అదానీకి రుణంపై 3 నెలల్లో నిర్ణయం: ఎస్‌బీఐ
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ఆస్ట్రేలియా మైనింగ్ ప్రాజెక్టుకు బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6,200 కోట్లు) రుణం మం జూరుపై రెండుమూడు నెలల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా క్వీన్స్‌ల్యాండ్‌లోని కార్మైఖేల్ బొగ్గు గని ప్రాజెక్టును అదానీ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంపై సంతకాల సందర్భంగానే ఎస్‌బీఐ కూడా బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అదానీ గ్రూప్‌తో అవగాహన ఒప్పందాన్ని(ఎంఓయూ) కుదుర్చుకుంది.
అయితే, ఏ మాత్రం లాభదాయకంకాని ఈ ప్రాజెక్టుకు ఎస్‌బీఐ రుణం ఎలా ఇస్తుందంటూ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా విమర్శలు గుప్పించడంతో వివాదాస్పదమైంది. కాగా, తమ ఎగ్జిక్యూటివ్ కమిటీలో పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరిపిన తర్వాతే అదానీకి రుణం మంజూరుచేసే విషయంపై తుది నిర్ణ యం తీసుకుంటామని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య వెల్లడించారు. కమిటీ సభ్యుల్లో ఆర్‌బీఐ నామినీ డెరైక్టర్ అయిన ఉర్జిత్ పటేల్(ఆర్‌బీఈ డిప్యూటీ గవర్నర్) కూడా ఒకరు కావడం గమనార్హం.