visilance officers
-
మారు పేర్లు మారేదెప్పుడు? చిక్కుముడి వీడేదెప్పుడు?
పెద్దపల్లి, గోదావరిఖని: రామయ్య(పేరు మార్చబడింది)అనే కార్మికుడికి కంటిచూపు మందగించింది. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంటే కళ్లు పరీక్షించి మెడికల్ ఇన్వాలిడేషన్ చేశారు. అతడి సొంత కుమారుడికి ఆ ఉద్యోగం ఇచ్చేందుకు సింగరేణి యాజమాన్యం ససేమిరా అంటోంది. ఊర్లో ఒకపేరు, గనిపై మరోపేరు ఉండటంతో ఇలా నాలుగేళ్లుగా సతాయిస్తోంది. ఆ యువకుడికి ఉద్యోగం లేక, పట్టుపైసా(గ్రాట్యుటీ) రాక ఆ కుటుంబం అప్పులపాలైంది. ఈచిక్కుముడి విప్పేందుకు అప్పటి సీఎం కేసీఆర్ కార్మికుల సభ సాక్షిగా మారుపేర్ల మార్పునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే సాంకేతిక సమస్యలు ఎదురు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఇలాంటి రామయ్యలు సింగరేణిలో 600మందికిపైగా ఉన్నారు. నిరక్షరాస్యులు కావడంతో.. సుమారు 40ఏళ్ల క్రితం ఊళ్లో ఏ పేరు ఉందో, బొగ్గు గనిపై ఏ పేరు ఉందో కార్మికులకు ఎవరికీ తెలియదు. నిరక్షరాస్యులు కావడంతో తమ పేర్ల గురించి కార్మికులు ఏనాడూ రికార్డుల్లో పరిశీలన చేసుకోలేదు. ఇలా కాలం గడిచి పోయింది. ఇప్పుడు సింగరేణిలో కంప్యూటర్ యుగం వచ్చింది. ఆ నాటి పేరుతో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సవాలక్ష కొర్రీలు పెడుతున్నారు. అనారోగ్య కారణాలతో మెడికల్ ఇన్వాలిడేషన్ అయినా తన తండ్రి పేరులో అక్షరదోషం ఉందనేసాకుతో తమ పిల్లలకు ఉద్యోగాలివ్వడం అంశాన్ని పక్కన బెట్టారు. ఇలా ఇప్పటివరకు కొత్తగూడెం కార్పొరేట్ విజిలెన్స్ విభాగం కార్యాలయంలో 600కు పైగా కేసులు పేరుకుపోయాయి. గత గుర్తింపు యూనియన్ ఈవిషయంపై అప్పటి సీఎం, ప్రస్తుత సీఎండీ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. భవిష్యత్‌పై హామీ ఇవ్వాలి.. మెడికల్ ఇన్వాలిడేషన్‌లో విజిలెన్స్ విచారణ పేరుతో నిలిచిపోయిన సింగరేణి సంస్థలోని సుమారు 600మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. మారుపేర్ల మార్పు అంశం తెరపైకి వచ్చినా ఆచరణ రూపం దాల్చకపోవడంతో ఈసారి ఎన్నికల్లో పోటీలో ఉన్న కార్మిక సంఘాలు, అధికార పార్టీ నేతలు.. కార్మికులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
'భారత ఆహార సంస్థ' కు నాసిరకం బియ్యం అప్పగింత..!
జగిత్యాల: జిల్లాలోని కొందరు రైస్‌మిల్లర్లు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)కు నాసిరకం బియ్యం అప్పగిస్తున్నారు. రాష్ట్రస్థాయి విజిలెన్స్ బృందాల తనిఖీల్లో ఈ నిజాలు బహిర్గతం కావడంతో జిల్లా అధికారులు అయోమయంలో పడ్డారు. నిజానికి ఐకేపీ, సహకార సంఘాల ద్వారా పౌరసరఫరాల అధికారులు ఏటా రెండు సీజన్లలో రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారు. దీనిని రైస్‌మిల్లర్లకు అప్పగించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)గా మార్చి ఎఫ్‌సీఐకి అందజేస్తున్నా రు. ఇక్కడే కొందరు మిల్లర్లు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మర ఆడించిన బియ్యాన్ని గోదాములకు తరలిస్తున్న సమయంలో పాత బియ్యాన్ని కూడా కొత్తవిగా చూపుతున్నారు. కేసులు నమోదైనా మారని తీరు.. ► జిల్లాలో 2022లో పౌర సరఫరాలు, విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు పలు రైస్‌మిల్లుల్లో చాలాసార్లు తనిఖీలు చేశారు. ► నిబంధనలు అతిక్రమించిన వారిపై 133 కేసులు నమోదు చేశారు. వారినుంచి 4,734 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ► గత జనవరి నుంచి ఇప్పటివరకు 26 కేసులు నమోదు చేసి 275 క్వింటాళ్ల బియ్యం, 4,500 క్వింటాళ్ల ధాన్యం స్వాధీనం చేసుకున్నారు. బయటపడుతున్న నిజాలు.. గతనెల 28న కొడిమ్యాల మండలం నాచుపల్లి శివారు ప్రభుత్వ గోదాముల్లో విజిలెన్స్ అధి కా రులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వచేసిన అనుమానాస్పద బియ్యాన్ని సీజ్‌చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు.. ► నాచుపల్లి ప్రభుత్వ గోదాము పర్యవేక్షణాధికారులను మిల్లర్లు మచ్చిక చేసుకుని పాతవాటినే కొత్త బియ్యంగా అప్పగించారని విజిలెన్స్ తనిఖీల్లో తేలింది. ► 2021–22కి భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) నిబంధనల ప్రకారం రైస్‌మిల్లర్లు పంపించిన రైస్బ్యాగ్పై బ్లూకలర్ దారం ఉండాలి. ► చాప ప్రింటింగ్, స్టిక్కర్, కన్సైన్మెంట్ నంబరు వేయాలి. ► అయితే, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో అవేమీ కనిపించలేదు. ► వాటిని పాత బియ్యంగానే పరిగణించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. రాజకీయ ఒత్తిళ్లతో వెనుకంజ వేస్తున్నారని తెలిసింది. ► 2022–23లో మిల్లర్లు తమ బ్యాగులకు రెడ్‌కలర్ దారం, రెడ్‌కలర్ చాప ప్రింటింగ్, రెడ్‌కలర్ స్టిక్కర్, కన్సైన్మెంట్ నంబరు బ్యాగ్‌పై వేయాలి. ► మొన్నటి తనిఖీల్లో ఇవేమీ కనిపించలేదు. దీంతో అక్కడ జరుగుతున్న అవినీతి బయటపడింది. ► నిబంధనల ప్రకారం.. బియ్యం రీసైక్లింగ్‌ను అరికట్టేందుకు ఒక ఏడాది ఒక కలర్ దారం, చాప, స్టిక్కర్, మరో ఏడాది మరో కలర్ దారం, చాప ప్రింటింగ్, స్టిక్కర్ ఉండాలి. ► చాలామంది మిల్లర్లు గోదాముల్లోని అధికారులను మచ్చిక చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా బియ్యం అప్పగిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు.. నాచుపల్లి గోదాముల్లో అనుమానాస్పద బియ్యం సరఫరా చేసిన మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. తమపై చర్యలు తీసుకోకుండా మిల్లర్లు అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారని తెలిసింది. కేసులు నమోదు చేస్తున్నాం నిబంధనలు పాటించని రైస్మిల్లర్లపై చర్యలు తీసుకుంటున్నాం. కొడిమ్యాల మండలం నాచుపల్లి గోదాముల్లో తనిఖీలు చేయగా అనుమానిత బియ్యం లభించాయి. వాటిని పరీక్షల నిమిత్తం ల్యామ్‌కు తరలించాం. నివేదికలు రాగానే చర్యలు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి -
‘త్రిశూల’ వ్యూహంతో టీటీడీలో దళారులకు చెక్
సాక్షి, తిరుమల : కలియుగ వైకుంఠం తిరుమలలో దళారులకు బ్రహ్మాస్త్రంగా మారిన సిఫార్సు లేఖలను నియంత్రించేందుకు టీటీడీ నడుంబిగించింది. త్రిశూల వ్యూహంతో దళారులుకు చెక్ పెట్టే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. ఏడుకొండలపై ఏళ్లుగా పాతుకుపోయిన దళారీ వ్యవస్థకు మూడు మార్గాల్లో అడ్డుకట్ట వేయాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. తొలి మార్గం ఇలా.. సిఫార్సు లేఖలపై టికెట్లు పొంది, భక్తులకు అధిక మొత్తంలో విక్రయిస్తున్న వారిని గుర్తించి, అదుపులోకి తీసుకోవడం. గతంలో మాదిరి కాకుండా వారిపై బలమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించడం. రెండో మార్గం ఇలా.. దళారులు సిఫార్సు లేఖలు ఎలా పొందుతున్నారో గుర్తించడం. సిఫార్సు లేఖలు అక్రమంగా పొందేవారిని అరికట్టడం. మూడో మార్గం ఇలా.. భక్తులు దళారులను ఆశ్రయించకుండా, సిఫార్సు లేఖలు లేకుండానే బ్రేక్ దర్శనాలు అందుబాటులోకి తీసుకువచ్చే విధానం అవలంబించనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను టీటీడీ ఇప్పటికే ప్రారంభించింది. విజిలెన్స్ అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ దళారులను అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు పీఆర్వోల ముసుగులో దళారీతనం చేస్తున్న వారిపై నిఘా ఉంచారు. ఇక నిత్యం సిఫార్సు లేఖలపై టికెట్లు జారీ చేసే జేఈఓ కార్యాలయంలో అక్రమార్కులు వివరాలను గుర్తించి, విజిలెన్స్ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తూ దళారులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇటీవల పట్టుకున్న దళారీ 65 రోజుల్లో 185 సిఫార్సు లేఖలపై టికెట్లు పొంది, విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. 46 మంది ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫార్సు లేఖలను ఒక దళారీనే పొందాడు. అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రజా ప్రతినిధుల పీఏలు వద్ద దళారీలు సిఫార్సు లేఖలను కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. సిఫార్సు లేఖలు జారీ చేసే ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేయాలని భావిస్తున్నారు. దళారులను పట్టుకున్న సమయంలో అతను సిఫార్సు లేఖలు పొందిన ప్రజా ప్రతినిధులకు సమాచారం అందిస్తే వారు అప్రమత్తంగా వ్యవహరిస్తారని టీటీడీ భావిస్తోంది. సామాన్యుల బ్రేక్ దర్శనానికి ‘శ్రీవాణి’ భక్తులు, దళారులను ఆశ్రయించకుండా ఉండేందు కు శ్రీవాణి పథకంపై భక్తులకు అవగాహన కల్పించాలని టీటీడీ భావిస్తోంది. శ్రీవాణి పథకానికి రూ.10 వేలు విరాళంగా అందజేసిన భక్తులు వీఐపీ బ్రేక్ దర్శనభాగ్యాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఎలాంటి సిఫార్సు లేఖ లేకుండానే వీఐపీ ప్రొటోకాల్ దర్శనం లభిస్తుండడంతో భక్తులు కూడా దళారీలను ఆశ్రయించకుండా నేరుగా టీటీడీ పథకానికే డబ్బు చెల్లించవచ్చు. దీంతో స్వామివారికి కానుక సమర్పించామన్న తృప్తి మిగులుతుండడంతో భక్తు లు ఈ పథకంపై మొగ్గు చూపుతున్నారు. ఇందుకు ఈ పథకానికి వస్త్ను్న విరాళాలే నిదర్శనంగా చెప్పవచ్చు. 10 రోజుల్లో 533 మంది భక్తులు శ్రీవాణి పథకానికి విరాళాలు అందించగా, గత శుక్రవారం ఏకంగా 153 మంది భక్తులు శ్రీవాణి ట్రస్టుకు విరాళం అందజేశారు. దీంతో దళారులను భక్తులు ఆశ్రయించకూండా ప్రత్యామ్నాయ మార్గంగా శ్రీవాణి ట్రస్టును వినియోగించుకోవాలని టీటీడీ భావిస్తోంది. ఇలా దళారీ వ్యవస్థను అరికట్టేందుకు అన్ని వైపుల టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇంటి దొంగల గుట్టు రట్టు ఇక ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేరన్న సామెత నిజం కాదన్న విషయాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు రుజువు చేస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో విధుల్లో ఉన్న మధుసూదన్ అనే వ్యక్తి భక్తులకు సులభ దర్శనం చేయిస్తానని పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్న ఘటన వెలుగు చూడగా... అతన్ని విచారించగా కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటకొచ్చాయి. రోజుకి 25 మంది భక్తుల వరకు టీటీడీ ఉద్యోగి మధుసూదన్ దర్శనా లు చేయిస్తున్నాడు. ఇక ఫోన్ పే ద్వారా 300 ట్రాన్సెక్షన్లు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇంత స్థాయిలో అక్రమాలకు పాల్పడిన దళారీ ఉద్యోగిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. దళారీ వ్యవస్థను మట్టి కరిపిస్తాం తిరుమలలో దళారీ వ్యవస్థను పూర్తిస్థాయి లో అణచివేస్తాం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శ్రీవారి దర్శనా న్ని సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చి, లంచగొండితనం అరికట్టే వి«ధంగా చర్యలు తీసుకుంటున్నాం. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్కుమార్సింఘాల్ పూర్తిస్థాయి సహాయ సహాకారాలతో ఇప్పటికే పూర్తిస్థాయిలో దళారీ వ్యవస్థను నాశనం చేశాం. శ్రీవాణి ట్రస్టుతో దళారీ అనే పదం ఉండకుండా చేశాం. – టీటీడీ అడిషనల్ ఈఓ ఏవీ ధర్మారెడ్డి -
మాజీ సీఎం నియోజకవర్గం కుప్పం అక్రమాలపై విజిలెన్స్!
సాక్షి, బి.కొత్తకోట: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తీసుకెళ్లే కుప్పం ఉపకాలువ పనుల అంచనాకు అదనపు చెల్లింపుల వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లెక్కతేల్చే పనిలో పడింది. రూ.430.26 కోట్ల పనులకు నిబంధనలకు విరుద్ధంగా రూ.144.7 కోట్లు అదనంగా చెల్లించడంపై ఆగస్టు 13న ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ పరిశీలనలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పనులను విజిలెన్స్ విచారణ చేపట్టింది. ప్రధానంగా కుప్పం కాలువ పనులను క్షేత్రస్థాయిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజేంద్రనాథరెడ్డి స్వయంగా పరిశీలించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన సోమవారం కుప్పం ఉపకాలువ పనులను స్వయంగా పరిశీలించనున్నారు. ఈ పరిశీలన వ్యవహరం అధికారుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఇష్టారాజ్యంగా దోచుకున్నారు కుప్పం కాలువలో అవినీతి వరద పారింది. పను ల అంచనా నుంచి అదనపు చెల్లింపు వ్యవహారం అంతా గత ప్రభుత్వ కనుసన్నల్లోనే సాగింది. ఈపీసీ ద్వారా 4 శాతం ఎక్సెస్‌తో రూ.430.26 కోట్లకు పనులు దక్కించుకున్న జాయింట్ వెంచర్ సంస్థలు ఒప్పందం మేరకు 123.641 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 324 స్ట్రక్చర్స్, 5 చోట్ల ఎన్‌హెచ్ క్రాసింగ్ పనులు, 3 చోట్ల ఎత్తిపోతల పథకాల నిర్మాణం, 110 చెరువులకు నీరు అందించే పనులు పూర్తి చేయాలి. ఈ మేరకు పనులు చేపట్టకపోగా, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్టŠస్ సంస్థకు భాగస్వామ్యం కల్పించడమేకాక ఒప్పందం మేరకు 9 నెలల్లో పూర్తి చేయాల్సిన పనులను ఇప్పటికీ పూర్తి చేయలేదు. దీనికితోడు ఈసీపీ ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలకు అదనపు చెల్లింపులు సాధ్యం కాదని... వెసులుబాటు కోసం 626, 68 జీవోలు జారీ చేసిన గత ప్రభుత్వం రెండు విడతల్లో అదనంగా రూ.144.7 కోట్లు చెల్లించింది. పనులు చేపట్టడంలోనూ కాంట్రాక్టు సంస్థలు ఇష్టారీతిన వ్యవహరించాయి. వారికి అనుకూలంగా పనులు చేసుకున్న అధికారులు ప్రభుత్వ నిర్ణయం మేరకు చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. ఈ పనులపై గత ఆగస్టు 13వ తేదీ నిపుణుల కమిటీ పరిశీలనలు నిర్వహించగా.. కమిటీ ప్రభుత్వానికి ఇంకా నివేదిక సమర్పించలేదని సమాచారం. ఈ పరిస్థితుల్లో విజిలెన్స్ ఉన్నత స్థాయి అధికారుల విచారణ చేపట్టి అక్రమాల నిగ్గు తేల్చనున్నారని తెలుస్తోంది. రెండు రోజులుగా రికార్డుల పరిశీలన కుప్పం ఉపకాలువ పనులకు సంబంధించిన రికార్డులను రెండు రోజులుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటుకు చెందిన డెప్యూటీ ఇంజినీర్, ముగ్గురు జేఈలు పరిశీలిస్తున్నారు. మదనపల్లెలోని ఎస్ఈ కార్యాలయంలో శని, ఆదివారాలు వీరు ముమ్మరంగా రికార్డులు పరిశీలిస్తున్నారు. ఏఏ పనులు రికార్డు చేశారు, నిబంధనల మేరకు పనులు జరిగాయా లేదా అనే వివరాలను ముందుగానే పరిశీలించారు. సోమవారం డైరెక్టర్ జనరల్ కాలువను పరిశీలించనుండటంతో ఆ శాఖ అధికారులు ముందస్తుగా నివేదికలు సిద్ధం చేసుకున్నారు. నేడు డీజీ, సీఈ రాక కుప్పం ఉపకాలువ పనులకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాజేంద్రనాథరెడ్డి, చీఫ్ ఇంజినీర్ గోపాల్‌రెడ్డి పరిశీలనలు నిర్వహించనున్నారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలో జరిగిన పనుల్లో ఏఏ పనులు పరిశీలిస్తారో ముందుగా సమాచారం లేనందున ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ఎత్తిపోతలు, కాలువ, కాంక్రీటు నిర్మాణాలను పరిశీలించే అవకాశం ఉంది. పనులు డీపీఆర్ మేరకు చేశారా లేదా, అంచనాలు ఎలా పెంచుకున్నారు, తదితర వాటిపై పరిశీలనలు చేసే వీలుంది. -
కొండంత అండ! ‘ఘను’డవే!
అధికారం అండగా టీడీపీ నేతలు అడ్డంగా దోచుకున్నారు. కొండలు.. గుట్టలు.. దేన్నీ వదల్లేదు. ఈ నేపథ్యంలోనే అక్రమ మైనింగ్ చేస్తున్న ఓ టీడీపీ నేతకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సుమారు రూ.2కోట్ల పెనాల్టీ విధించారు. ఈ వ్యక్తి పైసా చెల్లించకపోవడం చూస్తే ఏ స్థాయిలో చక్రం తిప్పాడో అర్థమవుతోంది. ఇకపోతే.. గత నెల 23న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 5 రోజుల ముందు(మే 18న) మూడు హెక్టార్లలో కొండను తవ్వుకునేందుకు గనుల శాఖ అధికారులు మళ్లీ అనుమతివ్వడం గమనార్హం. ఈ వ్యవహారంలో రూ.50లక్షల దాకా చేతులు మారినట్లు సమాచారం. సాక్షి, కదిరి: కదిరి పట్టణానికి చెందిన టీడీపీ నేత ఎం.శ్రీకాంత్‌రెడ్డి ఎస్వీ కన్ట్ర్సక్షన్స్ పేరుతో కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. తాను చేపట్టే పనులకు రోడ్డు మెటల్ కోసం గత ప్రభుత్వం ఈయనకు కదిరి మండలం సైదాపురం గ్రామ పరిధిలోని సర్వే నెం.1505లో ఒక హెక్టారు(2.50 ఎకరాలు)లో అనుమతులు పొందాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లు ఎక్కడ రోడ్డు పనులు జరిగినా ఆ పనులను ప్రభుత్వం ఈయనకే కట్టబెట్టింది. తనకు అనుమతులిచ్చిన ప్రాంతంలో మెటల్ కోసం కొండను పూర్తిగా తవ్వేశాడు. ఆ తర్వాత దక్కించుకున్న రోడ్డు పనులకు పెద్ద మొత్తంలో మెటల్ అవసరం రావడంతో ఆయన కన్ను ఆ పక్కనే ఉన్న కొండపై పడింది. హద్దులు చెరిపేసి సుమారు మరో రెండెకరాల వరకు కొండను ఆక్రమించి పూర్తిగా తవ్వేశాడు. విజిలెన్స్ దాడులతో వెలుగులోకి.. టీడీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి అక్రమ మైనింగ్ విషయం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దృష్టికి రావడంతో 2016లో తనిఖీలు చేసి అక్రమ మైనింగ్ నిజమేనని ధ్రువీకరించారు. ఆ మేరకు అప్పట్లో షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతో మళ్లీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమ మైనింగ్‌ను మరోసారి పరిశీలించి 1966 ఏపీఎంఎంసీ రూల్ 26(2) ప్రకారం ఆయనకు 2017 ఏప్రిల్ 25వ తేదీన రూ.1,76,96,800 పెనాల్టీ విధించారు. కానీ సదరు టీడీపీ నేత అధికారాన్ని అడ్డుపెట్టుకొని విజిలెన్స్ అధికారులు విధించిన పెనాల్టీ సొమ్ములో ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే పెనాల్టీ విధించిన తర్వాత ఇప్పటికీ.. అంటే పది నెలలుగా మైనింగ్ సాగుతూనే ఉంది. ఈ లెక్కన విజిలెన్స్ అధికారులు తిరిగి సర్వే చేస్తే దోపిడీ రూ.10కోట్లకు పైగానే తేలుతుందని అంచనా. కొండను తవ్వేసిన దృశ్యం మరో క్వారీకి అక్రమ అనుమతి ప్రభుత్వానికి రూ.1.76 కోట్లు ఎగ్గొట్టిన టీడీపీ నేత శ్రీకాంత్‌రెడ్డికి ఈ మధ్యే జిల్లా గనులశాఖ అధికారులు కదిరి మండలం సైదాపురం గ్రామ పరిధిలోని సర్వే నెం.294లో 2.910 హెక్టార్లలో కొండను తవ్వుకోవడానికి అక్రమంగా అనుమతులిచ్చారు. అది కూడా గత నెల 23న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 5 రోజుల ముందు.. అంటే మే 18న గనులశాఖ అనుమతినివ్వడం గమనార్హం. వాస్తవంగా ఆ సర్వే నెంబర్లో రోడ్ మెటల్‌కు అనుమతులివ్వకూడదు. ఎందుకంటే కేవలం మినరల్ శాండ్ కోసం గత చంద్రబాబు ప్రభుత్వమే రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ నిబంధనలకు తిలోదకాలివ్వడమే కాకుండా కోట్ల రూపాయల పెనాల్టీని ఎగ్గొట్టిన అదే వ్యక్తికి గనులశాఖ అధికారులు అనుమతులివ్వడం అనుమానాలకు తావిస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే.. ఇలాంటి వాటికి మైన్స్ అండ్ జియాలజీ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ అనుమతివ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆయనకు బదులు గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అనుమతి ఇవ్వడం కొసమెరుపు. అనుమతులు రద్దు చేస్తాం టీడీపీ నేత శ్రీకాంత్‌రెడ్డికి కదిరి మండలం సైదాపురం పరిధిలో ఇచ్చిన గనుల లీజును తక్షణం రద్దు చేస్తాం. నేను కూడా రెండు నెలల క్రితమే కొత్త బాధ్యతలు తీసుకున్నా. శ్రీకాంత్‌రెడ్డి గతంలో అక్రమ మైనింగ్ విషయంలో ప్రభుత్వానికి రూ.1.76 కోట్లు చెల్లించాలనే విషయం నా దృష్టికి రాలేదు. ఆయన కూడా చెప్పలేదు. విషయాన్ని పరిశీలించి కచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వరరెడ్డి, గనుల శాఖ ఏడీ, అనంతపురం -
జిల్లాలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
అనంతపురం సెంట్రల్: జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ధర్మవరం పట్టణంలోని మార్కెట్‌యార్డు గోడౌన్ , మైనర్ ఇరిగేషన్ చెరువు, పలు ప్రభుత్వ భవనాలను, బ్రహ్మసముద్రం మండలంలో నిర్మాణంలో ఉన్న పలు కార్యాలయాలను తనిఖీ చేసినట్లు విజిలెన్స్ ఎస్పీ అనిల్‌బాబు తెలిపారు. తనిఖీల్లో కాంక్రీట్ కోర్ సామర్థ్యం నమూనాలు సేకరించామన్నారు. పరిశోధనశాల నుంచి వచ్చిన నివేదికల మేరకు లోటుపాట్ల గురించి ప్రభుత్వానికి నివేదికలు పంపుతామన్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు రవీంద్రకుమార్, విజయకుమార్, బాలరంగారెడ్డి, ఆదిశేషయ్య తదితరులు పాల్గొన్నారు.