రెన్యువబుల్స్‌పై రూ. 2 లక్షల కోట్లు
2030కల్లా 50 గిగావాట్ల సామర్థ్యం
అహ్మదాబాద్: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ పునరుత్పాదక (రెన్యువబుల్స్‌ౖ) విద్యుదుత్పత్తిపై భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. 2030కల్లా 40 గిగావాట్ల (జీడబ్ల్యూ) పునరుత్పాదక సామర్థ్యాన్ని నిర్మించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సిద్ధపడుతోంది. తద్వారా 2050కల్లా వివిధ బిజినెస్‌లలో నికరంగా కర్బనరహితం(నెట్ జీరో)గా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం గ్రూప్ పునరుత్పాదక(సౌర, పవన) విద్యుత్‌లో 10 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఇకపై ప్రతీ ఏడాది 6–7 జీడబ్ల్యూను జత చేసుకోవాలని చూస్తోంది. వెరసి 2030కల్లా 50 గిగావాట్లకు చేరుకునే లక్ష్యంతో పనిచేస్తోంది. ఒక్కో మెగావాట్‌కు రూ. 5 కోట్ల పెట్టుబడుల అంచనాతో మదింపు చేస్తే 2030కల్లా రూ. 2 లక్షల కోట్లను వెచ్చించవలసి ఉంటుందని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ వెల్లడించారు. వీటితోపాటు 5 జీడబ్ల్యూ పంప్ స్టోరేజీ సామర్థ్యా న్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఈవో అమిత్ సింగ్ తెలిపారు. విద్యుత్‌కు అధిక డిమాండ్ నెలకొనే రాత్రి వేళల్లో విద్యుదుత్పత్తికి వీలుగా స్టోరేజీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వివరించారు.
కార్బన్ క్రెడిట్స్..
రెన్యువబుల్ సామర్థ్యాల వినియోగం ద్వారా లభించే కార్బన్ క్రెడిట్స్‌కుతోడు మరికొన్ని ఇతర చర్యల ద్వారా 2050కల్లా అదానీ గ్రూప్ నెట్ జీరోకు చేరనున్నట్లు అమిత్ పేర్కొన్నారు. గతేడాది(2023–24) అదానీ గ్రీన్ ఎనర్జీ 2.8 జీడబ్ల్యూ సామర్థ్యాలను జత చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో 6 జీడబ్ల్యూ సామర్థ్యాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కాగా, అదానీ గ్రూప్ ఈ ఏడాది (2024–25) వివిధ విభాగాలపై భారీ పెట్టుబడుల ప్రణాళికలు ప్రకటించింది. వివిధ కంపెనీలలో రూ. 1.3 లక్షల కోట్లు వెచ్చించనుంది.
Comments
Please login to add a commentAdd a comment