సింగరేణి డే వేడుకల సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో పతాకాన్ని అవిష్కరించి వందనం చేస్తున్న సంస్థ సీఎండీ (ఇన్‌సెట్) మాట్లాడుతున్న శ్రీధర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పరిశ్రమల కంటే సింగరేణి సంస్థ కార్మికులకు సంక్షేమ పథకాల అమలులో మొదటి స్థానంలో ఉందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ అన్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రకాశం స్టేడియంలో ఆదివారం జరిగిన ప్రధాన వేడుకల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయం విలేకరుల సమావేశంలో, రాత్రి జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ బొగ్గు రంగంలోనే కాకుండా విద్యుత్ ఉత్పత్తిలో కూడా సత్తా చాటుతోందని అన్నారు. జైపూర్‌లో ఇప్పటికే 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, త్వరలో మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధమైందని చెప్పారు.
సోలార్ విద్యుత్ వైపు కూడా దృష్టి సారించామని, రాబోయే కాలంలో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ముందుగా 130 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలోనే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా బొగ్గు గనుల ఏర్పాటుకు సింగరేణి చర్యలు చేపట్టిందని, 6 కొత్త బ్లాక్‌లను ఏర్పాటు చేయబోతోందని అన్నారు. ఇప్పటికే ఒడిశాలో నైనీ బ్లాక్‌ను చేపట్టినట్లు చెప్పారు. రాబోయే 5 సంవత్సరాల్లో మరో 12 గనుల ఏర్పాటుకు కార్యాచరణను సిద్ధం చేశామని చెప్పారు.
త్వరలో 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి దిశగా సింగరేణి సంస్థ ఎదగబోతోందని అన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో వార్షిక నికర ఆదాయాన్ని రూ.35 వేల కోట్ల లక్ష్యంగా నిర్దేశించుకుంటున్నట్లు వివరించారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ధ సంస్థగా సింగరేణి సంస్థ విరాజిల్లుతోందని అన్నారు. బయ్యారం స్టీల్‌ప్లాంట్ విషయంలో కమిటీ వేశారని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి సంస్థ బయ్యారం స్టీల్‌ప్లాంట్‌ను చేపట్టే అవకాశాలున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కార్మికుల సంక్షేమానికి తమ సంస్థ కట్టుబడి ఉందని, సొంత ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు వడ్డీలేని రుణాన్ని బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు.
వీటికోసం ఇప్పటికే 3 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. సింగరేణి అధికారులకు సొంత ఇంటి నిర్మాణాల కోసం హైదరాబాద్‌లో స్థలాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి స్థలాల్లో ఉన్న కార్మికులకు క్రమబద్ధీకరణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. భద్రాచలంరోడ్ – సత్తుపల్లి రైల్వేలైన్ నిర్మాణం కోసం 10 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని, 52 కిలోమీటర్ల రైల్వే మార్గానికి రూ. 710 కోట్ల ఖర్చవుతుందని, దీనిలో రూ.610 కోట్లు సింగరేణి ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని తెలిపారు. దీనికోసం 13 గ్రామాలలో భూ సేకరణ జరుగుతోందని సీఎండీ వివరించారు. విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే సింగరేణికి 5వ స్థానం రావడం ఐక్య కృషికి నిదర్శనమని అన్నారు. దినదిన ప్రవర్థమానంగా సింగరేణి సంస్థ ఎదుగుతూ తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోందన్నారు.
బంగారు తెలంగాణ నిర్మాణంలో సింగరేణి కుటుంబమంతా భాగస్వామ్యం కావాలని శ్రీధర్ కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నెలాఖరు వరకు గత ఏడాది చేసిన బొగ్గు ఉత్పత్తి కంటే 9 శాతం వృద్ధిరేటుతో 395 లక్షల టన్నుల మేర సాధించగలిగామని, 6 శాతం వృద్ధితో 430 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేశామని చెప్పారు. 3 శాతం వృద్ధితో గత 8 నెలల కాలంలో 247 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబీని కూడా తీశామని ప్రకటించారు. సింగరేణీయులందరికీ సంస్థ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 2013 – 14 వార్షిక బొగ్గు ఉత్పత్తి నుంచి 2017–18 వార్షిక బొగ్గు ఉత్పత్తి వరకు 22.9 శాతం వృద్ధి రేటును సాధించగలిగామని వివరించారు.
ప్రభుత్వం నియమించిన మెడికల్ బోర్డ్ ద్వారా ప్రతినెల బోర్డ్ నిర్వహించి కారుణ్య నియామకాలు చేపడుతున్నామని, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 25 మెడికల్ బోర్డ్‌లు నిర్వహించామని, 5,284 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 3,419 మంది కార్మికులు వైద్యపరంగా అన్‌ఫిట్ అయ్యారని, వారి వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని వివరించారు.
ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన సింగరేణికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందన్నారు. అంకితభావంతో పనిచేస్తూ యంత్రాలను పూర్తి పనిగంటలు వినియోగిస్తూ రక్షణ, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ముందుకు వెళ్తే రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా నంబర్ ఒన్ పరిశ్రమగా నిలబడగలుగుతామని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ (ఈఅండ్‌ఎం) సలాకుల శంకర్, డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ పా) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్) బి.భాస్కర్‌రావు, డైరెక్టర్ (ఫైనాన్స్) ఎన్.బలరాం, వేడుకల కన్వీనర్ కె.బసవయ్య, జీఎం (పర్సనల్ రిక్రూట్‌మెంట్ సెల్) ఎ.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment