సాక్షి, పెద్దపల్లి: జిల్లావాసులు గతం మరిచి కోటి ఆశలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 2023 మిగిల్చిన చేదు అనుభవాలను పక్కన పెట్టి.. నూతన వసంతాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నాతాధికారులు ఈఏడాది అందరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు. అనేక ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నందున అవన్నీ నెరవేరాలని కోరుకున్నారు. తాము చేపట్టే పనులు, తీసుకున్న నిర్ణయాలు, లక్ష్యాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. వారి మాటల్లోనే..
ప్రజలకు పథకాల ప్రయోజనాలు
ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు చేరువ చేస్తాం. ప్రభుత్వ ప్రాధాన్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఆరు గ్యారెంటీల పథకాలకు అర్హులైన ప్రతీఒక్కరు దరఖాస్తు చేసుకోవాలి. ప్రధానంగా జిల్లాలో విద్య, వైద్యం మరింత మెరుగుపరిచేలా చొరవ తీసుకుంటాం. పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం, స్వచ్ఛత పనులు పకడ్బందీగా నిర్వహిస్తాం. – ముజిమ్మిల్‌ఖాన్, కలెక్టర్
ప్రగతిని పరుగులు పెట్టిస్తాం
అధికారుల సహాయ సహకారాలతో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించుకున్నాం. ఇలాగే త్వరలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహిస్తాం. గ్రామ పంచాయతీలు జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డులు సాధించాయి. వచ్చేఏడాదిలో సైతం అవార్డులు సాధించడంలో ముందుండేలా చర్యలు తీసుకుంటాం. స్థానిక సంస్థలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తాం. ప్రగతిని పరుగులు పెట్టిస్తాం. – అరుణశ్రీ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
అందరికీ అభివృద్ధి ఫలాలు
కొత్తప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా కృషిచేస్తాం. అభివృద్ధి పనులను వేగవంతంచేసి సకాలంలో పూర్తియ్యేలా చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా పెండింగ్‌లోని భూసమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటాం. ప్రాజెక్టులకు కావలసిన భూసేకరణ చేసి పనులు వేగవంతం చేస్తాం. – శ్యాంలాల్ ప్రసాద్, అదనపు కలెక్టర్
మహిళల భద్రతకు పెద్దపీట
మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నాం. మహిళలు, పిల్లలపై దాడుల అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. 2024 లో రోడ్డు ప్రమాదాలు, సై బర్ నేరాల నియంత్రణకు చర్యలు చేపడతాం. ప్రతీఇంట్లో, ప్రతీగ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. వాటితో నేరాల విచారణ ఎంతో సులభమవుతుంది. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగహన కల్పిస్తున్నాం. – డాక్టర్ చేతన, డీసీపీ, పెద్దపల్లి
Comments
Please login to add a commentAdd a comment