ఈ అద్దాల కిటికీలతో మీ ఇల్లు విద్యుత్ సౌధమే!
ఇంటికైనా, భారీ భవనాలకైనా కిటికీలు అందంతోపాటు చల్లటి గాలి తెచ్చిపెడతాయి. వీటి ఉపయోగం ఇంతేనని మనం ఇప్పటివరకూ అనుకుంటున్నాం. అయితే టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు పరిస్థితి మారిపోనుంది. కావాలంటే పక్కనున్న ఫొటో చూడండి.. అందులో లాస్ అలమోస్ లేబొరేటరీ (యు.ఎస్.) శాస్త్రవేత్తలు చేత్తో పట్టుకుని ఉన్నది కిటికీలకు వాడే అద్దమే. కాకపోతే ఇదే అద్దం సోలార్ ప్యానెల్‌గానూ పనిచేస్తుంది. నిన్నమొన్నటివరకూ ఇలాంటివి చిన్నసైజులో మాత్రమే వస్తూంటే వీరు మాత్రం పెద్దపెద్ద సైజుల్లో తయారు చేసేశారు. వీటిని భవనాలకు లేదా ఇళ్ల కిటికీలకు వాడామనుకోండి. లోపల వాడే విద్యుత్తుకు అస్సలు బిల్లే కట్టక్కరలేదన్నమాట. ఒకవైపు సోలార్‌ప్యానెల్‌గా, మరోవైపు కిటికీలా పనిచేయడం ఎలా అని ప్రశ్నిస్తే... అంతా లుమినిసెంట్ సోలార్ కాన్‌సెంట్రేటర్స్ మహిమ అంటున్నారు శాస్త్రవేత్తలు.
ఇవి సూర్యరశ్మిని విశాలమైన ప్రాంతాల నుంచి సేకరించగలవు. వీటిల్లోని ఫ్లోరోఫోర్స్ ఒకవైపు కాంతిని లోపలికి పంపిస్తూనే మరోవైపు కొన్ని రసాయనాల సాయంతో కాంతి కిరణాలను చిన్నసైజులో ఉన్న ఫొటోవోల్టాయిక్ సెల్స్‌పైకి ప్రసరింప చేస్తాయి. ఈ లుమినిసెంట్ సోలార్ కాన్‌సెంట్రేటర్స్, ఫ్లోరోఫోర్స్‌ను ఒక సన్నటి పొరలా గాజుపై ఏర్పాటు చేసేందుకు శాస్త్రవేత్తలు డాక్టర్స్ బ్లేడ్ అనే ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించారు. కిటికీల ద్వారా సౌరశక్తిని విద్యుత్తుగా మార్చగలిగితే ఎన్నో ఫలితాలు ఉంటాయని, ఎలాంటి మౌలిక సదుపాయాల అవసరం లేకుండా అవసరమైన చోట అవసరమైనంత విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చునని అంచనా. ఇది అందుబాటులోకి వస్తే మన ఇల్లూ ఇలాగే ఖర్చులేకుండా వెలిగిపోతుంది.