చౌకగా సౌర, పవన శక్తి వనరులు !
ఆ దిశగా ప్రయత్నాలు చేయాలన్న ప్రధాని మోదీ
⇒ న్యూఢిల్లీలో రెన్యువబుల్ ఎనర్జీ- ఇన్వెస్ట్ ప్రారంభం
⇒ 20వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యం
⇒ రెట్టింపు వాటాకు రెన్యువబుల్ ఎనర్జీ !
న్యూఢిల్లీ: సౌర, పవన శక్తి వంటి పునరుత్పాదన ఇంధన వనరులు మరింత చౌకగా లభ్యమయ్యేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
భారత్‌లో శక్తివనరుల లోటును పూడ్చడానికి ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పారు. పర్యావరణ అనుకూల ఈ తరహా ఇంధన వనరులకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రపంచాన్ని ఆకట్టుకోవడానికి కాదని, ప్రజల ఇంధన అవసరాలను తీర్చడానికేనని ఆయన వివరించారు. ఇక్కడ తొలి రెన్యువబుల్ ఎనర్జీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్(ఆర్‌ఈ-ఇన్వెస్ట్)ను ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత రెన్యువబుల్ ఎనర్జీ సత్తాను ప్రపంచానికి చాటడం, 20 వేల కోట్ల డాలర్లు పెట్టుబడులు అకర్షించడం లక్ష్యాలుగా ఈ మీట్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ ఈ నెల 17 వరకూ(మంగళవారం) కొనసాగుతుంది. ఎన్‌టీపీసీ, సుజ్లాన్, రిలయన్స్ పవర్ వంటి 293 కం పెనీలు ఐదేళ్లలో 266 గిగా వాట్ల విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాయి.
హైబ్రిడ్ ఎనర్జీ పార్కులు
సౌర శక్తి వెలుగులు పేదలకు అందుబాటులోకి రావడానికి,మారుమూల ప్రాంతాల్లో సైతం వినియోగంలోకి తేవడానికి పరిశోధన చేయడం కోసం 50 దేశాలతో కలసి ఒక కన్సార్షియమ్‌ను ఏర్పాటు చేయడానికి భారత్ ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సోలార్ ఫొటో-వొల్టాయిక్ సెల్స్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ వ్యయం రూ.20 నుంచి రూ.7.50కు తగ్గిందని, మరింత పరిశోధన, నవకల్పనల కారణంగా ఈ వ్యయం మరింతగా తగ్గవచ్చని మోదీ వివరించారు.
సౌర శక్తి, పవన శక్తిలు అపారంగా ఉండే ప్రాంతాల్లో, హైబ్రిడ్ ఎనర్జీ పార్క్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. పునరుత్పాదన ఇంధన వనరుల ఉత్పత్తికి అవసరమయ్యే పరికరాలను దేశీయంగా అభివృద్ధి చేయాలని, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీనిని చేపట్టాలని పేర్కొన్నారు. ఫలితంగా దీర్ఘకాలం పాటు ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. నీటి కాలువలపై సౌర పలకలను ఏర్పాటు చేయాలని, ఇలా చేస్తే వాటిని సోలార్ ఇరిగేషన్ పంపులుగా కూడా ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఫొటో వొల్టాయిక్ సెల్స్‌ను రూఫ్-టాప్‌లుగా ఉపయోగించుకోవచ్చని కూడా ఆయన సూచించారు.
ప్రధాన కేంద్రంగా భారత్
ప్రపంచంలో పునరుత్పాదన ఇంధనాలకు ప్రధాన కేంద్రంగా భారత్ ఆవిర్భవించనున్నదని విద్యుత్, బొగ్గు, పునరుత్పాదన ఇంధన వనరుల శాఖ సహా య మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి మొత్తం భారత విద్యుదుత్పత్తిలో పునరుత్పాదన ఇంధన వనరుల వాటా6 శాతమని చెప్పారు. పదేళ్ల కాలంలో దీనిని 15 శాతానికి పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యమని గోయల్ పేర్కొన్నారు.
293 కంపెనీలు... 266 గిగా వాట్లు...
ఈ ఇన్వెస్టర్స్ మీట్‌లో పలు కంపెనీలు పలు ప్రణాళికలను వెల్లడించాయి. ఎన్‌టీపీసీ, రిలయన్స్ పవర్ వంటి 293 కంపెనీలు ఐదేళ్లలో 266 గిగా వాట్ల విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాయి. 11 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఉపయోగపడే పరికరాలు తయారు చేస్తామని సుజ్లాన్ ఎనర్జీ తెలిపింది. 7,500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఉపయోగపడే పరికరాలను తయారు చేస్తామని గమేస కంపెనీ వెల్లడించింది. పునరుత్పాదన వనరుల ద్వారా ఐదేళ్లలో 10 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తామని ఎన్‌టీపీసీ పేర్కొంది.
రూ.75,000 కోట్ల రుణాలిస్తాం: ఎస్‌బీఐ
15వేల మెగావాట్ల పునరుత్పాదన విద్యుదుత్పత్తి కోసం ఐదేళ్లలో రూ.75,000 కోట్ల రుణాలను ఇవ్వనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇప్పటి వరకు విద్యుత్ రంగానికి రూ.1.78 లక్షల కోట్ల రుణాలిచ్చామని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య వెల్లడించారు. వీటిల్లో రెన్యువబుల్ ఎనర్జీ రంగానికి సంబంధించిన రుణాలు రూ.7,500 కోట్లని పేర్కొన్నారు. ఆర్‌బీఐ ఈ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తిస్తే ఈ రంగానికి ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయని వివరించారు.