న్యూఢిల్లీ: భారత్ పునరుత్పాదక ఇంధన (ఆర్‌ఈ) సామర్థ్యం వచ్చే ఏడాది మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) మరో 11 గిగావాట్లు (జీడబ్ల్యూ) పెరిగే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్ సంస్థ ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. మాడ్యూల్ ధరల పెరుగుదల వల్ల సోలార్ బిడ్ టారిఫ్‌లు పెరిగినప్పటికీ, ఈ రంగం పురోగమిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ‘‘2019–20 ఆర్థిక సంవత్సరంలో పునరుత్పాదక ఇంధన రంగం అదనపు సామర్థ్యం 8.7 గిగావాట్లు పెరిగింది. అయితే కోవిడ్ మహమ్మారి ప్రేరిత సవాళ్ల పరిస్థితుల్లో 2020–21 ఆర్థిక సంవత్సరం ఈ వేగం మందగించి పురోగతి 7.4 జీడబ్ల్యూకు పడిపోయింది. కాగా, 2021–22లో తిరిగి ఈ విభాగం 10.5 నుంచి 11 జీడబ్ల్యూ వరకూ అదనపు సామర్థ్యాన్ని సాధించే అవకాశం ఉంది’’ అని ఇక్రా విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. ఈ రంగంలో 38 గిగావాట్ల పటిష్ట ప్రాజెక్ట్ పైప్‌లైన్ అమలు జరుగుతున్న విషయాన్నీ ఇక్రా గుర్తు చేసింది. అలాగే మరో 20 గిగావాట్ల ప్రాజెక్టులు వివిధ నోడెల్ ఏజెన్సీల నుంచి టెండరింగ్ దశలో ఉండడాన్ని ప్రస్తావించింది. ఆయా అంశాలన్నీ ఈ రంగాన్ని సమీప కాలంలో పటిష్టం చేస్తాయని విశ్లేషించింది.
ఈ విభాగానికి సంబంధించి ఇక్రా నివేదిక తదితర అంశాలను పరిశీలిస్తే..
► భారత్ ప్రస్తుత పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 136 గిగావాట్లు. 2022 నాటికి దాదాపు 180 గిగావాట్లకు పెంచాలన్నది కేంద్రం లక్ష్యం. 2030 నాటికి ఈ లక్ష్యం 450 గిగావాట్లగా ఉంది. దీన్ని సాధిస్తే మొత్తం విద్యుత్లో పునరుత్పాదక ఇంధన విద్యుత్ వాటా 54 శాతానికి చేరుకుంటుంది.
► వచ్చే నాలుగేళ్లలో ఈ రంగంలోకి రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్నది అంచనా.
► భారత్ మొత్తం విద్యుత్ వ్యవస్థీకృత సామర్థ్యంలో పోల్చితే 2021 మార్చి నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్య 25 శాతం అయితే 2025 మార్చి నాటికి ఇది 34 శాతానికి చేరుతుందని అంచనా.
► అయితే ఈ రంగంలో సవాళ్లు కూడా ఉన్నాయి. విద్యుత్ కొనుగోలు, అమ్మకం ఒప్పందాలపై (పీపీఏలు పీఎస్‌ఏలు) సంతకాల్లో ఆలస్యం అయిన సందర్భాలు గతంలో ఉన్నాయి. టారిఫ్‌లు తగ్గుతాయన్న అంచనాలతో బిడ్స్ రద్దయిన నేపథ్యమూ ఉంది. ఈ తరహా అంశాలు ఇకముందూ సవాలుగా కొనసాగే అవకాశం ఉంది. ► నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు భూ సేకరణ, మౌలిక సదుపాయాల పెంపు వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి పవన విద్యుత్ విషయంలో ఈ తరహా ఇబ్బందులు కొనసాగే వీలుంది.
► డిస్కమ్‌ల నుంచి పునరుత్పాదక ఇంధన స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులకు (ఐపీపీ) బకాయిల విలువ 2021 ఏప్రిల్ నాటికి రూ.11,840 కోట్లని పీఆర్‌ఏఏపీటీఐ పోర్టల్ పేర్కొంటోంది.
► ఈ రంగానికి ఇక్రా ‘సేబుల్’ అవుట్‌లుక్ కొనసాగుతుంది. ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న విధానపరమైన మద్దతు, భారీ వృద్ధి అవకాశాలు, సెంట్రల్ నోడల్ ఏజెన్సీలకు సంబంధించి రుణ సామర్థ్యాలు, చార్జీల విషయంలో పోటీతత్వం వంటి అంశాలు దీనికి కారణం. సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీకి కూడా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని వర్తింపచేయడం ఈ రంగానికి సానుకూల అంశం.
► దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవడం, దేశీయ తయారీకి ప్రాధాన్యత ఇవ్వడం ప్రధాన లక్ష్యాలుగా సోలార్ మాడ్యూల్స్, సెల్స్ విషయంలో కేంద్ర నూతన, పునరుత్పదక ఇంధన మంత్రిత్వశాఖ ఇటీవల కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచీ సోలార్ మాడ్యూల్స్ దిగుమతులపై 40 శాతం బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని (బీసీడీ) విధించనున్నట్లు ప్రకటించింది. అలాగే సెల్స్ విషయంలో ఈ సుంకం 20 శాతంగా ఉండనుంది. 2022 మార్చి 31 వరకూ సోలార్ మాడ్యూల్స్ అలాగే సెల్స్‌పై ‘జీరో’ బీసీడీ అమలవుతుంది.
విద్యుత్‌కు డిమాండ్ అనూహ్యం
దేశంలో విద్యుత్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. బుధవారం గరిష్ట డిమాండ్ (ఒక్క రోజులో అత్యధిక సరఫరా) 200.57 గిగావాట్ల మార్క్‌ను అధిగమించి జీవితకాల గరిష్టానికి చేరి నట్టు కేంద్ర విద్యుత్ శాఖ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. వర్షాలు ఆలస్యం కావడం వల్ల దేశం లోని చాలా రాష్ట్రాల్లో వేడి, ఉక్కపోత వాతావరణం నెలకొనడంతోపాటు.. కరోనా వైరస్ నియంత్రణ కోసం విధించిన ఆంక్షలను సడలిస్తుండడంతో విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. గడిచిన మంగళవారం విద్యుత్ డిమాండ్ 197.07 గిగావాట్లుగా నమోదైంది. గత నెలలో (జూన్ 30న) విద్యుత్‌కు రోజువారీ గరిష్ట డిమాండ్ 191.51 గిగావాట్లుగా నమోదు కావడం గమనార్హం. 2020 జూన్‌లో డిమాండ్ 164.98 గిగావాట్లుగా ఉంటే, 2019 జూన్ నెలలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 182.45 గిగావాట్లుగా నమోదు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment