పెద్దపల్లి, గోదావరిఖని: రామయ్య(పేరు మార్చబడింది)అనే కార్మికుడికి కంటిచూపు మందగించింది. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంటే కళ్లు పరీక్షించి మెడికల్ ఇన్వాలిడేషన్ చేశారు. అతడి సొంత కుమారుడికి ఆ ఉద్యోగం ఇచ్చేందుకు సింగరేణి యాజమాన్యం ససేమిరా అంటోంది. ఊర్లో ఒకపేరు, గనిపై మరోపేరు ఉండటంతో ఇలా నాలుగేళ్లుగా సతాయిస్తోంది. ఆ యువకుడికి ఉద్యోగం లేక, పట్టుపైసా(గ్రాట్యుటీ) రాక ఆ కుటుంబం అప్పులపాలైంది. ఈచిక్కుముడి విప్పేందుకు అప్పటి సీఎం కేసీఆర్ కార్మికుల సభ సాక్షిగా మారుపేర్ల మార్పునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే సాంకేతిక సమస్యలు ఎదురు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇలాంటి రామయ్యలు సింగరేణిలో 600మందికిపైగా ఉన్నారు.
నిరక్షరాస్యులు కావడంతో..
- సుమారు 40ఏళ్ల క్రితం ఊళ్లో ఏ పేరు ఉందో, బొగ్గు గనిపై ఏ పేరు ఉందో కార్మికులకు ఎవరికీ తెలియదు.
- నిరక్షరాస్యులు కావడంతో తమ పేర్ల గురించి కార్మికులు ఏనాడూ రికార్డుల్లో పరిశీలన చేసుకోలేదు.
- ఇలా కాలం గడిచి పోయింది.
- ఇప్పుడు సింగరేణిలో కంప్యూటర్ యుగం వచ్చింది.
- ఆ నాటి పేరుతో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు.
- అనారోగ్య కారణాలతో మెడికల్ ఇన్వాలిడేషన్ అయినా తన తండ్రి పేరులో అక్షరదోషం ఉందనేసాకుతో తమ పిల్లలకు ఉద్యోగాలివ్వడం అంశాన్ని పక్కన బెట్టారు.
- ఇలా ఇప్పటివరకు కొత్తగూడెం కార్పొరేట్ విజిలెన్స్ విభాగం కార్యాలయంలో 600కు పైగా కేసులు పేరుకుపోయాయి.
- గత గుర్తింపు యూనియన్ ఈవిషయంపై అప్పటి సీఎం, ప్రస్తుత సీఎండీ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు.
భవిష్యత్‌పై హామీ ఇవ్వాలి..
మెడికల్ ఇన్వాలిడేషన్‌లో విజిలెన్స్ విచారణ పేరుతో నిలిచిపోయిన సింగరేణి సంస్థలోని సుమారు 600మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. మారుపేర్ల మార్పు అంశం తెరపైకి వచ్చినా ఆచరణ రూపం దాల్చకపోవడంతో ఈసారి ఎన్నికల్లో పోటీలో ఉన్న కార్మిక సంఘాలు, అధికార పార్టీ నేతలు.. కార్మికులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment