న్యూఢిల్లీ: సీమాంతర చెల్లింపు లావాదేవీలకు సంబంధించి భారత్, రష్యా తమ తమ స్వంత పేమెంట్ విధానాలను ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై ఇరు దేశాల అత్యున్నత స్థాయి కమిషన్ (ఐఆర్‌ఐజీసీ–టీఈసీ) ఇటీవల సమావేశమైన సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రూపే (భారత్), మిర్ కార్డుల (రష్యా) వినియోగం ద్వారా ఇరు దేశాల ప్రజలు తమ తమ కరెన్సీల్లో చెల్లింపులు జరిపేందుకు వీలవుతుందని పేర్కొన్నాయి.
భారత ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ), రష్యాకు చెందిన ఫాస్టర్ పేమెంట్స్ సిస్టమ్ (ఎఫ్‌పీఎస్)ను అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అలాగే, సీమాంతర చెల్లింపుల కోసం బ్యాంక్ ఆఫ్ రష్యాకు చెందిన సర్వీసెస్ బ్యూరో ఆఫ్ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్‌ను ఉపయోగించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. భారత్ ప్రస్తుతం ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న స్విఫ్ట్ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తోంది.
ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యాపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో తాజా భేటీలో ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమ తమ దేశాల కరెన్సీల్లో సీమాంతర చెల్లింపులను జరిపేందుకు తోడ్పడేలా భారత్, సింగపూర్ ఇటీవలే యూపీఐ, పేనౌ (సింగపూర్ వ్యవస్థ)ను అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే. సింగపూర్‌లోని ప్రవాస భారతీయులు తక్కువ లావాదేవీ వ్యయాలతో, సత్వరం అక్కడి నుంచి ఇక్కడికి డబ్బును పంపించేందుకు ఇది తోడ్పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment