పెద్దపల్లి: మండలంలోని లద్నాపూర్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సింగరేణి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శనివారం అర్ధరాత్రి గ్రామ దేవత పోచమ్మ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ ఆదివారం ఉదయం ఆర్జీ–3 పరిధి ఓసీపీ–2 గేట్ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామానికి సంబంధించిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ సమస్యలను పరిష్కరించకుండా యాజమాన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూ నిర్వాసితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తోందని, తమ మనోభావాలను దెబ్బతీయడానికే ఇలా చేస్తోందని మండిపడ్డారు. అమ్మవారి విగ్రహన్ని ఆర్జీ–3 జీఎం దంపతులు తిరిగి ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. గేట్ వద్ద ఆందోళన అనంతరం సైట్ ఆఫీస్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోగా వారితో వాగ్వాదానికి దిగారు.
గ్రామంలోని 284 మందికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వచ్చాకే పనులు చేపట్టాలని సింగరేణి అధికారులకు గతంలోనే చెప్పామన్నారు. అయినప్పటికీ గ్రామాన్ని బలవంతంగా ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతోనే పోచమ్మ తల్లి విగ్రహాన్ని తొలగించారని ఆరోపించారు. మ్యాన్ వే రూంకు తాళం వేసి, కార్మికులను, క్వారీలో బ్లాస్టింగ్ పనులను అడ్డుకున్నారు.
సింగరేణి యాజమాన్యం స్పందించి, యథాస్థానంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గోదావరిఖని వన్ టౌన్ సీఐ ప్రసాద్‌రావు, రామగిరి, ముత్తారం, మంథని ఎస్సై లు దివ్య, మధుసూదన్‌రావు, కిరణ్‌లు తమ సిబ్బందితో బందోబస్తు చేపట్టారు.
ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆగ్రహం..
లద్నాపూర్‌లో పోచమ్మ తల్లి విగ్రహం తొలగించడం పట్ల ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతా ధికారులను కోరారు. అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment