
సాస్నొవీ బోర్(రష్యా): న్యూక్లియర్ ఎనర్జీ రంగ రష్యన్ దిగ్గజం రొజాటమ్ దేశీ మార్కెట్లో పెట్టుబడులపై దృష్టి పెట్టింది. ప్రధానంగా పునరుత్పాదక ఇంధనం, కార్బన్ ఫైబర్ విభాగాలపై కన్నేసినట్లు కంపెనీ అధికారి ఒకరు తెలియజేశారు. అపార అవకాశాలున్న దేశీ మార్కెట్లో విభిన్న విభాగాలలో కార్యకలాపాలు చేపట్టాలని భావిస్తున్నట్లు వివరించారు. ఈ బాటలో న్యూక్లియర్ మెడిసిన్, రేడియేషన్ టెక్నాలజీస్, ఎనర్జీ స్టోరేజీ రంగాలలో అవకాశాలను అన్వేషించనున్నట్లు పేర్కొన్నారు.
తమిళనాడులోని కుందకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఒక్కొక్కటీ 1,000 మెగావాట్ల సామర్థ్యంగల ఆరు రియాక్టర్లతో ప్లాంటును ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో రెండు యూనిట్లు ఇప్పటికే కార్యకలాపాలను ప్రారంభించాయి. కేవలం న్యూక్లియర్ ఎనర్జీపైనేకాకుండా పలు విభాగాలలో సహకారానికి రొజాటమ్ సిద్ధంగా ఉన్నట్లు రుజాటమ్ ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ ప్రెసిడెంట్ వడీమ్ టిటోవ్ తెలియజేశారు.
వెరసి కార్బన్ ఫైబర్, పవన విద్యుత్ తదితర రంగాలలో దేశీ భాగస్వాములతో చేతులు కలిపేందుకు రొజాటమ్ ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. విదేశీ మార్కెట్లలో రొజాటమ్ డివిజన్ల కార్యకలాపాలకు రుజాటమ్ ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ మద్దతిస్తుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment