Renewable Energy - Invest
-
గ్రీన్ హైడ్రోజన్.. గేమ్ చేంజర్!
హైడ్రోజన్ కార్లు.. బస్సులు.. రైళ్లు.. నౌకలు.. పరిశ్రమలు... ఇలా ప్రపంచమంతా ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ నామ జపం చేస్తోంది! పునరుత్పాదక ఇంధన రంగంలో గేమ్ చేంజర్‌గా అభివరి్ణస్తున్న గ్రీన్ హైడ్రోజన్ కోసం భారత్ కూడా వేట మొదలుపెట్టింది. దేశీ కార్పొరేట్ దిగ్గజాలైన రిలయన్స్, అదానీ గ్రూపులతో పాటు అవాడా, హైజెన్కో గ్రీన్ ఎనర్జీస్, థెర్మాక్స్ వంటి సంస్థలు ఈ రంగంలో ఇప్పటికే భారీ ప్రణాళికలతో చకచకా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ నయా ఇంధనాన్ని వినియోగదారులకు చౌకగా అందించేందుకు ఉత్పాదక వ్యయాన్ని రెండింతలకు పైగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదక వ్యయం ఒక్కో కేజీకి 4–5 డాలర్లు (దాదాపు రూ.340–430)గా ఉంటోంది. అదే గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చు 1–2 డాలర్లు (రూ.85–170) మాత్రమే. గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి కాలుష్యకరమైనది కావడంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో కంపెనీలు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదక వ్యయాన్ని గణనీయంగా తగ్గించడంపై దృష్టిపెట్టాయి. సరికొత్త టెక్నాలజీలతో పాటు వినూత్న ఉత్పత్తులు, ఇతరత్రా మార్గాలను ఎంచుకుంటున్నాయి. 2030 నాటికి భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న 50 లక్షల వార్షిక టన్నుల ఉత్పత్తి లక్ష్యం సాకారం కావాలంటే, ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడం చాలా కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. టెక్నాలజీ దన్ను... గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదనలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పాటు అధునాతన ఎనలిటిక్స్‌ను అవాడా గ్రూప్ ఉపయోగిస్తోంది. ‘అత్యాధునిక ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీ వల్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం మెరుగుపడి, హైడ్రోజన్ ఉత్పత్తికి తక్కువ విద్యుత్ అవసరమవుతుంది. దీంతో వ్యయం భారీగా దిగొస్తోంది’ అని కంపెనీ చైర్మన్ వినీత్ మిట్టల్ పేర్కొన్నారు. హైజెన్కో సంస్థ అయితే, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), ఏఐతో పాటు మెషీన్ లెరి్నంగ్‌ను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటోంది. కంపెనీ ఒడిశాలోని గోపాల్‌పూర్‌లో 1.1 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ అమోనియా ప్రాజెక్టును నెలకొల్పే ప్రణాళికల్లో ఉంది. వెల్స్పన్ న్యూ ఎనర్జీ కూడా గ్రీన్ హైడ్రోజన్‌ను చౌకగా అందించేందుకు సౌర, పవన విద్యుత్‌తో పాటు బ్యాటరీల్లో స్టోర్ చేసిన విద్యుత్‌ను కూడా ఉపయోగిస్తోంది. అంతేకాకుండా పెద్దయెత్తున జల విద్యుత్‌ను కూడా వినియోగించే సన్నాహాల్లో ఉన్నట్లు కంపెనీ సీఈఓ కపిల్ మహేశ్వరి పేర్కొన్నారు. ఇక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన మాడ్యూల్స్ తయారీ, విక్రయం, సరీ్వస్ కోసం థర్మాక్స్ బ్రిటన్‌కు చెందిన సెరెస్తో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా దాని ఆక్సైడ్ ఎల్రక్టాలిసిస్ టెక్నాలజీని ఉపయోగించుకోనుంది. తక్కువ ఉష్ణోగ్రతతో కూడిన ఎలక్ట్రాలిసిస్ సాంకేతికతతో పోలిస్తే ఇది 25% మెరుగైనదని సంస్థ సీఈఓ ఆశిష్ భండారీ వెల్లడించారు.అంబానీ, అదానీ గిగా ఫ్యాక్టరీలుదేశంలో గ్రీన్ హైడ్రోజన్ సమగ్ర వ్యవస్థ (ఎకో సిస్టమ్) నెలకొల్పేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) 10 బిలియన్ డాలర్లను వెచి్చంచనుంది. 2030 నాటికి కేజీ గ్రీన్ హైడ్రోజన్‌ను ఒక డాలరుకే ఉత్పత్తి చేయాలనేది కంపెనీ లక్ష్యం. 2026 కల్లా తొలి ఎలక్ట్రోలైజర్ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తాజా ఏజీఎంలో ప్రకటించారు కూడా. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచి, కొత్త తరం ఎలక్ట్రోలైజర్ల కోసం పెట్టుబడి వ్యయాలను తగ్గించుకోవడానికి అధునాతన ఎల్రక్టాలిసిస్ ఆధారిత టెక్నాలజీలను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా అదానీ న్యూ ఇండస్ట్రీస్‌ను తీర్చిదిద్దే సన్నాహాల్లో అదానీ గ్రూప్ నిమగ్నమైంది. 2030 నాటికి 10 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి తోడ్పడేలా సమగ్ర ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. తదుపరి పదేళ్లలో ఈ సామర్థ్యాన్ని 30 లక్షల టన్నులకు పెంచాలనేది అదానీ లక్ష్యం. ఈ వ్యవస్థలో గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్, పర్యావరణానుకూల విమాన ఇంధనం వంటి పలు ఉత్పత్తులు ఉంటాయి. గ్రీన్ హైడ్రోజన్: ప్రకృతిలో అపారంగా దొరికే నీటిని పునరుత్పాదక ఇంధనాలైన సౌర, పవన, జల విద్యుత్‌ను ఉపయోగించి హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొడతారు. ఎలక్ట్రోలైజర్లో జరిపే ఈ ప్రక్రియను ఎల్రక్టాలిసిస్గా పేర్కొంటారు. ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ 100 శాతం పర్యావరణానుకూలమైనది కావడంతో దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. దీన్ని నిల్వ చేయడం చాలా సులభం. అంతేకాకుండా, వాహనాల నుండి పరిశ్రమల వరకు అనేక అవసరాల కోసం వాడుకోవచ్చు. గ్రే హైడ్రోజన్: హైడ్రోజన్ ఉత్పత్తిలో ఇది అత్యంత సాధారణ ప్రక్రియ. స్టీమ్ మీథేన్ రిఫారి్మంగ్ (ఎస్ఎంఆర్) అనే ప్రక్రియలో సహజవాయువును ఉపయోగిస్తారు. తయారీలో గణనీయంగా కార్బన ఉద్గారాలను విడుదల చేయడం వల్ల దీనిపై వ్యతిరేకత నెలకొంది. వినియోగంలో మాత్రం 100% పర్యావరణ హితమైనదే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
టొరెంట్ పవర్ భారీ పెట్టుబడులు
గాంధీనగర్: ప్రయివేట్ రంగ కంపెనీ టొరెంట్ పవర్ పునరుత్పాదక(గ్రీన్) ఇంధన ప్రాజెక్టులపై భారీ పెట్టుబడులకు తెరతీయనుంది. గ్రీన్, సస్టెయినబుల్ ఎనర్జీ ప్రాజెక్టులపై మొత్తం రూ. 64,000 కోట్లుపైగా ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా 26,000 మందికి ఉపాధి కల్పించే అవకాశముంది. ఈ బాటలో పెట్టుబడుల కట్టుబాటును ప్రదర్శిస్తూ కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖకు రెండు శపథ పత్రాలను దాఖలు చేసింది.పరిశ్రమల సమాఖ్య(సీఐఐ)తో కలసి పునరుత్పాదక ఇంధన శాఖ నిర్వహించే ఆర్ఈ–ఇన్వెస్ట్ 4వ సదస్సులో భాగంగా టొరెంట్ పవర్ 2030కల్లా 10 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అందుకునే లక్ష్యాన్ని ప్రకటించింది. తొలి శపథ పత్రంలో భాగంగా సుమారు రూ. 57,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉద్యోగావకాశాలు లభించే వీలుంది. ఇందుకు ద్వారకలో 5 గిగావాట్ల సోలార్ లేదా విండ్ లేదా రెండింటి కలయికతో హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వంతో తాజాగా అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది.ఇక రెండవ శపథ పత్ర ప్రకారం ఏడాదికి లక్ష కిలో టన్నుల సామర్థ్యంతో గ్రీన్ అమోనియా ఉత్పత్తికి ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ. 7,200 కోట్లు వెచ్చించనుంది. తద్వారా 1,000 మందికి ఉపాధి లభించనుంది. దేశంలోని విద్యుత్ రంగ దిగ్గజాలలో ఒకటైన టొరెంట్ పవర్ భారత్ పునరుత్పాదక ప్రయాణంలో భాగమయ్యేందుకు కట్టుబడి ఉన్నట్లు కంపెనీ చైర్మన్ సమీర్ మెహతా పేర్కొన్నారు. -
2029 నాటికి రూ.5000 కోట్ల ఆర్డర్స్!.. రెనర్జీ డైనమిక్స్
రెనర్జీ డైనమిక్స్ (REnergy Dynamics) పునరుత్పాదక రంగంలోకి అడుగుపెట్టినట్లు సోమవారం ప్రకటించింది. కంపెనీ లార్జ్ స్కేల్ బయోఎనర్జీ ప్రాజెక్ట్‌లకు, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ రంగానికి, ఫీడ్‌స్టాక్ అగ్రిగేషన్, కంప్రెస్డ్ బయోగ్యాస్ మొదలైనవి సంస్థలకు తన ఉత్పతులను విక్రయించనుంది.రెనర్జీ డైనమిక్స్ 2029 నాటికి వివిధ సంస్థల నుంచి రూ.5000 కోట్ల రూపాయల ఆర్డర్లను బుక్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. సంస్థ వివిధ దశల్లో రూ. 575 కోట్ల విలువైన ప్రాజెక్టులను నిర్వహించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. -
భారత ఆర్ధిక ముఖచిత్రాన్ని మార్చబోతున రిలయన్స్ ...
-
భారత్‌పై రష్యా దిగ్గజ కంపెనీ కన్ను, భారీ పెట్టుడులతో..
సాస్నొవీ బోర్(రష్యా): న్యూక్లియర్ ఎనర్జీ రంగ రష్యన్ దిగ్గజం రొజాటమ్ దేశీ మార్కెట్లో పెట్టుబడులపై దృష్టి పెట్టింది. ప్రధానంగా పునరుత్పాదక ఇంధనం, కార్బన్ ఫైబర్ విభాగాలపై కన్నేసినట్లు కంపెనీ అధికారి ఒకరు తెలియజేశారు. అపార అవకాశాలున్న దేశీ మార్కెట్లో విభిన్న విభాగాలలో కార్యకలాపాలు చేపట్టాలని భావిస్తున్నట్లు వివరించారు. ఈ బాటలో న్యూక్లియర్ మెడిసిన్, రేడియేషన్ టెక్నాలజీస్, ఎనర్జీ స్టోరేజీ రంగాలలో అవకాశాలను అన్వేషించనున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడులోని కుందకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఒక్కొక్కటీ 1,000 మెగావాట్ల సామర్థ్యంగల ఆరు రియాక్టర్లతో ప్లాంటును ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో రెండు యూనిట్లు ఇప్పటికే కార్యకలాపాలను ప్రారంభించాయి. కేవలం న్యూక్లియర్ ఎనర్జీపైనేకాకుండా పలు విభాగాలలో సహకారానికి రొజాటమ్ సిద్ధంగా ఉన్నట్లు రుజాటమ్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ప్రెసిడెంట్ వడీమ్ టిటోవ్ తెలియజేశారు. వెరసి కార్బన్ ఫైబర్, పవన విద్యుత్ తదితర రంగాలలో దేశీ భాగస్వాములతో చేతులు కలిపేందుకు రొజాటమ్ ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. విదేశీ మార్కెట్లలో రొజాటమ్ డివిజన్ల కార్యకలాపాలకు రుజాటమ్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ మద్దతిస్తుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. -
‘ఆర్ఈ’ పెట్టుబడుల్లో భారత్‌కు 3వ స్థానం
న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుత్ (ఆర్ఈ) రంగంలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన దేశాల సూచీలో (ఆర్‌ఈసీఏఐ) టాప్ 3 దేశాలు ఈసారి కూడా తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలోనూ, భారత్ యథాప్రకారం 3వ స్థానంలోనూ కొనసాగుతున్నాయి. ఆర్‌ఈసీఏఐకి సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ ఈవై విడుదల చేసిన 58వ ఎడిషన్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆర్ఈ విభాగంలో పెట్టుబడి అవకాశాలకు ఆకర్షణీయంగా ఉన్న టాప్ 40 దేశాలతో ఈవై ఈ జాబితా రూపొందించింది. పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్ అంశాలకు కంపెనీలు, ఇన్వెస్టర్లు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో పర్యావరణహిత విద్యుత్ విభాగానికి కార్పొరేట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ), వృద్ధి చోదకాలుగా నిలుస్తున్నాయని సంస్థ పేర్కొంది. ఈసారి పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లలో ఆకర్షణీయతకు కొలమానంగా కొత్తగా పీపీఏ సూచీని కూడా ప్రవేశపెట్టినట్లు వివరించింది. దీనికి సంబంధించి టాప్ 30 పీపీఏ మార్కెట్లలో భారత్‌కు ఆరో ర్యాంక్ దక్కినట్లు పేర్కొంది. స్వావలంబన సాధించే లక్ష్యంతో విధానపరంగా సమగ్రమైన నిర్ణయాలు తీసుకోవడం, పునరుత్పాదక విద్యుత్ మార్కెట్లో సానుకూల పరిస్థితులు, పెట్టుబడులు.. టెక్నాలజీపరమైన పురోగతి తదితర అంశాలు, భారత్‌లో పర్యావరణహిత విద్యుత్ విభాగం కొత్త శిఖరాలకు చేరుకోవడానికి తోడ్పడుతున్నాయని ఈవై తెలిపింది. అయితే, వేగవంతమైన వృద్ధిని దెబ్బతీసే అవరోధాలను ఈ రంగం జాగ్రత్తగా అధిగమించాల్సి ఉంటుందని హెచ్చరించింది. -
హైడ్రోజన్ ఉత్పత్తిలోకి అదానీ
న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల దిగ్గజం అదానీ గ్రూప్ తాజాగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా రానున్న పదేళ్ల కాలంలో 20 బిలియన్ డాలర్లను(సుమారు రూ. 1.5 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. తద్వారా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, విడిభాగాలు, ప్రపంచంలోనే చౌకైన గ్రీన్ ఎలక్ట్రాన్ తయారీని చేపట్టనున్నట్లు తెలియజేశారు. పోర్టుల నుంచి ఇంధనం వరకూ బిజినెస్‌లను నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ రానున్న నాలుగేళ్లలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని మూడు రెట్లు పెంచాలని చూస్తున్నట్లు తెలియజేశారు. పర్యావరణ అనుకూల హైడ్రోజన్ ఉత్పత్తి, అన్ని డేటా సెంటర్లకు పునరుత్పాదక ఇంధన సరఫరా, 2025కల్లా సొంత పోర్టులనుంచి కర్బనాల విడుదలను పూర్తిగా తొలగించడం వంటి ప్రణాళికలున్నట్లు వివరించారు. 75 శాతం వరకూ..: జేపీ మోర్గాన్ ఇండియా పెట్టుబడిదారుల సదస్సులో ప్రసంగించిన గౌతమ్ అదానీ 2025వరకూ మొత్తం పెట్టుబడి వ్యయాల్లో 75 శాతాన్ని పర్యావరణ అనుకూల టెక్నాలజీలపైనే వెచ్చించనున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ సైతం రానున్న మూడేళ్లలో శుద్ధ విద్యుదుత్పత్తి, హైడ్రోజన్ ఇంధనంపై 10 బిలియన్ డాలర్లు(రూ. 75,000 కోట్లు) వెచ్చించనున్నట్లు పేర్కొన్న నేపథ్యంలో అదానీ ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో కొన్నేళ్లుగా పునరుత్పాదక విభాగంపై దృష్టి పెట్టిన అదానీ గ్రూప్‌తో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రత్యక్షంగా పోటీ పడనున్నట్లు పరిశ్రమవర్గాలు వ్యాఖ్యానించాయి. దశాబ్ద కాలంలో పునరుత్పాదక ఇంధనంలో భాగంగా కిలో హైడ్రోజన్‌ను 1 డాలరుకే తయారు చేయనున్నట్లు ముకేశ్ ప్రకటించిన విషయం విదితమే. కోవిడ్‌ను ఎదుర్కొనడంలో భారత్ తీరు భేష్ కోవిడ్–19 పరంగా తలెత్తిన పరిస్థితుల నిర్వహణ విషయంలో భారత్ భేషుగ్గానే పనిచేసిందని అదానీ అభిప్రాయపడ్డారు. ఈ అంశానికి సం బంధించిన విమర్శలు దేశ ప్రతిష్టను దెబ్బతీసే లా ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు. పత్రికా స్వేచ్ఛ, విమర్శల పేరుతో మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదని అదానీ హితవు పలికారు. అదానీ త్వరలో మీడియా రంగంలోకి అడుగుపెట్టనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
రెన్యూ పవర్ చేతికి ఎల్అండ్టీ హైడ్రో ప్రాజెక్టు
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) తమ అనుబంధ సంస్థకు చెందిన హైడ్రోఎలక్ట్రిక్ ప్లాంటులో 100 శాతం వాటాలను రెన్యూ పవర్ సర్వీసెస్‌కు విక్రయించింది. ఈ డీల్ విలువ రూ. 985 కోట్లు. ఇతర వ్యాపారాల నుంచి తప్పుకుని ప్రధాన వ్యాపారాల మీద మరింతగా దృష్టి పెట్టాలనే ప్రణాళికకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్అండ్టీ హోల్‌టైమ్ డైరెక్టర్ డీకే సెన్ వెల్లడించారు. ఎల్అండ్టీ ఉత్తరాంచల్ హైడ్రోపవర్ (ఎల్‌టీయూహెచ్‌పీఎల్)కి చెందిన ఈ ప్రాజెక్టు విక్రయ డీల్ సెప్టెంబర్ 30లోగా పూర్తి కాగలదని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న ప్రాజెక్టును కొనుగోలు చేయడం వల్ల తమకు అదనపు ప్రయోజనాలు లభించగలవని, రిస్కు స్థాయి కూడా తక్కువగా ఉండగలదని రెన్యూ పవర్ చైర్మన్ సుమంత్ సిన్హా తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని హైడ్రో ప్రాజెక్టులన కొనుగోలుపై దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. -
రూ. 5,000 కోట్లతో భారీ సోలార్ పీవీ ప్లాంట్
న్యూఢిల్లీ: ఫస్ట్ సోలార్ ఐఎన్‌సీ 684 మిలియన్ డాలర్లతో (సుమారు రూ.5,000 కోట్లు) భారత్‌లో సమగ్ర ఫోటోవోల్టిక్ (పీవీ) థిన్ ఫిల్మ్ సోలార్ మాడ్యూళ్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికతో ఉన్నట్టు ప్రకటించింది. తమకు ప్రోత్సాహకరమైన రాయితీలతో కూడిన అనుమతి భారత ప్రభుత్వం నుంచి లభించినట్టయితే.. ఈ సమగ్ర పీవీ తయారీ కేంద్రం 2023 రెండో అర్థభాగంలో కార్యకలాపాలు ప్రారంభించే వీలుంటుందని తెలిపింది. తమిళనాడులో ఏర్పాటు కానున్న ఈ కేంద్రంతో 1,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అంచనా. ఆకర్షణీయమైన మార్కెట్ ‘‘ఫస్ట్ సోలార్కు భారత్ ఆకర్షణీయమైన మార్కెట్. వేడి, తేమతో కూడిన వాతావరణం మా మాడ్యూల్ సాంకేతికతకు అనుకూలంగా ఉంటుంది. భారత్ సహజసిద్ధంగా సుస్థిరమైన మార్కెట్. అభివృద్ధి చెందుతున్న దేశం కావడంతో ఇంధనానికి డిమాండ్ ఉంది. ఏటా 25 గిగావాట్ల సోలార్ ఇంధనాన్ని వచ్చే తొమ్మిదేళ్లలో సాధించాలన్న స్పష్టమైన లక్ష్యంతో ఉంది. మా ప్రతిపాదిత తయారీ కేంద్రం 3.3 గిగావాట్ల సామర్థ్యంతో ఉంటుంది’’ అని ఫస్ట్ సోలార్ సీఈవో మార్క్‌విడ్‌మార్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పది అతిపెద్ద సోలార్ పీవీ తయారీ కంపెనీల్లో ఒకటైన ఫస్ట్ సోలార్ మిగిలిన వాటికి భిన్నమైన టెక్నాలజీని అమలు చేస్తుండడం గమన్హాం. -
నాలుగేళ్లలో ఈ రంగంలో రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్ పునరుత్పాదక ఇంధన (ఆర్ఈ) సామర్థ్యం వచ్చే ఏడాది మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) మరో 11 గిగావాట్లు (జీడబ్ల్యూ) పెరిగే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్ సంస్థ ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. మాడ్యూల్ ధరల పెరుగుదల వల్ల సోలార్ బిడ్ టారిఫ్‌లు పెరిగినప్పటికీ, ఈ రంగం పురోగమిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ‘‘2019–20 ఆర్థిక సంవత్సరంలో పునరుత్పాదక ఇంధన రంగం అదనపు సామర్థ్యం 8.7 గిగావాట్లు పెరిగింది. అయితే కోవిడ్ మహమ్మారి ప్రేరిత సవాళ్ల పరిస్థితుల్లో 2020–21 ఆర్థిక సంవత్సరం ఈ వేగం మందగించి పురోగతి 7.4 జీడబ్ల్యూకు పడిపోయింది. కాగా, 2021–22లో తిరిగి ఈ విభాగం 10.5 నుంచి 11 జీడబ్ల్యూ వరకూ అదనపు సామర్థ్యాన్ని సాధించే అవకాశం ఉంది’’ అని ఇక్రా విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. ఈ రంగంలో 38 గిగావాట్ల పటిష్ట ప్రాజెక్ట్ పైప్‌లైన్ అమలు జరుగుతున్న విషయాన్నీ ఇక్రా గుర్తు చేసింది. అలాగే మరో 20 గిగావాట్ల ప్రాజెక్టులు వివిధ నోడెల్ ఏజెన్సీల నుంచి టెండరింగ్ దశలో ఉండడాన్ని ప్రస్తావించింది. ఆయా అంశాలన్నీ ఈ రంగాన్ని సమీప కాలంలో పటిష్టం చేస్తాయని విశ్లేషించింది. ఈ విభాగానికి సంబంధించి ఇక్రా నివేదిక తదితర అంశాలను పరిశీలిస్తే.. ► భారత్ ప్రస్తుత పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 136 గిగావాట్లు. 2022 నాటికి దాదాపు 180 గిగావాట్లకు పెంచాలన్నది కేంద్రం లక్ష్యం. 2030 నాటికి ఈ లక్ష్యం 450 గిగావాట్లగా ఉంది. దీన్ని సాధిస్తే మొత్తం విద్యుత్‌లో పునరుత్పాదక ఇంధన విద్యుత్ వాటా 54 శాతానికి చేరుకుంటుంది. ► వచ్చే నాలుగేళ్లలో ఈ రంగంలోకి రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్నది అంచనా. ► భారత్ మొత్తం విద్యుత్ వ్యవస్థీకృత సామర్థ్యంలో పోల్చితే 2021 మార్చి నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్య 25 శాతం అయితే 2025 మార్చి నాటికి ఇది 34 శాతానికి చేరుతుందని అంచనా. ► అయితే ఈ రంగంలో సవాళ్లు కూడా ఉన్నాయి. విద్యుత్ కొనుగోలు, అమ్మకం ఒప్పందాలపై (పీపీఏలు పీఎస్ఏలు) సంతకాల్లో ఆలస్యం అయిన సందర్భాలు గతంలో ఉన్నాయి. టారిఫ్‌లు తగ్గుతాయన్న అంచనాలతో బిడ్స్ రద్దయిన నేపథ్యమూ ఉంది. ఈ తరహా అంశాలు ఇకముందూ సవాలుగా కొనసాగే అవకాశం ఉంది. ► నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు భూ సేకరణ, మౌలిక సదుపాయాల పెంపు వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి పవన విద్యుత్ విషయంలో ఈ తరహా ఇబ్బందులు కొనసాగే వీలుంది. ► డిస్కమ్‌ల నుంచి పునరుత్పాదక ఇంధన స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులకు (ఐపీపీ) బకాయిల విలువ 2021 ఏప్రిల్ నాటికి రూ.11,840 కోట్లని పీఆర్ఏఏపీటీఐ పోర్టల్ పేర్కొంటోంది. ► ఈ రంగానికి ఇక్రా ‘సేబుల్’ అవుట్‌లుక్ కొనసాగుతుంది. ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న విధానపరమైన మద్దతు, భారీ వృద్ధి అవకాశాలు, సెంట్రల్ నోడల్ ఏజెన్సీలకు సంబంధించి రుణ సామర్థ్యాలు, చార్జీల విషయంలో పోటీతత్వం వంటి అంశాలు దీనికి కారణం. సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీకి కూడా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని వర్తింపచేయడం ఈ రంగానికి సానుకూల అంశం. ► దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడం, దేశీయ తయారీకి ప్రాధాన్యత ఇవ్వడం ప్రధాన లక్ష్యాలుగా సోలార్ మాడ్యూల్స్, సెల్స్ విషయంలో కేంద్ర నూతన, పునరుత్పదక ఇంధన మంత్రిత్వశాఖ ఇటీవల కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచీ సోలార్ మాడ్యూల్స్ దిగుమతులపై 40 శాతం బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని (బీసీడీ) విధించనున్నట్లు ప్రకటించింది. అలాగే సెల్స్ విషయంలో ఈ సుంకం 20 శాతంగా ఉండనుంది. 2022 మార్చి 31 వరకూ సోలార్ మాడ్యూల్స్ అలాగే సెల్స్‌పై ‘జీరో’ బీసీడీ అమలవుతుంది. విద్యుత్‌కు డిమాండ్ అనూహ్యం దేశంలో విద్యుత్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. బుధవారం గరిష్ట డిమాండ్ (ఒక్క రోజులో అత్యధిక సరఫరా) 200.57 గిగావాట్ల మార్క్‌ను అధిగమించి జీవితకాల గరిష్టానికి చేరి నట్టు కేంద్ర విద్యుత్ శాఖ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. వర్షాలు ఆలస్యం కావడం వల్ల దేశం లోని చాలా రాష్ట్రాల్లో వేడి, ఉక్కపోత వాతావరణం నెలకొనడంతోపాటు.. కరోనా వైరస్ నియంత్రణ కోసం విధించిన ఆంక్షలను సడలిస్తుండడంతో విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. గడిచిన మంగళవారం విద్యుత్ డిమాండ్ 197.07 గిగావాట్లుగా నమోదైంది. గత నెలలో (జూన్ 30న) విద్యుత్‌కు రోజువారీ గరిష్ట డిమాండ్ 191.51 గిగావాట్లుగా నమోదు కావడం గమనార్హం. 2020 జూన్‌లో డిమాండ్ 164.98 గిగావాట్లుగా ఉంటే, 2019 జూన్ నెలలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 182.45 గిగావాట్లుగా నమోదు కావడం గమనార్హం. -
చౌకగా సౌర, పవన శక్తి వనరులు !
ఆ దిశగా ప్రయత్నాలు చేయాలన్న ప్రధాని మోదీ ⇒ న్యూఢిల్లీలో రెన్యువబుల్ ఎనర్జీ- ఇన్వెస్ట్ ప్రారంభం ⇒ 20వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యం ⇒ రెట్టింపు వాటాకు రెన్యువబుల్ ఎనర్జీ ! న్యూఢిల్లీ: సౌర, పవన శక్తి వంటి పునరుత్పాదన ఇంధన వనరులు మరింత చౌకగా లభ్యమయ్యేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారత్‌లో శక్తివనరుల లోటును పూడ్చడానికి ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పారు. పర్యావరణ అనుకూల ఈ తరహా ఇంధన వనరులకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రపంచాన్ని ఆకట్టుకోవడానికి కాదని, ప్రజల ఇంధన అవసరాలను తీర్చడానికేనని ఆయన వివరించారు. ఇక్కడ తొలి రెన్యువబుల్ ఎనర్జీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్(ఆర్ఈ-ఇన్వెస్ట్)ను ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత రెన్యువబుల్ ఎనర్జీ సత్తాను ప్రపంచానికి చాటడం, 20 వేల కోట్ల డాలర్లు పెట్టుబడులు అకర్షించడం లక్ష్యాలుగా ఈ మీట్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ ఈ నెల 17 వరకూ(మంగళవారం) కొనసాగుతుంది. ఎన్టీపీసీ, సుజ్లాన్, రిలయన్స్ పవర్ వంటి 293 కం పెనీలు ఐదేళ్లలో 266 గిగా వాట్ల విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాయి. హైబ్రిడ్ ఎనర్జీ పార్కులు సౌర శక్తి వెలుగులు పేదలకు అందుబాటులోకి రావడానికి,మారుమూల ప్రాంతాల్లో సైతం వినియోగంలోకి తేవడానికి పరిశోధన చేయడం కోసం 50 దేశాలతో కలసి ఒక కన్సార్షియమ్ను ఏర్పాటు చేయడానికి భారత్ ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సోలార్ ఫొటో-వొల్టాయిక్ సెల్స్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ వ్యయం రూ.20 నుంచి రూ.7.50కు తగ్గిందని, మరింత పరిశోధన, నవకల్పనల కారణంగా ఈ వ్యయం మరింతగా తగ్గవచ్చని మోదీ వివరించారు. సౌర శక్తి, పవన శక్తిలు అపారంగా ఉండే ప్రాంతాల్లో, హైబ్రిడ్ ఎనర్జీ పార్క్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. పునరుత్పాదన ఇంధన వనరుల ఉత్పత్తికి అవసరమయ్యే పరికరాలను దేశీయంగా అభివృద్ధి చేయాలని, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీనిని చేపట్టాలని పేర్కొన్నారు. ఫలితంగా దీర్ఘకాలం పాటు ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. నీటి కాలువలపై సౌర పలకలను ఏర్పాటు చేయాలని, ఇలా చేస్తే వాటిని సోలార్ ఇరిగేషన్ పంపులుగా కూడా ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఫొటో వొల్టాయిక్ సెల్స్‌ను రూఫ్-టాప్‌లుగా ఉపయోగించుకోవచ్చని కూడా ఆయన సూచించారు. ప్రధాన కేంద్రంగా భారత్ ప్రపంచంలో పునరుత్పాదన ఇంధనాలకు ప్రధాన కేంద్రంగా భారత్ ఆవిర్భవించనున్నదని విద్యుత్, బొగ్గు, పునరుత్పాదన ఇంధన వనరుల శాఖ సహా య మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి మొత్తం భారత విద్యుదుత్పత్తిలో పునరుత్పాదన ఇంధన వనరుల వాటా6 శాతమని చెప్పారు. పదేళ్ల కాలంలో దీనిని 15 శాతానికి పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యమని గోయల్ పేర్కొన్నారు. 293 కంపెనీలు... 266 గిగా వాట్లు... ఈ ఇన్వెస్టర్స్ మీట్లో పలు కంపెనీలు పలు ప్రణాళికలను వెల్లడించాయి. ఎన్టీపీసీ, రిలయన్స్ పవర్ వంటి 293 కంపెనీలు ఐదేళ్లలో 266 గిగా వాట్ల విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాయి. 11 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఉపయోగపడే పరికరాలు తయారు చేస్తామని సుజ్లాన్ ఎనర్జీ తెలిపింది. 7,500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఉపయోగపడే పరికరాలను తయారు చేస్తామని గమేస కంపెనీ వెల్లడించింది. పునరుత్పాదన వనరుల ద్వారా ఐదేళ్లలో 10 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తామని ఎన్టీపీసీ పేర్కొంది. రూ.75,000 కోట్ల రుణాలిస్తాం: ఎస్బీఐ 15వేల మెగావాట్ల పునరుత్పాదన విద్యుదుత్పత్తి కోసం ఐదేళ్లలో రూ.75,000 కోట్ల రుణాలను ఇవ్వనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇప్పటి వరకు విద్యుత్ రంగానికి రూ.1.78 లక్షల కోట్ల రుణాలిచ్చామని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య వెల్లడించారు. వీటిల్లో రెన్యువబుల్ ఎనర్జీ రంగానికి సంబంధించిన రుణాలు రూ.7,500 కోట్లని పేర్కొన్నారు. ఆర్బీఐ ఈ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తిస్తే ఈ రంగానికి ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయని వివరించారు.