న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు గుప్త విరాళాలందించే ఎలక్టోరల్ బాండ్ల అంశంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు అందిన విరాళాల వివరాలు ఎన్నికల సంఘానికి(ఈసీ) అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చేస్తున్న జాప్యానికి మోదీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ జాతీయ అధ్యకక్షుడు మల్లిఖార్జున ఖర్గే మంగళవారం ఆరోపించారు.
జాతీయ బ్యాంకును మోదీ ప్రభుత్వం రక్షణ కవచంలా వాడుకుంటోందన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ టర్ము జూన్ 16తో ముగుస్తుందనగా ఎస్బీఐ జూన్ 30దాకా గడువు కోరడమేంటని ఖర్గే ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అత్యధికంగా అక్రమ లావాదేవీలు జరిపింది మోదీ బీజేపీయేనన్నారు. మార్చి 6వ తేదీకల్లా ఈసీకి బాండ్ల వివరాలందించాల్సిన ఎస్బీఐ డెడ్‌లైన్‌ను జూన్ 30 దాకా పొడిగించాలని తాజాగా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలందించిన 44వేల434 కంపెనీలు, వ్యక్తుల వివరాలను సిద్ధం చేయడానికి 24 గంటల కంటే ఎస్బీఐకి ఎక్కువ సమయం పట్టదని నిపుణులు వాదిస్తుండటం గమనార్హం.
కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్టీల పేరు మీద విడుదల చేసే ఎలక్టోరల్ బాండ్లను కంపెనీలు, వ్యక్తులు కొనుక్కుంటే రాజకీయ పార్టీల ఖాతాల్లో ఆ నిధులు జమవుతాయి. ఎవరు బాండ్లు కొనుగోలు చేస్తారనేది రహస్యంగా ఉంచుతారు. అయితే ఈ స్కీమ్‌లో పారదర్శకత లేదని దాఖలైన పిల్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని వాటి వివరాలను ఎన్నికల సంఘానికి వెంటనే అందించాలని ఎస్బీఐని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment