ఉరవకొండలోని గృహ నిర్మాణశాఖ సిమెంట్ గోదాము
పేదల సొంతింటి కలను గత ప్రభుత్వం చెరిపేసింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టామని గొప్పలు చెప్పుకున్న ఎన్టీఆర్ గృహ నిర్మాణాల్లో సైతం భారీ ఎత్తున అక్రమాలకు ఊతమిచ్చింది. పేదల పేరుతో లెక్కలు చూపి అందిన కాడికి సిమెంట్‌ను బొక్కేశారు. ఈ కారణంగా నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
అనంతపురం సిటీ: గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ పక్కా గృహాల నిర్మాణం అక్రమాలకు నిలయంగా మారింది. ఉరవకొండ, కూడేరు, బెళుగుప్ప, వజ్రకరూరు, విడపనకల్లు మండలాల్లో 2017 ఏప్రిల్ నుంచి 2019 మార్చి మధ్య మంజూరైన, చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో సిమెంట్ కొరతతో ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. అధికారిక రికార్డుల మేరకు సిమెంట్ బస్తాలు లబ్ధిదారులకు అందజేసినట్లుగానే ఉంది. అయితే లబి్ధదారులు మాత్రం తమకు సిమెంట్ అందివ్వకపోవడం వల్లనే గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోలేకపోయామని వాపోతున్నారు.
వేలాది సిమెంట్ బస్తాలు ఎక్కడ?
ఒక్కో ఇంటి నిర్మాణానికి 90 బస్తాల సిమెంట్ చొప్పున గత ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ ద్వారా లబి్ధదారులకు అందజేస్తామని చెప్పింది. అయితే ఉరవకొండ నియోజకవర్గంలో లబి్ధదారుల్లో కొందరికి సిమెంట్ ఇవ్వకనే ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేసి అక్రమాలకు తెరతీశారు. దీనికి తోడు కంపెనీల నుంచి సిమెంట్ తీసుకువచ్చిన లారీల్లోని బస్తాలను స్థానిక గోదాములో దించకుండానే మాయం చేసేశారు. అధికారిక అంచనాల మేరకు సుమారు 5వేలకు పైబడి బస్తాల సిమెంట్ మాయమైనట్లుగా తెలుస్తోంది. అయితే వాస్తవానికి 15వేల సిమెంట్ బస్తాలకు లెక్క తేలడం లేదు. ఈ లెక్కన ఒక్కో సిమెంట్ బస్తా రూ.160 చొప్పున అమ్ముకున్నా.. రూ.లక్షల్లో అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి.
రికార్డులు తారుమారు
2017–19 మధ్య సిమెంట్ బస్తాల సరఫరాకు సంబంధించిన రికార్డులన్నీ తారుమారు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అసలు కంపెనీల నుంచి లారీల్లో వచ్చిన సిమెంట్ బస్తాలు గోదాములోకి కాకుండా ఎక్కడికి తరలించారనే విషయం ఇప్పటికీ ఆ శాఖ అధికారులకే అంతు చిక్కడం లేదు. ఈ వ్యవహారంలో అదృశ్య శక్తుల పాత్రపైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమాలకు సంబంధించి ఇప్పటి వరకూ ఏ ఒక్కరిపైనా చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం.
ఆర్నెల్లుగా విచారణ
ఉరవకొండ నియోజకవర్గంలో ఎనీ్టఆర్ పక్కాగృహాల నిర్మాణానికి సంబంధించి కేటాయించిన సిమెంట్ బస్తాలు మాయమైన ఉదంతంపై సంబంధిత శాఖ అధికారులు ఆలస్యంగా స్పందించారు. ఆర్నెల్ల క్రితం విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. విచారణాధికారిగా గృహ నిర్మాణ శాఖ ఈఈ వెంకటనారాయణను నియమించారు. అయితే ఆర్నెల్లు అవుతున్నా విచారణ ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారు. టీడీపీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి జోక్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
అప్పు చేసి నిర్మించుకున్న ఇంటి వద్ద బోయ రామాంజినమ్మ
నూతనంగా నిర్మించుకున్న ఇంటి ఎదుట నిల్చొన్న ఈమె పేరు బోయ రామాంజినమ్మ. ఉరవకొండ మండలం రేణుమాకులపల్లి. పక్కా గృహాన్ని నిర్మించుకోవాలని ఏళ్లుగా కలలు కనింది. రేయింబవళ్లూ పిల్లలతో కలిసి కూలి పనులకు వెళ్లి కొద్దోగొప్పో దాచుకుంది. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆమెకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు మంజూరు చేసింది. ఎంతో సంతోషంతో దాచుకున్న డబ్బుతో బేస్ మట్టం నిర్మించుకుంది. బిల్లుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఒక్క పైసా బిల్లు మంజూరు చేయలేదు. బేస్‌మట్టం నిర్మాణానికి ఇస్తామన్న ఆరు బస్తాల సిమెంట్ కూడా ఇవ్వలేదు. బిల్లు మంజూరుకు టీడీపీ నాయకులు డబ్బు డిమాండ్ చేశారు. అప్పటికే ఉన్న గూడును తొలగించి, నిలువ నీడ లేని స్థితిలో ఉన్న రామాంజినమ్మ చివరకు తన వద్దనున్న బంగారు నగలు అమ్మగా వచ్చిన సొమ్ముకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులతో అప్పులు చేసి రూ.3.50లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుంది. కాగా, సిమెంట్‌తో పాటు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లులు స్వాహా చేశారంటూ ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.
అక్రమాలు వాస్తవమే
ఉరవకొండ నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సిమెంట్ బస్తాల పంపిణీలో గోల్‌మాల్ జరిగిన మాట వాస్తవమే. ఈ వ్యవహారంపై రెండ్రోజుల్లో విచారణ పూర్తి అవుతుంది. ఆ వెంటనే నివేదికను పీడీకి అందజేస్తా.
– వెంకటనారాయణ, గృహ నిర్మాణ శాఖ ఈఈ, అనంతపురం
చర్యలు తీసుకుంటాం
ఉరవకొండలో లబి్ధదారులకు సిమెంట్ ఇవ్వకుండా వేలాది బస్తాలు మాయం చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. ఈ ఉదంతంపై విచారణ కొనసాగుతోంది. నివేదిక అందగానే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– వెంకటేశ్వరరెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment