mining project
-
2023లో 4 కొత్త గనుల్లో ఉత్పత్తి ప్రారంభించాలి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌తో పాటు మరో మూడు ఉపరితల గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని, దీనికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సింగేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. కొత్త ప్రాజెక్టులపై బుధవారం ఆయన సింగరేణి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఐదేళ్లలో చేపట్టనున్న 10 ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు. కొత్తగూడెంలోని వీకే బ్లాక్‌లో జూన్ నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని, బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఉపరితల గని, ఇల్లెందులోని జేకే ఓసీ విస్తరణలో జూలై నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని ఆదేశించారు. అటవీ, పర్యావరణ తదితర అనుమతులు పొంది ఓబీ కాంట్రాక్టులు కూడా ఖరారు చేయాలని శ్రీధర్ సూచించారు. 2023–24లో బెల్లంపల్లి ఏరియాలోని ఎంవీకే ఓసీ తదితర గనుల ప్రారంభానికి అన్ని అనుమతులు సాధించాలన్నారు. ఉత్పత్తి ప్రారంభించిన కొత్త ఓపెన్ కాస్ట్ గనుల వార్షిక లక్ష్యాలను పెంచుతూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జీడీకే గని నుంచి ఏడాదికి 30 లక్షల టన్నులు, ఇందారం ఓపెన్ కాస్టు నుంచి 26 లక్షల టన్నులు, కేకే ఓసీ గని నుంచి 22.5 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని ఆయన ఆదేశించారు. రికార్డుస్థాయిలో రూ.23,225 కోట్ల టర్నోవర్ సింగరేణి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నెలతో ముగిసిన మూడో త్రైమాసికం నాటికి రికార్డు స్థాయిలో రూ.23,225 కోట్ల టర్నోవర్ సాధించిందని శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి సాధించిన రూ.18,956 కోట్ల టర్నోవర్‌తో పోల్చితే 23 శాతం వృద్ధి నమోదు చేసినట్లు వెల్లడించారు. 2021–22లో సింగరేణి వార్షిక టర్నోవర్ రూ.26,619 కోట్లు కాగా, 2022–23లో రూ.34 వేల కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. -
అదానీ ఆస్ట్రేలియా మైనింగ్ ప్రాజెక్ట్ పై మరో వివాదం
మెల్బోర్న్: అదానీ గ్రూప్ ఆస్ట్రేలియాలో చేపట్టిన మైనింగ్ ప్రాజెక్ట్‌పై తాజాగా మరో న్యాయ వివాదం చోటు చేసుకుంది. అదానీ సంస్థ క్వీన్స్‌లాండ్‌లోని గలిలీ బేసిన్లో 1,200 కోట్ల డాలర్ల మైనింగ్ ప్రాజెక్ట్‌ను నిర్వహించాలని యోచిస్తోంది. ఈ మైనింగ్ ప్రాజెక్ట్‌కు ఇచ్చిన లీజ్‌లను సవాల్ చేస్తూ, ఈ గలిలీ బేసిన్ పాత యాజమాన్య సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామంటూ వాన్గన్ అండ్ జగలిన్గావూ(డబ్ల్యూ అండ్ జే) సంస్థ ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టులో తాజాగా కేసు దాఖలు చేసింది. తమ ఆమోదం లేకుండానే ఈ మైనింగ్ లీజ్‌లు అదానీ సంస్థకు ఇచ్చారని డబ్ల్యూ అండ్ జే సంస్థ పేర్కొంది. అయితే గలిలీ బేసిన్ గత యజమానులకు డబ్ల్యూ అండ్ జే గ్రూప్ పూర్తిగా ప్రాతినిధ్యం వహించడం లేదని, ఈ కేసు దాఖలు చేయడం పూర్తిగా రాజకీయ ప్రేరేపిత చర్య అని అదానీ గ్రూప్ పేర్కొంది. -
అదానీకి రుణంపై 3 నెలల్లో నిర్ణయం: ఎస్బీఐ
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ఆస్ట్రేలియా మైనింగ్ ప్రాజెక్టుకు బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6,200 కోట్లు) రుణం మం జూరుపై రెండుమూడు నెలల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా క్వీన్స్‌ల్యాండ్‌లోని కార్మైఖేల్ బొగ్గు గని ప్రాజెక్టును అదానీ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంపై సంతకాల సందర్భంగానే ఎస్బీఐ కూడా బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అదానీ గ్రూప్‌తో అవగాహన ఒప్పందాన్ని(ఎంఓయూ) కుదుర్చుకుంది. అయితే, ఏ మాత్రం లాభదాయకంకాని ఈ ప్రాజెక్టుకు ఎస్బీఐ రుణం ఎలా ఇస్తుందంటూ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా విమర్శలు గుప్పించడంతో వివాదాస్పదమైంది. కాగా, తమ ఎగ్జిక్యూటివ్ కమిటీలో పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరిపిన తర్వాతే అదానీకి రుణం మంజూరుచేసే విషయంపై తుది నిర్ణ యం తీసుకుంటామని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య వెల్లడించారు. కమిటీ సభ్యుల్లో ఆర్బీఐ నామినీ డెరైక్టర్ అయిన ఉర్జిత్ పటేల్(ఆర్బీఈ డిప్యూటీ గవర్నర్) కూడా ఒకరు కావడం గమనార్హం.