ఉత్తమమైతే తెలుపు.. వెనుకంజలో ఉంటే ఎరుపు
మలప్పురం: కేరళలోని మలప్పురంలో ఓ పాఠశాల తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా రెండు వేర్వేరు డ్రెస్ కోడ్‌లు అమలు చేసేందుకు సిద్ధమైంది. తెలివైన విద్యార్థులు, తెలివి తక్కువ విద్యార్థులు అని విభజించి వారికి యూనిఫాం నిబంధనను విధించటంపై తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పండిక్కడ్ ప్రాంతంలోని అల్ ఫరూఖ్ ఇంగ్లిష్ స్కూల్లో 900 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది నుంచి కొత్త డ్రెస్ కోడ్ అమలు చేయాలని పాఠశాల నిర్ణయించింది. తెలివైన విద్యార్థులకు తెలుపు యూనిఫాం, చదువులో వెనుకంజలో ఉన్న వారు ఎరుపు గళ్ల చొక్కాను యూనిఫాంగా ధరించాలని ఆదేశించింది.
చదువులో వెనకంజలో ఉన్న విద్యార్థుల్లో కసి పెంచటం, పోటీతత్వాన్ని పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. అయితే, పిల్లలపై ఇలాంటి వివక్షత చూపటం సరికాదని చైల్డ్ లైన్ సమన్వయకర్త అన్వర్ కరకాదన్ అన్నారు. ఈ అంశంపై పూర్తి నివేదికను విద్యాశాఖకు అందజేసినట్లు తెలిపారు.