్తురాలు గమనించింది. అటు సెక్యూరిటీ సిబ్బందితో పా టు ఘాట్‌రోడ్డులోని సమాచార కేంద్రం లోని సిబ్బందిౖపై చిందులు తొక్కింది. దేవస్థాన అధికా రులు భక్తులందరిని ఒకేలా చూడాలని, అలా చేతకాని పక్షంలో నిబంధనలు పెట్టడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవస్థానంలో ఓ నిబంధన పెట్టినప్పుడు దానిని సక్రమంగా అమలు చేసేవిధంగా కొంతమంది అధికారులకు బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉంది. సెల్‌పోన్లు నిషేధం, డ్రస్ కోడ్ సక్రమంగా జరిగేలా పర్యవేక్షకులు లేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment