న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన రంగం ఈ ఏడాది 20 బిలియన్ డాలర్లను (రూ.1.64 లక్షల కోట్లు) ఆకర్షిస్తుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిశ్రమకు సంబంధించి బలమైన కార్యాచరణ అవసరమన్న అభిప్రాయం శుక్రవారం ఢిల్లీలో జరిగిన రీకాన్ ఇండియా 2023 సదస్సులో వ్యక్తమైంది.
పరిశ్రమకు సంబంధించి కీలక అంశాలు, సవాళ్లు, అవకాశాలను ఈ సందర్భంగా నిపుణులు ప్రస్తావించారు. బ్లూ సర్కిల్ ఈ సదస్సును నిర్వహించింది. పునరుత్పాదక రంగంలోకి 2023లో 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్టు బ్లూసర్కిల్ సీఈవో సిద్ధార్థ్ ఆనంద్ తెలిపారు. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ సైతం 2023లో ఈ రంగం 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని లోగడ చెప్పడం గమనార్హం.
భారత్‌లో ఉత్పత్తికి అనువుకాని భూములు అధికంగా ఉన్నాయని, కనుక సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటులో భారీ అవకాశాలు సొంతం చేసుకోవచ్చని ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ప్రైవేటు సెక్టార్ స్పెషలిస్ట్ అలెగ్జాండర్ హాగ్‌వీన్ రుట్టర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల పరంగా కూడా అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భారత్ 2030 నాటికి 280 గిగావాట్ సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకుంటుందని ఎన్‌టీపీసీ రెన్యువబుల్స్ సీఈవో మోహిత్ భార్గవ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment