Andru Minerals Illegally Mined Laterite in East Godavari - Sakshi
Sakshi News home page

అండ్రు అరాచకాలు: కొండను తవ్వేసి.. అడవిని మింగేసి..

Published Mon, Sep 6 2021 7:36 AM | Last Updated on Mon, Sep 6 2021 9:56 AM

Andru Minerals Illegal Mining In East Godavari - Sakshi

వంతాడ కొండపై అండ్రు మినరల్స్‌ జరిపిన ఖనిజ తవ్వకాల్లో ఒక చిన్న భాగం

వంతాడ నుంచి సాక్షి ప్రతినిధి బొల్లికొండ ఫణికుమార్‌: అది రక్షిత అటవీ ప్రాంతం. సముద్ర మట్టానికి 400 అడుగుల ఎత్తులో ఉన్న కొండ. దాని పైనే ఉంది చిన్న గిరిజన గ్రామం వంతాడ. ఒకప్పుడు ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడేది. ఇప్పుడు ఆ కొండపై ప్రతి చోటా లోయలను తలపించేలా పెద్ద పెద్ద గోతులు దర్శనమిస్తున్నాయి. వందల మీటర్ల లోతుకు తవ్వి వదిలేసిన ఎర్రమట్టి లోయలు మిలమిలా మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఆ మెరిసే మట్టే అత్యంత విలువైన బాక్సైట్‌ ఖనిజం. అక్కడే లేటరైట్‌ కూడా ఉంది. వాటిపై మైనింగ్‌ మాఫియా కన్ను పడింది.

అంతే అడవి స్వరూపమే మారిపోయింది. ఐదేళ్లలో ఆ ప్రాంతంలో కనీవినీ ఎరుగని స్థాయిలో ఖనిజాన్ని తవ్వేశారు. లేటరైట్‌తోపాటు దాని పేరు చెప్పి వేల కోట్ల విలువైన బాక్సైట్‌ను అమ్మేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా లింగంపర్తి రిజర్వు ఫారెస్టులోని గిరిజనాపురం, లింగంపర్తి రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ తవ్వకాలు జరిగాయి. ప్రత్తిపాడు మండలం ఇ.గోకవరం పంచాయతీలోని వంతాడ గ్రామంలో ఈ భూములు కలిసిపోయి ఉంటాయి. మైనింగ్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో జరిగిన ఈ దోపిడీపై సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌.. 

టీడీపీ హయాం.. అండ్రు మినరల్స్‌కు స్వర్ణయుగం 
2013లో కేంద్రం నుంచి అండ్రు మినరల్స్‌ సంస్థ వంతాడ పరిసరాల్లోని 200 ఎకరాల డిఫారెస్టేషన్‌కి అనుమతి సంపాదించింది. అదే సంవత్సరం డిసెంబర్‌ 4న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విస్తీర్ణాన్ని 8 భాగాలుగా విడగొట్టి 8 లేటరైట్‌ లీజులు మంజూరు చేసింది. అప్పుడు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌ పార్టీ. ఆ పార్టీతో టీడీపీ అధినేతకు తెరచాటు సంబంధాలు ఉండడంతో ఈ డిఫారెస్టేషన్‌ ప్రక్రియ సాధ్యమైంది. లీజుల మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆ తర్వాత వెంటనే వాటిని ఇచ్చేశారు. అనంతరం కొద్ది కాలానికే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఈ అడవిని ఊహించని స్థాయిలో కొల్లగొట్టేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు అండ్రు మినరల్స్‌కు స్వర్ణయుగంలా నడిచింది. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌తో సన్నిహితంగా ఉండడంతో ఆ కంపెనీ వైపు ఎవరూ కన్నెత్తి చూడలేకపోయారు. పరిధి దాటి అడవిని కబళించినా, గిరిజనుల కడుపు కొట్టినా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు.

ఒకే కుటుంబంలో 8 మందికి ఎడాపెడా లీజులు
ఒక కుటుంబంలో పది మంది ఉంటే ప్రభుత్వం ద్వారా ఎంత మందికి లబ్ధి ఉంటుంది. ఉంటే ఒకరో, ఇద్దరో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. ఒకరిద్దరు ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారు. కానీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా? అందరికీ పథకాలు వర్తిస్తాయా? అర్హత ఉన్నా అందరికీ లబ్ధి సాధ్యం కాదు. ప్రభుత్వ నిబంధనలు అందుకు ఒప్పుకోవు. పేదల కోసం అమలు చేసే పథకాలు, ఉపాధి కల్పించే ఉద్యోగాలకే బోలెడు నిబంధనలుంటాయి. అలాంటిది ఒకే కుటుంబంలో 8 మందికి మైనింగ్‌ లీజులు ఇస్తే.. అదీ అత్యంత విలువైన లేటరైట్‌ లీజులు.. బరితెగించి ఇలా లీజులు ఇప్పించింది చంద్రబాబే.

అండ్రు మినరల్స్‌ యజమాని అండ్రు రమేష్‌బాబు. ఆయన పేరుతో ఒక లీజు మంజూరు చేశారు. ఆయన భార్య అండ్రు సుజాత పేరుతో మరో లీజు. రమేష్‌బాబు దగ్గరి సోదరుడు (పెదనాన్న కుమారుడు) శ్రీనివాస్‌ పేరుతో మరో లీజు. శ్రీనివాస్‌ తల్లి సత్యవతి, భార్య ఉషారాణి పేరుతో రెండు లీజులు. వీరి దగ్గరి బంధువులైన మన్యం వెంకటేశ్వరరావు, మన్యం వెంకట రజని, వెంపాటి వీర్రాజులకు మరో మూడు లీజులు. ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి ఎడాపెడా లేటరైట్‌ లీజులు ఇచ్చేశారు. ఒకే కుటుంబంలో అంతమందికి ఎలా లీజులు ఇచ్చారనే దానికి సమాధానం లేదు. గనుల శాఖలో వేల లీజు దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటే కేవలం ఒక కుటుంబానికి అన్ని లీజులు మంజూరు చేయడంలోనే కుమ్మక్కు స్పష్టమవుతోంది.

ఐదు రెట్లు ఎక్కువ ఖనిజం అక్రమంగా తరలించారు!
అధికారికంగా 83 లక్షల మెట్రిక్‌ టన్నుల ఖనిజాన్ని తవ్వినట్లు రికార్డుల్లో చూపింది అండ్రు మినరల్స్‌. దానికి రూ.88.30 కోట్ల సీనరేజి ఫీజు కట్టింది. నిజానికి దాని కంటే నాలుగైదు రెట్ల ఎక్కువ ఖనిజాన్ని అనధికారికంగా తవ్వి తరలించినట్లు భావిస్తున్నారు. సుమారు నాలుగు కోట్ల మెట్రిక్‌ టన్నులకుపైగా ఖనిజాన్ని అక్రమంగా తరలించినట్లు తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని చూసిన మైనింగ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్‌లో ఎ గ్రేడ్‌ (మెటలర్జికల్‌) లేటరైట్‌ మెట్రిక్‌ టన్ను రూ.200, బి గ్రేడ్‌ (నాన్‌–మెటలర్జికల్‌) లేటరైట్‌ టన్ను రూ.100కిపైగానే ఉంది. ఎ గ్రేడ్‌ లేటరైట్‌ను 30 శాతం, బి గ్రేడ్‌ లేటరైట్‌ను 70 శాతం తరలించారు. దీని విలువ వందల కోట్లకుపైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

దోచేసింది   వేల కోట్లు !
పైకి లేటరైట్‌ అని చూపిస్తున్నా అదంతా బాక్సైట్‌ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లోతుగా విచారణ చేపట్టింది. అండ్రు మినరల్స్‌ చేసిన ఎగుమతుల్ని బట్టి ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. వేదాంత లిమిటెడ్‌ (ఒడిశా)కు ఐదేళ్లలో 32 లక్షల టన్నుల ఖనిజాన్ని సరఫరా చేసినట్లు ఈ కంపెనీ రికార్డుల్లో చూపింది. వాస్తవానికి ఆ కంపెనీ స్టీల్, అల్యూమినియంను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకు బాక్సైట్‌ వినియోగిస్తారు. ఈ నేపథ్యంలోనే అండ్రు కంపెనీ లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌ను తవ్వేసి అమ్మేసుకున్నట్లు స్పష్టమవుతోంది.

అలాగే చైనాకు ఎగుమతి చేసిన 4.5 లక్షల టన్నుల ఖనిజం కూడా బాక్సైట్‌ అని భావిస్తున్నారు. బాక్సైట్‌ టన్ను రేటు మార్కెట్‌లో రూ.500 నుంచి వెయ్యి వరకు ఉంటుంది. ఈ లెక్కన అండ్రు మినరల్స్‌ లేటరైట్‌ ముసుగులో బాౖMð్సట్‌ను అమ్మి రూ. వేల కోట్లను అక్రమంగా సంపాదించిందనే అనుమానాలు బలపడుతున్నాయి. గనుల్లో తవ్విన ఖనిజాన్ని ప్రాసెస్‌ చేసేందుకు తూర్పుగోదావరి జిల్లా రావికంపాడు/బెండపూడి, అర్లధర/ప్రత్తిపాడులో రెండు స్టాక్‌ యార్డ్‌లు నిర్వహించారు. అందులో రోజుకు 8 వేల మెట్రిక్‌ టన్నుల ఖనిజాన్ని ప్రాసెస్‌ చేసే క్రషింగ్‌ యూనిట్లు పెట్టారు. అక్కడే లేటరైట్‌ను ప్రాసెస్‌ చేసి బాక్సైట్‌గా మార్చి అమ్ముకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 

అడ్డగోలుగా తవ్వేశారు.. అవి కనపడకుండా పూడ్చి మొక్కలు నాటారు..
కేటాయించిన లీజు ప్రాంతం 200 ఎకరాలే అయినా దాన్ని దాటి తవ్వకాలు జరిపినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కో బ్లాకులో (మొత్తం 8 బ్లాకులు) 25 ఎకరాలే వాళ్ల పరిధి. ఆ మార్కింగ్‌ లోపే తవ్వకాలు జరపాలి. కానీ దాన్ని దాటి అదనంగా ప్రతి బ్లాకులో 5 నుంచి 10 ఎకరాల్లో తవ్వకాలు జరిపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బ్లాకులతో సంబంధం లేకుండా కొన్నిచోట్ల విడిగా కూడా తవ్వేశారు. ఇలా 50 ఎకరాల కంటే ఎక్కువ అడవిని తొలిచేశారు. ఈ అక్రమ తవ్వకాలు బయటపడకుండా గొప్ప పన్నాగమే  పన్నింది అండ్రు కంపెనీ. తవ్వేశాక మిగిలిన పనికిరాని రాళ్లు, మట్టితో ఆ గోతులను పూడ్చేశారు.

తవ్వకాల పరిమాణం తెలియకుండా నాటిన నీలగిరి చెట్లు  

వాటిపై మళ్లీ మొక్కలు నాటేశారు. దీంతో అనధికారికంగా తవ్వకాలు జరిపిన చోట్ల ప్రస్తుతం మొక్కలే కనిపిస్తున్నాయి. దీనివల్ల ఎంత పరిమాణంలో అక్రమ తవ్వకాలు జరిగాయో కనిపెట్టడం అధికారులకు సాధ్యం కావడంలేదు. మైనింగ్‌ శాఖ నిర్వహించే సాధారణ డీజీపీఎస్, ఈటీఎస్‌ సర్వేలతో ఎంత తవ్వారో తెలియని పరిస్థితి నెలకొంది. మైనింగ్‌ తవ్వకాల్లో ఇదో కొత్త టెక్నిక్‌గా అధికారులు చెబుతున్నారు. ఎన్ని రకాల తనిఖీలు చేసినా అక్రమాలు బయటపడకుండా ఉండేలా అండ్రు మినరల్స్‌ తన పలుకుబడిని, ఆర్థిక బలాన్ని ఉపయోగించింది.  

అధిక లోడుతో  లారీల తరలింపు 
2014 నుంచి 2019 వరకు ఐదేళ్లలో ప్రతిరోజు వందలాది లారీల్లో ఖనిజాన్ని తరలించారు. తవ్విన చోటు నుంచి స్టాక్‌ యార్డుకు ఒక్కో లారీ ప్రతిరోజూ 25 నుంచి 30 ట్రిప్పులు తిరిగేదని స్థానికులు చెబుతున్నారు. ఒక లారీలో 12 టన్నుల ఖనిజాన్ని తరలించడానికే అనుమతి ఉంది. కానీ దానికి రెట్టింపు ఖనిజాన్ని లారీలో వేసేవారు. ఒకోసారి 30 టన్నులు కూడా లారీలో ఉండేదని సమాచారం. ఎప్పుడైనా మైనింగ్‌ అధికారులు తనిఖీ చేసినప్పుడు మాత్రం 12 టన్నులే వేసేవారు. ఆ తర్వాత మామూలే. మైనింగ్‌ నిబంధనల ప్రకారం తవ్విన ఖనిజాన్ని తరలించే లారీకి పర్మిట్‌ ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. ఆ లారీలో ఎంత పరిమాణం ఉందనేది చూడరు. దీన్ని ఆసరాగా తీసుకుని అండ్రు కంపెనీ పరిమితికి మించి ఇష్టానుసారం ఖనిజాన్ని తవ్వేసి తరలించేసింది. ఇప్పటికే స్టాక్‌ యార్డుల్లో రికార్డుల్లో చూపిన దానికన్నా అదనంగా రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల ఖనిజాన్ని నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. నిబంధనల ప్రకారం దీనికి రూ.12.32 కోట్లు జరిమానా వసూలు చేయాల్సివుంది. 

అటవీ శాఖకు యూజర్‌ చార్జీలు ఎగనామం
తవ్వకాలు జరిపిన ప్రాంతం అంతా రిజర్వు ఫారెస్టు. అటవీ భూమిని మైనింగ్‌ కోసం కన్వర్ట్‌ చేసుకున్నారు. ఇలా చేసిన అటవీ భూమిలో తవ్విన ఖనిజానికి టన్నుకు రూ.10 అటవీ శాఖకు యూజర్‌ చార్జీగా చెల్లించాలి. 2013లో జీఓ నంబర్‌ 63 ప్రకారం ఈ యూజర్‌ చార్జీలు కచ్చితంగా కట్టాల్సిందే. అధికారికంగా 83 లక్షల మెట్రిక్‌ టన్నుల లేటరైట్‌ తవ్వారు. దానిపై యూజర్‌ చార్జీల కింద రూ.8.3 కోట్లకుపైగా అటవీ శాఖకు చెల్లించాల్సి వుంది. కానీ ఆ చార్జీలను కూడా అండ్రు మినరల్స్‌ కట్టలేదు. రాజకీయ పలుకుబడి ఉండడంతో అటవీ శాఖాధికారులు కూడా దీనిపై నోరు మెదపలేకపోయారు.

 
అండ్రు మినరల్స్‌ తవ్విన ఖనిజాన్ని నిల్వ చేసే స్టాక్‌ యార్డ్‌ 

టీడీపీ మళ్లీ వస్తే   ఇంకా కుమ్మేయడానికి స్కెచ్‌ 
ఐదేళ్లలో అడ్డగోలుగా ఖనిజాన్ని తవ్వేసిన అండ్రు కుటుంబం టీడీపీ పెద్దల దన్నుతో అడవిని ఇంకా తవ్వేయడానికి ప్రణాళిక రూపొందించింది. 2019 ఎన్నికల్లోను మళ్లీ టీడీపీ గెలుస్తుందని అప్పుడు ఇంకా తవ్వుకోవచ్చనే ఉద్దేశంతో అదే ప్రాంతంలో మరిన్ని లీజులకు దరఖాస్తు చేసుకుంది. ఈసారి వంతాడ గ్రామం వెనుక ఉన్న అడవిని సర్వే చేసి హద్దులు కూడా నిర్ణయించింది. సుమారు 600 ఎకరాలను లీజుకు తీసుకునేందుకు మైనింగ్‌ శాఖకు దరఖాస్తులు పెట్టినట్లు సమాచారం. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ అనుమతులు కూడా తెచ్చుకుని య«థేచ్ఛగా తవ్వకాలు చేసేవారు. కానీ టీడీపీ ఓడిపోవడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. మైనింగ్‌ కోసం వంతాడ కొండపై రిజర్వు ఫారెస్టులో 5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించారు. మైనింగ్‌కు అనుమతి ఉన్నా రోడ్డు వేయడానికి మళ్లీ అనుమతి తీసుకోవాల్సిందే. ఈ రోడ్డు కోసం అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకున్నట్లు చెబుతున్నా అది అధికారులను ప్రలోభపెట్టి తీసుకున్నట్లు చెబుతున్నారు.

రిజర్వు ఫారెస్టులో అండ్రు సంస్థ నిర్మించిన రోడ్డు  

రక్షణ చర్యలూ లేవు
మైనింగ్‌ ప్రాంతంలో పెద్దగా రక్షణ చర్యలు కూడా తీసుకోలేదు. మైనింగ్‌ చేసే చోట, స్టాక్‌ యార్డుల్లో సుమారు 500 మంది పనిచేసేవారు. ఖనిజాన్ని రవాణా చేసేందుకు వచ్చే వాహనాల సిబ్బంది వందల సంఖ్యలో ఉండేవారు. వారికి అక్కడ కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా పని చేయించుకున్నారు. రాత్రి సమయాల్లో వారు ఉండడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. వారికి జీతాలు కూడా సరిగా ఇవ్వలేదని చెబుతున్నారు. పనిచేసే వారిలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినా వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండేవి. అధికారం అండతో మైనింగ్‌ చేసే చోట తీసుకోవాల్సిన కనీస చర్యల్ని అండ్రు కంపెనీ తీసుకోలేదని చెబుతున్నారు.

స్థానికులకు ఉపాధి ఇవ్వలేదు.. అక్కడి రోడ్లను నాశనం చేశారు
మరోవైపు మైనింగ్‌ జరిగే ప్రాంతంలో ఉన్న వంతాడ గ్రామవాసులకు పెద్దగా ఉపాధి కల్పించలేదు. అతికొద్ది మందికి మాత్రమే చిన్నచిన్న పనులు ఇచ్చినా ఎక్కువ మందిని బయట ప్రాంతం నుంచే తీసుకువచ్చారు. దీంతో వందల కోట్ల విలువైన ఖనిజాన్ని ఆ ప్రాంతం నుంచి తరలించుకుపోయినా అక్కడి ప్రజలకు మాత్రం ఎటువంటి ఉపాధి దొరకలేదు. ఐదేళ్లపాటు ఓవర్‌ లోడు వాహనాలను నిరంతరాయంగా నడపడంతో ఆ ప్రాంతంలో రోడ్లు నాశనమయ్యాయి.

స్టాక్‌ యార్డులో నిల్వ ఉన్న ఖనిజం 

లంపకలోవ–ప్రత్తిపాడు రోడ్డు చిద్రమైపోయింది. చివరికి ఖనిజాన్ని తరలించే టిప్పర్లు కూడా వెళ్లడం కష్టంగా మారడంతో అండ్రు కంపెనీ కోసం టీడీపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద రూ.12 కోట్లతో రోడ్డు మంజూరు చేసి నిర్మించింది. అనుమతి లేకుండా పెదశంకర్లపూడి వద్ద ఏలేరు ఎడమ కాలువ గట్టును మైనింగ్‌ వాహనాల రాకపోకలకు వినియోగించింది. దీనివల్ల కాలువ గట్టు ధ్వంసమై కుంగిపోయింది. పెద శంకర్లపూడి వద్ద ఏలేరు కాలువపై ఉన్న వంతెన అండ్రు లారీల రాకపోకలతో కుంగిపోయింది. మైనింగ్‌ తవ్వకాల వల్ల ఏర్పడే కాలుష్యంతో గిరిజనులు సాగు చేసే తోటలు దెబ్బతిన్నాయి. జీడిమామిడి తోటలు, సీతాఫలం దిగుబడులు తగ్గిపోయాయి. మరోవైపు మైనింగ్‌ కోసం ఈ ప్రాంతంలో నీటి వనరులను అండ్రు సంస్థ పెద్దఎత్తున వినియోగించింది. బోర్లు వేసి పెద్దఎత్తున నీటిని తోడేసింది. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఫలితంగా గిరిజనులు తీవ్రంగా నష్టపోయారు.


అండ్రు మినరల్స్‌ జరిపిన ఖనిజ తవ్వకాలు.. వృత్తంలో అక్కడే వదిలేసిన యంత్రాలు 

ఎవరీ అండ్రు..
అండ్రు మినరల్స్‌ యజమాని రమేష్‌బాబు. తన ఇంటి పేరుతోనే ఈ కంపెనీ ఏర్పాటు చేశారు. ఈయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం. గతంలో అక్కడ స్టోన్‌ క్వారీలు ఉండేవి. క్రషర్లు నిర్వహించేవారు. క్రషర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. 2013లో తన కుటుంబ సభ్యుల పేరు మీదే లేటరైట్‌ లీజులు తీసుకున్నారు. పూర్తిగా లేటరైట్‌ మైనింగ్‌పైనే దృష్టి పెట్టారు. రాజమండ్రిలో ప్రధాన కార్యాలయం పెట్టారు. టీడీపీ నాయకుల ద్వారా చంద్రబాబుకు దగ్గరయ్యారు. ఆ తర్వాత లోకేశ్‌తో సన్నిహితంగా ఉండేవారని చెబుతున్నారు. అప్పటి నుంచి ఆయనకు తిరుగులేదు. చిన్న క్రషర్‌ యజమాని ఇప్పుడు మైనింగ్‌ ద్వారా వేల కోట్లు ఆర్జించినట్లు మైనింగ్‌ రంగంలో ఉన్న పెద్దవాళ్లు చెబుతున్నారు. ఇదంతా చంద్రబాబు, లోకేశ్‌ అండతోనే. టీడీపీ హయాంలో స్వయంగా లోకేశ్‌ ఈ లీజుల్లో తవ్వకాలను పర్యవేక్షించేవారని సమాచారం. స్థానిక టీడీపీ నేతలు, కొందరు మంత్రులకు ఈ తవ్వకాల్లో భాగమున్నట్లు చెబుతున్నారు.

లారీలు తిరుగుతూనే ఉండేవి
రాత్రి, పగలు తేడా లేకుండా మట్టిని తవ్వేవాళ్లు. పెద్ద టిప్పర్లు ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవి. ఆ క్వారీలు లేకముందు అంతా పచ్చగా ఉండేది. ఇప్పుడు ఎటు చూసినా ఎర్రమట్టి గోతులున్నాయి. ఆ క్వారీల వల్ల మా పిల్లలకు ఏమైనా ఉద్యోగాలిప్పిస్తారనుకున్నాం. అది కూడా లేదు. పెద్ద మిషన్లతో తవ్వుతుంటే మట్టితో మా తోటలు పాడైపోయేవి. ఎవరికి చెప్పుకోలేక అలాగే ఉండిపోయాం. 
– మాతే బాలమ్మ, వంతాడ

ఇక్కడ ఖనిజం తవ్వుకున్నారు.. ఇక్కడ ఉద్యోగాలివ్వలేదు
మా కొండపై ఐదేళ్లు ఎర్రమట్టి తవ్వుకుని వెళ్లారు. దానికి చాలా విలువ ఉంటుందని చెబుతున్నారు. మా ఏరియా మట్టితో కోట్లు సంపాదించినోళ్లు మా ఊర్లో పది మందికి కూడా ఉద్యోగాలివ్వలేదు. గట్టిగా మాట్లాడిన నలుగురైదుగురిని సూపర్‌వైజర్లుగా పెట్టుకున్నారు. క్వారీలు రాకముందు చాలా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అది జరగలేదు. మా పంటలు పాడైపోయాయి. ఉపాధి తగ్గిపోయింది.
– కుడే రాంబాబు, వంతాడ

ఇష్టానుసారం తవ్వుకున్నారు
మా ప్రాంతంలో ఖనిజాన్ని ఇష్టం వచ్చినట్లు తీసుకెళ్లారు. కానీ మా ప్రాంతాలను పట్టించుకోలేదు. అండ్రు కంపెనీ లారీల వల్ల మా రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. వంతెనలు కుంగిపోయాయి. ఆ లారీల వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి. పాడైన రోడ్లు బాగు చేస్తామన్నారు కానీ చేయలేదు.
 – అన్నిక సత్తిబాబు, ఇ.గోకవరం, ప్రత్తిపాడు మండలం 

ప్రాథమికంగా అక్రమాలు బయటపడ్డాయి..
అండ్రు మినరల్స్‌ తవ్వకాలపై చాలా ఫిర్యాదులు రావడంతో ప్రాథమిక విచారణకు ఆదేశించాం. అందులో కొన్ని అక్రమాలు బయటపడ్డాయి. స్టాక్‌ యార్డులో 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ఖనిజం లెక్కకు మించి ఉంది. దీంతో ఇంకా లోతుగా విచారణ చేస్తున్నాం. తవ్విన చోట మళ్లీ పూడ్చి మొక్కలు నాటారు. దీంతో అసలు ఎంత తవ్వారో తెలియడంలేదు. అందుకే త్రీ డైమెన్షన్‌లో డ్రోన్‌ సర్వే చేయాలని నిర్ణయించాం. ఈ కంపెనీ తవ్వకాలు జరపకముందు అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకునేందుకు శాటిలైట్‌ చిత్రాలను తెప్పిస్తున్నాం. 
– వీజీ వెంకటరెడ్డి, మైనింగ్‌ శాఖ డైరెక్టర్‌

ఇవీ చదవండి:
Andhra Pradesh: పోలవరం.. శరవేగం   
ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement