N Sridhar
-
ఎన్ఎండీసీ చైర్మన్‌గా శ్రీధర్ నియామకం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సీఎండీ నడిమెట్ల శ్రీధర్‌కు మరో గౌవరం దక్కింది. నేషనల్ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC) చైర్మన్‌గా శ్రీధర్ నియామకమయ్యారు. వివరాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు ఎన్ఎండీసీ చైర్మన్‌గా శ్రీధర్‌ను నియమించాలని సిఫారసు చేసింది. దీంతో కేంద్రం శ్రీధర్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, శ్రీధర్ ప్రస్తుతం సింగరేణి సీఎండీగా కొనసాగుతున్నారు. శ్రీధర్ 1997 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. తెలంగాణ ఏర్పాట తర్వాత నుంచి 2015 జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు సింగరేణి కంపెనీ కాలరీస్ లిమిటెడ్ సీఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఇది కూడా చదవండి: నాగ్‌పూర్ టూ విజయవాడ: ఎకనమిక్ కారిడార్‌కు లైన్‌క్లియర్ -
2023లో 4 కొత్త గనుల్లో ఉత్పత్తి ప్రారంభించాలి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌తో పాటు మరో మూడు ఉపరితల గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని, దీనికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సింగేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. కొత్త ప్రాజెక్టులపై బుధవారం ఆయన సింగరేణి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఐదేళ్లలో చేపట్టనున్న 10 ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు. కొత్తగూడెంలోని వీకే బ్లాక్‌లో జూన్ నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని, బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఉపరితల గని, ఇల్లెందులోని జేకే ఓసీ విస్తరణలో జూలై నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని ఆదేశించారు. అటవీ, పర్యావరణ తదితర అనుమతులు పొంది ఓబీ కాంట్రాక్టులు కూడా ఖరారు చేయాలని శ్రీధర్ సూచించారు. 2023–24లో బెల్లంపల్లి ఏరియాలోని ఎంవీకే ఓసీ తదితర గనుల ప్రారంభానికి అన్ని అనుమతులు సాధించాలన్నారు. ఉత్పత్తి ప్రారంభించిన కొత్త ఓపెన్ కాస్ట్ గనుల వార్షిక లక్ష్యాలను పెంచుతూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జీడీకే గని నుంచి ఏడాదికి 30 లక్షల టన్నులు, ఇందారం ఓపెన్ కాస్టు నుంచి 26 లక్షల టన్నులు, కేకే ఓసీ గని నుంచి 22.5 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని ఆయన ఆదేశించారు. రికార్డుస్థాయిలో రూ.23,225 కోట్ల టర్నోవర్ సింగరేణి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నెలతో ముగిసిన మూడో త్రైమాసికం నాటికి రికార్డు స్థాయిలో రూ.23,225 కోట్ల టర్నోవర్ సాధించిందని శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి సాధించిన రూ.18,956 కోట్ల టర్నోవర్‌తో పోల్చితే 23 శాతం వృద్ధి నమోదు చేసినట్లు వెల్లడించారు. 2021–22లో సింగరేణి వార్షిక టర్నోవర్ రూ.26,619 కోట్లు కాగా, 2022–23లో రూ.34 వేల కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. -
ఆ 4 నెలలే ఎంతో కీలకం
సాక్షి, హైదరాబాద్: బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న ఆ 4 నెలలు ఎంతో కీలకమని సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తిని సకాలంలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 700 లక్షల టన్నులకుగానూ రోజుకు కనీసం 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరపాలని, లక్ష్యాలను రోజువారీగా సాధించడానికి కచ్చితమైన ప్రణాళికతో ముందుకు పోవాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన సంస్థ డైరెక్టర్లు, అడ్వైజర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఉత్పత్తి లక్ష్యాల సాధనపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. విద్యుత్ వినియోగం పెరిగిన నేపథ్యంలో బొగ్గుకు డిమాండ్ క్రమంగా పెరుగుతోందని, ఉత్పత్తి అయిన బొగ్గును వినియోగదారులకు అందించడం కోసం తగినన్ని రేకులను సమకూర్చుకోవడానికి కోల్ మూమెంట్ శాఖ రైల్వే వారిని సమన్వయపరచుకుంటూ ముందుకువెళ్లాలని శ్రీధర్ సూచించారు. సమావేశంలో డైరెక్టర్(ఆపరేషన్స్, పర్సనల్) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (పి అండ్ పి, ఫైనాన్స్), డైరెక్టర్ (పి అండ్ పి, ఫైనాన్స్ ఎన్. బలరామ్, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణరావు, అడ్వైజర్ డి.ఎన్.ప్రసాద్ (మైనింగ్), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జె.ఆల్విన్ జీ.ఎం. (కో ఆర్డినేషన్) ఎం.సురేశ్, జీఎం (మార్కెటింగ్) కె. సూర్యనారాయణ, జీఎం (సీపీపీ) సీహెచ్. నర్సింహారావు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల జీఎంలు, కార్పొరేట్ జీఎంలు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అతి పెద్ద పరిశ్రమగా సింగరేణి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పరిశ్రమగా ఉన్న సింగరేణి ఇప్పటికే తగినంత బొగ్గు, విద్యుత్ అందిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, రాష్ట్రంలోనే కాక దేశంలోనే అత్యుత్తమ వృద్ధి నమోదు చేస్తున్న ప్రభుత్వ సంస్థల్లో ఒకటిగా నిలుస్తోందని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. సింగరేణి భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రానున్న ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 3 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధన దిశగా కృషి చేయనున్నామన్నారు. గత ఎనిమిదేళ్లలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, అమ్మకాలలో అత్యద్భుత వృద్ధిని నమోదు చేసి దేశంలో గల నవరత్న కంపెనీలకు దీటుగా నిలబడిందని పేర్కొన్నారు. 2014తో పోల్చితే నాడు 50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన కంపెనీ గత ఆర్థిక ఏడాది రికార్డు స్థాయిలో 65 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేసిందని, నాడు రూ.11 వేల కోట్ల టర్నోవర్ ఉండగా అది గతేడాది రూ.26 వేల కోట్లకు పెరిగిందని, లాభాలు కూడా గణనీయంగా పెరిగాయని, ఈ అభివృద్ధి ప్రస్థానాన్ని ఇలాగే కొనసాగించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. -
విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తగినన్ని బొగ్గు నిల్వలు ఉండేలా ప్రతీరోజూ బొగ్గు రవాణా చేస్తున్నామని, కొరత ఏర్పడే ప్రసక్తే లేదని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు. తమ గనుల నుంచి లక్ష్యాల మేరకు బొగ్గు ఉత్పత్తి, రవాణాకు పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం రోజుకు లక్షా 90 వేల టన్నుల బొ గ్గు రవాణా చేస్తున్నామని, నవంబర్ నుంచి రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కేంద్రబొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కూడా బొగ్గు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి సంస్థ డెరైక్టర్లు, ఏరియా జనరల్ మేనేజర్లతో బొగ్గు ఉత్పత్తి పెంపుపై సమీక్ష నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడ రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రానివ్వబోమని స్పష్టం చేశారు. -
సింగరేణి సీఎండీగా శ్రీధర్ ఇంకెంతకాలం?
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ పదవీకాలం పొడిగింపు పట్ల కేంద్ర ప్రభుత్వం మరోసారి అభ్యంతరం తెలిపింది. కొత్తగూడెంలోని సింగరేణి కార్పొరేట్ కార్యాలయంలో గత నెల 30న నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో శ్రీధర్ పదవీకాలం పొడిగింపునకు వ్యతిరేకంగా తమ శాఖ అండర్ సెక్రటరీ ఆల్కా శేఖర్ ఓటు వేశారని, ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నుంచి తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. ఈ నెల 8న లేఖ అందిన విషయాన్ని రాష్ట్ర ఇంధన శాఖ, సింగరేణి సంస్థ అధికారవర్గాలు ధ్రువీకరించాయి. 2015 జనవరి 1 నుంచి సంస్థ సీఎండీగా శ్రీధర్ కొనసాగుతున్నారు. చదవండి: సింగరేణికి సోలార్ సొబగులు ఈ నెల 31తో శ్రీధర్ పదవీకాలం ముగియనుండగా, ప్రభుత్వం తదుపరి ఆదే శాలు జారీ చేసే వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని గత నెల నిర్వహించిన ఏజీఎంలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కేంద్రం వ్యతిరేకించినా, రాష్ట్ర ప్రభుత్వ వాటాదారుల మద్దతుతో ఆమోదం పొందింది. సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలుండటంతో మెజారిటీ ఓట్ల మద్దతుతో ఈ తీర్మానం నెగ్గింది. తర్వాత శ్రీధర్ పదవీకాలాన్ని మరో ఏడాదికాలం పాటు పొడిగిస్తూ ఈ నెల 5న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో రెండేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న శ్రీధర్‌కు అప్పటినుంచి ఎక్స్టెన్షన్ ఇస్తూ వస్తున్నారు. అలా మొత్తం ఆరేళ్లు పనిచేసిన శ్రీధర్‌ను మరో ఏడాది కొనసాగించడంపై కేంద్రం సుముఖంగా లేదు. శ్రీధర్ పదవికి ప్రమాదం లేదు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పదవికి ఎలాంటి ప్రమాదం లేదని, మరో ఏడాది పాటు ఆయనే సీఎండీగా కొనసాగుతారని రాష్ట్ర ప్రభుత్వ అధికారవర్గాలు తెలిపాయి. సీఎండీ కొనసాగింపు పట్ల కేంద్రం వ్యతిరేకత చూపుతున్నా, మెజారిటీ వాటాదారుడిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. -
ఆరు నెలల్లో ‘సింగరేణి’ ఖాళీల భర్తీ: ఎన్.శ్రీధర్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో ఉన్న ఖాళీలన్నీ మరో ఆరు నెలల్లో భర్తీ చేస్తామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. గత ఐదేళ్లలో ప్రత్యక్ష, కారుణ్య, అంతర్గత నియామకాల పద్ధతుల్లో 16 వేలకు పైగా ఖాళీ పోస్టులను భర్తీ చేశామన్నారు. చాలా గనుల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ స్టాఫ్, సూపర్ వైజర్లు, మెడికల్ సిబ్బంది, స్పెషలిస్టు డాక్టర్లు తదితర పోస్టులను వెంటనే భర్తీ చేసి రక్షణతో కూడిన ఉత్పత్తి పెంచాలని ఉద్యోగ సంఘాలు చేసిన సూచనలపై ఆయన స్పందించారు. సింగరేణి యాజమాన్యం, మైన్స్ సేఫ్టీ డీజీ, గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు/అధికారుల సంఘం ప్రతినిధులతో మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన 46వ రక్షణ త్రైపాక్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు కొత్తగా భర్తీ చేయనున్న పోస్టుల్లో ఇంటర్నల్ కోటా పెంచి అర్హులందరికీ అవకాశం కల్పిస్తామన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా కార్మికుల రక్షణ విషయంలో పరికరాల కొనుగోలుకు సింగరేణి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగంపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి, ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. ‘తెలంగాణ ప్రజల బతుకు దెరువు నిలబెట్టాలి, రాష్ట్రాన్ని కాపాడాలి’అన్న నినాదంతో జనవరి 3, 4 తేదీల్లో 48 గంటలపాటు నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2018 నుంచి ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో యువత గ్రామాల్లో ఉంటూ ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారని వాపోయారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు దాని ఊసెత్తలేదని విమర్శించారు. కరోనా అనంతరం అన్ని వ్యాపార సంస్థలను ప్రోత్సహించిన ప్రభుత్వం బడ్జెట్ స్కూళ్ల విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ పేరుతో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా ముంచేసిందన్నారు. -
3 కోట్ల 65 లక్షలతో కార్మికులకు యూనిఫాం
సాక్షి, కరీంనగర్ : సింగరేణి కార్మికులకు యూనిఫాం కొనుగోలు, 4 భూగర్భ గనుల మైనింగ్ ప్లానులకు, ఒక కొత్త ఓ.సి. గనికి అనుమతితో పాటు సింగరేణిలో 3వ దశ సోలార్ పవర్ ప్లాంటుల నిర్మాణం కాంట్రాక్టులకు సిఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన శనివారం జరిగిన 555వ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఎన్.శ్రీధర్ అందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. రానున్న కాలంలో నిర్దేశించుకొన్న అధికోత్పత్తి లక్ష్యాల సాధనకు అనుగుణంగా కొత్తగూడెం ఏరియా పరిధిలో మరో ఓపెన్ కాస్ట్ గని నిర్మాణానికి ఏర్పటు చేయనున్నామన్నారు. అలాగే ప్రస్తుత భూగర్భ గనుల విస్తరణలో భాగంగా కాసీపేట, ఆర్.కె.-1 ఎ, శ్రీరాంపూర్ 1, శ్రీరాంపూర్ 3, 3ఎ గనుల మైనింగ్ ప్లానులకు బోర్డు అనుమతించిందన్నారు. దీంతోపాటు సింగరేణి కార్మికులకు రెండు జతల యూనిఫాంలను 3 కోట్ల 65 లక్షల రూపాయలతో యూనిఫాంలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు తెలంగాణా రాష్ట్ర చేనేత సహకార సంస్థ నుంచి నామినేషన్ పద్ధతిలో కొనుగోలు చేయడానికి బోర్డు అనుమతించింది. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా చేపట్టిన 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటుల నిర్మాణంలో చివరిదైన 3వ దశ నిర్మాణం పనుల కాంట్రాక్టుల అప్పగింతకు బోర్డు అనుమతించిందన్నారు. ఈ 3వ దశలో భాగంగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం వాటర్ రిజర్వాయర్ పైన 10 మెగావాట్లు, మూతపడిన బెల్లంపల్లి డోర్లీ ఓ.సి. గని క్వారీ నీటిపై 5 మెగావాట్ల సామర్థ్యంతోనీటిపై తేలియాడే సోలార్ ప్లాంటులతో పాటు కొత్తగూడెం, చెన్నూరు లో నేలపై నిర్మించే సోలార్ ప్లాంటు, ఆర్.జి. ఓ.సి.-1, డోర్లీ ఓ.సి.-1 ఓవర్ బర్డెన్ డంపుల మీద నిర్మించే సోలార్ ప్లాంటుల నిర్మాణం పనుల అప్పగింత ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయన్నారు. రానున్న రెండేళ్లకు ఓ.సి. గనుల్లో వాడే పేలుడు పదార్ధాల కొనుగోలుకు, కంపెనీ నిర్వహిస్తున్న పేలుడు పదార్ధాల ఉత్పత్తి ప్లాంటులకు కావాలసిన అమ్మోనియాం నెట్రేట్, మొదలగు వాటి కొనుగోలుకు, రూఫ్ బోల్టుల కొనుగోలు తదితర పనులకు బోర్డు తన అంగీకారం తెలిపిందని వెల్లడించారు. సింగరేణి సిఎండి ఎన్.శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్ (డైరెక్టర్ ఆపరేషన్స్ & పా), ఎన్.బలరామ్ (డైరెక్టర్ ఫైనాన్స్ మరియు పి&పి), డి.సత్యనారాయణ రావు (డైరెక్టర్ ఇ&ఎం) పాల్గొనగా, వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఢిల్లీ నుంచి బొగ్గు శాఖ సహాయ కార్యదర్శులు పి.ఎస్.ఎల్.స్వామి, అజితేష్ కుమార్, నాగపూర్ నుండి వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ ఛైర్మన్ ఆర్.ఆర్.మిశ్రా లు పాల్గొన్నారు. కార్యక్రమంలో జి.ఎం. (సి.డి.ఎన్.) కె.రవిశంకర్, కంపెనీ వ్యవహారాల కార్యదర్శి మురళీధర్ రావులు పాల్గొన్నారు. -
సత్వరమే కొత్త గనులు ప్రారంభించాలి
సాక్షి, హైదరాబాద్: బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను సాధించాలంటే ఈ ఏడాదికి ప్రతిపాదించిన కొత్త ఓసీ గనులను సత్వరమే ప్రారంభించాలని సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. సింగరేణి భవన్లో మంగళవారం డెరైక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలతో వెనకబడిన బొగ్గు ఉత్పత్తి, రవాణాలను సెప్టెంబర్ నెల లక్ష్యాలతోపాటు సాధించాలన్నారు. ఓబీ తొలగింపుపై మరింత శ్రద్ధ చూపాలని, లక్ష్యాల మేర ఓబీ తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సింగరేణి సంస్థ ఆగస్ట్ నెల వరకూ గడచిన 5 నెలల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను దాటి బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించింది. ఆగస్టు ముగిసేనాటికి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 254లక్షల టన్నులు కాగా, 262 లక్షల టన్నుల బొగ్గును (103 శాతం) ఉత్పత్తి చేసింది. 262 లక్షల టన్నుల బొగ్గు రవాణా లక్ష్యాన్ని 261.5 లక్షల టన్నుల రవాణా చేయడం ద్వారా నూరు శాతం ఫలితాన్ని సాధించింది. 2018–19తో పోలిస్తే బొగ్గు ఉత్పత్తిలో 12.4 శాతం వృద్ధిని సాధించింది. 2018 ఆగస్టు చివరికి 233లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, ఈ ఏడాది ఆగస్టు చివరికి 262లక్షల టన్నులు ఉత్పత్తి చేసింది. -
సింగరేణికి ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డు
గోదావరిఖని: అమెరికాకు చెందిన ప్రముఖ బహుళజాతి వాణిజ్య వ్యాపార సంప్రదింపుల సంస్థ అయిన బెర్క్‌ఫైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు 2018 సంవత్సరానికి ఇచ్చే ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డుకు సింగరేణి కాలరీస్ కంపెనీని ఎంపిక చేశారు. ఈ అవార్డును 2019, మార్చి 8న ముంబైలో ప్రదానం చేయనున్నారు. అవార్డు స్వీకరణకు రావాల్సిందిగా సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్‌ను బెర్క్‌ఫైర్ మీడియా సీఈవో హేమంత్కౌశిక్, వైస్ ప్రెసిడెంట్ ఎమిలీవాల్ష్ ఆహ్వానం పంపించారు. బెర్క్‌ఫైర్ సంస్థవారు ఏటా దేశంలోని కంపెనీల పనితీరును, వృద్ధిని స్వచ్ఛందంగా అధ్యయనం చేసి అత్యుత్తమ కంపెనీని ఇండియాస్ బెస్ట్ కంపెనీగా ఎంపిక చేసి అవార్డును బహూకరిస్తున్నారు. అద్భుత ప్రగతికి విశిష్ట పురస్కారాలు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డు లభించడంపై హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ సారథ్యంలో వృద్ధిని సాధిస్తూ దూసుకుపోతోంది. కంపెనీ సాధిస్తున్న ప్రగతికి గుర్తింపుగా ఇప్పటికే పలు అంతర్జాతీయ, జాతీయ అవార్డులను కంపెనీ పొందింది. వీటిలో ఆసియా పసిఫిక్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ అవార్డు, అవుట్ స్టాండింగ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు, ఎక్స్‌లెన్స్ ఇన్‌కాస్ట్ మేనేజ్మెంట్ అవార్డు, బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు, ఆసియాస్ మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ అవార్డు, ఎక్స్‌లెన్స్ ఇన్‌పర్ఫార్మెన్స్ అవార్డు, బెస్ట్ సేవా అవార్డు వంటివి 2018 సంవత్సరంలో సాధించినవాటిలో ఉన్నాయి. సమష్టి కృషికి గుర్తింపు: సీఎండీ శ్రీధర్ ఇండియాస్ బెస్ట్ కంపెనీ–2018 అవార్డుకు సింగరేణి ఎంపిక కావడంపై సీఎండీ ఎన్.శ్రీధర్ హర్షం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకుపోతూ అనేక జాతీయ అవార్డులు, ప్రశంసలు అందుకుంటోందని, అలాగే తమ సంస్థ కూడా ఆయన మార్గదర్శకత్వంలో సింగరేణీయుల సమష్టి కృషితో దేశంలోనే అగ్రగామి సంస్థగా ఎదుగుతోందన్నారు. ఈ అవార్డు సంస్థలోని సింగరేణీయుల అందరి సమష్టి కృషికి గుర్తింపుగా భావిస్తున్నానని తెలిపారు. -
ప్రగతిలో సింగరేణి పరుగులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అన్ని విభాగాల్లో రికార్డు స్థాయిల్లో వృద్ధిని నమోదు చేస్తూ ప్రగతిపథంలో దూసుకుపోతోంది. రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం (2009–14) సాధించిన బొగ్గు రవాణా, ఓబీ తొలగింపు, అమ్మకాలు, నిఖర లాభాలతో పోలిస్తే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత (2014–2019) సింగరేణి సాధించిన వృద్ధి రికార్డుస్థాయిలో ఉంది. దేశంలోనే ఎనిమిది సబ్సిడరీ కంపెనీలు గల కోలిండియా సైతం గత ఐదేళ్లలో ఇంత వృద్ధిని నమోదు చేయలేదని శుక్రవారం సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. 2009–2014 బొగ్గు రవాణాలో కేవలం 90 లక్షల టన్నుల వృద్ధిని సాధించిన సింగరేణి, ఆవిర్భావం తర్వాత 200 లక్షల టన్నుల వృద్ధిని సాధించింది. అంటే 122 శాతం వృద్ధి అన్నమాట. అలాగే ఓవర్ బర్డెన్ తొలగింపులో 250 మిలియన్ క్యూబిక్ మీటర్లు నమోదు చేసి 257 శాతం వృద్ధిని సాధించింది. తెలంగాణ రాకముందు ఐదేళ్ల అమ్మకాల్లో రూ.5,600 కోట్ల వృద్ధిని నమోదు చేసిన కంపెనీ, ఆవిర్భావం తర్వాతి ఐదేళ్లలో రూ.13,000 కోట్లతో 132 శాతం వృద్ధిని సాధించడం విశేషం. అలాగే ట్యాక్సులు చెల్లించిన తర్వాత నికరలాభం కూడా భారీగా పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఐదేళ్లలో నికర లాభం 290 కోట్ల రూపాయలు ఉండగా గడిచిన ఐదేళ్లలో రూ.1,200 కోట్లుగా నమోదు చేసింది. నెలనెలా సమీక్షలు, తక్షణ పరిష్కారాలు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తన నేతృత్వంలో సింగరేణిని అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలుపుతూ నాలుగేళ్లలో అనూహ్య ప్రగతిని సాధిస్తూ వస్తున్నారు. గతంలో ఏడాదికి, ఆరు నెలలకోసారి జరిగే ఏరియా జనరల్ మేనేజర్ల సమీక్ష సమావేశాలను ఆయన ప్రతీనెలా నిర్వహించడం మొదలు పెట్టారు. సమావేశాల్లో ఉత్పత్తికి ఆటంకంగా ఉన్న సమస్యలను జీఎంలు వివరించినప్పుడు వాటిని తక్షణమే పరిష్కరించే విధంగా అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయడం, సంబంధిత శాఖ తక్షణ చర్యలు తీసుకునేలా పర్యవేక్షణ చేసేవారు. దీంతో 2015–16లో ఏకంగా 15% వృద్ధి రేటు నమోదు చేసి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలకే ఆదర్శప్రాయంగా నిలిపారు. పాత యంత్రాల స్థానంలో సుమారు రూ.350 కోట్లతో కొత్త యంత్రాలు కొనుగోలు చేశారు. విద్యుదుత్పత్తిలోనూ ముందే.. సింగరేణి సంస్థ తమ 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా రాష్ట్రానికి ఇప్పటివరకూ 19,036 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందించింది. అనతికాలంలోనే అత్యధిక పీఎల్ఎఫ్ సాధించిన ప్లాంటుగా జాతీయస్థాయిలో 4వ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించడానికి సన్నాహాలు కూడా చేస్తోంది. ఇదే కాక 12 ఏరియాల్లో మరో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికీ పూనుకుంది. తొలి దశలో 130 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంటును 2018–19లో పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించనుంది. -
సంక్షేమంలో నం–1
సూపర్‌బజార్(కొత్తగూడెం): దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పరిశ్రమల కంటే సింగరేణి సంస్థ కార్మికులకు సంక్షేమ పథకాల అమలులో మొదటి స్థానంలో ఉందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ అన్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రకాశం స్టేడియంలో ఆదివారం జరిగిన ప్రధాన వేడుకల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయం విలేకరుల సమావేశంలో, రాత్రి జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ బొగ్గు రంగంలోనే కాకుండా విద్యుత్ ఉత్పత్తిలో కూడా సత్తా చాటుతోందని అన్నారు. జైపూర్‌లో ఇప్పటికే 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, త్వరలో మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధమైందని చెప్పారు. సోలార్ విద్యుత్ వైపు కూడా దృష్టి సారించామని, రాబోయే కాలంలో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ముందుగా 130 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలోనే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా బొగ్గు గనుల ఏర్పాటుకు సింగరేణి చర్యలు చేపట్టిందని, 6 కొత్త బ్లాక్‌లను ఏర్పాటు చేయబోతోందని అన్నారు. ఇప్పటికే ఒడిశాలో నైనీ బ్లాక్‌ను చేపట్టినట్లు చెప్పారు. రాబోయే 5 సంవత్సరాల్లో మరో 12 గనుల ఏర్పాటుకు కార్యాచరణను సిద్ధం చేశామని చెప్పారు. త్వరలో 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి దిశగా సింగరేణి సంస్థ ఎదగబోతోందని అన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో వార్షిక నికర ఆదాయాన్ని రూ.35 వేల కోట్ల లక్ష్యంగా నిర్దేశించుకుంటున్నట్లు వివరించారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ధ సంస్థగా సింగరేణి సంస్థ విరాజిల్లుతోందని అన్నారు. బయ్యారం స్టీల్‌ప్లాంట్ విషయంలో కమిటీ వేశారని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి సంస్థ బయ్యారం స్టీల్‌ప్లాంట్‌ను చేపట్టే అవకాశాలున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కార్మికుల సంక్షేమానికి తమ సంస్థ కట్టుబడి ఉందని, సొంత ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు వడ్డీలేని రుణాన్ని బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. వీటికోసం ఇప్పటికే 3 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. సింగరేణి అధికారులకు సొంత ఇంటి నిర్మాణాల కోసం హైదరాబాద్‌లో స్థలాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి స్థలాల్లో ఉన్న కార్మికులకు క్రమబద్ధీకరణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. భద్రాచలంరోడ్ – సత్తుపల్లి రైల్వేలైన్ నిర్మాణం కోసం 10 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని, 52 కిలోమీటర్ల రైల్వే మార్గానికి రూ. 710 కోట్ల ఖర్చవుతుందని, దీనిలో రూ.610 కోట్లు సింగరేణి ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని తెలిపారు. దీనికోసం 13 గ్రామాలలో భూ సేకరణ జరుగుతోందని సీఎండీ వివరించారు. విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే సింగరేణికి 5వ స్థానం రావడం ఐక్య కృషికి నిదర్శనమని అన్నారు. దినదిన ప్రవర్థమానంగా సింగరేణి సంస్థ ఎదుగుతూ తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో సింగరేణి కుటుంబమంతా భాగస్వామ్యం కావాలని శ్రీధర్ కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నెలాఖరు వరకు గత ఏడాది చేసిన బొగ్గు ఉత్పత్తి కంటే 9 శాతం వృద్ధిరేటుతో 395 లక్షల టన్నుల మేర సాధించగలిగామని, 6 శాతం వృద్ధితో 430 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేశామని చెప్పారు. 3 శాతం వృద్ధితో గత 8 నెలల కాలంలో 247 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబీని కూడా తీశామని ప్రకటించారు. సింగరేణీయులందరికీ సంస్థ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 2013 – 14 వార్షిక బొగ్గు ఉత్పత్తి నుంచి 2017–18 వార్షిక బొగ్గు ఉత్పత్తి వరకు 22.9 శాతం వృద్ధి రేటును సాధించగలిగామని వివరించారు. ప్రభుత్వం నియమించిన మెడికల్ బోర్డ్ ద్వారా ప్రతినెల బోర్డ్ నిర్వహించి కారుణ్య నియామకాలు చేపడుతున్నామని, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 25 మెడికల్ బోర్డ్‌లు నిర్వహించామని, 5,284 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 3,419 మంది కార్మికులు వైద్యపరంగా అన్‌ఫిట్ అయ్యారని, వారి వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని వివరించారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన సింగరేణికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందన్నారు. అంకితభావంతో పనిచేస్తూ యంత్రాలను పూర్తి పనిగంటలు వినియోగిస్తూ రక్షణ, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ముందుకు వెళ్తే రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా నంబర్ ఒన్ పరిశ్రమగా నిలబడగలుగుతామని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ (ఈఅండ్ఎం) సలాకుల శంకర్, డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ పా) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్) బి.భాస్కర్‌రావు, డైరెక్టర్ (ఫైనాన్స్) ఎన్.బలరాం, వేడుకల కన్వీనర్ కె.బసవయ్య, జీఎం (పర్సనల్ రిక్రూట్మెంట్ సెల్) ఎ.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. -
రూ.1,500 కోట్లతో సింగరేణి అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి గనులున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అందుబాటులో ఉన్న రూ.1,500 కోట్ల ‘డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్టు (డీఎంఎఫ్టీ)’నిధులతోపాటు ఇతర నిధులు కలిపి రహదారుల నిర్మాణం, ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్లో సమీ క్షించారు. సింగరేణి ఖనిజ సంపద జాతి అభివృద్ధికి దోహదపడుతుందని.. కానీ బొగ్గు గనులున్న ప్రాంతాలు ఛిద్రమైపోతున్నాయని, రోడ్లు పాడవుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. బొగ్గు గనులున్న ప్రాంతాలతోపాటు బొగ్గు తరలించే మార్గాల్లోని రోడ్లు దెబ్బతింటున్నాయని, దుమ్ముతో జనం ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అందువల్ల ఆయా ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలని అన్నారు. నిధులన్నింటినీ సమీకరించి.. సింగరేణి గనులున్న గ్రామాలన్నీ మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలేనని.. వాటిపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘సింగరేణి బొగ్గు ద్వారా వచ్చిన ఆదాయం నుంచి సమకూరిన డీఎంఎఫ్టీ నిధులతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులు, ఇరిగేషన్ నిధులు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సమకూరే నిధులను అనుసంధానం చేసుకుని సింగరేణి ప్రాంతంలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి. ఏ ప్రాంతంలో ఏ అవసరం ఉందో గుర్తించి, దాని ప్రకారం పనులు చేపట్టాలి. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు కలసి పనులను నిర్ధారించి, నిధులు విడుదల చేయాలి. ఈ నిధులతో చేపట్టే పనులను కలెక్టర్లు పర్యవేక్షించాలి..’’అని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో.. కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాలను కొత్త జిల్లాలుగా చేసుకున్నామని.. ఈ జిల్లా కేంద్రాల్లోనూ అభివృద్ధి పనులు జరగాలని చెప్పారు. హామీలన్నీ నెరవేర్చాలి.. సింగరేణి ఎన్నికలతోపాటు ఇటీవల సింగరేణి పర్యటన సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ నూటికి నూరుశాతం అమలు కావాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు సీఎం ఇచ్చిన 17 హామీలను నెరవేర్చే దిశగా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. సీఎండీకి, కార్మికులకు కేసీఆర్ అభినందనలు 2017–18 సంవత్సరంలో 6.2 శాతం వృద్ధిరేటుతో రికార్డు స్థాయిలో 646 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సింగరేణి సీఎండీ శ్రీధర్, కార్మికులను అభినందించారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 91.1 శాతం పీఎల్‌ఎఫ్‌తో విద్యుదుత్పత్తి జరగడంపైనా సంతోషం వ్యక్తం చేశారు. సమీక్షలో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, జలగం వెంకట్రావు, కోవ లక్ష్మి, పుట్టా మధు, పాయం వెంకటేశ్వర్లు, దివాకర్ రావు, కోరం కనకయ్య, మనోహర్‌రెడ్డి, దుర్గం చిన్నయ్య, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్తగూడెం–సత్తుపల్లి రైల్వేలైన్‌కు రూ.50కోట్లు
► మొదటి విడతగా దక్షిణ మధ్యరైల్యే జీఎంకు అందజేసిన సీఎండీ ► 2019 నాటికి పూర్తిచేయాలని కోరిన ఎన్.శ్రీధర్ రుద్రంపూర్: కొత్తగూడెంనుంచి సత్తుపల్లి రైల్వే బ్రాడ్‌గేజ్‌లైన్ నిర్మాణానికి సింగరేణి యాజమాన్యం మొదటి విడతగా రూ.50 కోట్లను విడుదల చేసింది. బుధవారం ఆ చెక్కును దక్షిణ మధ్యరైల్యే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్‌కు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ సికింద్రబాద్‌లోని రైల్వే కార్యాలయంలో అందజేశారు. 2019లో సత్తుపల్లిలోని క్రిష్టారం ఓసీ ప్రారంభం అయ్యేలోగా ఈ రైల్వేలైను పూర్తిచేయాలని, తద్వారా బొగ్గు రవాణాకు సులువు అవుతుందని రైల్వే జీఎంను సీఎండీ కోరారు. ఈ రైల్వేలైన్ పొడవు 53.20 కిలోమీటర్లు కాగా.. దీని నిర్మాణానికి అయ్యే దాదాపు రూ. 620 కోట్ల ఖర్చును భరించేందుకు యాజమాన్యం ముందుకువచ్చింది. దీనిలో భాగంగానే మొదటి విడతగా రూ. 50కోట్ల చెక్కును సీఎండీ అందజేశారు. రవాణా సులువు..: ఈ రైల్వేలైన్ పూర్తయితే కొత్తగూడేనికి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్తుపల్లిలోగల గనుల నుంచి అధిక మొత్తంలో బొగ్గును రవాణా చేసే అవకాశం ఉంటుంది. సత్తుపల్లిలోని జేవీఆర్ఓసీనుంచి ప్రస్తుతం సంవత్సరానికి 55 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి తోపాటు రవాణా జరుగుతుంది. త్వరలో ఇక్కడ కొత్త ఓసీ ప్రారంభం కాబోతున్నందున 100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగనుంది. అయితే రైల్వే లైన్ పూర్తయితే అంతే మొత్తలో రవాణా చేయడం సులువు అంతుంది. ఈ బొగ్గును రైల్వేద్వారా విద్యుత్ ప్లాంట్లకు సరఫరా చేస్తారు. ప్రధానంగా పాల్వంచలోని కేటీపీఎస్, మణుగూరు (పినపాక)లో నిర్మించబోయే భద్రాద్రి పవర్‌ప్లాంట్, నల్గొండలో నిర్మించబోయే యదాద్రి థర్మల్ పవర్ ప్లాంటుకు ఇక్కడినుంచే నేరుగా రైల్వే ద్వారా రవాణా జరుగుతుంది. దీని వల్ల కొంతవరకు రోడ్డు ప్రమాదాలు, వాతావరణ కాలుష్యం తగ్గనుంది. పురోగతిపై సమీక్ష కొత్తగూడెం–సత్తుపల్లి రైల్వేలైన్ పురోగతిపై రైల్వే కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే జీఎం మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన భూసేకరణ పూర్తిచేశామన్నారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించే బ్రిడ్జిలకు టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామన్నారు. భూసేకరణ పూర్తయిన నాటి నుంచి రెండేళ్లలోపు రైల్వేలైన్‌ను నిర్మించి ఇస్తామని జీఎం వినోద్‌కుమార్ తెలిపారు. అటవీ, ప్రైవేటు భూముల సేకరణ విషయంలో సింగరేణి తనవంతు సహకారం అందించాలని కోరారు. ఇందుకు స్పందించిన సీఎండీ సింగరేణి సంస్థనుంచి ఎటువంటి సాయం కావాలన్న చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే రైల్వేలైన్ నిర్మాణానికి కావాల్సిన నిధులను కూడా ఎప్పటికప్పుడు అందిస్తామని శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో సింగరేణి అధికారులు ఈడీ (కోల్ మూవ్మెంట్) శ్రీనివాస్‌రావు, జీఎం కో ఆర్డినేషన్ నాగయ్య, రైల్వే అధికారులు ఎన్.మధూసుధన్రావు, ఎన్ఏసీఓ పద్మిని రాధాకృష్ణన్, చీఫ్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్స్ జి.బ్రహ్మానందరెడ్డి, చీఫ్ ప్రైట్ ట్రాఫిక్ మేనేజర్ నాగయ్య పాల్గొన్నారు. -
‘ఆడ్రియాల’పై సింగరేణి సీఎండీ సమీక్ష
హైదరాబాద్: సింగరేణిలోని రామగుండం ఏరియాలో ప్రతిష్టాత్మకమైన ఆడ్రియాల లాంగ్వాల్ భూగర్భగనిలో ఉత్పిత్తిపై సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆడ్రియాల లాంగ్వాల్ గనిలో నిలకడైన పనితీరుతో, రోజువారీ లక్ష్యాలను సాధిస్తూ.. ఉత్పత్తి పెంచాలని అధికారులను, లాంగ్వాల్ పరికరాల సరఫరా సంస్థ ఎం/ఎస్ కాటర్‌పిల్లర్ ప్రతినిధులు వోల్ఫ్‌గాంగ్ రోజర్‌ను, మన్వీందర్సింగ్ భరత్ తదితరులను ఆదేశించారు. ఆసియాలోనే పెద్దదిగా భావిస్తున్న ఈ గని నుంచి ఈ ఏడాది 25 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో సంస్థ డెరైక్టర్లు బి.రమేశ్‌కుమార్, పి.రమేశ్‌బాబు, సీజీఎం అమర్నాథ్ పాల్గొన్నారు. -
రోజుకు 2 లక్షల టన్నులు
గోదావరిఖని : సింగరేణి వ్యాప్తంగా రోజుకు రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పని చేయాలని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.శ్రీధర్ సూచించారు. సీఎండీగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా అన్ని ఏరియాల జీఎంలు, డెరైక్టర్లతో ఉత్పత్తి, ఉత్పాదకతపై సోమవారం గోదావరిఖని ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో సమీక్షించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి సంస్థ కీలక భూమిక పోషించాలని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత అధికంగా ఉందని, కొరత తీర్చి 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరముందన్నారు. మూడు, నాలుగేళ్లలో 8,300 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లు ఏర్పడే అవకాశముందని, ఇందుకోసం ఏటా 10 శాతం అదనంగా బొగ్గు ఉత్పత్తి పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం 16 ఓపెన్‌కాస్ట్‌లు, 32 భూగర్భ గనుల ద్వారా ప్రస్తుతం రోజుకు 1.60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నామని, దీన్ని 2 లక్షల టన్నులకు పెంచాలని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 55 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనకు రోజువారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు నిర్ణయించామని తెలిపారు. గనుల వారీగా లక్ష్యం నిర్దేశించుకోవాలని సూచించారు. ఇందుకు కార్మికులు, అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. నూతన ప్రాజెక్టులైన బెల్లంపల్లి ఓసీపీ-2, జేవీఆర్ ఓసీపీ, ఆర్కేపీ ఓసీ, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సమీక్షలో డెరైక్టర్లు ఎస్.వివేకానంద, బి.రమేశ్‌కుమార్, ఎ.మనోహర్‌రావు, పి.రమేశ్‌బాబు, సీపీఅండ్‌పీ చీఫ్ జనరల్ మేనేజర్ కేజే అమర్నాథ్, కార్పొరేట్ జనరల్ మేనేజర్లు జె.నాగయ్య, బి.కిషన్‌రావు, ఆంటోని రాజా, సీహెచ్ విజయారావు, ఎం.వసంత్‌కుమార్, వి.విజయ్‌పాల్‌రెడ్డి, పి.ఉమామహేశ్వర్, జీవీ రెడ్డి, సీహెచ్ నర్సింహారెడ్డి, జె.రామకృష్ణ, జె.సాంబశివరావు, ఎస్.శరత్‌కుమార్, డాక్టర్ కె.ప్రసన్నసింహా, ఎం.కృష్ణమోహన్, సీహెచ్ వరప్రసాద్, పి.రవిచంద్ర, ఎల్.బాలకోటయ్య, ఎ.ఆనందరావు, కె.బసవయ్య, ఏరియా సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు. -
పంట రుణాల లక్ష్యం రూ.1,549 కోట్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,549 కోట్ల మేర పంట రుణాలు ఇవ్వాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 50శాతం అధికం. శనివారం 2014-15 జిల్లా రుణ ప్రణాళికను కలెక్టర్ ఎన్ .శ్రీధర్ విడుదల చేశారు. వివిధ రంగాలకు రూ.5,393.29 కోట్ల రుణ వితరణ చేయాలని నిర్ణయించిన బ్యాంకర్లు.. స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూతకు పెద్దపీట వేశారు. మహిళా సంఘాలకు రూ.2,036.39 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. రుణాలు త్వరగా ఇవ్వండి ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకుల పాత్ర కీలకమని, ప్రతి పథకానికి బ్యాంకుతో లింకు ఉన్నందున.. రుణ వితరణ లో బ్యాంకులు క్రియాశీలకంగా వ్యవహరించాలని కలెక్టర్ శ్రీధర్ సూచించారు. ఎన్నికల నేపథ్యంలో రుణ ప్రణాళిక విడుదల ఆలస్యమైందని, జూలైలోపు రైతులకు పంట రుణాలు అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించేందుకు చొరవ చూపాలన్నారు. జనవరిలోపు ప్రభుత్వ పథకాలు గ్రౌండింగ్ చేసేలా సంబంధిత శాఖల అధికారులు చూడాలని, పథకాల గ్రౌండింగ్ ఆలస్యమైతే నిధులు మురిగే ప్రమాదముందని, లబ్ధిదారులకు అన్యా యం జరుగుతుందన్నారు. ఉద్యాన పంటల హబ్‌గా జిల్లాను మార్చాలని నిర్ణయించామని, అందుకనుగుణంగా పూలు, పండ్ల తోటల పెంపకానికి చేయూతనిచ్చేందుకు బ్యాంకులు శ్రద్ధ వహించాలని సూచించా రు. బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తే నిర్దేశిత లక్ష్యాలను సులువుగా అధిగమించవచ్చని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేసీ ఎంవీ రెడ్డి, ఎస్బీహెచ్ జీఎం కేఎస్ జవాండా, డీజీఎం దేవేందర్, నాబార్డు ఏజీఎం సుబ్బారావు, ఎల్డీఎం సుబ్రమణ్యం పాల్గొన్నారు. కాగా, లీడ్‌బ్యాంకు అధికారులు రూపొందిం చిన రుణ ప్రణాళికలో గత ఏడాది నిర్దేశిత లక్ష్యంలో ఏ మేరకు సాధించాం.. ఎంతమందికి లబ్ధి చేకూర్చామనే అంశం పొందుపరచకపోవడం గమనార్హం.