గాంధీనగర్: ప్రయివేట్ రంగ కంపెనీ టొరెంట్ పవర్ పునరుత్పాదక(గ్రీన్) ఇంధన ప్రాజెక్టులపై భారీ పెట్టుబడులకు తెరతీయనుంది. గ్రీన్, సస్టెయినబుల్ ఎనర్జీ ప్రాజెక్టులపై మొత్తం రూ. 64,000 కోట్లుపైగా ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా 26,000 మందికి ఉపాధి కల్పించే అవకాశముంది. ఈ బాటలో పెట్టుబడుల కట్టుబాటును ప్రదర్శిస్తూ కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖకు రెండు శపథ పత్రాలను దాఖలు చేసింది.
పరిశ్రమల సమాఖ్య(సీఐఐ)తో కలసి పునరుత్పాదక ఇంధన శాఖ నిర్వహించే ఆర్‌ఈ–ఇన్వెస్ట్ 4వ సదస్సులో భాగంగా టొరెంట్ పవర్ 2030కల్లా 10 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అందుకునే లక్ష్యాన్ని ప్రకటించింది. తొలి శపథ పత్రంలో భాగంగా సుమారు రూ. 57,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉద్యోగావకాశాలు లభించే వీలుంది. ఇందుకు ద్వారకలో 5 గిగావాట్ల సోలార్ లేదా విండ్ లేదా రెండింటి కలయికతో హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వంతో తాజాగా అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది.
ఇక రెండవ శపథ పత్ర ప్రకారం ఏడాదికి లక్ష కిలో టన్నుల సామర్థ్యంతో గ్రీన్ అమోనియా ఉత్పత్తికి ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ. 7,200 కోట్లు వెచ్చించనుంది. తద్వారా 1,000 మందికి ఉపాధి లభించనుంది. దేశంలోని విద్యుత్ రంగ దిగ్గజాలలో ఒకటైన టొరెంట్ పవర్ భారత్ పునరుత్పాదక ప్రయాణంలో భాగమయ్యేందుకు కట్టుబడి ఉన్నట్లు కంపెనీ చైర్మన్ సమీర్ మెహతా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment