gundumala Thippeswamy
-
మడకశిర టీడీపీ అభ్యర్థికి ఘెర పరాభవం
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: మడకశిర టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్‌కు ఘెర పరాభవం ఎదురైంది. సునీల్ కుమార్‌పై మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గీయులు చెప్పులతో దాడి చేశారు. మడకశిర పట్టణంలోని టీడీపీ నేత గుండుమల తిప్పేస్వామి ఇంటి వద్ద ఘటన జరిగింది. మడకశిర నియోజకవర్గంలో కొంత కాలంగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మధ్య వర్గపోరు సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే ఈరన్న కొడుకు సునీల్ కుమార్‌కు చంద్రబాబు టికెట్ ఖరారు చేయగా, మద్దతు కోరేందుకు టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఈరన్న.. తిప్పేస్వామి ఇంటికెళ్లారు. దీంతో ఇద్దరిపైనా చెప్పులతో దాడి చేసి తరిమేశారు. మడకశిర టీడీపీ గ్రూపు రాజకీయాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శింగనమల టీడీపీ అభ్యర్థి గా బండారు శ్రావణి నియామకంపై అసంతృప్తి భగ్గుమంది. టూమెన్ కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. జిల్లా టీడీపీ కార్యాలయంపై అసమ్మతి నేతలు రాళ్లు రువ్వారు. టీడీపీ కార్యాలయంలో అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. చంద్రబాబు, లోకేష్‌లకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఇదీ చదవండి: ‘తుప్పు పట్టిన సైకిల్-పగిలిపోయిన గ్లాసుకు గోల్డ్ కవరింగ్’ -
మడకశిరలో చిరిగిన విస్తరాకులా టీడీపీ
సాక్షి, సత్యసాయి జిల్లా: మడకశిరలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఒక వర్గానికి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న మరొక వర్గానికి నాయకత్వం వహిస్తుండడంతో ఆ పార్టీ పరిస్థితి చిరిగిన విస్తరాకులా తయారైంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటోంది. ఈ క్రమంలోనే పార్టీలో ఇరువర్గాల నాయకులు ఎవరికివారు పైచేయి సాధించడానికి పరస్పరం ఫిర్యాదుల పర్వానికి తెరలేపారు. వైరి వర్గాల నేతలు నెలకు మూడు నాలుగు సార్లు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి పెద్దలను కలిసి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. చంద్రబాబును కలిసిన ఈరన్న వ్యతిరేక వర్గం టీడీపీ అధినేత చంద్రబాబును బుధవారం మాజీ ఎమ్మెల్యే ఈరన్న వ్యతిరేక వర్గం కలిసింది. టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్, బీసీ సెల్ అధ్యక్షుడు తిప్పేస్వామి, టీడీపీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నరేష్ తదితరులు చంద్రబాబు, అచ్చెన్నాయుడుని కలిసి ఈరన్నకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని రాత పూర్వకంగా ఫిర్యాదు అందించారు. ఇప్పటికే గుండుమలపై ఫిర్యాదు.. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గం కూడా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గంపై ఫిర్యాదు చేసింది. మాజీ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో వర్గ పోరును ప్రోత్సహిస్తున్నారని, ఇన్చార్జ్కు వ్యతిరేకంగా పని చేస్తూ పార్టీ కట్టుబాట్లను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది. అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అవినీతితో పార్టీ నష్టపోయిన తీరుపై కూడా మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మడకశిర టీడీపీ వ్యవహారం పార్టీ అధినేతకు తలనొప్పిగా మారింది. గతంలో చంద్రబాబు రెండు వర్గాల నేతలను మంగళగిరి పార్టీ కార్యాలయానికి పిలిపించి పంచాయతీ చేసి పంపినా ప్రయోజనం లేకుండా పోయింది. -
రూ.30 కోట్ల జరిమానా ఎగ్గొట్టిన టీడీపీ నేత
మడకశిర: అధికారాన్ని అడ్డు పెట్టుకుని క్వారీల నిర్వహణతో అనంతపురం జిల్లాలో టీడీపీ ఏపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సాగించిన అక్రమాలు వెలుగు చూశాయి. నిబంధనలకు వ్యతిరేకంగా 18 క్వారీలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున గ్రానైట్, రోడ్డు మెటల్ తరలించి, ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా రాయల్టీ చెల్లించక పోవడాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్‌గా పరిగణించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) బాలాజీ నాయక్ తదితరులు.. విస్తృత తనిఖీలు చేపట్టి, అక్రమాలపై నిగ్గు తేల్చారు. 18 క్వారీలను బంద్ చేయించారు. ఈ క్వారీల నిర్వహణలో పరిమితికి మించి గ్రానైట్, రోడ్డు మెటల్ తరలిస్తుండడంతో గతంలోనే రూ.30 కోట్ల మేర అధికారులు జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో క్వారీలను బంద్ చేయించినట్లు శనివారం గనుల శాఖ ఏడీ ధ్రువీకరించారు. కాగా, యూ.రంగాపురం వద్ద ఉన్న మెటల్ క్వారీకి విద్యుత్ సరఫరాను సైతం నిలిపి వేయాలంటూ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీతో పాటు ఎస్ఈకి లేఖ రాసినట్లు తెలిపారు. క్వారీల్లో అక్రమ మైనింగ్ జరపకుండా గట్టి నిఘా ఉంచామని ఆయన వివరించారు. -
గుండుమల.. గ్రానైట్ దందా!
ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు మెటల్ క్వారీ మడకశిర మండలం మెళవాయి గ్రామంలోనిది. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సోదరుడు జయప్ప దీనికి లీజు పొందారు. హెక్టార్ విస్తీర్ణంలో ఉన్న ఈ క్వారీకి పర్యావరణ అనుమతులు లేవు. అయినప్పటికీ ఆరేళ్లుగా రోడ్డు మెటల్‌ను తవ్వేసుకుంటున్నారు. ఇదే గ్రామంలోని సర్వే నంబర్ 622–2లో ఐదు హెక్టార్లను 2016 మార్చి నెలలో అధికారులు ఎమ్మెల్సీ మరో సోదరుడు జి.సుభాష్ పేరుతో క్వారీకి లీజు ఇచ్చారు. ఈ క్వారీకి భూగర్భ, గనులశాఖ నుంచి అనుమతులు లేవు. అయినా అధికారం అండతో తవ్వకాలు చేపట్టిన ఎమ్మెల్సీ సోదరుడు...రాయల్టీ కూడా చెల్లించకుండానే మూడేళ్లుగా రోడ్డు మెటల్‌ను కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆయనో ప్రజాప్రతినిధి.. పైగా పెద్దల సభకు ప్రాతినిథ్యం. ఈ పెద్దమనిషి.. వక్రబుద్ధితో దోపిడీదారుని అవతారమెత్తారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఆయన.. అక్రమార్కులకు మార్గదర్శిగా మారారు. అధికార అండతో కొండలను పిండిచేసి రూ.కోట్లు కూడబెట్టాడు. తమ్ముళ్లు, బంధువుల పేరుతో గనులను లీజుకు తీసుకుని అనుమతులు లేకుండానే ఖనిజం తవ్వడంతో పాటు.. రాయల్టీ సైతం ఎగ్గొట్టి సరిహద్దు దాటించేస్తున్నాడు. సాక్షి, అనంతపురం టౌన్: మడకశిర.. కర్ణాటక ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న నియోజకవర్గం. రెండు, మూడు కిలోమీటర్లు దాటితే కర్ణాటక రాష్ట్ర సరిహద్దు వస్తుంది. ఇదే క్వారీ నిర్వాహకులకు కలిసి వస్తోంది. క్వారీల కోసం భూములను లీజుకు తీసుకుంటున్న వారు...ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి అత్యంత విలువైన ఖనిజాన్ని గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే కర్ణాటక ప్రాంతానికి తరలిస్తున్నారు. మామూళ్లకు అలవాటు పడిన అధికారులు కూడా అక్రమ రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. ఎమ్మెల్సీ అండ.. తమ్ముళ్ల దందా మడకశిర నియోజకవర్గంలో దాదాపు 40కిపైగా గ్రానైట్, రోడ్డుమెటల్ క్వారీలున్నాయి. వీటిలో 25కు పైగా గుండుమల తిప్పేస్వామి బంధువుల పేరుతో ఉన్నాయి. ఈ క్వారీల నుంచి ఖనిజ తరలింపు కోసం చెల్లించిన రాయల్టీకి తవ్విన ఖనిజానికి ఎక్కడా పొంతన లేదు. వందల క్యూబిక్ మీటర్లకు అనుమతులు పొంది వేల క్యూబిక్ మీటర్లలో తవ్వకాలు చేపట్టారు. అంతటితో ఆగకుండా లీజు పొందని ప్రాంతాల్లో సైతం హద్దులు దాటి తవ్వకాలు చేపట్టారు. అంతా గుండుమల కనుసన్నల్లో.. మడకశిర ప్రాంతంలో జరిగే గ్రానైట్ వ్యాపారం అంతా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కనుసన్నల్లోనే సాగుతుంది. క్వారీల్లో సింహభాగం కుటుంబీకులవే. దీంతో ఇతరులెవరైనా క్వారీలు లీజు పొందిన ఎమ్మెల్సీ కనుసన్నల్లో నడవాల్సిందే.. క్వారీలో వాటా ఇవ్వాల్సిందే. లేని పక్షంలో ఇబ్బందులు గురికావాల్సి ఉంటుంది. దీంతో గుండుమల తిప్పేస్వామి సోదరులకు అన్ని క్వారీల్లోను వాటాలున్నాయి. వారి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సోదరులు గుండుమల చంద్రప్ప, శివానందప్ప, రాధాకృష్ణలు మడకశిర మండలం జాదరహళ్లి గ్రామంలో నాలుగు గ్రానైట్ క్వారీలను 2012 సంవత్సరంలో లీజుకు తీసుకున్నారు. లీజులు మాత్రమే పొందిన వారు ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టి గుట్టుచప్పుడు కాకుండా విలువైన గ్రానైట్ బ్లాక్‌లను కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నారు. కలర్ గ్రానైట్‌కు ఒక క్యూబిక్ మీటర్‌కు రూ.1,600 వరకు రాయల్టీ చెల్లించాల్సి ఉన్నప్పటికీ.. ఆరేళ్లుగా ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా వేలాది క్యూబిక్ మీటర్ల గ్రానైట్ బ్లాక్‌లను తరలించి సొమ్ము చేసుకున్నారు. జాదరహళ్లి గ్రామంలో ఎమ్మెల్సీ సోదరులు నడుపుతున్న క్వారీలో అనుమతి పొందిన దానికంటే.. అదనంగా తవ్వకాలు చేసినట్లు గనుల శాఖ అధికారులు గుర్తించారు. ఏకంగా రూ.2 కోట్లకు పైగా జరిమానా విధించారు. అయినా అక్రమ దందాను మాత్రం అరికట్టలేకపోయారు. రాయల్టీ ఊసేలేదు రోడ్డు మెటల్‌కు బెంగళూరులో మంచి డిమాండ్ ఉంది. మడకశిర కర్ణాటక సరిహద్దులో ఉండటంతో అందరూ ఇక్కడి నుంచే మెటల్‌ను తరలిస్తున్నారు. అందువల్లే ఇక్కడి క్వారీల నుంచి రోజూ పదుల సంఖ్యల్లో వాహనాల్లో రోడ్డు మెటల్ తరలిపోతుంది. నిబంధనల ప్రకారం క్యూబిక్ మీటర్ రోడ్డు మెటల్‌కు రూ.100 ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంది. అయితే ఏ ఒక్క క్వారీ నిర్వాహకుడు రాయల్టీ చెల్లించడం లేదు. అసలు పర్మిట్లే తీసుకోవడం లేదు. ఎవరైనా అధికారి వాహనాన్ని ఆపితే... గుండుమల పేరు చెబుతున్నారు. దీంతో అధికారులు కూడా ఆ వాహనాలను ఆపే సాహసం చేయడం లేదు. అందువల్లే గుండమల గ్రానైట్, మెటల్ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. రూ.కోట్లలో జరిమానా విధించినా.. మడకశిర మండలం మళ్లినాయకనహళ్లి, ఆమిదాలగొంది, జాదరహాళ్లి, అగళి మండలం హెచ్డీ హళ్లి గ్రామాల్లో గుండుమల తిప్పేస్వామి సోదరులు కలర్ గ్రానైట్, రోడ్డు మెటల్ క్వారీలను నిర్వహిస్తున్నారు. ఈ క్వారీలపై గతంలో కొందరు ఫిర్యాదు చేయగా.. రాష్ట్ర గనులశాఖ అధికారులు గతేడాది సెప్టెంబర్, అక్టోబర్లలో తనిఖీలు చేశారు. అయితే తీసుకున్న పర్మిట్లకు, తవ్వుకున్న ఖనిజానికి పొంతన లేకపోవడంతో గనులశాఖ అధికారులు క్వారీల్లో కొలతలు వేశారు. అక్రమ తవ్వకాలు చేపట్టినట్లు గుర్తించి రూ. కోట్లలో జరిమానా విధించారు. ఇక జాదరహళ్లి గ్రామంలో ఎమ్మెల్సీ సోదరులు.. అనుమతి పొందిన దానికంటే... అదనంగా తవ్వకాలు చేసినట్లు గుర్తించి ఆ క్వారీకి రూ.2 కోట్లకుపైగా జరిమానా విధించారు. అయినా క్వారీ నిర్వాహకుల్లో ఎలాంటి మార్పు రాలేదు. నేటికీ ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి విలువైన ఖనిజ సంపదను తరలిస్తూ... ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. చర్యలు తీసుకుంటాం పర్యావరణ అనుమతులు లేకుండా క్వారీల్లో తవ్వకాలు చేపట్టకూడదు. మడకశిర నియోజకవర్గంలోని క్వారీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. అవసరమైతే లీజులను రద్దు చేస్తాం. ఇక రాయల్టీ చెల్లించకుండా ఖనిజం తరలిస్తున్న వారిపై చర్యలకు ఆదేశిస్తాం. – వెంకటేశ్వరరెడ్డి, ఏడీ భూగర్భ, గనులశాఖ -
ఎమ్మెల్సీగా హ్యాట్రిక్ అవకాశం
మడకశిర : నియోజకవర్గానికి చెందిన గుండుమల తిప్పేస్వామికి ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్సీ పదవి దక్కించుకునే అవకాశం లభించింది. ఇప్పటికే అసెంబ్లీ బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా హ్యాట్రిక్ కొట్టారు. రాష్ట్ర విభజన అనంతరం ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని బలోపేతం చేశారు. ఈ సేవలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తించి సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవికి గుండుమల తిప్పేస్వామిని ఎంపిక చేశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు గుండుమల తిప్పేస్వామి రెండు సార్లు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. 2006లో మొదటి సారిగా ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆ రోజు కొత్తగా శాసన మండలిని పునరుద్ధరించారు. దీంతో లాటరీ పద్ధతిలో తిప్పేస్వామికి రెండేళ్ల పాటు ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశం వచ్చింది. మళ్లీ ఆ తర్వాత 2009లో కూడా వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. మూడో సారి టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గుండుమల తిప్పేస్వామిని పోటీకి పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మంగళవారం ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా గుండుమల నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంచెలంచెలుగా ఎదిగిన గుండుమల మడకశిర మండల పరిధిలోని గుండుమల గ్రామానికి చెందిన తిగళప్ప, బాలమ్మల కుమారుడు జి.తిప్పేస్వామి. యాదవ సామాజిక వర్గానికి చెందిన తిప్పేస్వామి 1987 కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రస్తుత ఏపీపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అనుచరుడుగా కొనసాగుతూ వివిధ పదవులను అలంకరిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి 2014 మార్చి 15న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మంది అభ్యర్థులను, ఎమ్మెల్యేను గెలిపించుకున్నారు. బయోడేటా పేరు : గుండుమల తిప్పేస్వామి విద్యార్హతలు : బీఎస్సీ, ఎల్ఎల్బీ పుట్టినతేదీ : 03.01.1960 రాజకీయ ప్రవేశం : 1987 చేపట్టిన పదువులు 2001లో రొళ్ల జెడ్పీటీసీ సభ్యుడు జనవరి 2005 జెడ్పీ చైర్మన్ మార్చి 2007 ఎమ్మెల్సీగా మొదటిసారి ఏప్రిల్ 2009 ఎమ్మెల్సీగా రెండో సారి జూన్ 2010 అసెంబ్లీ బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా మొదటి సారి జూన్ 2012 అసెంబ్లీ బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా రెండో సారి మార్చి 15, 2014లో టీడీపీలోకి చేరిక మార్చి 2015లో అసెంబ్లీ బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా మూడోసారి నియాకం