న్యూఢిల్లీ: భారత్ విధించుకున్న కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను సాధించడానికి వచ్చే ఆరు ఆర్థిక సంవత్సరాల్లో (2024–2030) రూ.30 లక్షల కోట్లు అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘ఇరెడా’ సీఎండీ ప్రదీప్ కుమార్ దాస్ అన్నారు. దేశంలో సగం విద్యుత్తును పునరుత్పాదక ఇంధన వనరుల రూపంలో సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని భారత్ ఏర్పాటు చేసుకోగా, 2070 నాటికి నికరంగా సున్నా కర్బన ఉద్గారాల స్థితికి చేరుకోనున్నట్టు ప్రకటించడం తెలిసిందే.
దీంతో సోలార్ పరికరాలు, ఎలక్ట్రోలైజర్లు, పవన విద్యుత్ టర్బయిన్లు, వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ సామర్థ్యాల ఏర్పాటుపై పెట్టుబడులు అవసరమవుతాయని దాస్ చెప్పారు. ప్రపంచబ్యాంక్ నిర్వహించిన ఒక వెబినార్‌లో భాగంగా ఆయన మాట్లాడారు. పీఎం ప్రారంభించిన పీఎం సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని గొప్ప ప్రాజెక్టుగా అభివర్ణించారు. దీని కింద కోటి ఇళ్లకు ప్రతి నెలా 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, ఇందు కోసం కేంద్ర సర్కారు రూ.75,000 కోట్లను ఖర్చు చేయనుంది.
రూఫ్‌టాప్ సోలార్ ద్వారా దీన్ని చేపట్టనున్నారు. ఈ పథకం వల్ల గణనీయమైన ప్రయోజనాలకు తోడు, ప్రజల్లో పునరుత్పాదక ఇంధనం పట్ల పెద్ద ఎత్తున అవగాహన ఏర్పడుతుందని దాస్ అభిప్రాయపడ్డారు. దేశ కర్బన ఉద్గారాల లక్ష్యాలకు సాయపడుతుందన్నారు. ‘‘వచ్చే మూడేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యాన్ని భారత్ విధించుకుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఇంధన డిమాండ్‌ను చేరుకోవాల్సి ఉంటుంది. ఇందులో 90 శాతం పునత్పాదక ఇంధన వనరుల రూపంలోనే సమకూరనుంది’’అని దాస్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment