న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ పర్యావరణహిత(గ్రీన్) ఇంధనం(ఎనర్జీ)కి మరింత ప్రాధాన్యత ఇస్తోంది. 2030కల్లా 45 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించాలని ఆశిస్తోంది. ఇందుకు అనుగుణంగా అదానీ కుటుంబం రూ. 9,350 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధపడుతోంది. గ్రూప్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(ఏజీఈఎల్) ప్రమోటర్ కుటుంబీకులతోపాటు ఆర్డౌర్ ఇన్వెస్ట్‌మెంట్, హోల్డింగ్ లిమిటెడ్, అదానీ ప్రాపర్టిస్ ప్రయివేట్ లిమిటెడ్‌కు మొత్తం 6.31 కోట్ల వారంట్లను జారీ చేయనుంది.
ఒక్కో వారంట్‌ను రూ. 1,480.75 ధరలో కేటాయించేందుకు కంపెనీ బోర్డు తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనున్నట్లు అదానీ గ్రీన్ పేర్కొంది. తాజా పెట్టుబడుల కారణంగా కంపెనీలో ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు 3.83 శాతం వాటా లభించనుంది. వచ్చే ఏడాది 1.2 బిలియన్ డాలర్ల విలువైన బాండ్ల గడువు తీరనుంది. ఇప్పటికే వీటి చెల్లింపులు లేదా రీఫైనాన్సింగ్‌కు కంపెనీ ప్రణాళికలు వేసింది. 19.8 గిగావాట్ల విద్యుత్ కొనుగోలుకి అదానీ గ్రీన్ ఇప్పటికే ఒప్పందాన్ని పీపీఏ కుదుర్చుకుంది. ప్రమోటర్ పెట్టుబడుల వార్తలతో అదానీ గ్రీన్ షేరు బీఎస్‌ఈలో 4.3 శాతం ఎగసి రూ. 1,600 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment