జయప్పకు ఇచ్చిన లీజు స్థలంలోని కొండను తవ్వేసిన దృశ్యం
ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు మెటల్ క్వారీ మడకశిర మండలం మెళవాయి గ్రామంలోనిది. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సోదరుడు జయప్ప దీనికి లీజు పొందారు. హెక్టార్ విస్తీర్ణంలో ఉన్న ఈ క్వారీకి పర్యావరణ అనుమతులు లేవు. అయినప్పటికీ ఆరేళ్లుగా రోడ్డు మెటల్‌ను తవ్వేసుకుంటున్నారు. ఇదే గ్రామంలోని సర్వే నంబర్ 622–2లో ఐదు హెక్టార్లను 2016 మార్చి నెలలో అధికారులు ఎమ్మెల్సీ మరో సోదరుడు జి.సుభాష్ పేరుతో క్వారీకి లీజు ఇచ్చారు. ఈ క్వారీకి భూగర్భ, గనులశాఖ నుంచి అనుమతులు లేవు. అయినా అధికారం అండతో తవ్వకాలు చేపట్టిన ఎమ్మెల్సీ సోదరుడు...రాయల్టీ కూడా చెల్లించకుండానే మూడేళ్లుగా రోడ్డు మెటల్‌ను కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఆయనో ప్రజాప్రతినిధి.. పైగా పెద్దల సభకు ప్రాతినిథ్యం. ఈ పెద్దమనిషి.. వక్రబుద్ధితో దోపిడీదారుని అవతారమెత్తారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఆయన.. అక్రమార్కులకు మార్గదర్శిగా మారారు. అధికార అండతో కొండలను పిండిచేసి రూ.కోట్లు కూడబెట్టాడు. తమ్ముళ్లు, బంధువుల పేరుతో గనులను లీజుకు తీసుకుని అనుమతులు లేకుండానే ఖనిజం తవ్వడంతో పాటు.. రాయల్టీ సైతం ఎగ్గొట్టి సరిహద్దు దాటించేస్తున్నాడు.
సాక్షి, అనంతపురం టౌన్: మడకశిర.. కర్ణాటక ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న నియోజకవర్గం. రెండు, మూడు కిలోమీటర్లు దాటితే కర్ణాటక రాష్ట్ర సరిహద్దు వస్తుంది. ఇదే క్వారీ నిర్వాహకులకు కలిసి వస్తోంది. క్వారీల కోసం భూములను లీజుకు తీసుకుంటున్న వారు...ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి అత్యంత విలువైన ఖనిజాన్ని గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే కర్ణాటక ప్రాంతానికి తరలిస్తున్నారు. మామూళ్లకు అలవాటు పడిన అధికారులు కూడా అక్రమ రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది.
ఎమ్మెల్సీ అండ.. తమ్ముళ్ల దందా
మడకశిర నియోజకవర్గంలో దాదాపు 40కిపైగా గ్రానైట్, రోడ్డుమెటల్ క్వారీలున్నాయి. వీటిలో 25కు పైగా గుండుమల తిప్పేస్వామి బంధువుల పేరుతో ఉన్నాయి. ఈ క్వారీల నుంచి ఖనిజ తరలింపు కోసం చెల్లించిన రాయల్టీకి తవ్విన ఖనిజానికి ఎక్కడా పొంతన లేదు. వందల క్యూబిక్ మీటర్లకు అనుమతులు పొంది వేల క్యూబిక్ మీటర్లలో తవ్వకాలు చేపట్టారు. అంతటితో ఆగకుండా లీజు పొందని ప్రాంతాల్లో సైతం హద్దులు దాటి తవ్వకాలు చేపట్టారు.
అంతా గుండుమల కనుసన్నల్లో..
మడకశిర ప్రాంతంలో జరిగే గ్రానైట్ వ్యాపారం అంతా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కనుసన్నల్లోనే సాగుతుంది. క్వారీల్లో సింహభాగం కుటుంబీకులవే. దీంతో ఇతరులెవరైనా క్వారీలు లీజు పొందిన ఎమ్మెల్సీ కనుసన్నల్లో నడవాల్సిందే.. క్వారీలో వాటా ఇవ్వాల్సిందే. లేని పక్షంలో ఇబ్బందులు గురికావాల్సి ఉంటుంది. దీంతో గుండుమల తిప్పేస్వామి సోదరులకు అన్ని క్వారీల్లోను వాటాలున్నాయి. వారి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సోదరులు గుండుమల చంద్రప్ప, శివానందప్ప, రాధాకృష్ణలు మడకశిర మండలం జాదరహళ్లి గ్రామంలో నాలుగు గ్రానైట్ క్వారీలను 2012 సంవత్సరంలో లీజుకు తీసుకున్నారు. లీజులు మాత్రమే పొందిన వారు ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టి గుట్టుచప్పుడు కాకుండా విలువైన గ్రానైట్ బ్లాక్‌లను కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారు. కలర్ గ్రానైట్‌కు ఒక క్యూబిక్ మీటర్‌కు రూ.1,600 వరకు రాయల్టీ చెల్లించాల్సి ఉన్నప్పటికీ.. ఆరేళ్లుగా ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా వేలాది క్యూబిక్ మీటర్ల గ్రానైట్ బ్లాక్‌లను తరలించి సొమ్ము చేసుకున్నారు.
జాదరహళ్లి గ్రామంలో ఎమ్మెల్సీ సోదరులు నడుపుతున్న క్వారీలో అనుమతి పొందిన దానికంటే.. అదనంగా తవ్వకాలు చేసినట్లు గనుల శాఖ అధికారులు గుర్తించారు. ఏకంగా రూ.2 కోట్లకు పైగా జరిమానా విధించారు. అయినా అక్రమ దందాను మాత్రం అరికట్టలేకపోయారు.
రాయల్టీ ఊసేలేదు
రోడ్డు మెటల్‌కు బెంగళూరులో మంచి డిమాండ్ ఉంది. మడకశిర కర్ణాటక సరిహద్దులో ఉండటంతో అందరూ ఇక్కడి నుంచే మెటల్‌ను తరలిస్తున్నారు. అందువల్లే ఇక్కడి క్వారీల నుంచి రోజూ పదుల సంఖ్యల్లో వాహనాల్లో రోడ్డు మెటల్ తరలిపోతుంది. నిబంధనల ప్రకారం క్యూబిక్ మీటర్ రోడ్డు మెటల్‌కు రూ.100 ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంది. అయితే ఏ ఒక్క క్వారీ నిర్వాహకుడు రాయల్టీ చెల్లించడం లేదు. అసలు పర్మిట్లే తీసుకోవడం లేదు. ఎవరైనా అధికారి వాహనాన్ని ఆపితే... గుండుమల పేరు చెబుతున్నారు. దీంతో అధికారులు కూడా ఆ వాహనాలను ఆపే సాహసం చేయడం లేదు. అందువల్లే గుండమల గ్రానైట్, మెటల్ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.
రూ.కోట్లలో జరిమానా విధించినా..
మడకశిర మండలం మళ్లినాయకనహళ్లి, ఆమిదాలగొంది, జాదరహాళ్లి, అగళి మండలం హెచ్‌డీ హళ్లి గ్రామాల్లో గుండుమల తిప్పేస్వామి సోదరులు కలర్ గ్రానైట్, రోడ్డు మెటల్ క్వారీలను నిర్వహిస్తున్నారు. ఈ క్వారీలపై గతంలో కొందరు ఫిర్యాదు చేయగా.. రాష్ట్ర గనులశాఖ అధికారులు గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లలో తనిఖీలు చేశారు. అయితే తీసుకున్న పర్మిట్లకు, తవ్వుకున్న ఖనిజానికి పొంతన లేకపోవడంతో గనులశాఖ అధికారులు క్వారీల్లో కొలతలు వేశారు. అక్రమ తవ్వకాలు చేపట్టినట్లు గుర్తించి రూ. కోట్లలో జరిమానా విధించారు. ఇక జాదరహళ్లి గ్రామంలో ఎమ్మెల్సీ సోదరులు.. అనుమతి పొందిన దానికంటే... అదనంగా తవ్వకాలు చేసినట్లు గుర్తించి ఆ క్వారీకి రూ.2 కోట్లకుపైగా జరిమానా విధించారు. అయినా క్వారీ నిర్వాహకుల్లో ఎలాంటి మార్పు రాలేదు. నేటికీ ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి విలువైన ఖనిజ సంపదను తరలిస్తూ... ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
పర్యావరణ అనుమతులు లేకుండా క్వారీల్లో తవ్వకాలు చేపట్టకూడదు. మడకశిర నియోజకవర్గంలోని క్వారీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. అవసరమైతే లీజులను రద్దు చేస్తాం. ఇక రాయల్టీ చెల్లించకుండా ఖనిజం తరలిస్తున్న వారిపై చర్యలకు ఆదేశిస్తాం. – వెంకటేశ్వరరెడ్డి, ఏడీ భూగర్భ, గనులశాఖ
Comments
Please login to add a commentAdd a comment