న్యూఢిల్లీ: మినీరత్న కంపెనీ భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (ఐఆర్‌ఈడీఏ)కు రూ.1,500 కోట్ల నిధులను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితోపాటు మహమ్మారి సమయంలో మారటోరియం విషయంలో రుణగ్రహీతలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపులకు సంబంధించి బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు రూ.974 కోట్లు క్యాబినెట్ మంజూరు చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం విలేకరులతో సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాలను తెలిపారు.
ఆర్‌బీఐ రుణ నిబంధనల నేపథ్యం.
ఆర్‌బీఐ రుణ నిబంధనల నేపథ్యంలో ఐఆర్‌ఈడీఏ నిధుల కల్పన నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. తాజా క్యాబినెట్ నిర్ణయం నేపథ్యంలో, పునరుత్పాదక ఇంధన రంగానికి ఐఆర్‌ఈడీఏ తన రుణ సామర్థ్యాన్ని రూ.12,000 కోట్లకు పెంచుకోవడానికి వీలు కలుగుతుందని ఆయన తెలిపారు. ‘‘ పునరుత్పాదక ఇంధన రంగంలో ఐఆర్‌ఈడీఏ కీలక పాత్ర పోషిస్తోంది. పునరుత్పాదక శక్తికి ఆర్థిక సహాయం చేయడానికి ఈ సంస్థ ఏర్పాటయ్యింది. గత ఆరు సంవత్సరాల్లో దీని పోర్ట్‌ఫోలియో రూ. 8,800 కోట్ల నుంచి రూ.27,000 కోట్లకు పెరిగింది’’ అని ఠాకూర్ చెప్పారు. ‘అయితే ఆర్‌బీఐ తాజా రుణ నిబంధనల ప్రకారం, ఒక సంస్థ తన నికర విలువలో 20 శాతం మాత్రమే రుణం ఇవ్వబడుతుంది. ఐఆర్‌ఈడీఏ నికర విలువ రూ. 3,000 కోట్లు. దీని ప్రకారం ప్రస్తుతం రూ. 600 కోట్ల వరకు మాత్రమే రుణాలు ఇవ్వగలదు. తాజా కేబినెట్ నిర్ణయంతో సంస్థ నెట్‌వర్త్ రూ.4,500 కోట్లకు పెరుగుతుంది. దీనివల్ల సంస్థ తన రుణ సామర్థ్యాన్ని సంస్థ భారీగా పెంచుకోగలుగుతుంది’’ అని కేంద్ర మంత్రి వివరించారు.
భారీ ఉపాధి కల్పనకు దోహదం: ఐఆర్‌ఈడీఏ
కేబినెట్ నిర్ణయం వల్ల సంస్థలో ఏటా దాదాపు 10,200 ఉద్యోగాల కల్పనకు సహాయపడుతుందని ఐఆర్‌ఈడీఏ పేర్కొంది. అలాగే ఒక సంవత్సరంలో సుమారు 7.49 మిలియన్ టన్నుల సీఓ2కు సమానమైన ఉద్గారాల తగ్గింపుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపింది. ఐఆర్‌ఈడీఏ ఎంఎన్‌ఆర్‌ఈ (మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ) నియంత్రణలో పనిచేస్తుంది. పునరుత్పాక ఇంధన రంగానికి రుణాలను అందించడానికిగాను బ్యాంకింగ్ యేతర ఫైనాన్షియల్ కంపెనీగా ఐఆర్‌ఈడీఏ 1987 ఏర్పాటయ్యింది. ఈ రంగ ప్రాజెక్ట్ ఫైనాన్షింగ్‌లో గడచిన 34 సంవత్సరాల్లో సంస్థ కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది.
ఎస్‌బీఐకి రూ.974 కోట్లు
మహమ్మారి కరోనా మొదటి వేవ్ సమయంలో 2020లో అమలు చేసిన రుణ మారటోరియంకు సంబంధించి రీయింబర్స్‌మెంట్‌గా (పునఃచెల్లింపులుగా) బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు రూ. 973.74 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి ఠాకూర్ తెలిపిన సమాచారం ప్రకారం, నిర్దిష్ట రుణ ఖాతాలలో రుణగ్రహీతలకు ఆరు నెలల పాటు చక్రవడ్డీ– సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం విషయంలో చెల్లింపులకు ఉద్దేశించి ఎక్స్‌గ్రేషియా పథకం కోసం బడ్జెట్ రూ.5,500 కోట్లు కేటాయించింది. ఇందులో 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.4,626 కోట్ల చెల్లింపులు జరిగాయి. రూ.1,846 కోట్ల అదనపు క్లెయిమ్స్ పెండింగులో ఉన్నాయి.
పునరుత్పాదక ఇం‘ధన’ శక్తి
Published Thu, Jan 20 2022 2:00 AM | Last Updated on Thu, Jan 20 2022 2:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment