నిన్న మొన్నటి వరకు జిల్లాలో ఆయనో మోనార్క్. నిబంధనలు ప్రభుత్వ ఉత్తర్వులు ఆయన మాట ముందు బలాదూర్. తాను చెప్పిందే నిబంధన, సూచించిందే ఆదేశం అన్నట్లుగా సాగింది. ఎంపీ హోదాతో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ధోరణి అవలంబించారు. ఆయన అండ చూసుకొని సోదరుడు జిల్లాలో ప్రకృతి సంపదను దోచుకోవడం, దాచుకోవడం చేశారు. కొండంత దోపిడీ కొనసాగించారు. ముద్దనూరు మండలం చిన్నదుద్యాల కేంద్రంగా కోట్లాది రూపాయలు అక్రమార్జన చేపట్టారు.
సాక్షి, కడప: పోట్లదుర్తి బ్రదర్స్ ఈ పేరు చెప్పగానే ఎంపీ రమేష్, సురేష్‌నాయుడుగా జిల్లావాసులు గుర్తుపట్టగలరు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా వీరు ఆడిందే ఆట, పాడిందే పాట, చెప్పేందే వేదం అనే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పోట్లదుర్తి గ్రామానికి చెందిన జి.చెన్నకేశవనాయడు (సురేష్ నాయుడు బినామీ) పేరుతో 2015లో స్లాబ్‌స్టోన్ మైనింగ్ లీజు ఇప్పించారు. ఆపై ఎలాంటి మైనింగ్ అనుమతులు పొందకుండా అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారు. అందులో లక్షలాది క్యూబిక్ మీటర్లు రాయిని వెలికితీసి, కంకర కొట్టి కోట్లాది రూపాయాలు అక్రమంగా గడించారు. నాలుగేళ్లుగా ఇదే తంతు కొనసాగించారు.
మైనింగ్ లీజుతోనే సరి....
పోట్లదుర్తి గ్రామానికి చెందిన చెన్నకేశవనాయుడు పేరుతో 2015 నుంచి 2025 వరకు స్లాబ్ స్టోన్ నిమిత్తం మైనింగ్ లీజు లభించింది. ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామం సర్వే నంబర్ 242లో 10.11హెక్టార్లలో మైనింగ్ లీజు దక్కింది. అయితే అందులో మైనింగ్ చేసేందుకు కాలుష్యనియంత్రణ మండలి అనుమతి పొందాల్సి ఉంది. ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తూ పక్కనే క్రషర్ ఏర్పాటు చేసి కంకర కొడుతున్నారు. నాలుగేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది.
కాగా 2018 నవంబర్ 30న కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తున్నారంటూ ఎర్రగుంట్ల మైనింగ్ ఏడీ నోటీసు జారీ చేశారు. అవేవి లెక్కచేయని పోట్లదుర్తి బ్రదర్స్ వారి అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తూనే వచ్చారు. అధికారులు నోటీసులతో సరిపెట్టడం మినహా అక్రమ మైనింగ్‌ను నియంత్రించే సాహసం లేయలేకపోయారు. ఈ క్రమంలో అప్పటి అధికార టీడీపీలో ఉన్న ఆధిపత్య పోరు కారణంగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గీయులు ఎంపీ రమేష్ క్రషర్‌ను మూయించే చర్యల్లో భాగంగా పరస్పర దాడులు సైతం చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నా అటువైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
5లక్షల క్యూబిక్ మీటర్ల మైనింగ్....
ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామంలో పోట్లదుర్తి బ్రదర్స్ 5.10లక్షల క్యూబిక్ మీటర్ల స్టోన్ క్రషర్ అక్రమంగా మైనింగ్ చేశారు. ఆమేరకు ఎర్రగుంట్ల మైనింగ్ ఏడీ నిర్ధారణ చేశారు. అందులోభాగంగా రూ.21.67కోట్లు అపరాధ రుసుం వేశారు. అనుమతులు లేకుండా మైనింగ్ చేయడం, ఆపై 5లక్షల10వేల260 క్యూబిక్ మీటర్ల రాయిని డైనమేట్లు పెట్టి పేల్చి యంత్రాల ద్వారా కొండను పెకళించారు. నిబంధనల మేరకు ప్రభుత్వానికి రూ.21.67కోట్లు చెల్లించాలని మైనింగ్ ఏడీ డిమాండ్ నోటీసును 2019 ఫిబ్రవరి 27న జారీ చేశారు. ఇవేవి పట్టించుకోకుండా పోట్లదుర్తి బ్రదర్స్ వారి అక్రమ కార్యకలాపాలు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారని ప్రజలు వాపోతున్నారు. ఈవిషయమై మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు వివరణ కోరగా, డిమాండ్ నోటీసు జారీ చేసిన విషయం వాస్తమేనని, అయితే గడువులోపు నిర్వాహకుల స్పందన చూసి తదుపరి ఆర్‌ఆర్ యాక్టు అమలు చేస్తామని వెల్లడించారు.
కలెక్టర్ గారు దృష్టి సారించండి...
ఓ వైపు ప్రజాధనం, మరోవైపు ప్రకృతి సంపద ఆధారంగా అక్రమార్జన చేయడంలో పోట్లదుర్తి సోదరులకు పెట్టింది పేరు. ఈక్రమంలోనే పోట్లదుర్తి సమీపంలో పెన్నానది ప్రవాహానికి భూములు కోతకు గురి కాకుండా ఉండేందు ఈఏడాది జనవరి 29న జలవనరులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే మైనర్ ఇరిగేషన్ యంత్రాంగం 2019 ఫిబ్రవరి 1న ప్రొటెక్షన్‌వాల్ ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. 4.44శాతం అదనంగా సింగిల్ టెండర్‌కు ఎంపీ రమేష్‌కు చెందిన రిత్విక్ కన్‌స్ట్రక్షన్‌కు రూ.3.08కోట్లకు అప్పగించారు. ఇవే పనులను పెన్నానదిలో ప్రభుత్వ భూమి అక్రమించిన ప్రాంతానికి ప్రజాధనం వెచ్చించి ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తున్నారు.
మరోవైపు చిన్నదుద్యాల గ్రామంలో వారి పేరుతో మైనింగ్ లీజు లేకపోయినా ఇప్పటీకీ కొండను కొల్లగొడుతున్నారు. ఇప్పటికే మైనింగ్ అధికారులు గుర్తించి దాదాపు రూ.21.67కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలని డిమాండ్ నోటీసు జారీ చేశారు. నోటీసు జారీ చేసిన తర్వాత 90రోజులు వరకు గడువు ఉంటుంది ఈలోపు మరింత స్పీడుగా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. నోటీసుతో సరిపెట్టడం మినహా అక్రమమైనింగ్‌కు అడ్డుకునే పరిస్థితి జిల్లా యంత్రాంగంలో కన్పించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ హరికిరణ్ ప్రత్యేక చొరవ చూపి అక్రమ మైనింగ్‌ను అరికట్టడంతోపాటు, అక్రమ మైనింగ్ ద్వారా నిల్వ ఉన్న కంకరను సీజ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏమేరకు చర్యలు చేపడుతారో వేచి చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment