
కేరళ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహంగా అదానీ గ్రూప్ వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టే ప్రణాళికలను ప్రకటించింది. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిని పెంచడం, అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా ఈ పెట్టుబడులు ఉండబోతున్నట్లు తెలిపింది. ‘ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్ 2025’ సందర్భంగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ (ఏపీఎస్ఈజెడ్) మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ ఈమేరకు ప్రకటన చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సదస్సును ప్రారంభించారు.
కీలక పెట్టుబడి రంగాలు
విజింజం పోర్టు అభివృద్ధి: రూ.20,000 కోట్ల పెట్టుబడిలో గణనీయమైన భాగాన్ని విజింజం పోర్టు అభివృద్ధికి మళ్లించనున్నారు. అదానీ గ్రూప్ ఇప్పటికే ఈ ప్రాజెక్టులో రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. విజింజం పోర్టును దేశంలోనే మొదటి ట్రాన్స్ షిప్‌మెంట్ హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
త్రివేంద్రం అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ: తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యాన్ని 45 లక్షల ప్రయాణికుల నుంచి 1.2 కోట్లకు పెంచేందుకు అదానీ గ్రూప్ రూ.5,500 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇది విమానాశ్రయం మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది.
కొచ్చి లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్ హబ్: కొచ్చిలో లాజిస్టిక్స్, ఈ-కామర్స్ హబ్‌ను ఏర్పాటు చేసి అదానీ గ్రూప్ ఈ రంగంలో కేరళ స్థానాన్ని మరింత బలోపేతం చేయనుంది. సమర్థవంతమైన సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్‌ను ఈ హబ్ సులభతరం చేస్తుంది. రాష్ట్రంలో పెరుగుతున్న ఈ-కామర్స్ పరిశ్రమకు మద్దతు ఇస్తుంది.
సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు: కొచ్చిలో తన సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని అదానీ గ్రూప్ ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. ఈ పెట్టుబడి నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగాలకు తోడ్పడుతుంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది.
ఇదీ చదవండి: మస్క్, బెజోస్‌ను మించిన ‘బ్లాక్‌పాంథర్’ సంపద
అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
కేరళ పురోగతికి అదానీ గ్రూప్ కట్టుబడి ఉందని కరణ్ అదానీ నొక్కిచెప్పారు. కేరళ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ఈ వృద్ధిలో అదానీ గ్రూప్ భాగం కావడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. సంస్థ ప్రకటించిన ఈ పెట్టుబడులు వేలాది ఉద్యోగాలను సృష్టిస్తాయని చెప్పారు. స్థానిక వ్యాపారాలను పెంచుతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు.