గ్రీన్‌ హైడ్రోజన్‌.. గేమ్‌ చేంజర్‌! | Green hydrogen be a game changer In India | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ హైడ్రోజన్‌.. గేమ్‌ చేంజర్‌!

Dec 18 2024 6:07 AM | Updated on Dec 18 2024 6:07 AM

Green hydrogen be a game changer In India

ఉత్పత్తి వ్యయాన్ని భారీగా తగ్గించడంపై కంపెనీల ఫోకస్‌ ]

ఏఐ సహా అధునాతన టెక్నాలజీల వాడకం

ప్రస్తుతం కేజీ ఉత్పాదక వ్యయం 4–5 డాలర్లు 

దీన్ని 1–2 డాలర్లకు చేర్చడమే లక్ష్యం

రిలయన్స్, అదానీ, అవాడా, హైజెన్కో, థెర్మాక్స్‌ భారీ ప్రణాళికలు

హైడ్రోజన్‌ కార్లు.. బస్సులు.. రైళ్లు.. నౌకలు.. పరిశ్రమలు... ఇలా ప్రపంచమంతా ఇప్పుడు గ్రీన్‌ హైడ్రోజన్‌ నామ జపం చేస్తోంది! పునరుత్పాదక ఇంధన రంగంలో గేమ్‌ చేంజర్‌గా అభివరి్ణస్తున్న గ్రీన్‌ హైడ్రోజన్‌ కోసం భారత్‌ కూడా వేట మొదలుపెట్టింది. దేశీ కార్పొరేట్‌ దిగ్గజాలైన రిలయన్స్, అదానీ గ్రూపులతో పాటు అవాడా, హైజెన్కో 
గ్రీన్‌ ఎనర్జీస్, థెర్మాక్స్‌ వంటి సంస్థలు ఈ రంగంలో  ఇప్పటికే భారీ ప్రణాళికలతో చకచకా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ నయా ఇంధనాన్ని వినియోగదారులకు చౌకగా అందించేందుకు ఉత్పాదక వ్యయాన్ని రెండింతలకు పైగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 

ప్రస్తుతం దేశంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పాదక వ్యయం ఒక్కో కేజీకి 4–5 డాలర్లు (దాదాపు రూ.340–430)గా ఉంటోంది. అదే గ్రే హైడ్రోజన్‌ ఉత్పత్తి ఖర్చు 1–2 డాలర్లు (రూ.85–170) మాత్రమే. గ్రే హైడ్రోజన్‌ ఉత్పత్తి కాలుష్యకరమైనది కావడంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో కంపెనీలు గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పాదక వ్యయాన్ని గణనీయంగా తగ్గించడంపై దృష్టిపెట్టాయి. సరికొత్త టెక్నాలజీలతో పాటు వినూత్న ఉత్పత్తులు, ఇతరత్రా మార్గాలను ఎంచుకుంటున్నాయి. 2030 నాటికి భారత్‌ ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న 50 లక్షల వార్షిక టన్నుల ఉత్పత్తి లక్ష్యం సాకారం కావాలంటే, ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడం చాలా కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. 

టెక్నాలజీ దన్ను... 
గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పాదనలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో పాటు అధునాతన ఎనలిటిక్స్‌ను అవాడా గ్రూప్‌ ఉపయోగిస్తోంది. ‘అత్యాధునిక ఎలక్ట్రోలైజర్‌ టెక్నాలజీ వల్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం మెరుగుపడి, హైడ్రోజన్‌ ఉత్పత్తికి తక్కువ విద్యుత్‌ అవసరమవుతుంది. దీంతో వ్యయం భారీగా దిగొస్తోంది’ అని కంపెనీ చైర్మన్‌ వినీత్‌ మిట్టల్‌ పేర్కొన్నారు. హైజెన్కో సంస్థ అయితే, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), ఏఐతో పాటు మెషీన్‌ లెరి్నంగ్‌ను ఉపయోగించి గ్రీన్‌ హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటోంది. 

కంపెనీ ఒడిశాలోని గోపాల్‌పూర్‌లో 1.1 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో గ్రీన్‌ అమోనియా ప్రాజెక్టును నెలకొల్పే ప్రణాళికల్లో ఉంది. వెల్‌స్పన్‌ న్యూ ఎనర్జీ కూడా గ్రీన్‌ హైడ్రోజన్‌ను చౌకగా అందించేందుకు సౌర, పవన విద్యుత్‌తో పాటు బ్యాటరీల్లో స్టోర్‌ చేసిన విద్యుత్‌ను కూడా ఉపయోగిస్తోంది. అంతేకాకుండా పెద్దయెత్తున జల విద్యుత్‌ను కూడా వినియోగించే సన్నాహాల్లో ఉన్నట్లు కంపెనీ సీఈఓ కపిల్‌ మహేశ్వరి పేర్కొన్నారు. ఇక గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తికి అవసరమైన మాడ్యూల్స్‌ తయారీ, విక్రయం, సరీ్వస్‌ కోసం థర్మాక్స్‌ బ్రిటన్‌కు చెందిన సెరెస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా దాని ఆక్సైడ్‌ ఎల్రక్టాలిసిస్‌ టెక్నాలజీని ఉపయోగించుకోనుంది.  తక్కువ ఉష్ణోగ్రతతో కూడిన ఎలక్ట్రాలిసిస్‌ సాంకేతికతతో పోలిస్తే ఇది 25% మెరుగైనదని సంస్థ సీఈఓ ఆశిష్‌ భండారీ వెల్లడించారు.

అంబానీ, అదానీ గిగా ఫ్యాక్టరీలు
దేశంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ సమగ్ర వ్యవస్థ (ఎకో సిస్టమ్‌) నెలకొల్పేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) 10 బిలియన్‌ డాలర్లను వెచి్చంచనుంది. 2030 నాటికి కేజీ గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఒక డాలరుకే ఉత్పత్తి చేయాలనేది కంపెనీ లక్ష్యం. 2026 కల్లా తొలి ఎలక్ట్రోలైజర్‌ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తాజా ఏజీఎంలో ప్రకటించారు కూడా. 

ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచి, కొత్త తరం ఎలక్ట్రోలైజర్ల కోసం పెట్టుబడి వ్యయాలను తగ్గించుకోవడానికి అధునాతన ఎల్రక్టాలిసిస్‌ ఆధారిత టెక్నాలజీలను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తిలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా అదానీ న్యూ ఇండస్ట్రీస్‌ను తీర్చిదిద్దే సన్నాహాల్లో అదానీ గ్రూప్‌ నిమగ్నమైంది. 2030 నాటికి 10 లక్షల టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తికి తోడ్పడేలా సమగ్ర ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. తదుపరి పదేళ్లలో ఈ సామర్థ్యాన్ని 30 లక్షల టన్నులకు పెంచాలనేది అదానీ లక్ష్యం. ఈ వ్యవస్థలో గ్రీన్‌ అమోనియా, గ్రీన్‌ మిథనాల్, పర్యావరణానుకూల విమాన ఇంధనం వంటి పలు ఉత్పత్తులు ఉంటాయి. 

గ్రీన్‌ హైడ్రోజన్‌: ప్రకృతిలో అపారంగా దొరికే నీటిని పునరుత్పాదక ఇంధనాలైన సౌర, పవన, జల విద్యుత్‌ను ఉపయోగించి హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొడతారు. ఎలక్ట్రోలైజర్‌లో జరిపే ఈ ప్రక్రియను ఎల్రక్టాలిసిస్‌గా పేర్కొంటారు. ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ 100 శాతం పర్యావరణానుకూలమైనది కావడంతో దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోంది. దీన్ని నిల్వ చేయడం చాలా సులభం. అంతేకాకుండా, వాహనాల నుండి పరిశ్రమల వరకు అనేక అవసరాల కోసం వాడుకోవచ్చు. 

గ్రే హైడ్రోజన్‌: హైడ్రోజన్‌ ఉత్పత్తిలో ఇది అత్యంత సాధారణ ప్రక్రియ. స్టీమ్‌ మీథేన్‌ రిఫారి్మంగ్‌ (ఎస్‌ఎంఆర్‌) అనే ప్రక్రియలో సహజవాయువును ఉపయోగిస్తారు. తయారీలో గణనీయంగా కార్బన ఉద్గారాలను విడుదల చేయడం వల్ల దీనిపై వ్యతిరేకత నెలకొంది. వినియోగంలో మాత్రం 100% పర్యావరణ హితమైనదే. 

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement