జైపూర్ ప్లాంట్‌ను తెలంగాణ ప్రజలకు అంకితమిస్తాం
2016 మార్చికల్లా అందుబాటులోకి ప్లాంటు
- రెండో యూనిట్ బాయిలర్ లైటప్‌కు శ్రీకారం
- కార్మికుల లాభాల వాటాపై త్వరలో కేసీఆర్ ప్రకటన
- సింగరేణి సీఎండీ శ్రీధర్
జైపూర్ : 1200 మెగావాట్ల జైపూర్ థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని 2016 మార్చికల్లా తెలంగాణ ప్రజానీకానికి అంకితమిస్తామని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.శ్రీధర్ తెలిపారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణంలో కీలకమైన రెండో యూనిట్ లైటప్‌కు ఆయన గురువారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా యూనిట్-2 బాయిలర్ లైటప్‌ను కంప్యూటర్ ద్వారా ప్రారంభించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీటీజీ, బాయిలర్ టర్బైన్ జనరేషన్, బాయిలర్ ఎరాక్షన్, స్విచ్ యార్డు, బీవోపీ(బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్స్) చిమ్నీ, నీటి రిజర్వాయర్, కూలింగ్ టవర్స్, యాష్ యార్డు, కోల్-హ్యాడ్లింగ్ ప్లాంట్(సీహెచ్‌పీ), డీ-మినరలైజేషన్(డీఎం) ప్లాంట్, సర్క్యులేటింగ్ వాటర్(సీడబ్ల్యూ) సిస్టమ్, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, కంప్రెషర్ హౌజ్ పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎండీ శ్రీధర్ మాట్లాడారు.
సింగరేణి డెరైక్టర్లు, జీఎంలు, అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీల సహకారంతో 30 రోజుల వ్యవధిలో యూనిట్-1,యూనిట్-2 బాయిలర్ లైటప్ విజయవంతంగా పూర్తిచేశామన్నారు. 6 నెలల క్రితం సీఎం కేసీఆర్ పవర్ ప్లాంటును సందర్శించడంతో నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుందన్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న 17 కొత్త గనుల్లో ఈ ఏడాది 3 గనులను ప్రారంభిస్తామని చెప్పారు. కార్మికులకు అత్యవసర సేవలు అందించడానికి 12 కొత్త అంబులెన్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. వారం రోజుల్లో సీఎం కేసీఆర్ జైపూర్ ప్రాజెక్టులో కార్మికుల లాభాల వాటాను ప్రకటిస్తారని చెప్పారు. మూడో యూనిట్‌కు అన్ని అనుమతులు వచ్చాయన్నారు.
30 రోజులకోసారి నిర్మాణ పనులను పరిశీలిస్తున్నామని..బీటీజీతో పాటు పాటు బీవోపీ పనులు ఏకకాలంలో పూర్తరుుతేనే విద్యుత్ ఉత్పత్తి సాధ్యం అవుతుందని సీఎండీ శ్రీధర్ వివరించారు. బీటీజీ పనులు 95 శాతం పూర్తవగా ప్రధానంగా బీవోపీ పనులపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. నవంబర్‌లో మొదటి యూనిట్ సింక్రనైజేషన్ చేసి 2016 జనవరి నాటికి మొదటి యూనిట్, డిసెంబర్‌కల్లా రెండో యూనిట్ సింక్రనైజేషన్ చేసి వచ్చే మార్చిలోగా విద్యుత్‌ను అందిస్తామన్నారు. రాష్ట్రంలో కొత్త విద్యుత్తు ప్లాంటు నిర్మిస్తున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరముందన్నారు.
ఈ ఏడాది అదనంగా 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గడిచిన 4 నెలల్లో 35 శాతం బొగ్గు ఉత్పత్తిని పెంచుకోగలిగామన్నారు.అనంతరం నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సంస్థ డెరైక్టర్లు రమేశ్‌కుమార్(ఆపరేషన్స్), రమేశ్‌బాబు(ఈఅండ్‌ఎం), పవిత్రన్ కుమార్(ఫైనాన్స్), మనోహర్ రావు(పీపీ), పవర్ ప్లాంటు ఈడీ సంజయ్‌కుమార్ సూర్, ఐఎన్‌టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు, పాల్గొన్నారు.