renewable
-
భారీ పెట్టుబడులకు అదానీ రెడీ
అహ్మదాబాద్: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ పునరుత్పాదక (రెన్యువబుల్స్‌ౖ) విద్యుదుత్పత్తిపై భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. 2030కల్లా 40 గిగావాట్ల (జీడబ్ల్యూ) పునరుత్పాదక సామర్థ్యాన్ని నిర్మించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సిద్ధపడుతోంది. తద్వారా 2050కల్లా వివిధ బిజినెస్‌లలో నికరంగా కర్బనరహితం(నెట్ జీరో)గా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం గ్రూప్ పునరుత్పాదక(సౌర, పవన) విద్యుత్‌లో 10 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఇకపై ప్రతీ ఏడాది 6–7 జీడబ్ల్యూను జత చేసుకోవాలని చూస్తోంది. వెరసి 2030కల్లా 50 గిగావాట్లకు చేరుకునే లక్ష్యంతో పనిచేస్తోంది. ఒక్కో మెగావాట్‌కు రూ. 5 కోట్ల పెట్టుబడుల అంచనాతో మదింపు చేస్తే 2030కల్లా రూ. 2 లక్షల కోట్లను వెచ్చించవలసి ఉంటుందని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ వెల్లడించారు. వీటితోపాటు 5 జీడబ్ల్యూ పంప్ స్టోరేజీ సామర్థ్యా న్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఈవో అమిత్ సింగ్ తెలిపారు. విద్యుత్‌కు అధిక డిమాండ్ నెలకొనే రాత్రి వేళల్లో విద్యుదుత్పత్తికి వీలుగా స్టోరేజీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. కార్బన్ క్రెడిట్స్.. రెన్యువబుల్ సామర్థ్యాల వినియోగం ద్వారా లభించే కార్బన్ క్రెడిట్స్‌కుతోడు మరికొన్ని ఇతర చర్యల ద్వారా 2050కల్లా అదానీ గ్రూప్ నెట్ జీరోకు చేరనున్నట్లు అమిత్ పేర్కొన్నారు. గతేడాది(2023–24) అదానీ గ్రీన్ ఎనర్జీ 2.8 జీడబ్ల్యూ సామర్థ్యాలను జత చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో 6 జీడబ్ల్యూ సామర్థ్యాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కాగా, అదానీ గ్రూప్ ఈ ఏడాది (2024–25) వివిధ విభాగాలపై భారీ పెట్టుబడుల ప్రణాళికలు ప్రకటించింది. వివిధ కంపెనీలలో రూ. 1.3 లక్షల కోట్లు వెచ్చించనుంది. -
‘పునరుత్పాదకత’లోకి రూ.1.64 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన రంగం ఈ ఏడాది 20 బిలియన్ డాలర్లను (రూ.1.64 లక్షల కోట్లు) ఆకర్షిస్తుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిశ్రమకు సంబంధించి బలమైన కార్యాచరణ అవసరమన్న అభిప్రాయం శుక్రవారం ఢిల్లీలో జరిగిన రీకాన్ ఇండియా 2023 సదస్సులో వ్యక్తమైంది. పరిశ్రమకు సంబంధించి కీలక అంశాలు, సవాళ్లు, అవకాశాలను ఈ సందర్భంగా నిపుణులు ప్రస్తావించారు. బ్లూ సర్కిల్ ఈ సదస్సును నిర్వహించింది. పునరుత్పాదక రంగంలోకి 2023లో 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్టు బ్లూసర్కిల్ సీఈవో సిద్ధార్థ్ ఆనంద్ తెలిపారు. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ సైతం 2023లో ఈ రంగం 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని లోగడ చెప్పడం గమనార్హం. భారత్‌లో ఉత్పత్తికి అనువుకాని భూములు అధికంగా ఉన్నాయని, కనుక సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటులో భారీ అవకాశాలు సొంతం చేసుకోవచ్చని ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ప్రైవేటు సెక్టార్ స్పెషలిస్ట్ అలెగ్జాండర్ హాగ్వీన్ రుట్టర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల పరంగా కూడా అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భారత్ 2030 నాటికి 280 గిగావాట్ సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకుంటుందని ఎన్టీపీసీ రెన్యువబుల్స్ సీఈవో మోహిత్ భార్గవ ప్రకటించారు. -
పునరుత్పాదక ఇం‘ధన’ శక్తి
న్యూఢిల్లీ: మినీరత్న కంపెనీ భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (ఐఆర్ఈడీఏ)కు రూ.1,500 కోట్ల నిధులను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితోపాటు మహమ్మారి సమయంలో మారటోరియం విషయంలో రుణగ్రహీతలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపులకు సంబంధించి బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు రూ.974 కోట్లు క్యాబినెట్ మంజూరు చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం విలేకరులతో సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాలను తెలిపారు. ఆర్బీఐ రుణ నిబంధనల నేపథ్యం. ఆర్బీఐ రుణ నిబంధనల నేపథ్యంలో ఐఆర్ఈడీఏ నిధుల కల్పన నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. తాజా క్యాబినెట్ నిర్ణయం నేపథ్యంలో, పునరుత్పాదక ఇంధన రంగానికి ఐఆర్ఈడీఏ తన రుణ సామర్థ్యాన్ని రూ.12,000 కోట్లకు పెంచుకోవడానికి వీలు కలుగుతుందని ఆయన తెలిపారు. ‘‘ పునరుత్పాదక ఇంధన రంగంలో ఐఆర్ఈడీఏ కీలక పాత్ర పోషిస్తోంది. పునరుత్పాదక శక్తికి ఆర్థిక సహాయం చేయడానికి ఈ సంస్థ ఏర్పాటయ్యింది. గత ఆరు సంవత్సరాల్లో దీని పోర్ట్‌ఫోలియో రూ. 8,800 కోట్ల నుంచి రూ.27,000 కోట్లకు పెరిగింది’’ అని ఠాకూర్ చెప్పారు. ‘అయితే ఆర్బీఐ తాజా రుణ నిబంధనల ప్రకారం, ఒక సంస్థ తన నికర విలువలో 20 శాతం మాత్రమే రుణం ఇవ్వబడుతుంది. ఐఆర్ఈడీఏ నికర విలువ రూ. 3,000 కోట్లు. దీని ప్రకారం ప్రస్తుతం రూ. 600 కోట్ల వరకు మాత్రమే రుణాలు ఇవ్వగలదు. తాజా కేబినెట్ నిర్ణయంతో సంస్థ నెట్‌వర్త్ రూ.4,500 కోట్లకు పెరుగుతుంది. దీనివల్ల సంస్థ తన రుణ సామర్థ్యాన్ని సంస్థ భారీగా పెంచుకోగలుగుతుంది’’ అని కేంద్ర మంత్రి వివరించారు. భారీ ఉపాధి కల్పనకు దోహదం: ఐఆర్ఈడీఏ కేబినెట్ నిర్ణయం వల్ల సంస్థలో ఏటా దాదాపు 10,200 ఉద్యోగాల కల్పనకు సహాయపడుతుందని ఐఆర్ఈడీఏ పేర్కొంది. అలాగే ఒక సంవత్సరంలో సుమారు 7.49 మిలియన్ టన్నుల సీఓ2కు సమానమైన ఉద్గారాల తగ్గింపుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపింది. ఐఆర్ఈడీఏ ఎంఎన్ఆర్ఈ (మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ) నియంత్రణలో పనిచేస్తుంది. పునరుత్పాక ఇంధన రంగానికి రుణాలను అందించడానికిగాను బ్యాంకింగ్ యేతర ఫైనాన్షియల్ కంపెనీగా ఐఆర్ఈడీఏ 1987 ఏర్పాటయ్యింది. ఈ రంగ ప్రాజెక్ట్ ఫైనాన్షింగ్‌లో గడచిన 34 సంవత్సరాల్లో సంస్థ కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. ఎస్బీఐకి రూ.974 కోట్లు మహమ్మారి కరోనా మొదటి వేవ్ సమయంలో 2020లో అమలు చేసిన రుణ మారటోరియంకు సంబంధించి రీయింబర్స్‌మెంట్‌గా (పునఃచెల్లింపులుగా) బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు రూ. 973.74 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి ఠాకూర్ తెలిపిన సమాచారం ప్రకారం, నిర్దిష్ట రుణ ఖాతాలలో రుణగ్రహీతలకు ఆరు నెలల పాటు చక్రవడ్డీ– సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం విషయంలో చెల్లింపులకు ఉద్దేశించి ఎక్స్‌గ్రేషియా పథకం కోసం బడ్జెట్ రూ.5,500 కోట్లు కేటాయించింది. ఇందులో 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.4,626 కోట్ల చెల్లింపులు జరిగాయి. రూ.1,846 కోట్ల అదనపు క్లెయిమ్స్ పెండింగులో ఉన్నాయి. -
ఎక్కువ కరెంటు వాడితే డబ్బులిస్తారు!
జర్మనీ: సాధారణంగా విద్యుత్ వినియోగించినందుకు గాను ప్రజలు ప్రభుత్వానికి కరెంటు బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ఒక్కోసారి కరెంటు ఎక్కువగా వాడకపోయినా లక్షలకొద్దీ తప్పుడు బిల్లులు రావడం చూశాం. కానీ అక్కడ మాత్రం విద్యుత్ అధికంగా వినియోగించండి... డబ్బులు సంపాదించండి అంటూ ప్రభుత్వమే ప్రజలను ప్రాధేయపడిందట. వింతగా ఉంది కదూ! సహజ విద్యుత్ ఉత్సత్తి సామర్థ్యంలో (35,900 మెగావాట్లతో) ప్రపంచంలోనే అగ్రభాగాన ఉన్న జర్మనీ... ప్రజలకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. విద్యుత్ ఎక్కువగా వినియోగించినవారికి మేమే డబ్బు చెల్లిస్తామంటూ ప్రకటనలు చేసింది. గతనెల్లో వాతావరణంలో వచ్చిన మార్పులు, ఎండ, గాలులతో జర్మనీలో విద్యుత్ పునరుత్సాదకత భారీగా పెరిగి, కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోని సౌర, పవన, జల, బయోమాస్ ప్లాంట్లలో విద్యుత్ 55GW నుంచి 63GW వరకూ... అంటే సుమారు 87 శాతం వరకూ ఉత్పత్తి పెరిగిపోయింది. దీంతో కొన్ని గంటలపాటు విద్యుత్ ధరలు ప్రతికూల పరిస్థితుల్లోకి చేరడంతో అత్యధిక విద్యుత్ వినియోగించినవారికి, వాణిజ్య వినియోగదారులకు ప్రభుత్వమే ఎదరు డబ్బు చెల్లించే పరిస్థితులు నెలకొన్నాయి. జర్మనీలో గత ఏడాది సగటున సునరుత్సాదకత 33 శాతం ఉన్నట్లు జర్మన్ క్లీన్ ఎనర్జీ థింక్ ట్యాంక్ 'అగోరా ఎనర్జీ వెండే' నివేదికలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం పవన విద్యుత్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. 2050 నాటికి వందశాతం ఉత్పాదకతను చేరుకునేందుకు జర్మనీ యోచిస్తుండగా... డెన్మార్క్ గాలి టర్బైన్లు ఇప్పటికే అత్యధిక విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూ, మిగులు విద్యుత్ ను జర్మనీ నార్వే, స్వీడన్ లకు ఎగుమతి చేస్తోంది. కాగా.. జర్మనీలో ఏర్పడ్డ మిగులు విద్యుత్ అన్నది మంచి పరిణామం కాదని, ఈ విషయంలో సమయానికి ఇటు సరఫరాదారులు, అటు వినియోగదారులు ధరల సూచికపై స్పందించాల్సి వస్తుందని, లేదంటే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని నిపుణులు అంటున్నారు. పైగా గ్యాస్ పవర్ ప్లాంట్లు ఆఫ్ లైన్లో ఉన్నపుడు, న్యూక్లియర్, లోకల్ ప్లాంట్లు మూసే వీలుండకపోవడంతో వాటిని గంటల తరబడి కొనసాగించాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో వారు విద్యుత్తుకు డబ్బు చెల్లించాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రిఫైనరీలు, కర్మాగారాలు వంటి పారిశ్రామిక వినియోగదారులు మాత్రం విద్యుత్ ను వాడుకొని డబ్బు సంపాదించగల్గుతున్నారని చెప్తున్నారు.