ప్రజాధనం గోదారి పాలు.. టీడీపీ నిర్వాకం | Purushothapatnam Lift Irrigation Scheme Was Constructed Without Permission | Sakshi
Sakshi News home page

‘ఉత్తి’పోతల పథకం

Published Fri, Jul 10 2020 9:33 AM | Last Updated on Fri, Jul 10 2020 9:33 AM

Purushothapatnam Lift Irrigation Scheme Was Constructed Without Permission - Sakshi

నిరుపయోగంగా మారిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం

రాజుల సొమ్ము.. రాళ్లపాలు అన్నట్టుగా.. నాటి చంద్రన్న సర్కారు కమీషన్ల కక్కుర్తితో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గోదారి పాలు చేసింది. సరైన అనుమతులు లేకుండానే నాటి ప్రభుత్వం నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భారీగా కమీషన్లు ఎత్తిపోశారని గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే అసలు ఈ ఎత్తిపోతల పథకమే వృథా అని చాలామంది అప్పట్లోనే చెప్పారు. అయినప్పటికీ కమీషన్ల కక్కుర్తితో నాటి చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకం ఆగమేఘాల మీద నిర్మించేసింది.

ఇప్పుడీ పథకం ‘ఉత్తిపోతలు’గా మారినట్టే కనిపిస్తోంది. దీని నుంచి ఒక్క చుక్క నీరు కూడా ఎత్తిపోయడానికి వీల్లేదంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) కొద్ది రోజుల కిందట ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారగా.. దీనికోసం ఖర్చు చూపించిన రూ.1,638 కోట్లను చంద్రన్న ప్రభుత్వం గోదారిలో కలిపినట్టయ్యిందన్న విమర్శలు వస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పాలకుల స్వలాభపేక్ష ఫలితంగా ప్రజాధనం ఎలా దురి్వనియోగం అవుతుందో కళ్లకు కడుతోంది పురుషోత్తపట్నం ఎత్తిపోల పథకం. మెట్ట ప్రాంత సంజీవనిగా పిలిచే ఏలేరు రిజర్వాయర్‌కు గోదావరి నీటిని పంపింగ్‌ చేస్తామని నమ్మించి, నాటి సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద నిర్మించిన ఈ పథకం ద్వారా గత పాలకులు రూ.కోట్లు కొల్లగొట్టేశారు. 2017 ఆగస్టు 15న అప్పటి సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు.

సాగునీరు విడుదల చేస్తున్నట్టు పెద్ద ఆర్భాటమే చేశారు. 2017లో పాక్షికంగా 1.63 టీఎంసీలు, 2018–19 ఖరీఫ్‌న్‌లో 7.81 టీఎంసీలు.. అది కూడా గోదావరికి  వరదలు వచ్చినప్పుడు విడుదల చేశారు. పోలవరం ఎడమ కాలువ, ఏలేరు ప్రాజెక్టులు ఉండగా ఈ ఎత్తిపోతల పథకం వృథా అని రైతులు, ఇంజినీర్లు ఎంత మొత్తుకున్నా చంద్రబాబు చెవికెక్కలేదు. ఎటువంటి అనుమతులూ తీసుకోకుండానే.. కమీషన్లకు కక్కుర్తి పడి, అధికార బలంతో రూ.1,638 కోట్ల ప్రజల సొమ్ము గోదావరిపాలు చేశారు. అనుమతులు తీసుకోకుండానే ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టడం, రైతులకు నష్టపరిహారం చెల్లించకపోవడంపై ఎన్జీటీ, న్యాయస్థానాలు చంద్రబాబుకు మొట్టికాయలు వేశాయి. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు విడుదల చేయరాదంటూ ఎన్జీటీ తాజాగా మరోసారి తీవ్రంగా హెచ్చరించింది. 

బలవంతపు భూసేకరణ.. అక్రమ కేసులు 
వాస్తవానికి ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణం ఆద్యంతం వివాదాస్పదంగానే జరిగింది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం, వంగలపూడి, చినకొండేపూడి, నాగంపల్లి రెవెన్యూ పరిధిలో భూములకు పరిహారం తక్కువని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలని 70 ఎకరాలకు చెందిన 85 మంది రైతులు అప్పట్లో డిమాండ్‌ చేశారు. వారిని దారిలోకి తెచ్చుకునేందుకు క్రిమినల్‌ కేసులు పెట్టి, బలవంతంగా నాటి ప్రభుత్వం భూములు తీసుకుంది. దీనిపై 30 మంది రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి న్యాయ పోరాటానికి మద్దతుగా ప్రస్తుత రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అప్పట్లో ఆమరణ దీక్ష కూడా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత జక్కంపూడి రాజా పురుషోత్తపట్నం రైతుల సమస్యను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వారిపై చంద్రబాబు సర్కార్‌ పెట్టిన అక్రమ కేసులను ఇటీవల ఎత్తివేయించారు. దీంతో ఆ రైతులకు ఉపశమనం లభించింది.

‘ఏలేరు’లో సమృద్ధిగా జలాలు 
ఏలేరు రిజర్వాయర్‌ కింద ఖరీఫ్‌లో 60 వేలు, రబీలో 40 వేల ఎకరాల సాగు జరుగుతోంది. ఒక టీఎంసీ జలాలతో 10 వేల ఎకరాల్లో సాగు జరుగుతుంది. ప్రస్తుతం ఏలేరు జలాశయంలో 12.21 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. దీంతో ఆయకట్టుకు ఎటువంటి ఢోకా లేదు. సీజన్‌ ప్రారంభంలోనే సమృద్ధిగా నిల్వలుంటే వర్షాలు విస్తారంగా పడితే ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ– రామవరం లిఫ్ట్‌తో సంబంధం లేకుండానే ఏలేరు ఆయకట్టులో రెండు పంటలకూ సమృద్ధిగా నీరందుతోంది. ఇటువంటి ఏలేరు ప్రాజెక్టులోకి గోదావరి నీటిని ఎత్తి పోస్తామని నమ్మబలికి, రైతుల పేరుతో పురుషోత్తపట్నం పథకాన్ని తీసుకువచ్చి, కమీషన్ల రూపంలో రూ.కోట్లు కొట్టేశారని మెట్ట ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. ఏలేరు ప్రాజెక్టు రైతులపై ప్రేమ కంటే కమీషన్ల పై యావ ఎక్కువయ్యే చంద్రబాబు అండ్‌ కో ఇలా చేశారని రైతు ప్రతినిధులు విమర్శిస్తున్నారు. 

రామవరం లిఫ్ట్‌ పేరుతో రూ.500 కోట్లు వృథా 
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భాగంగా రామవరం వద్ద రెండో లిఫ్ట్‌ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి ఏలేరు ప్రాజెక్టుకు నీటిని పంపింగ్‌ చేశారు. రామవరం పంపు హౌస్‌కు మూడు కిలోమీటర్లు దూరాన కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం, ఏలేరు కాలువలు క్రాస్‌ అవుతున్నాయి. రెండో దశ లిఫ్ట్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండానే పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే నీటిని ఏలేరు ప్రధాన కాలువలోకి మళ్లించవచ్చు. అలా చేసే అవకాశం ఉన్నప్పటికీ రెండో దశ లిఫ్ట్‌ పేరుతో రూ.500 కోట్లు వృథా చేశారని అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. 

నీటి విడుదలకు ఎన్జీటీ ‘నో’ 
అనుమతులు లేకుండానే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపడుతున్నారంటూ ప్రారంభంలోనే రైతులు ఎన్జీటీని ఆశ్రయించారు. అయినప్పటికీ చంద్రబాబు సర్కార్‌ అడ్డగోలుగా దీని నిర్మాణం పూర్తి చేసింది. దీనిపై స్పందించిన ఎన్జీటీ.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ నుంచి నిరభ్యంతర పత్రం, పర్యావరణ అనుమతి, కేంద్ర జలసంఘం నుంచి అనుమతి వచ్చే వరకూ ‘పురుషోత్తపట్నం’ నుంచి నీటి విడుదలను నిలుపు చేయాలని తాజాగా ఆదేశించింది. కీలకమైన ఈ అనుమతులేవీ తీసుకోకుండా కేవలం కమీషన్ల కోసమే ఈ ఎత్తిపోతల పథకం చేపట్టి ప్రజాధనాన్ని చంద్రబాబు వృథా చేశారని రైతులు దుయ్యబడుతున్నారు. 

కేసులు పెట్టి వేధించారు 
పురుషోత్తపట్నం పథకంలో నేను 4.32 ఎకరాలు కోల్పోయాను. నా అనుమతి లేకుండా, సంతకం చేయకపోయినా భూమిని బలవంతంగా లాగేసుకున్నారు. భార్యతో సహా ఆత్మ హత్య చేసుకోవడానికి ప్రయతి్నస్తే పోలీసులు అడ్డుకుని, ఇంటిలోనే బంధించారు. నా అంగీకారం లేకుండానే క్రిమినల్‌ కేసులు పెట్టి మరీ భూమిని బలవంతంగా తీసుకున్నారు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కేసులను రద్దు చేసింది. 
– కరుటూరి శ్రీనివాస్, రైతు,రామచంద్రపురం,సీతానగరం మండలం 

జక్కంపూడి కృషితో కేసులు ఎత్తేశారు 
2013 భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వాలని అడిగాం. ఆ చట్టం ప్రకారం ఎకరాకు రూ.39 లక్షలు వస్తుంది. అలా పరిహారం చెల్లించకుండా పోలీసు బందోబస్తుతో బలవంతంగా భూముల్ని లాగేసుకుని మా కుటుంబాన్ని రోడ్డున పడేశారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కృషి ఫలితంగా మాపై ఉన్న కేసులను ఎత్తేశారు. కేసులు ఎత్తివేసినట్టే పరిహారం విషయంలో కూడా ఆదుకుంటారనే నమ్మకంతో ఉన్నాం.
– ఐఎస్‌ఎన్‌ రాజు, చినకొండేపూడి, సీతానగరం మండలం 

‘పురుషోత్తపట్నం’లో ‘బాబు’ లూటీ 
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పేరుతో చంద్రబాబు అండ్‌ కో రూ.కోట్లు లూటీ చేసింది. రూ.1,638 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసినా ఒక్క ఎకరాకు కూడా సాగునీరందించలేని పరిస్థితి చంద్రబాబు నిర్వాకంతోనే ఏర్పడింది. ఆయనకు కమీషన్లపై ఉన్న ధ్యాస ప్రాజెక్టుకు అనుమతులు రాబట్టడంలో లేకుండా పోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చినా లెక్క చేయలేదు. దానికి అభ్యంతరాలు ఎదురైనా ఇక్కడ పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టి హడావుడిగా పూర్తి చేసి, కమీషన్లు నొక్కేశారు. ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం కూడా ఇవ్వకపోగా, తిరిగి వారిపై అక్రమంగా కేసులు పెట్టి బలవంతంగా భూములు లాగేసుకున్నారు.ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి రైతులపై కేసులు ఎత్తివేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం అవసరం లేదన్న నిపుణుల సూచనలను చంద్రబాబు పెడచెవిన పెట్టి ప్రజల సొమ్మును దుబారా చేశారు. పోలవరం యుద్ధప్రాతిపదికన జరుగుతోందని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు ఆ ప్రాజెక్టులో భాగంగానే దీనిని చేపడుతున్నామని అప్పట్లో చెప్పారు. దీనిలో ఆంతర్యమేమిటి? 
– జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే, రాజానగరం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement