![Adani Green Energy decided to withdraw projects on srilanka in February 2025](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/adani01.jpg.webp?itok=FLEfBTbR)
న్యూఢిల్లీ: శ్రీలంకలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం టారిఫ్‌లను పునఃసమీక్షించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అక్కడ తలపెట్టిన రెండు పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) వైదొలిగింది. అయితే, శ్రీలంకలో పెట్టుబడులకు తమ సంస్థ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో ప్రభుత్వం కోరుకుంటే తప్పకుండా కలిసి పని చేస్తామని సంస్థ తెలిపింది.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీలంకలోని మన్నార్, పూనెరిన్ ప్రాంతాల్లో దాదాపు 740 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏజీఈఎల్ 484 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాల్సి ఉంది. 2026 మధ్య నాటికి ఇవి పూర్తి కావాలి. అయితే, వీటితో పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందంటూ పర్యావరణవేత్తల ఆందోళనలు చేపట్టి, లీగల్ కేసులు వేయడంతో ఈ ప్రాజెక్టులకు ప్రారంభం నుంచే అడ్డంకులు ఎదురయ్యాయి. ఇక గత ప్రభుత్వం ప్రతిపాదిత అదానీ విండ్ పవర్ ప్లాంటు నుంచి యూనిట్‌కు 0.0826 డాలర్ల ధరకు విద్యుత్ కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. కానీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు రేటును యూనిట్‌కు 0.06 స్థాయికి తగ్గించేలా టారిఫ్‌లను పునఃసమీక్షించాలని జనవరిలో నిర్ణయించింది. ఇది ఆమోదయోగ్యమైన ధర కాకపోవడంతో ప్రాజెక్టుల నుంచి తప్పుకోవాలని ఏజీఈఎల్ నిర్ణయం తీసుకుంది. అయితే, అదానీ గ్రూప్ 700 మిలియన్ డాలర్లతో కొలంబోలో తలపెట్టిన పోర్టు అభివృద్ధి పనులు యథాప్రకారం సాగనున్నాయి.
ఇదీ చదవండి: హోండా, నిస్సాన్ పొత్తు లేనట్టే!
యూపీఎమ్‌కు టీసీఎస్ సేవలు
ఐటీ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో ఏఐ మద్దతు
న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఫిన్‌లాండ్ సంస్థ యూపీఎమ్‌తో ఐటీ ట్రాన్స్‌ఫార్మేషన్ సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రీసైక్లబుల్ ప్రొడక్టులను రూపొందించడంలో ప్రత్యేకత కలిగిన యూపీఎమ్ పునరుత్పాదక ఇంధన మెటీరియల్స్‌ను ముడిసరుకులుగా వినియోగిస్తోంది. 11 దేశాలలో కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ 10.3 బిలియన్ యూరోల టర్నోవర్‌ను కలిగి ఉంది. యూపీఎమ్ వృద్ధికి డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ సహకరించనున్నట్లు ఒప్పందం సందర్భంగా టీసీఎస్ పేర్కొంది. తద్వారా ఏఐ ఫస్ట్ ఆపరేటింగ్ మోడల్‌ను అందిపుచ్చుకోనున్నట్లు తెలియజేసింది. అయితే ఒప్పందం(కాంట్రాక్ట్) విలువను వెల్లడించలేదు. యూపీఎమ్ ఎంటర్‌ప్రైజ్ ఐటీ వేల్యూ చైన్‌ను పటిష్టపరిచే బాటలో ఏఐ ఆధారిత అటానమస్ ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫామ్ ఇగ్నియోను వినియోగించనున్నట్లు టీసీఎస్ వెల్లడించింది. అంతేకాకుండా యూపీఎమ్‌కు చెందిన 15,800 మంది ఉద్యోగులు, మెషీన్ల మధ్య మరింత భాగస్వామ్యానికి ఏఐ ద్వారా మద్దతివ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment