Singareni Collieries Company CMD
-
రాష్ట్రంలో జలాశయాలపై సోలార్‌ప్లాంట్లు..? ఎక్కడో తెలుసా..
రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో భారీ జలాశయాలపై సుమారు 800 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సింగరేణి సీఎండీ ఎన్ బలరాం తెలిపారు. ఇటీవల సింగరేణి భవన్లో విద్యుత్ విభాగానికి చెందిన సంస్థ ఎలక్ట్రికల్ మెకానికల్ శాఖ డైరెక్టర్ డి.సత్యనారాయణ రావుతోపాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. భారీ జలాశయాలపై సౌర ఫలకల ఏర్పాటుతో విద్యుదుత్పత్తి పెంపునకు కృషి చేయాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోయర్ మానేరు డ్యాం నీటిపై 300 మెగావాట్లు, మల్లన్న సాగర్ నీటిపై 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎండీ ఆదేశించారు. అయితే లోయర్ మానేరు డ్యాంపై 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. మల్లన్న సాగర్ జలాశయంపైనా రెండు 250 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు డీపీఆర్‌ను వెంటనే రూపొందించాలని అధికారులకు సీఎండీ సూచించారు. మరోవైపు రాజస్థాన్‌లో సింగరేణి ఏర్పాటు చేయాలనే యోచనలో భాగంగా 500 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌పై కూడా అధికారులతో చర్చించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్మించే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను పూర్తిచేసి నిర్మాణం మొదలుపెట్టాలన్నారు. ఇదీ చదవండి: విమానం కంటే వేగంగా వెళ్లే రైలు.. ప్రత్యేకతలివే.. మరోవైపు వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో పవన విద్యుదుత్పత్తి కేంద్రాలకు అనువైన ప్రాంతాలను సందర్శించాలని, దీనికి సంబంధించి ఒక నివేదికనూ రూపొందించాలని అధికారులను సంస్థ సీఎండీ బలరాం ఆదేశించారు. -
సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) యాజమాన్యం11వ వేజ్ బోర్డు ఏరియర్స్ విడుదల చేసింది. ఇందుకుగానూ రూ.1450 కోట్లను కేటాయించింది. సంస్థ డైరెక్టర్(పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్ ఆదేశాలపై కార్మికుల అకౌంట్లలో గురువారం మధ్యాహ్నం ఈ నగదు జమ చేసింది. ప్రస్తుత 39, 413 మంది ఉద్యోగుల కోసం రూ. 1450 కోట్లు విడుదల చేసింది సింగరేణి యాజమాన్యం. సింగరేణి భవన్ నుంచి గురువారం మధ్యాహ్నం ఆన్లైన్ ద్వారా ఎరియర్స్ విడుదల చేసిన చేశారు డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్, జీఎం(కో ఆర్డినేషన్) ఎం.సురేష్. సగటున ఒక్కో కార్మికుడికి మూడు లక్షల డెబ్బై వేల రూపాయల ఎరియర్స్ అందనుంది. అయితే.. ఉద్యోగులకు వాళ్ల వాళ్ల సర్వీస్ సీనియారిటీని బట్టి నగదు జమ అవుతుంది. ఎరియర్స్ చెల్లింపుపై సింగరేణి సీ&ఎండీ ఎన్.శ్రీధర్, డైరెక్టర్ ఎన్ బలరామ్‌కు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా.. త్వరలో దసరా, దీపావళి బోనస్‌ల చెల్లింపు ఉంటుందని డైరెక్టర్ బలరామ్ వెల్లడించారు. -
లద్నాపూర్ గ్రామంలో ఉద్రిక్తత..! ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆగ్రహం..!!
పెద్దపల్లి: మండలంలోని లద్నాపూర్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సింగరేణి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శనివారం అర్ధరాత్రి గ్రామ దేవత పోచమ్మ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ ఆదివారం ఉదయం ఆర్జీ–3 పరిధి ఓసీపీ–2 గేట్ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామానికి సంబంధించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ సమస్యలను పరిష్కరించకుండా యాజమాన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ నిర్వాసితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తోందని, తమ మనోభావాలను దెబ్బతీయడానికే ఇలా చేస్తోందని మండిపడ్డారు. అమ్మవారి విగ్రహన్ని ఆర్జీ–3 జీఎం దంపతులు తిరిగి ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. గేట్ వద్ద ఆందోళన అనంతరం సైట్ ఆఫీస్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోగా వారితో వాగ్వాదానికి దిగారు. గ్రామంలోని 284 మందికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వచ్చాకే పనులు చేపట్టాలని సింగరేణి అధికారులకు గతంలోనే చెప్పామన్నారు. అయినప్పటికీ గ్రామాన్ని బలవంతంగా ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతోనే పోచమ్మ తల్లి విగ్రహాన్ని తొలగించారని ఆరోపించారు. మ్యాన్ వే రూంకు తాళం వేసి, కార్మికులను, క్వారీలో బ్లాస్టింగ్ పనులను అడ్డుకున్నారు. సింగరేణి యాజమాన్యం స్పందించి, యథాస్థానంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గోదావరిఖని వన్ టౌన్ సీఐ ప్రసాద్‌రావు, రామగిరి, ముత్తారం, మంథని ఎస్సై లు దివ్య, మధుసూదన్‌రావు, కిరణ్‌లు తమ సిబ్బందితో బందోబస్తు చేపట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆగ్రహం.. లద్నాపూర్‌లో పోచమ్మ తల్లి విగ్రహం తొలగించడం పట్ల ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతా ధికారులను కోరారు. అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. -
సింగరేణిని ప్రైవేటీకరణ చేసే అధికారం కేంద్రానికి లేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
-
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. లాభాల బోనస్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దసరా పండుగ లోపు ఈ వాటాను ఉద్యోగులకు చెల్లించాలని సీఎం ఆదేశించారు. దీంతో అర్హులైన కార్మికులకు రూ. 368 కోట్లను సింగరేణి సంస్థ చెల్లించనుంది. సింగరేణి కాలరీస్ సంస్థ, 2021 -22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు వెంటనే చెల్లించాల్సిందిగా, సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్‌కు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా పరిస్థితుల్ని అధిగమించి.. దేశంలో గత రెండేళ్లుగా నెలకొన్న కరోనా విపత్కర పరిస్థితులను అధిగమించి 2021-22 లో రికార్డు స్థాయిలో 26,607 కోట్ల రూపాయల టర్నోవర్ ను సాధించింది సింగరేణి. మొత్తం టర్నోవర్ పై పన్నులు విధించడానికి ముందుకు 1,722 కోట్ల రూపాయల లాభాలను ఆర్థించినట్లు సంస్థ ఛైర్మన్ అండ్ ఎండీ శ్రీ ఎన్.శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణి సంస్థ బొగ్గు, విద్యుత్ అమ్మకాల ద్వారా సాధించిన టర్నోవర్ పై నికర లాభాలు రూ.1,227 కోట్లుగా (పన్నులు చెల్లించిన తర్వాత) ఉన్నట్లు తెలిపారు. అలాగే గత ఏడాది పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 3,596 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీన లాభాల వాటా చెల్లింపు సింగరేణి సాధించిన లాభాల్లో కార్మికులకు 30 శాతం వాటాను ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గత ఏడాది కంటే ఒక శాతం పెంచుతూ సింగరేణి కార్మికులకు లాభాల వాటాను దసరా కానుకగా ప్రకటించిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కార్మికులందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు సీ అండ్ ఎండీ. ఈ ఏడాది లాభాల వాటాగా కార్మికులు రూ.368 కోట్లను అందుకోనున్నారని వివరించారు. దాదాపు 44 వేల మంది ఉద్యోగులకు లాభాల వాటాను అక్టోబర్ 1వ తేదీన (శనివారం) చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు. 70 మిలియన్ టన్నుల లక్ష్యంతో.. 2021-22 లో సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 655 లక్షల టన్నుల రవాణా చేసిందన్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 88.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను గ్రిడ్ కు సరఫరా చేసినట్లు వివరించారు. అలాగే ఈ ఏడాది నిర్దేశించుకున్న 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి ప్రతీ ఒక్కరూ పునరంకితమై పనిచేయాలని, తద్వారా రికార్డు స్థాయి టర్నోవర్, లాభాలు సాధించవచ్చని తద్వారా మరిన్ని ఎక్కువ లాభాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. -
సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ నెల 4న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను జేఎన్టీయూ–హెచ్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, సింగరేణి డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ శనివారం రాత్రి విడుదల చేశారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను సింగరేణి సంస్థ వెబ్సైట్ www.scclmines.comలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 98,882 మంది అభ్యర్థులకు 77,898 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. నెగిటివ్ మార్కింగ్ విధానంలో పరీక్ష నిర్వహించగా.. 49328 మంది అభ్యర్థులు మాత్రమే కనీస అర్హత మార్కులు సాధించారు. 28,570 మంది పరీక్షలో అర్హత పొందలేదు. మూడు ప్రశ్నలకు సరైన సమాధానం నాలుగు ఆప్షన్లలో లేదని నిపుణులు తేల్చడంతో అభ్యర్థులకు మూడు మార్కులు కలపాలని నిర్ణయించారు. వారం రోజుల్లో ప్రొవిజినల్ సెలక్షన్ జాబితాను సంస్థ వెబ్సైట్లో ప్రకటిస్తామని చంద్రశేఖర్ తెలిపారు. అనంతరం అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, వారు సమర్పించిన అన్ని వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాక తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. చదవండి: ఆ కోరిక తీరకుండానే మరణించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు! -
దసరా కానుక: ఒక్కో కార్మికుడికి రూ.1.15 లక్షలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ కార్మికులకు ప్రకటించిన 29 శాతం లాభాల బోనస్ సొమ్మును ఈ నెల 11న చెల్లించనున్నట్టు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీని కింద రూ.79.07 కోట్లను కార్మికులకు పంపిణీ చేస్తామన్నారు. అలాగే ఇటీవల ప్రకటించిన దీపావళి బోనస్ (ప్రొడక్షన్ లింక్డ్ రివార్డ్ బోనస్)ను నవంబర్ 1న కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఇందుకోసం సంస్థ రూ.300 కోట్లను వెచ్చిస్తోందని, ప్రతి కార్మికుడు రూ.72,500 అందుకోనున్నాడని వివరించారు. ఇక పండుగ అడ్వాన్స్ కింద ప్రతి కార్మికుడికి రూ.25 వేల చొప్పున సంస్థ ప్రకటించిందని, ఈ డబ్బును ఈ నెల 8వ తేదీన చెల్లించనుందని పేర్కొన్నారు. పై రెండు రకాల బోనస్‌లు, పండుగ అడ్వాన్స్ కలిపి కార్మికులు సగటున రూ.1.15 లక్షల వరకు రానున్న మూడు వారాల్లో అందుకోనున్నారని తెలిపారు. ఈ మొత్తాన్ని దుబారా చేయకుండా వినియోగించుకోవాలని, పొదుపు చేయడం లేదా గృహావసరాలకు వాడుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో మరింతంగా ఉత్సాహంగా, కలిసికట్టుగా పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని, తద్వారా ఈ ఏడాది మరింత మెరుగైన బోనస్‌లు, సంక్షేమం అందుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగుల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్మికులకు దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చదవండి: సాగర్‌ను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్లు -
ఉద్యోగంలో ఉన్నట్టా.. లేనట్టా!
గోదావరిఖని (రామగుండం): సింగరేణి కార్మికుల ఉద్యోగ విరమణ వయసు పెంపు విషయంలో సందిగ్ధత నెలకొంది. కార్మికుల సర్వీసును ఏడాది పొడిగించాలని గత నెల సీఎం ఆదేశించినప్పటికీ దానికి సంబంధించి ఇప్పటికీ సర్క్యులర్ జారీ కాలేదు. దీంతో తమకు పొడిగింపు ఉందో లేదో అని జూలైలో పదవీ విరమణ చేసిన కార్మికులు సంశయంలో పడ్డారు. గత నెల 20న ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమావేశంలో సింగరేణి కార్మికుల ఉద్యోగ విరమణ వయసు ఏడాది పెంచాలని సంస్థ సీఅండ్ఎండీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో జూలై 26న జరిగిన సింగరేణి బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఉద్యోగ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం సంస్థ వ్యాప్తంగా పనిచేస్తున్న 43,899 మంది ఉద్యోగులు, అధికారులకు మరో ఏడాది రిటైర్మెంట్ వయస్సు పెరగనుంది. ఈ లెక్కన జూలైలో ఉద్యోగ విరమణ పొందే కార్మికుల సర్వీస్ మరో ఏడాది వరకు ఉంటుంది. దీనిప్రకారం సంస్థ వ్యాప్తంగా సుమారు 3 వేల మందికి లబ్ధి చేకూరనుంది. కానీ.. సీఎం ఆదేశాలిచ్చినా కంపెనీలో మాత్రం ఇంకా అవి అమలుకు నోచుకోవడం లేదు. జారీ కాని ఆదేశాలు.. ఉద్యోగ విరమణ వయస్సు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన విధివిధానాలపై సర్క్యులర్ మాత్రం ఇంకా జారీ కాలేదు. గత నెల 30న ఒక సర్క్యులర్ వచ్చినా అందులో స్పష్టమైన ఆదేశాలు లేవు. స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు డ్యూటీలోకి తీసుకోబోమని గనులపైకి వెళ్లిన కార్మికులకు అధికారులు స్పష్టం చేశారు. దీంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. యాజమాన్యం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. రిటైర్మెంట్ వయస్సు పెంపుపై సింగరేణి బోర్డు సభ్యులైన కోలిండియా డైరెక్టర్‌తో పాటు మహారాష్ట్రలోని వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్) ఎండీ సంతకాలు చేయకపోవడంతోనే ప్రభుత్వం అధికారికంగా సర్క్యులర్ జారీ చేయలేదని తెలుస్తోంది. జూలైలో లక్ష్యానికి మించి బొగ్గు ఉత్పత్తి సింగరేణి సంస్థ వెల్లడి సాక్షి, హైదరాబాద్/గోదావరిఖని (రామగుండం): ఈ ఏడాది జూలైలో 47.56 లక్షల టన్నుల నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 48.67 (102.34 శాతం) లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించినట్టు సింగరేణి బొగ్గు గనుల సంస్థ వెల్లడించింది. అలాగే 45.56 లక్షల టన్నుల నిర్దేశిత బొగ్గు రవాణా లక్ష్యానికి గాను 50.29 లక్షల టన్నులు (110.30శాతం) రవాణా చేసినట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది జూలైలో 28.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో 70.65 శాతం వృద్ధిని సాధించినట్టు పేర్కొంది. గతేడాది జూలైలో 29.1 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేస్తే, ఈ ఏడాది జూలైలో 72.9 శాతం వృద్ధిని సాధించినట్టు తెలిపింది. గతేడాది జూలైలో 477 రేకులతో బొగ్గు రవాణా చేయగా, ఈ ఏడాది జూలైలో 91.6 శాతం వృద్ధితో 914 రేకుల ద్వారా రవాణా చేసినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని ఐదు ఏరియాలు వంద శాతానికి మించి బొగ్గును వెలికి తీశాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 70.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బొగ్గు ఉత్పత్తి, రవాణాలో 100 శాతానికి పైగా లక్ష్యాలు సాధించడంపై సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. -
సింగరేణి బోర్డు కీలకనిర్ణయాలు : ఉద్యోగులకు గుడ్ న్యూస్
-
‘సింగరేణి ప్రైవేటీకరణ తగదు’
హిమాయత్‌నగర్: సింగరేణి సంస్థను ప్రైవేటీకరించడం తగదని సీపీఐ, ఏఐటీయూసీ పేర్కొన్నాయి. సింగరేణి కార్మికుల అక్రమ అరెస్టులు, బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సీపీఐ, ఏఐటీయూసీ నేతలు, కార్యకర్తలు హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ బొగ్గు గని కార్మిక సంఘం సమ్మెలో పాల్గొంటున్నట్లు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం తర్వాత కేంద్రానికి తొత్తుగా మారి కార్మికులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ బొగ్గు గనులను నల్ల బంగారంగా రాష్ట్ర ప్రజలు అభివర్ణిస్తారని, అలాంటిది కేంద్ర ప్రభుత్వం ఆ సం స్థను ప్రైవేటీకరణ చేయడం తగదన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బోస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏకైక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని పోరాటాల ద్వారా కాపాడుకుంటామన్నారు. -
సింగరేణి యాజమాన్యంపై కార్మికులు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : సింగరేణి యాజమాన్యంపై కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వేతనంలో 50శాతం కోత విధించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సింగరేణి కార్మికులు డిమాండ్ చేశారు. అలాగే లే ఆఫ్ కాకుండా బొగ్గు గనుల్లో లాక్డౌన్ ప్రకటించాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఈనెల 15 నుంచి సమ్మె చేపడతామని సింగరేణి కార్మికులు హెచ్చరించారు. ఈ మేరకు సింగరేణి సీఎండీకి గురువారం నోటీస్ ఇచ్చారు. నోటీస్‌లోని ముఖ్యాంశాలు ‘కరోనా వైరస్ వలన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు-కార్మికులు అందరికీ పూర్తి జీతంతో కూడిన లాక్డౌన్ ప్రకటిస్తే, డీజీఎమ్‌ఎస్ నోటీసు ఇచ్చిన తర్వాత సింగరేణి యాజమాన్యం అండర్ గ్రౌండ్ మైన్స్ కార్మికులకు సగం జీతంతో కూడిన లే ఆఫ్ ప్రకటించింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ప్రకారం లాక్ డౌన్ చేయాలి తప్ప లే ఆఫ్ చేయకూడదు. రాష్ట్ర బడ్జెట్లో డబ్బు లేనందువలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 50శాతం జీతంలో కోత విధించాలని నిర్ణయించారు. దీనికి సింగరేణికి సంబంధం లేదు. ఎందుకంటే సింగరేణి కార్మికుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు. సింగరేణి బొగ్గు అమ్మిన డబ్బుల నుండే చెల్లిస్తుంది. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం కూడా కార్మికుల జీతం కట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కోల్ ఇండియాలో అనుమతి ఇచ్చిన కార్మికుడు జీతం నుండి ఒక్క రోజు జీతం ప్రధానమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించారు. కానీ సింగరేణి యాజమాన్యం మాత్రం కార్మికులను సంప్రదించకుండానే ఒక్క రోజు జీతం ఏడు కోట్ల 50 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చారు. ఇది చట్టవిరుద్ధం. గత 15 రోజులుగా సింగరేణి కార్మికులు అయోమయానికి గురై దిక్కుతోచక ప్రాణాలకు తెగించి పోలీసులు కొట్టినా డ్యూటీ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే 15-4-2019 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నాం’ అని లేఖలో పేర్కొన్నారు. -
సత్వరమే కొత్త గనులు ప్రారంభించాలి
సాక్షి, హైదరాబాద్: బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను సాధించాలంటే ఈ ఏడాదికి ప్రతిపాదించిన కొత్త ఓసీ గనులను సత్వరమే ప్రారంభించాలని సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. సింగరేణి భవన్లో మంగళవారం డెరైక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలతో వెనకబడిన బొగ్గు ఉత్పత్తి, రవాణాలను సెప్టెంబర్ నెల లక్ష్యాలతోపాటు సాధించాలన్నారు. ఓబీ తొలగింపుపై మరింత శ్రద్ధ చూపాలని, లక్ష్యాల మేర ఓబీ తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సింగరేణి సంస్థ ఆగస్ట్ నెల వరకూ గడచిన 5 నెలల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను దాటి బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించింది. ఆగస్టు ముగిసేనాటికి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 254లక్షల టన్నులు కాగా, 262 లక్షల టన్నుల బొగ్గును (103 శాతం) ఉత్పత్తి చేసింది. 262 లక్షల టన్నుల బొగ్గు రవాణా లక్ష్యాన్ని 261.5 లక్షల టన్నుల రవాణా చేయడం ద్వారా నూరు శాతం ఫలితాన్ని సాధించింది. 2018–19తో పోలిస్తే బొగ్గు ఉత్పత్తిలో 12.4 శాతం వృద్ధిని సాధించింది. 2018 ఆగస్టు చివరికి 233లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, ఈ ఏడాది ఆగస్టు చివరికి 262లక్షల టన్నులు ఉత్పత్తి చేసింది. -
సంక్షేమంలో నం–1
సూపర్‌బజార్(కొత్తగూడెం): దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పరిశ్రమల కంటే సింగరేణి సంస్థ కార్మికులకు సంక్షేమ పథకాల అమలులో మొదటి స్థానంలో ఉందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ అన్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రకాశం స్టేడియంలో ఆదివారం జరిగిన ప్రధాన వేడుకల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయం విలేకరుల సమావేశంలో, రాత్రి జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ బొగ్గు రంగంలోనే కాకుండా విద్యుత్ ఉత్పత్తిలో కూడా సత్తా చాటుతోందని అన్నారు. జైపూర్‌లో ఇప్పటికే 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, త్వరలో మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధమైందని చెప్పారు. సోలార్ విద్యుత్ వైపు కూడా దృష్టి సారించామని, రాబోయే కాలంలో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ముందుగా 130 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలోనే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా బొగ్గు గనుల ఏర్పాటుకు సింగరేణి చర్యలు చేపట్టిందని, 6 కొత్త బ్లాక్‌లను ఏర్పాటు చేయబోతోందని అన్నారు. ఇప్పటికే ఒడిశాలో నైనీ బ్లాక్‌ను చేపట్టినట్లు చెప్పారు. రాబోయే 5 సంవత్సరాల్లో మరో 12 గనుల ఏర్పాటుకు కార్యాచరణను సిద్ధం చేశామని చెప్పారు. త్వరలో 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి దిశగా సింగరేణి సంస్థ ఎదగబోతోందని అన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో వార్షిక నికర ఆదాయాన్ని రూ.35 వేల కోట్ల లక్ష్యంగా నిర్దేశించుకుంటున్నట్లు వివరించారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ధ సంస్థగా సింగరేణి సంస్థ విరాజిల్లుతోందని అన్నారు. బయ్యారం స్టీల్‌ప్లాంట్ విషయంలో కమిటీ వేశారని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి సంస్థ బయ్యారం స్టీల్‌ప్లాంట్‌ను చేపట్టే అవకాశాలున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కార్మికుల సంక్షేమానికి తమ సంస్థ కట్టుబడి ఉందని, సొంత ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు వడ్డీలేని రుణాన్ని బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. వీటికోసం ఇప్పటికే 3 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. సింగరేణి అధికారులకు సొంత ఇంటి నిర్మాణాల కోసం హైదరాబాద్‌లో స్థలాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి స్థలాల్లో ఉన్న కార్మికులకు క్రమబద్ధీకరణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. భద్రాచలంరోడ్ – సత్తుపల్లి రైల్వేలైన్ నిర్మాణం కోసం 10 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని, 52 కిలోమీటర్ల రైల్వే మార్గానికి రూ. 710 కోట్ల ఖర్చవుతుందని, దీనిలో రూ.610 కోట్లు సింగరేణి ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని తెలిపారు. దీనికోసం 13 గ్రామాలలో భూ సేకరణ జరుగుతోందని సీఎండీ వివరించారు. విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే సింగరేణికి 5వ స్థానం రావడం ఐక్య కృషికి నిదర్శనమని అన్నారు. దినదిన ప్రవర్థమానంగా సింగరేణి సంస్థ ఎదుగుతూ తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో సింగరేణి కుటుంబమంతా భాగస్వామ్యం కావాలని శ్రీధర్ కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నెలాఖరు వరకు గత ఏడాది చేసిన బొగ్గు ఉత్పత్తి కంటే 9 శాతం వృద్ధిరేటుతో 395 లక్షల టన్నుల మేర సాధించగలిగామని, 6 శాతం వృద్ధితో 430 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేశామని చెప్పారు. 3 శాతం వృద్ధితో గత 8 నెలల కాలంలో 247 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబీని కూడా తీశామని ప్రకటించారు. సింగరేణీయులందరికీ సంస్థ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 2013 – 14 వార్షిక బొగ్గు ఉత్పత్తి నుంచి 2017–18 వార్షిక బొగ్గు ఉత్పత్తి వరకు 22.9 శాతం వృద్ధి రేటును సాధించగలిగామని వివరించారు. ప్రభుత్వం నియమించిన మెడికల్ బోర్డ్ ద్వారా ప్రతినెల బోర్డ్ నిర్వహించి కారుణ్య నియామకాలు చేపడుతున్నామని, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 25 మెడికల్ బోర్డ్‌లు నిర్వహించామని, 5,284 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 3,419 మంది కార్మికులు వైద్యపరంగా అన్‌ఫిట్ అయ్యారని, వారి వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని వివరించారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన సింగరేణికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందన్నారు. అంకితభావంతో పనిచేస్తూ యంత్రాలను పూర్తి పనిగంటలు వినియోగిస్తూ రక్షణ, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ముందుకు వెళ్తే రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా నంబర్ ఒన్ పరిశ్రమగా నిలబడగలుగుతామని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ (ఈఅండ్ఎం) సలాకుల శంకర్, డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ పా) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్) బి.భాస్కర్‌రావు, డైరెక్టర్ (ఫైనాన్స్) ఎన్.బలరాం, వేడుకల కన్వీనర్ కె.బసవయ్య, జీఎం (పర్సనల్ రిక్రూట్మెంట్ సెల్) ఎ.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. -
వేడుకలకు రెడీ..
సాక్షి, కొత్తగూడెం: సింగరేణి సంస్థ 130వ ఆవిర్భావ వేడుకల సెంట్రల్ ఫంక్షన్ కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఆదివారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంస్థ సీఎండీ శ్రీధర్ హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించి పలు విషయాలను జీఎం (వెల్ఫేర్ అండ్ సీఎస్ఆర్) కె.బసవయ్య శనివారం ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఆవిర్భావ దినోత్సవాలు జరుపుతుండగా, సెంట్రల్ ఫంక్షన్ మాత్రం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహిస్తున్నాం. ఈ వేడుకకు సింగరేణి సీఎండీ శ్రీధర్ హాజరు కానున్నారు. సంస్థ పురోభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న సీఎండీని ఆహ్వానించేందుకు భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నాం. ఉదయం 8:30 గంటలకు సింగరేణి కేంద్ర కార్యాలయం నుంచి 2 కె రన్ ప్రారంభం అవుతుంది. ప్రకాశం స్టేడియం వరకు ఈ రన్ కొనసాగుతుంది. కార్యక్రమంలో అందరు డైరక్టర్లు, అధికారులు, కార్మికులు, విద్యార్థులు పాల్గొంటారు. 9:30 గంటలకు సీఎండీ స్టేడియానికి చేరుకుని సింగరేణి జెండాను ఆవిష్కరించి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రకాశం స్టేడియంలో మొత్తం 13 విభాగాలకు సంబంధించిన 18 స్టాల్స్ ఏర్పాటు చేశాం. సాయంత్రం 7 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయి. సినీ, టీవీ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సినీ గాయకుడు యాసిన్నిజార్, స్వాతి, శృతిల సంగీత విభావరి, క్రాంతినారాయణ్, సీతాప్రసాద్ బృందా లతో శాస్త్రీయ నృత్య ప్రదర్శన ఉంటాయి. జబర్దస్త్ ఫేమ్ సుధాకర్ కామెడీ ఉంటాయి. 7గంటల నుంచి 7:30 వరకు బహుమతి ప్రదానం ఉంటుంది. ఆర్జీ–1 ఏరియా లోని జీడీకే–11 ఉత్తమ కంటి న్యూయస్ మైనర్‌గా ప్రథమ బహుమతి సాధించింది. ఆర్జీ–2 ఏరియాలోని ఓసీ–3 ప్రథమ, ఎస్డీఎల్స్ విభాగంలో మందమర్రి ఏరియాలోని కేకే–1 కు ప్రథమ, ఆర్జీ–1 ఏరియాలోని జీడీకే–5కు ఎల్‌హెచ్‌డీ విభాగంలో ప్రథమ బహుమతులు వచ్చాయి. వీటిని సీఎండీ ప్రదానం చేస్తారు. -
వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే
సాక్షి,సత్తుపల్లి: భూ నిర్వాసితుల సమస్యలు తెలుసు. కొంతమంది అధికారుల తప్పిందం వల్ల గ్రామం పోతోంది. సీఎం కేసీఆర్, సింగరేణి సీఎండీలతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని, వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అన్నారు. మండలంలోని కొమ్మేపల్లి, యాతాలకుంట, చెరుకుపల్లి, కిష్టారం గ్రామాల్లో డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. నిర్వాసితులకు జగన్నాథపురంలో డబుల్ బెడ్రూం ఇళ్లు కడుతున్న తరహాలోనే కొమ్మేపల్లి నిర్వాసితులకు కూడా ఇళ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని, రూ.1.30 లక్షలు ఎటూ సరిపోవన్నారు. సీఎం కేసీఆర్ ఖమ్మం సభలో పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇచ్చారని మొట్ట మొదటిసారిగా చెప్పారన్నారు. టీఆర్ఎస్లో చేరేటప్పుడే.. గిరిజనులు, దళితులు, పేదల సంక్షేమం కోసం పోడు కొట్టుకున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరానన్నారు. కొమ్మేపల్లి పట్టా భూముల సమస్యలను కేసీఆర్‌కు చెప్పి సత్వర పరిష్కారం అయ్యేలా చేస్తానని.. ఏ పనులు జరగాలన్నా.. కారు గుర్తుకు ఓటువేసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. చెరుకుపల్లిలో పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తానని గిరిజనులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కార్యక్రమంలో దిశ కమిటీ సభ్యుడు మట్టా దయానంద్, ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, చల్లగుళ్ల నర్సింహారావు, కొత్తూరు ప్రభాకర్‌రావు, మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, సోమరాజు సీతారామారావు, మోరంపూడి ప్రభాకర్, తుమ్మూరు శ్రీనివాసరావు, అమరవరపు కృష్ణారావు, కొడిమెల అప్పారావు, జ్యేష్ట లక్ష్మణరావు, ఐ. శ్రీను మొదుగు పుల్లారావు, ఎండీ యాసీన్, మౌలాలీ, షఫీ, సుభాని పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటేయండి సత్తుపల్లి: టీఆర్ఎస్ పార్టీని బలపర్చి కారుగుర్తుకు ఓటేయండని డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు కోరారు. పట్టణంలోని జవహర్‌నగర్‌లో గురువారం టీఆర్ఎస్లో చేరిన తన్నీరు వెంకటేశ్వరరావు, అరవపల్లి అమరయ్య, దుర్గారావు, మల్లీశ్వరి, తులశమ్మ, దానియేలు, లేయమ్మ, శివమ్మ, షారుక్, జయమ్మ, కమలమ్మలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేసిందని.. ఆసరా పెన్షన్లు రూ.2,016, వికలాంగుల పెన్షన్లు రూ.3,016లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ రూ.1,0116లు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్‌దేనన్నారు. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కారుగుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్లగుండ్ల కృష్ణయ్య, దొడ్డాకుల స్వాతిగోపాలరావు, కోటగిరి వెంకటరావు, రామకృష్ణ, విష్ణు పాల్గొన్నారు. -
ఓపెన్‌కాస్ట్ బ్లాస్టింగ్‌తో ఇబ్బందులు
సాక్షి, గోదావరిఖని(రామగుండం) : సింగరేణి రామ గుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ–2 డివిజన్ పరిధిలో గల ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్–3లో సోమవారం మట్టి తొలగించేందుకు ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థ చేపట్టిన బ్లాస్టింగ్ ధాటికి గోదావరిఖని విఠల్‌నగర్‌లోని ఓ ఇంట్లో ఫ్యాన్ ఊడి కిందపడింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న గాండ్ల వెంకటమ్మ అనే మహిళ చెవుకు గాయమైంది. ఆ సమయంలో తన కూతురు పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటుండగా వారిపై ఫ్యాన్ పడకపోవడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ఆదివారం కూడా ఇదే కాలనీలో నివసించే రాజు అనే కిరాణా వ్యాపారి ఇంట్లో బ్లాస్టింగ్ చేసిన తర్వాత ఫ్యాన్ కుప్పకూలింది. ఈ సమయంలో ఇంట్లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా ఓసీపీ–3లో మట్టి తొలగింపు పనుల కోసం చేస్తున్న బ్లాస్టింగ్‌కు వాడుతున్న పేలుడు పదార్థాలను ఎక్కువగా వినియోగిస్తున్న కారణంగానే తమ ఇళ్లు పగుళ్లు తేలడం, ఇంట్లో రేకులు, ఫ్యాన్లు ఊడిపడుతున్నాయని విఠల్‌నగర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. అయితే బ్లాస్టింగ్ విషయమై గతంలో ఆందోళన చేసినప్పుడు తక్కువ సామర్థ్యంతో బ్లాస్టింగ్ చేస్తున్నారని, ఆ తర్వాత షరా మామూలుగానే వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్ తెలిపారు. రెండు నెలల క్రితం ఓ ఇంట్లో మండంపై ఆడుకుంటున్న బాలుడిపై బ్లాస్టింగ్ జరిగిన సమయంలో పెద్ద బండరాయి పడింది. దీంతో బాలుడి కుటుంబసభ్యులు, స్థానికులు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులోపలికి వెళ్లి వాహనాలు నడవకుండా రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో స్పందించిన యాజమాన్యం అధికారులను విఠల్‌నగర్ కాలనీకి పంపించి ఇళ్లల్లో అద్దాలను బిగించారు. ఆ సమయంలో అద్దాలు పగలకుండా తక్కువ స్థాయిలో బ్లాస్టింగ్ చేసి కాలనీవాసులను అధికారులు నమ్మించారు. ఆ తర్వాత షరా మామూలుగానే బ్లాస్టింగ్ చేస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. కాగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబసభ్యులు నివసించే ఈ కాలనీలో బ్లాస్టింగ్ వల్ల నష్టపోతున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని స్థానికులంటున్నారు. దీనికితోడు రామగుండం కార్పొరేషన్‌కు పన్నులు చెల్లిస్తున్నా అధికారులు సింగరేణి యాజమాన్యంతో ఏనాడు తమ గురించి చర్చించలేదని, ఇక తమ ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలని కాలనీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం, రామగుండం కార్పొరేషన్ అధికారులు బ్లాస్టింగ్ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. -
బొగ్గు ఉత్పత్తిలో నంబర్ వన్
సాక్షి, హైదరాబాద్: బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి బొగ్గు గనుల సంస్థ అత్యుత్తమ ఫలితాలు సాధించి దేశంలోనే నంబర్ వన్‌గా నిలవడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్, ఇతర ఉద్యోగులను ముఖ్యమంత్రి అభినందించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో డివిడెండ్‌గా రూ.66.42 కోట్ల చెక్కును సింగరేణి సీఎండీ శ్రీధర్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సింగరేణి కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ మొత్తం రూ.409 కోట్ల లాభాలు గడించింది. రాష్ట్రానికి 7.5 శాతాన్ని డివిడెండ్‌గా నిర్ణయించింది. దీని ప్రకారం 51 శాతం వాటా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి రూ.66.42 కోట్లు, 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి రూ.63.58 కోట్లు లభిస్తాయి. 2014-15 సంవత్సరంలో 520 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణి, 2015-16లో 600 లక్షల టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎనిమిది కోల్ ఇండియా సంస్థల్లో కెల్లా సింగరేణి అత్యధిక ఉత్పత్తి సాధిస్తున్న సంస్థగా నిలిచింది. తెలంగాణలోనే మరో 50 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని, అయినా ఇతర చోట్ల కూడా గనులను నిర్వహించాలని సంస్థ అధికారులను సీఎం కోరారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇంధనశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, సింగరేణి డెరైక్టర్ రమేశ్ బాబు, జీఎం నాగయ్య పాల్గొన్నారు. -
జైపూర్ ప్లాంట్‌ను తెలంగాణ ప్రజలకు అంకితమిస్తాం
2016 మార్చికల్లా అందుబాటులోకి ప్లాంటు - రెండో యూనిట్ బాయిలర్ లైటప్కు శ్రీకారం - కార్మికుల లాభాల వాటాపై త్వరలో కేసీఆర్ ప్రకటన - సింగరేణి సీఎండీ శ్రీధర్ జైపూర్ : 1200 మెగావాట్ల జైపూర్ థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని 2016 మార్చికల్లా తెలంగాణ ప్రజానీకానికి అంకితమిస్తామని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.శ్రీధర్ తెలిపారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణంలో కీలకమైన రెండో యూనిట్ లైటప్కు ఆయన గురువారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా యూనిట్-2 బాయిలర్ లైటప్ను కంప్యూటర్ ద్వారా ప్రారంభించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీటీజీ, బాయిలర్ టర్బైన్ జనరేషన్, బాయిలర్ ఎరాక్షన్, స్విచ్ యార్డు, బీవోపీ(బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్స్) చిమ్నీ, నీటి రిజర్వాయర్, కూలింగ్ టవర్స్, యాష్ యార్డు, కోల్-హ్యాడ్లింగ్ ప్లాంట్(సీహెచ్‌పీ), డీ-మినరలైజేషన్(డీఎం) ప్లాంట్, సర్క్యులేటింగ్ వాటర్(సీడబ్ల్యూ) సిస్టమ్, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, కంప్రెషర్ హౌజ్ పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎండీ శ్రీధర్ మాట్లాడారు. సింగరేణి డెరైక్టర్లు, జీఎంలు, అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీల సహకారంతో 30 రోజుల వ్యవధిలో యూనిట్-1,యూనిట్-2 బాయిలర్ లైటప్ విజయవంతంగా పూర్తిచేశామన్నారు. 6 నెలల క్రితం సీఎం కేసీఆర్ పవర్ ప్లాంటును సందర్శించడంతో నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుందన్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న 17 కొత్త గనుల్లో ఈ ఏడాది 3 గనులను ప్రారంభిస్తామని చెప్పారు. కార్మికులకు అత్యవసర సేవలు అందించడానికి 12 కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. వారం రోజుల్లో సీఎం కేసీఆర్ జైపూర్ ప్రాజెక్టులో కార్మికుల లాభాల వాటాను ప్రకటిస్తారని చెప్పారు. మూడో యూనిట్‌కు అన్ని అనుమతులు వచ్చాయన్నారు. 30 రోజులకోసారి నిర్మాణ పనులను పరిశీలిస్తున్నామని..బీటీజీతో పాటు పాటు బీవోపీ పనులు ఏకకాలంలో పూర్తరుుతేనే విద్యుత్ ఉత్పత్తి సాధ్యం అవుతుందని సీఎండీ శ్రీధర్ వివరించారు. బీటీజీ పనులు 95 శాతం పూర్తవగా ప్రధానంగా బీవోపీ పనులపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. నవంబర్‌లో మొదటి యూనిట్ సింక్రనైజేషన్ చేసి 2016 జనవరి నాటికి మొదటి యూనిట్, డిసెంబర్‌కల్లా రెండో యూనిట్ సింక్రనైజేషన్ చేసి వచ్చే మార్చిలోగా విద్యుత్‌ను అందిస్తామన్నారు. రాష్ట్రంలో కొత్త విద్యుత్తు ప్లాంటు నిర్మిస్తున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరముందన్నారు. ఈ ఏడాది అదనంగా 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గడిచిన 4 నెలల్లో 35 శాతం బొగ్గు ఉత్పత్తిని పెంచుకోగలిగామన్నారు.అనంతరం నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సంస్థ డెరైక్టర్లు రమేశ్‌కుమార్(ఆపరేషన్స్), రమేశ్‌బాబు(ఈఅండ్ఎం), పవిత్రన్ కుమార్(ఫైనాన్స్), మనోహర్ రావు(పీపీ), పవర్ ప్లాంటు ఈడీ సంజయ్‌కుమార్ సూర్, ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు, పాల్గొన్నారు. -
పవర్ ప్రాజెక్ట్ పరిశీలించిన సింగరేణి చైర్మన్
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో సిగరేణి సంస్థ కొత్తగా నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్ట్ పనులను ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.శ్రీధర్ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఉద్యోగులకు సూచించారు. ఆయనతో పాటు ఇంకా కొంతమంది అధికారులు పాల్గొన్నారు. -
సింగరేణి చైర్మన్‌తో దక్షిణాఫ్రికా ప్రతినిధుల భేటీ
గోదావరిఖని : సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్‌తో దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ మైనింగ్ యంత్రాల తయారీ కంపెనీ జాయ్ గ్లోబల్ ప్రతినిధుల బృందం సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా వారు భూగర్భ గనుల్లో అత్యధిక బొగ్గును తవ్వి తీసే అత్యాధునిక యంత్రాల గురించి, వాటి పనితీరు గురించి చైర్మన్‌కు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సింగరేణి సంస్థ రానున్న కాలంలో 80 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోనున్న నేపథ్యంలో కొత్తగా తవ్వనున్న గనులకు అవసరమైన ఆధునిక టెక్నాలజీని, యంత్రాలను తమ సంస్థ సమకూర్చగలదని జాయ్ గ్లోబల్ ప్రతినిధులు సీఎండీకి వివరించారు. అనంతరం చైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ సింగరేణిలో ఉన్న గనులలో షార్ట్‌వాల్, కంటిన్యూయస్ మైనర్ వంటి యంత్రాలు ఏర్పాటు చేయడానికి ఎక్కడెక్కడ అవకాశం ఉంది పరిశీలించాలని, కొత్తగూడెం వీకే-7లోని కంటిన్యూయస్ మైనర్ పనితీరును పరిశీలించి మరింత సమర్థవంతంగా అధిక ఉత్పత్తి సాధించడానికి గల అవకాశాలను వివరించాలని కోరారు. సమావేశంలో జాయ్ గ్లోబల్ కంపెనీ ప్రతినిధులు ఆన్‌డ్రాయిన్, ఆ కంపెనీకి చెందిన భారతదేశ ప్రతినిధి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల సింగరేణి సంస్థ చైర్మన్ ఎన్.శ్రీధర్ దక్షిణాఫ్రికాలోని గనులతోపాటు జాయ్ గ్లోబల్ కంపెనీని కూడా సందర్శించారు. ఈ నేపథ్యంలో త్వరలో సింగరేణిలో తవ్వనున్న కొత్త గనులలో ఏర్పాటు చేసే టెక్నాలజీని సదరు కంపెనీకి సంబంధించినవి వినియోగించేందుకు యాజమాన్యం మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. -
జైపూర్ విద్యుత్ ప్రాజెక్టును పరిశీలించిన శ్రీధర్
జైపూర్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ లో సింగరేణి సంస్థ నిర్మించనున్న విద్యుత్ ప్రాజెక్టును సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్ పరిశీలించారు. ఈ బొగ్గు ఆధారిత ప్రాజెక్టు 1200 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండేలా పనులు జరుగుతున్నాయి. పూర్తిస్థాయిలోపనులు త్వరలో ప్రారంభించే అవకాశాలున్నాయి. -
‘గూడెం’లో సీఎండీ శ్రీధర్
రుద్రంపూర్(ఖమ్మం) :సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టిన ఎన్.శ్రీధర్ గురువారం మొదటి సారిగా కొత్తగూడెం ఏరియాలో పర్యటించారు. ఆయనకు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గౌతంఖని ఓపెన్‌కాస్టు, పీవీకే ఎయిర్‌షాఫ్ట్ మైన్లను సందర్శించారు. జీకే ఓసీ వ్యూ పాయింట్ నుంచి ఓబీ బ్లాస్టింగ్, బొగ్గు బ్లాస్టింగ్, బొగ్గు రవాణా ప్రక్రియను పరిశీలించారు. ఏరియా సీజీఎం మాదాసి మల్లేష్, జీకే ఓసీ పీఓ శాలెం రాజు ఓసీ పనితీరు, చరిత్రను సీఎండీకి వివరించారు. అనంతరం ఓసీకి చెందిన ఓవర్‌బర్డెన్ వద్ద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన జామాయిల్ ప్లాంటేషన్, క్వారీలోని ఓబీ డంపింగ్, లోడింగ్ పనులను చూశారు. బొగ్గు వెలికితీసే విధానాన్ని, బొగ్గు పొరల మందాన్ని, వాటి గ్రేడ్లను పీఓను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆర్‌సీహెచ్‌పీ వద్ద వ్యాగెన్‌లో బొగ్గు లోడింగ్, రోజుకు ఎన్ని వ్యాగన్లు రవాణా చేస్తున్నారు తదితర విషయాలను ఆర్‌సీహెచ్‌పీ డీవైఎస్ఈ ముత్యాల నాయుడు తెలిపారు. ఇటీవల రూ.6కోట్ల వ్యయంతో చేపట్టిన ఎయిర్‌షాఫ్ట్ వైండింగ్ ఇంజిన్‌ను సీఎండీ పరిశీలించగా గని లోపల బొగ్గు వివరాలు, ఉత్పత్తి ప్రక్రియను గని ఏజెంట్ వివరించారు. వైండింగ్ ఇంజిన్ ఆపరేటింగ్, దాని ఉపయోగాలను సీజీఎంను అడిగి తెలుసుకున్నారు. సీఎండీ వెంట డెరైక్టర్లు బి.రమేష్ కుమార్(ఆపరేషన్స్), మనోహర్‌బాబు(పీఅండ్‌పీ), గనుల మేనేజర్లు ఆర్.నారాయణరావు, బచ్చ రవీందర్, ప్రభాకర్‌రావు, సెక్యూరిటీ అధికారులు ఉన్నారు. -
కలెక్టర్ బదిలీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉత్కంఠకు తెర వీడింది. జిల్లా కలెక్టర్ నడిమట్ల శ్రీధర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. సింగరేణి కాలరీస్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా పోస్టింగ్ ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లా కలెక్టర్‌గా ఇంకా ఎవరికి పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.. కొత్తవారిని నియమించేవరకు శ్రీధ ర్ పూర్తిస్థాయిలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్‌కు కూడా ఆయనే ఇన్చార్జిగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. 1997 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శ్రీధర్ గత జూన్ 17న కలెక్టర్‌గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుఅభిమానాన్ని చూరగొన్న శ్రీధర్.. ప్రతిష్టాత్మక సింగరేణి చైర్మన్ గిరిని దక్కించుకోగలిగారు. శ్రీధర్ పేరుకు కేంద్రం కూడా ఆమోదముద్ర వేయడంతో ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సీఎండీగా నియమిస్తూ బదిలీ చేసింది. కాగా, కొత్త కలెక్టర్ ఎవరనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోనే కీలక జిల్లాగా పరిగణించే ఈ పోస్టుకు ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల విభజన ప్రక్రియకు బుధవారం పుల్‌స్టాప్ పడనున్న నేపథ్యంలో జరిగే బదిలీల్లో రంగారెడ్డి జిల్లాకు కొత్త కలెక్టర్‌ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ పదవికి ప్రస్తుతం కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న రఘునందన్‌రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సామాజిక సమీకరణలు, సీఎం కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కేడర్‌కు ఖరారు కావడంతో బుధవారం ఆయన ఏపీ రాష్ట్రం నుంచి రిలీవ్ కానున్నారు. కలెక్టర్ శ్రీధర్ నిర్వహించిన పదవులు కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో 1971 జూన్ 1న జన్మించిన శ్రీధర్, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్(ఈసీఈ) పూర్తి చేశారు. 1997లో ఐఏఎస్ ఎంపికైన ఆయన తొలుత రాజమండ్రి సబ్‌కలెక్టర్‌గా.. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. అక్కడి నుంచి నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, పోర్టుల డెరైక్టర్‌గా కాకినాడలో విధులు నిర్వర్తించారు. అనంతరం అనంత పురం, కృష్ణా, వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా సీఎంవోలో ముఖ్య భూమిక పోషించారు. అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నియమితులైన ఆయన సుమారు ఆరు నెలలపాటు జిల్లాలో సేవలందించారు. కాగా, నాలుగు జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేసిన అధికారిగానే కాకుండా... సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపడుతున్న యువ ఐఏఎస్‌గా శ్రీధర్ గుర్తింపు పొందనున్నారు. -
సింగరేణి సీఎండీగా శ్రీధర్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఐఏఎస్ అధికారి ఎన్.శ్రీధర్ నియామకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెండుమూడు రోజుల్లో ఆయనను సింగరేణి సీఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీధర్ గతంలో అనంతపురం, వరంగల్, కృష్ణా జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన కార్యాలయం లో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లి ప్రాంతానికి చెందిన శ్రీధర్ 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఇదివరకు సింగరేణి సీఎండీగా ఉన్న సుతీర్థ భట్టాచార్య కోల్ ఇండియా సీఎండీగా ఎంపిక కావడంతో.. ఆయన స్థానంలో శ్రీధర్‌ను ప్రభుత్వం నియమించాలని నిర్ణయించి, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సమాచారాన్ని అందించడం, అందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆయన నియామకం ఓకే అయింది. -
సింగరేణి సీఎండీగా కలెక్టర్ శ్రీధర్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా కలె క్టర్ నడిమట్ల శ్రీధర్ అతి త్వరలో బదిలీ కానున్నారు. ప్రతిష్టాత్మక సింగరేణి కాలరీస్ కంపెనీ సీఎండీగా ఆయన నియామకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ అంద జేసింది. ప్రస్తుతం కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న శ్రీధర్ ఈ పోస్టును చేపడుతున్న అతి పిన్న వయస్కుడు. ఈ పదవిలో కొనసాగిన సుదీర్థ భట్టాచార్య ఇటీవల కోల్ ఇండియా కార్పొరేషన్ చైర్మన్‌గా వెళ్లడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో శ్రీధర్ పేరును పరిశీలించిన రాష్ట్ర సర్కారు.. కేంద్రానికి ఈయన పేరును సిఫార్సు చేసింది. దీనికి కేంద్రం ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. దేశంలోనే బొగ్గు ఉత్పత్తిలో ప్రసిద్ధిగాంచిన సంస్థల్లో ఒకటైన సింగరేణి సీఎండీ పోస్టుకు ఐఏఎస్ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ ఏర్పాటు అనంతరం జిల్లా కలెక్టర్‌గా నియమితులైన శ్రీధర్ సమర్థ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. పరిశ్రమల స్థాపన, భూముల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ విధానపర నిర్ణయాల్లో కీలక భూమిక వహిస్తున్నారు. కాగా, అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారుల విభజన ప్రక్రియకు ప్రధాని ఆమోదం తెలిపిన తరుణంలో రాష్ట్రంలో పెద్దఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలుగనుంది. ఈ బదిలీల పర్వంలోనే జిల్లా కలెక్టర్ శ్రీధర్ కూడా సింగరేణి సీఎండీగా వెళ్లవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇదిలావుండగా, కలెక్టర్ మార్పిడి తప్పనిసరి అనే వార్తల నేపథ్యంలో కొత్త కలెక్టర్ ఎవరనేది చర్చనీయాంశమైంది.