సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌తో పాటు మరో మూడు ఉపరితల గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని, దీనికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సింగేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. కొత్త ప్రాజెక్టులపై బుధవారం ఆయన సింగరేణి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఐదేళ్లలో చేపట్టనున్న 10 ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు.
కొత్తగూడెంలోని వీకే బ్లాక్‌లో జూన్ నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని, బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఉపరితల గని, ఇల్లెందులోని జేకే ఓసీ విస్తరణలో జూలై నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని ఆదేశించారు. అటవీ, పర్యావరణ తదితర అనుమతులు పొంది ఓబీ కాంట్రాక్టులు కూడా ఖరారు చేయాలని శ్రీధర్ సూచించారు.
2023–24లో బెల్లంపల్లి ఏరియాలోని ఎంవీకే ఓసీ తదితర గనుల ప్రారంభానికి అన్ని అనుమతులు సాధించాలన్నారు. ఉత్పత్తి ప్రారంభించిన కొత్త ఓపెన్ కాస్ట్ గనుల వార్షిక లక్ష్యాలను పెంచుతూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జీడీకే గని నుంచి ఏడాదికి 30 లక్షల టన్నులు, ఇందారం ఓపెన్ కాస్టు నుంచి 26 లక్షల టన్నులు, కేకే ఓసీ గని నుంచి 22.5 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని ఆయన ఆదేశించారు.
రికార్డుస్థాయిలో రూ.23,225 కోట్ల టర్నోవర్
సింగరేణి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నెలతో ముగిసిన మూడో త్రైమాసికం నాటికి రికార్డు స్థాయిలో రూ.23,225 కోట్ల టర్నోవర్ సాధించిందని శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి సాధించిన రూ.18,956 కోట్ల టర్నోవర్‌తో పోల్చితే 23 శాతం వృద్ధి నమోదు చేసినట్లు వెల్లడించారు. 2021–22లో సింగరేణి వార్షిక టర్నోవర్ రూ.26,619 కోట్లు కాగా, 2022–23లో రూ.34 వేల కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment