సైదాపురం గ్రామ పరిధిలో హద్దులను చెరిపేసి మైనింగ్ నిర్వహిస్తున్న దృశ్యం
అధికారం అండగా టీడీపీ నేతలు అడ్డంగా దోచుకున్నారు. కొండలు.. గుట్టలు.. దేన్నీ వదల్లేదు. ఈ నేపథ్యంలోనే అక్రమ మైనింగ్ చేస్తున్న ఓ టీడీపీ నేతకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సుమారు రూ.2కోట్ల పెనాల్టీ విధించారు. ఈ వ్యక్తి పైసా చెల్లించకపోవడం చూస్తే ఏ స్థాయిలో చక్రం తిప్పాడో అర్థమవుతోంది. ఇకపోతే.. గత నెల 23న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 5 రోజుల ముందు(మే 18న) మూడు హెక్టార్లలో కొండను తవ్వుకునేందుకు గనుల శాఖ అధికారులు మళ్లీ అనుమతివ్వడం గమనార్హం. ఈ వ్యవహారంలో రూ.50లక్షల దాకా చేతులు మారినట్లు సమాచారం.
సాక్షి, కదిరి: కదిరి పట్టణానికి చెందిన టీడీపీ నేత ఎం.శ్రీకాంత్‌రెడ్డి ఎస్‌వీ కన్ట్ర్‌సక్షన్స్ పేరుతో కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. తాను చేపట్టే పనులకు రోడ్డు మెటల్ కోసం గత ప్రభుత్వం ఈయనకు కదిరి మండలం సైదాపురం గ్రామ పరిధిలోని సర్వే నెం.1505లో ఒక హెక్టారు(2.50 ఎకరాలు)లో అనుమతులు పొందాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లు ఎక్కడ రోడ్డు పనులు జరిగినా ఆ పనులను ప్రభుత్వం ఈయనకే కట్టబెట్టింది. తనకు అనుమతులిచ్చిన ప్రాంతంలో మెటల్ కోసం కొండను పూర్తిగా తవ్వేశాడు. ఆ తర్వాత దక్కించుకున్న రోడ్డు పనులకు పెద్ద మొత్తంలో మెటల్ అవసరం రావడంతో ఆయన కన్ను ఆ పక్కనే ఉన్న కొండపై పడింది. హద్దులు చెరిపేసి సుమారు మరో రెండెకరాల వరకు కొండను ఆక్రమించి పూర్తిగా తవ్వేశాడు.
విజిలెన్స్ దాడులతో వెలుగులోకి..
టీడీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి అక్రమ మైనింగ్ విషయం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దృష్టికి రావడంతో 2016లో తనిఖీలు చేసి అక్రమ మైనింగ్ నిజమేనని ధ్రువీకరించారు. ఆ మేరకు అప్పట్లో షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతో మళ్లీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అక్రమ మైనింగ్‌ను మరోసారి పరిశీలించి 1966 ఏపీఎంఎంసీ రూల్ 26(2) ప్రకారం ఆయనకు 2017 ఏప్రిల్ 25వ తేదీన రూ.1,76,96,800 పెనాల్టీ విధించారు. కానీ సదరు టీడీపీ నేత అధికారాన్ని అడ్డుపెట్టుకొని విజిలెన్స్ అధికారులు విధించిన పెనాల్టీ సొమ్ములో ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే పెనాల్టీ విధించిన తర్వాత ఇప్పటికీ.. అంటే పది నెలలుగా మైనింగ్ సాగుతూనే ఉంది. ఈ లెక్కన విజిలెన్స్ అధికారులు తిరిగి సర్వే చేస్తే దోపిడీ రూ.10కోట్లకు పైగానే తేలుతుందని అంచనా.
కొండను తవ్వేసిన దృశ్యం
మరో క్వారీకి అక్రమ అనుమతి
ప్రభుత్వానికి రూ.1.76 కోట్లు ఎగ్గొట్టిన టీడీపీ నేత శ్రీకాంత్‌రెడ్డికి ఈ మధ్యే జిల్లా గనులశాఖ అధికారులు కదిరి మండలం సైదాపురం గ్రామ పరిధిలోని సర్వే నెం.294లో 2.910 హెక్టార్లలో కొండను తవ్వుకోవడానికి అక్రమంగా అనుమతులిచ్చారు. అది కూడా గత నెల 23న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 5 రోజుల ముందు.. అంటే మే 18న గనులశాఖ అనుమతినివ్వడం గమనార్హం. వాస్తవంగా ఆ సర్వే నెంబర్‌లో రోడ్ మెటల్‌కు అనుమతులివ్వకూడదు. ఎందుకంటే కేవలం మినరల్ శాండ్ కోసం గత చంద్రబాబు ప్రభుత్వమే రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఆ నిబంధనలకు తిలోదకాలివ్వడమే కాకుండా కోట్ల రూపాయల పెనాల్టీని ఎగ్గొట్టిన అదే వ్యక్తికి గనులశాఖ అధికారులు అనుమతులివ్వడం అనుమానాలకు తావిస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే.. ఇలాంటి వాటికి మైన్స్ అండ్ జియాలజీ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ అనుమతివ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఆయనకు బదులు గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అనుమతి ఇవ్వడం కొసమెరుపు.
అనుమతులు రద్దు చేస్తాం
టీడీపీ నేత శ్రీకాంత్‌రెడ్డికి కదిరి మండలం సైదాపురం పరిధిలో ఇచ్చిన గనుల లీజును తక్షణం రద్దు చేస్తాం. నేను కూడా రెండు నెలల క్రితమే కొత్త బాధ్యతలు తీసుకున్నా. శ్రీకాంత్‌రెడ్డి గతంలో అక్రమ మైనింగ్ విషయంలో ప్రభుత్వానికి రూ.1.76 కోట్లు చెల్లించాలనే విషయం నా దృష్టికి రాలేదు. ఆయన కూడా చెప్పలేదు. విషయాన్ని పరిశీలించి కచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటాం.
– వెంకటేశ్వరరెడ్డి, గనుల శాఖ ఏడీ, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment