Indian Renewable Energy
-
ఆరేళ్లలో రూ.30 లక్షల కోట్లు కావాలి
న్యూఢిల్లీ: భారత్ విధించుకున్న కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను సాధించడానికి వచ్చే ఆరు ఆర్థిక సంవత్సరాల్లో (2024–2030) రూ.30 లక్షల కోట్లు అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘ఇరెడా’ సీఎండీ ప్రదీప్ కుమార్ దాస్ అన్నారు. దేశంలో సగం విద్యుత్తును పునరుత్పాదక ఇంధన వనరుల రూపంలో సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని భారత్ ఏర్పాటు చేసుకోగా, 2070 నాటికి నికరంగా సున్నా కర్బన ఉద్గారాల స్థితికి చేరుకోనున్నట్టు ప్రకటించడం తెలిసిందే. దీంతో సోలార్ పరికరాలు, ఎలక్ట్రోలైజర్లు, పవన విద్యుత్ టర్బయిన్లు, వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ సామర్థ్యాల ఏర్పాటుపై పెట్టుబడులు అవసరమవుతాయని దాస్ చెప్పారు. ప్రపంచబ్యాంక్ నిర్వహించిన ఒక వెబినార్‌లో భాగంగా ఆయన మాట్లాడారు. పీఎం ప్రారంభించిన పీఎం సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని గొప్ప ప్రాజెక్టుగా అభివర్ణించారు. దీని కింద కోటి ఇళ్లకు ప్రతి నెలా 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, ఇందు కోసం కేంద్ర సర్కారు రూ.75,000 కోట్లను ఖర్చు చేయనుంది. రూఫ్‌టాప్ సోలార్ ద్వారా దీన్ని చేపట్టనున్నారు. ఈ పథకం వల్ల గణనీయమైన ప్రయోజనాలకు తోడు, ప్రజల్లో పునరుత్పాదక ఇంధనం పట్ల పెద్ద ఎత్తున అవగాహన ఏర్పడుతుందని దాస్ అభిప్రాయపడ్డారు. దేశ కర్బన ఉద్గారాల లక్ష్యాలకు సాయపడుతుందన్నారు. ‘‘వచ్చే మూడేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యాన్ని భారత్ విధించుకుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఇంధన డిమాండ్‌ను చేరుకోవాల్సి ఉంటుంది. ఇందులో 90 శాతం పునత్పాదక ఇంధన వనరుల రూపంలోనే సమకూరనుంది’’అని దాస్ చెప్పారు. -
ఇరెడా ఐపీవో సక్సెస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మినీరత్న సంస్థ ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఐఆర్ఈడీఏ–ఇరెడా) పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. చివరి రోజు గురువారానికల్లా 39 రెట్లు అధిక స్పందన నమోదైంది. కంపెనీ 47 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 1,827 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు దాఖలయ్యాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 24 రెట్లు, రిటైలర్ల నుంచి దాదాపు 8 రెట్లు అధికంగా బిడ్స్ లభించాయి. అర్హతగల కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో అయితే దాదాపు 105 రెట్లు అధికంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. రూ. 30–32 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూలో భాగంగా సోమవారం(20న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 643 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. ఈక్విటీ వివరాలిలా ఐపీవోలో భాగంగా 40.31 కోట్ల ఈక్విటీ షేర్లను ఇరెడా తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్ కేంద్ర ప్రభుత్వం 26.88 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచింది. ఈక్విటీ జారీతో రూ. 1,290 కోట్లు, ప్రభుత్వ వాటాకు రూ. 860 కోట్ల చొప్పున లభించనున్నాయి. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ. 2,150 కోట్లు సమకూర్చుకోనుంది. గతేడాది మే నెలలో బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ లిస్టింగ్ తదుపరి మళ్లీ ప్రభుత్వ రంగ సంస్థ పబ్లిక్ ఇష్యూకి రావడం విశేషం! కాగా.. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ భవిష్యత్ పెట్టుబడి అవసరాలరీత్యా మూలధన పటిష్టతకు వినియోగించనుంది. -
పునరుత్పాదక ఇం‘ధన’ శక్తి
న్యూఢిల్లీ: మినీరత్న కంపెనీ భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (ఐఆర్ఈడీఏ)కు రూ.1,500 కోట్ల నిధులను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితోపాటు మహమ్మారి సమయంలో మారటోరియం విషయంలో రుణగ్రహీతలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపులకు సంబంధించి బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు రూ.974 కోట్లు క్యాబినెట్ మంజూరు చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం విలేకరులతో సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాలను తెలిపారు. ఆర్బీఐ రుణ నిబంధనల నేపథ్యం. ఆర్బీఐ రుణ నిబంధనల నేపథ్యంలో ఐఆర్ఈడీఏ నిధుల కల్పన నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. తాజా క్యాబినెట్ నిర్ణయం నేపథ్యంలో, పునరుత్పాదక ఇంధన రంగానికి ఐఆర్ఈడీఏ తన రుణ సామర్థ్యాన్ని రూ.12,000 కోట్లకు పెంచుకోవడానికి వీలు కలుగుతుందని ఆయన తెలిపారు. ‘‘ పునరుత్పాదక ఇంధన రంగంలో ఐఆర్ఈడీఏ కీలక పాత్ర పోషిస్తోంది. పునరుత్పాదక శక్తికి ఆర్థిక సహాయం చేయడానికి ఈ సంస్థ ఏర్పాటయ్యింది. గత ఆరు సంవత్సరాల్లో దీని పోర్ట్‌ఫోలియో రూ. 8,800 కోట్ల నుంచి రూ.27,000 కోట్లకు పెరిగింది’’ అని ఠాకూర్ చెప్పారు. ‘అయితే ఆర్బీఐ తాజా రుణ నిబంధనల ప్రకారం, ఒక సంస్థ తన నికర విలువలో 20 శాతం మాత్రమే రుణం ఇవ్వబడుతుంది. ఐఆర్ఈడీఏ నికర విలువ రూ. 3,000 కోట్లు. దీని ప్రకారం ప్రస్తుతం రూ. 600 కోట్ల వరకు మాత్రమే రుణాలు ఇవ్వగలదు. తాజా కేబినెట్ నిర్ణయంతో సంస్థ నెట్‌వర్త్ రూ.4,500 కోట్లకు పెరుగుతుంది. దీనివల్ల సంస్థ తన రుణ సామర్థ్యాన్ని సంస్థ భారీగా పెంచుకోగలుగుతుంది’’ అని కేంద్ర మంత్రి వివరించారు. భారీ ఉపాధి కల్పనకు దోహదం: ఐఆర్ఈడీఏ కేబినెట్ నిర్ణయం వల్ల సంస్థలో ఏటా దాదాపు 10,200 ఉద్యోగాల కల్పనకు సహాయపడుతుందని ఐఆర్ఈడీఏ పేర్కొంది. అలాగే ఒక సంవత్సరంలో సుమారు 7.49 మిలియన్ టన్నుల సీఓ2కు సమానమైన ఉద్గారాల తగ్గింపుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపింది. ఐఆర్ఈడీఏ ఎంఎన్ఆర్ఈ (మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ) నియంత్రణలో పనిచేస్తుంది. పునరుత్పాక ఇంధన రంగానికి రుణాలను అందించడానికిగాను బ్యాంకింగ్ యేతర ఫైనాన్షియల్ కంపెనీగా ఐఆర్ఈడీఏ 1987 ఏర్పాటయ్యింది. ఈ రంగ ప్రాజెక్ట్ ఫైనాన్షింగ్‌లో గడచిన 34 సంవత్సరాల్లో సంస్థ కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. ఎస్బీఐకి రూ.974 కోట్లు మహమ్మారి కరోనా మొదటి వేవ్ సమయంలో 2020లో అమలు చేసిన రుణ మారటోరియంకు సంబంధించి రీయింబర్స్‌మెంట్‌గా (పునఃచెల్లింపులుగా) బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు రూ. 973.74 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి ఠాకూర్ తెలిపిన సమాచారం ప్రకారం, నిర్దిష్ట రుణ ఖాతాలలో రుణగ్రహీతలకు ఆరు నెలల పాటు చక్రవడ్డీ– సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం విషయంలో చెల్లింపులకు ఉద్దేశించి ఎక్స్‌గ్రేషియా పథకం కోసం బడ్జెట్ రూ.5,500 కోట్లు కేటాయించింది. ఇందులో 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.4,626 కోట్ల చెల్లింపులు జరిగాయి. రూ.1,846 కోట్ల అదనపు క్లెయిమ్స్ పెండింగులో ఉన్నాయి. -
చౌకగా సౌర, పవన శక్తి వనరులు !
ఆ దిశగా ప్రయత్నాలు చేయాలన్న ప్రధాని మోదీ ⇒ న్యూఢిల్లీలో రెన్యువబుల్ ఎనర్జీ- ఇన్వెస్ట్ ప్రారంభం ⇒ 20వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యం ⇒ రెట్టింపు వాటాకు రెన్యువబుల్ ఎనర్జీ ! న్యూఢిల్లీ: సౌర, పవన శక్తి వంటి పునరుత్పాదన ఇంధన వనరులు మరింత చౌకగా లభ్యమయ్యేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారత్‌లో శక్తివనరుల లోటును పూడ్చడానికి ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పారు. పర్యావరణ అనుకూల ఈ తరహా ఇంధన వనరులకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రపంచాన్ని ఆకట్టుకోవడానికి కాదని, ప్రజల ఇంధన అవసరాలను తీర్చడానికేనని ఆయన వివరించారు. ఇక్కడ తొలి రెన్యువబుల్ ఎనర్జీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్(ఆర్ఈ-ఇన్వెస్ట్)ను ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత రెన్యువబుల్ ఎనర్జీ సత్తాను ప్రపంచానికి చాటడం, 20 వేల కోట్ల డాలర్లు పెట్టుబడులు అకర్షించడం లక్ష్యాలుగా ఈ మీట్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ ఈ నెల 17 వరకూ(మంగళవారం) కొనసాగుతుంది. ఎన్టీపీసీ, సుజ్లాన్, రిలయన్స్ పవర్ వంటి 293 కం పెనీలు ఐదేళ్లలో 266 గిగా వాట్ల విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాయి. హైబ్రిడ్ ఎనర్జీ పార్కులు సౌర శక్తి వెలుగులు పేదలకు అందుబాటులోకి రావడానికి,మారుమూల ప్రాంతాల్లో సైతం వినియోగంలోకి తేవడానికి పరిశోధన చేయడం కోసం 50 దేశాలతో కలసి ఒక కన్సార్షియమ్ను ఏర్పాటు చేయడానికి భారత్ ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సోలార్ ఫొటో-వొల్టాయిక్ సెల్స్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ వ్యయం రూ.20 నుంచి రూ.7.50కు తగ్గిందని, మరింత పరిశోధన, నవకల్పనల కారణంగా ఈ వ్యయం మరింతగా తగ్గవచ్చని మోదీ వివరించారు. సౌర శక్తి, పవన శక్తిలు అపారంగా ఉండే ప్రాంతాల్లో, హైబ్రిడ్ ఎనర్జీ పార్క్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. పునరుత్పాదన ఇంధన వనరుల ఉత్పత్తికి అవసరమయ్యే పరికరాలను దేశీయంగా అభివృద్ధి చేయాలని, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీనిని చేపట్టాలని పేర్కొన్నారు. ఫలితంగా దీర్ఘకాలం పాటు ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. నీటి కాలువలపై సౌర పలకలను ఏర్పాటు చేయాలని, ఇలా చేస్తే వాటిని సోలార్ ఇరిగేషన్ పంపులుగా కూడా ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఫొటో వొల్టాయిక్ సెల్స్‌ను రూఫ్-టాప్‌లుగా ఉపయోగించుకోవచ్చని కూడా ఆయన సూచించారు. ప్రధాన కేంద్రంగా భారత్ ప్రపంచంలో పునరుత్పాదన ఇంధనాలకు ప్రధాన కేంద్రంగా భారత్ ఆవిర్భవించనున్నదని విద్యుత్, బొగ్గు, పునరుత్పాదన ఇంధన వనరుల శాఖ సహా య మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి మొత్తం భారత విద్యుదుత్పత్తిలో పునరుత్పాదన ఇంధన వనరుల వాటా6 శాతమని చెప్పారు. పదేళ్ల కాలంలో దీనిని 15 శాతానికి పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యమని గోయల్ పేర్కొన్నారు. 293 కంపెనీలు... 266 గిగా వాట్లు... ఈ ఇన్వెస్టర్స్ మీట్లో పలు కంపెనీలు పలు ప్రణాళికలను వెల్లడించాయి. ఎన్టీపీసీ, రిలయన్స్ పవర్ వంటి 293 కంపెనీలు ఐదేళ్లలో 266 గిగా వాట్ల విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాయి. 11 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఉపయోగపడే పరికరాలు తయారు చేస్తామని సుజ్లాన్ ఎనర్జీ తెలిపింది. 7,500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఉపయోగపడే పరికరాలను తయారు చేస్తామని గమేస కంపెనీ వెల్లడించింది. పునరుత్పాదన వనరుల ద్వారా ఐదేళ్లలో 10 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తామని ఎన్టీపీసీ పేర్కొంది. రూ.75,000 కోట్ల రుణాలిస్తాం: ఎస్బీఐ 15వేల మెగావాట్ల పునరుత్పాదన విద్యుదుత్పత్తి కోసం ఐదేళ్లలో రూ.75,000 కోట్ల రుణాలను ఇవ్వనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇప్పటి వరకు విద్యుత్ రంగానికి రూ.1.78 లక్షల కోట్ల రుణాలిచ్చామని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య వెల్లడించారు. వీటిల్లో రెన్యువబుల్ ఎనర్జీ రంగానికి సంబంధించిన రుణాలు రూ.7,500 కోట్లని పేర్కొన్నారు. ఆర్బీఐ ఈ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తిస్తే ఈ రంగానికి ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయని వివరించారు.