ఆ అవినీతి మూట.. రూ.23 కోట్లపై మాటే | Massive Crop Loan Scandal In Gandepalli Under TDP Rule | Sakshi
Sakshi News home page

‘మాఫీ’ మాయలో ‘పచ్చ’ వ్యూహం 

Published Thu, Sep 24 2020 10:52 AM | Last Updated on Thu, Sep 24 2020 12:11 PM

Massive Crop Loan Scandal In Gandepalli Under TDP Rule - Sakshi

గండేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ భవనం

ఓ సారి అధికారం ఇస్తే పది కాలాలపాటు ప్రజల సేవలో తరించాలనుకోవాలి...ప్రజల మన్ననలు పొందుతూ వారి మదిలో పదిలంగా స్థానం  సంపాదించాలని ప్రజాప్రతినిధి తపన పడాలి. కానీ టీడీపీ హయాంలో ప్రజాప్రతినిధులంటే నిధుల స్వాహాకే వచ్చినట్టుగా...అందుకే పదవిని చేపట్టినట్టుగా యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. ఆ ఐదేళ్లే కాకుండా రానున్న ఐదేళ్లలో కూడా దోపిడీకి స్కెచ్‌ వేసుకొని మరీ స్వాహాకు ఉపక్రమించడం మరీ విడ్డూరం. అదృష్టవశాత్తూ వారు అధికారానికి దూరమయ్యారు కాబట్టి సరిపోయింది గానీ లేదంటే నిలువు దోపిడీ జరిగేది.

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పచ్చ నేతల ముందు చూపుతో సహకార సంఘాల్లో కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. జిల్లాలోని ఏ సహకార సంఘాన్ని కదిలించినా గత టీడీపీ ఏలుబడిలో ఎటు చూసినా అవినీతి కుంభకోణాలు బట్టబయలవుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్‌ అండాదండా చూసుకుని తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోయారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమనే ధీమాతో టీడీపీ నేతలు సహకార సంఘాల్లో దొంగలు పడ్డట్టుగా చొరబడి దొరికినంత దోచుకున్నారు. చంద్రబాబు మరోసారి సీఎం అవుతారు, పంట రుణాలు మాఫీ చేస్తారని ఆ పార్టీ ఏలుబడిలోని సహకార సంఘాల పాలక వర్గాలు సార్వత్రిక ఎన్నికలకు ముందు గట్టి నమ్మకంతో ఉన్నారు. అతి విశ్వాసంతోనే  బినామీ పేర్లతో కోట్లు రుణాలు లాగేశారు. తీరా ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి ఘోర పరాభవాన్ని రుచి చూపించారు. ఈ పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్లు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ప్రభుత్వం వచ్చేస్తుంది, చంద్రబాబు రుణ మాఫీ అమలవుతుందనే గుడ్డి నమ్మకంతో జిల్లాలోని పలు సహకార సంఘాల ప్రతినిధులు నకిలీ పాస్‌ పుస్తకాలు, బినామీ పేర్లతో రూ.కోట్లకు పడగలెత్తారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌గా అనంత ఉదయభాస్కర్‌ బాధ్యతలు స్వీకరించాక ఈ కుంభకోణాలను ఒకటొకటిగా ఛేదిస్తున్నారు.  

గతం దొంగల దోబూచులాట 
కొన్ని సంఘాలు, బ్రాంచీల్లో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కుంభకోణాలు బయటకు రాకుండా సంఘాల్లో పనిచేస్తున్న అధికారులు దాచిపెడుతున్నారు. గత పాలకవర్గాల్లో సంఘాలపై పడి నిలువునా దోచుకున్న వారే కావడం గమనార్హం. గత టీడీపీలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌ వరుపుల రాజా, సీఈఓల హయాంలో డీసీసీబీ, సహకార సంఘాలు కుంభకోణాలమయంగా మారిపోయాయి. ఈ కుంభకోణాల గుట్టును ‘సాక్షి’ వరుస కథనాలతో రట్టు చేస్తున్న సంగతి పాఠకులకు విదితమే. ఇలా ఏజెన్సీలోని మొల్లేరు, మెట్ట ప్రాంతంలో లంపకలోవ, కోనసీమలో వద్దిపర్రు...తదితర సొసైటీలపై పడి రూ.కోట్లు కొట్టేసిన వైనాన్ని సాక్షి’ వెలుగులోకి తేవడం, డీసీసీబీ చైర్మన్‌ అనంతబాబు విచారణ జరిపించి బాధ్యులపై చర్య తీసుకుంటున్నారు. 

గండేపల్లిలో తాజాగా... 
ఈ వరుసలోనే తాజాగా మెట్ట ప్రాంతంలోని గండేపల్లి సహకార సంఘం, గండేపల్లి డీసీసీ బ్రాంచీలో రూ.కోట్లు కొల్లగొట్టిన కుంభకోణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 2017 నవంబరు నెల నుంచి గండేపల్లి బ్రాంచి పరిధిలోని గండేపల్లి పీఏసీఎస్‌లో నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ బాండ్లు, బినామీ రైతుల పేరుతో స్వాహా బాగోతమిదీ. గండేపల్లి డీసీసీబీ బ్రాంచి సూపర్‌వైజర్‌గా నేదూరి వాసుదేవరెడ్డి గతేడాది అక్టోబరు 28న జాయినయ్యారు. 2020 జనవరి 30న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం, చైర్మన్‌ ఆదేశాల మేరకు గండేపల్లి సొసైటీ రికార్డులను బ్యాంకులో పరిశీలించేందుకు సూపర్‌వైజర్‌ ప్రయత్నించారు. అందుకు సొసైటీ, బ్రాంచిల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. ఈ క్రమంలో 2017 నవంబరు 28 నుంచి ఇచ్చిన రుణాలకు సంబంధించి రికార్డులు బ్యాంక్‌కు ఇవ్వలేదనే విషయం గుర్తించారు. గండేపల్లి బ్రాంచిలో సైతం రికార్డులను దాచిపెట్టారు. లోతుగా పరిశీలించే క్రమంలో బ్యాంకులో ఉన్న షాడో రిజిస్టర్, సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాల ద్వారా కొంత సమాచారాన్ని సూపర్‌వైజర్‌ సేకరించడంతో విషయం డీసీసీబీ ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లిందని విశ్వసనీయ సమాచారం.  

సూపర్‌వైజర్‌ సంతకం లేకుండానే.. 
సూపర్‌వైజర్‌ సంతకం లేకుండా పది మంది సభ్యుల రుణాలు రెన్యువల్‌ చేసిన వైనం ఆ సందర్భంలోనే బయటపడింది. తన ప్రమేయం లేకుండా రుణాలు రెన్యువల్‌ చేయడంతో ఇందులో పెద్ద కుంభకోణమే దాగి ఉందనే అనుమానం, ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందనే భయం వెరసి సూపర్‌వైజర్‌ డీసీసీబీ ఉన్నతాధికారుల దృష్టికి  తీసుకువెళ్లారని తెలియవచ్చింది. ఈ క్రమంలోనే రికార్డులు పరిశీలించే సరికి తీగ లాగితే డొంక కదిలినట్టు గండేపల్లి సొసైటీలో కోటి రూపాయల బినామీ రుణాల బాగోతం బయటకు వచ్చిందంటున్నారు. 10 మంది సభ్యుల రుణాలకు సంబంధించి అడ్వాన్సు స్టేట్‌మెంట్, రికవరీ స్టేట్‌మెంట్‌పై సొసైటీ సూపర్‌వైజర్‌ సంతకాలు లేకపోవడం గమనార్హం. మేనేజర్‌ ఒక్క కలం పోటుతో రూ.99,93,000 లక్షలు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంట రుణాలను 2020, ఫిబ్రవరి 17న రెన్యువల్‌ చేయడం విశేషం.

మొదట గుర్తించిన పది మంది సభ్యుల బినామీ రుణాలు రెన్యువల్‌ చేయడంతో మరిన్ని రుణాలు ఇదే రీతిన రెన్యువల్‌ చేశారని తెలియవచ్చింది. అలా గండేపల్లి సొసైటీలో మొత్తం 156 మంది సభ్యుల పేరుతో బినామీ పాస్‌పుస్తకాలు, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ బాండ్‌ పేపర్లతో సుమారు రూ.23 కోట్లు రుణాలు అప్పటి పాలకవర్గం హయాంలో విడుదలయ్యాయి. ఈ 156లో మొత్తం 50 మంది సభ్యుల(బినామీలు) రుణాలను రెన్యువల్‌ చేయగా, మిగిలిన 106 మంది రెన్యువల్‌ చేసే క్రమంలోనే విషయం బయటకు పొక్కడంతో బ్రేక్‌ పడిందంటున్నారు. ఈ నకిలీ పాస్‌పుస్తకాలు, డాక్యుమెంట్ల కోసం ప్రత్యేకంగా ఒక ప్రింటింగ్‌ మెషీన్‌ను గండేపల్లిలో ఏర్పాటు చేశారని, చివరకు బాండు పేపర్లను సబ్‌ రిజిస్ట్రార్‌ సీల్‌ను కూడా టేంపరింగ్‌ చేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ బినామీ రుణాలకు సంబంధించిన మొత్తం జాబితా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌కు కూడా చేరినట్టు తెలిసింది. ఈ జాబితా ఆధారంగా డీసీసీబీ నిష్పక్షపాతమైన విచారణ జరిపితే కుంభకోణం వెలుగులోకి రానుంది.       

ఇంకా మా దృష్టికి రాలేదు
గండేపల్లి బ్రాంచ్‌ పరిధిలో రుణాల అవకతవకల విషయం నా దృష్టికి రాలేదు. జిల్లాలో ఏ సొసైటీ, బ్రాంచ్‌లో అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చినా వెంటనే చైర్మన్‌ అనంతబాబు ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుని రికవరీ కూడా చేస్తున్నాం. గండేపల్లి సొసైటీ విషయం చైర్మన్‌తో మాట్లాడతాను. 
– ప్రవీణ్‌కుమార్, డిసీసీబీ ఇన్‌చార్జ్‌ సీఈవో 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement