ఎక్కువ కరెంటు వాడితే డబ్బులిస్తారు!
జర్మనీ: సాధారణంగా విద్యుత్ వినియోగించినందుకు గాను ప్రజలు ప్రభుత్వానికి కరెంటు బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ఒక్కోసారి కరెంటు ఎక్కువగా వాడకపోయినా లక్షలకొద్దీ తప్పుడు బిల్లులు రావడం చూశాం. కానీ అక్కడ మాత్రం విద్యుత్ అధికంగా వినియోగించండి... డబ్బులు సంపాదించండి అంటూ ప్రభుత్వమే ప్రజలను ప్రాధేయపడిందట. వింతగా ఉంది కదూ!
సహజ విద్యుత్ ఉత్సత్తి సామర్థ్యంలో (35,900 మెగావాట్లతో) ప్రపంచంలోనే అగ్రభాగాన ఉన్న జర్మనీ... ప్రజలకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. విద్యుత్ ఎక్కువగా వినియోగించినవారికి మేమే డబ్బు చెల్లిస్తామంటూ ప్రకటనలు చేసింది. గతనెల్లో వాతావరణంలో వచ్చిన మార్పులు, ఎండ, గాలులతో జర్మనీలో విద్యుత్ పునరుత్సాదకత భారీగా పెరిగి, కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోని సౌర, పవన, జల, బయోమాస్ ప్లాంట్లలో విద్యుత్ 55GW నుంచి 63GW వరకూ... అంటే సుమారు 87 శాతం వరకూ ఉత్పత్తి పెరిగిపోయింది. దీంతో కొన్ని గంటలపాటు విద్యుత్ ధరలు ప్రతికూల పరిస్థితుల్లోకి చేరడంతో అత్యధిక విద్యుత్ వినియోగించినవారికి, వాణిజ్య వినియోగదారులకు ప్రభుత్వమే ఎదరు డబ్బు చెల్లించే పరిస్థితులు నెలకొన్నాయి.
జర్మనీలో గత ఏడాది సగటున సునరుత్సాదకత 33 శాతం ఉన్నట్లు జర్మన్ క్లీన్ ఎనర్జీ థింక్ ట్యాంక్ 'అగోరా ఎనర్జీ వెండే' నివేదికలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం పవన విద్యుత్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. 2050 నాటికి వందశాతం ఉత్పాదకతను చేరుకునేందుకు జర్మనీ యోచిస్తుండగా... డెన్మార్క్ గాలి టర్బైన్లు ఇప్పటికే అత్యధిక విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూ, మిగులు విద్యుత్ ను జర్మనీ నార్వే, స్వీడన్ లకు ఎగుమతి చేస్తోంది.
కాగా.. జర్మనీలో ఏర్పడ్డ మిగులు విద్యుత్ అన్నది మంచి పరిణామం కాదని, ఈ విషయంలో సమయానికి ఇటు సరఫరాదారులు, అటు వినియోగదారులు ధరల సూచికపై స్పందించాల్సి వస్తుందని, లేదంటే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని నిపుణులు అంటున్నారు. పైగా గ్యాస్ పవర్ ప్లాంట్లు ఆఫ్ లైన్లో ఉన్నపుడు, న్యూక్లియర్, లోకల్ ప్లాంట్లు మూసే వీలుండకపోవడంతో వాటిని గంటల తరబడి కొనసాగించాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో వారు విద్యుత్తుకు డబ్బు చెల్లించాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రిఫైనరీలు, కర్మాగారాలు వంటి పారిశ్రామిక వినియోగదారులు మాత్రం విద్యుత్ ను వాడుకొని డబ్బు సంపాదించగల్గుతున్నారని చెప్తున్నారు.