తమ్ముడు.. కుమ్ముడు...! | TDP Leaders Mining Mafia | Sakshi
Sakshi News home page

టీడీపీ మైనింగ్‌ మాఫియా 

Published Wed, Jul 3 2019 8:09 AM | Last Updated on Wed, Jul 3 2019 8:11 AM

TDP Leaders Mining Mafia - Sakshi

సోమందేపల్లి మండలం సర్వే నంబర్‌ 64లో రోడ్డు మెటల్‌ క్వారీకి గనులశాఖ అధికారులు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి కుమార్తె బీకే రోజా పేరుతో అనుమతులు ఇచ్చారు. ఇక్కడ 20,500 క్యూబిక్‌ మీటర్లు మాత్రమే తవ్వుకోవాలని సూచించారు. అయితే ఈ క్వారీలో దాదాపు 90 వేల క్యూబిక్‌ మీటర్లకుపైగా అక్రమంగా తవ్వకాలు జరిపారు. 2018 నవంబర్‌ 1న క్వారీని పరిశీలించిన రాష్ట్ర గనులశాఖ అధికారులు దీన్ని గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించడం, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారని తెలిసి రూ.98 లక్షలు జరిమానా విధించారు. అయితే బీకే కుటుంబం జరిమానా చెల్లించకపోగా... నేటికీ తవ్వకాలు జరుపుతూ రోడ్డు మెటల్‌ను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటోంది.  

అనుమతులు ఉండవు.. తవ్వేస్తారు. రాయల్టీ చెల్లించరు.. రవాణా చేస్తారు. లీజు ఒకచోట పొంది మరో ప్రాంతంలో తవ్వేస్తారు. ఎవరూ పట్టించుకోరు. కొండలను పిండిచేసి రూ.కోట్లు వెనకేసుకున్నారు. అయినా ప్రభుత్వానికి పైసా చెల్లించరు. జిల్లాను పట్టి పీడించిన మైనింగ్‌ మాఫియా దెబ్బకు ‘అనంత’లోని గనులు, కొండలు నామ  రూపాల్లేకుండా పోయాయి. ఇవన్నీ తెలిసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో...గత ఐదేళ్లలో టీడీపీ నేతలు సహజ వనరులన్నీ దోచేశారు. అక్రమార్జనకు అలవాటుపడిన వారంతా నేటికీ దందా నడిపిస్తూనే ఉన్నారు.  

జిల్లా వ్యాప్తంగా ఉన్న క్వారీలు- 320
గ్రానైట్‌ క్వారీలు- 120
రోడ్‌ మెటల్‌ క్వారీలు- 200
పర్యావరణ అనుమతులున్న క్వారీలు- 120

సాక్షి, పెనుకొండ/అనంతపురం టౌన్‌: కరువుకు చిరునామాగా మారిన జిల్లాలో సహజవనరులకు మాత్రం కొదవలేదు. అందుకే గత ఐదేళ్లు అధికారంలో ఉన్న  టీడీపీ నేతలు వీటిపైనే కన్నేశారు. మనీ కోసం మైనింగ్‌ మాఫియా నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపి రూ.కోట్లు సంపాదించారు. క్వారీలు, గనులను అనుక్షణం పర్యవేక్షించాల్సిన భూగర్భ గనుల శాఖ అధికారులు కళ్లుమూసుకోవడంతో ఇష్టానుసారం చెలరేగిపోయారు. యథేచ్ఛగా అక్రమ క్వారీలు, అనుమతులు లేని క్రషర్‌లను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు. అయినా అధికారులు మాత్రం చర్యలు తీసుకోలేకపోయారు.
 
120 క్వారీలకే అనుమతులు 
జిల్లా వ్యాప్తంగా 320లకుపైగా క్వారీలుండగా...వీటిలో 120 గ్రానైట్‌ క్వారీలు, 200 రోడ్డు మెటల్‌ క్వారీలున్నాయి. ప్రతి క్వారీకి పర్యావరణ అనుమతులు తప్పని సరి. లేని వాటిని సీజ్‌ చేయాలని కేంద్ర పర్యావరణ అధికారులు భూగర్భ గనుల శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. అయితే జిల్లాలో 120 క్వారీలకు మాత్రమే పర్యావరణ అనుమతులున్నాయి. మిగిలిన వాటికి అనుమతులు లేకున్నా... ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. తీసుకున్న లీజు ప్రాంతంలో కాకుండా సమీపంలోని ప్రాంతంలో తవ్వకాలు చేపడుతున్నారు. అయినా గనులశాఖ అధికారులు మాత్రం అక్రమ తవ్వకాలను గుర్తించలేకపోతున్నారు. గనులశాఖకే ప్రత్యేకంగా విజిలెన్స్‌ విభాగం ఉన్నప్పటికీ ఆమ్యామ్యాలకు అలవాటుపడిన వారంతా కళ్లుమూసుకుని చోద్యం చూస్తున్నారు.
 
ప్రతినెలా 12 లక్షల క్యూబిక్‌ మీటర్ల మెటల్‌ తరలింపు 
జిల్లాలోని రోడ్డు మెటల్‌ క్వారీల నుంచి ప్రతి నెలా 12 లక్షల క్యూబిక్‌ మీటర్లకుపైగా మెటల్‌ను తరలిస్తున్నారు. ఈలెక్కన ప్రతి క్వారీ నిర్వాహకుడు రాయల్టీ చెల్లించి పర్మిట్లు తీసుకుంటే... ప్రతినెలా రోడ్డు మెటల్‌ క్వారీలనుంచే ప్రభుత్వానికి దాదాపు రూ.12 కోట్లకుపైగా ఆదాయం రావాల్సి ఉంది. అయితే క్వారీ నిర్వాహకులు మాత్రం  2 లక్షల క్యూబిక్‌ మీటర్లకు కూడా రాయల్టీ చెల్లించలేదు. దీంతో ప్రతి నెలా ప్రభుత్వం దాదాపు రూ.10 కోట్లకుపైగా.... ఏడాదికి దాదాపు రూ.120 కోట్లకు పైగా ఆదాయం కోల్పోతోంది. గనులశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో క్వారీ నిర్వహకులు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తక్కువ పర్మిట్లకు రాయల్టీ చెల్లించి అక్రమంగా రోడ్డు మెటల్‌ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు సైతం అక్రమ వ్యాపారాన్ని అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
 
ఎల్‌.నారాయణ చౌదరి దందా ఎక్కువే 
మాజీ మంత్రి పరిటాల సునీత సమీప బంధువు ఎల్‌.నారాయణ చౌదరి 2015లో సోమందేపల్లి మండలంలోని సర్వే నంబర్లు 509లోని 3 హెక్టార్లు, 2 హెక్టార్లు చొప్పున రెండు రోడ్డు మెటల్‌ క్వారీలకు లీజు తీసుకున్నాడు. 2016–17 సంవత్సరంలో క్యూబిక్‌ మీటరుకు కూడా రాయల్టీ చెల్లించలేదు. 2017–18లో మాత్రం ఒక క్వారీకి 6,500 క్యూబిక్‌ మీటర్లకు గానూ రూ.6.50 లక్షలు, మరో క్వారీ తరఫున 1,300 క్యూబిక్‌ మీటర్లకు రూ.1.30 లక్షలు చెల్లించాడు. 2015 నుంచి ఇప్పటి వరకు మొత్తంగా రూ.8 లక్షల్లోపే రాయల్టీ చెల్లించాడు.

క్వారీలో మాత్రం నేటికీ తవ్వకాలు చేపడుతూనే ఉన్నారు. ఈ మూడేళ్లకాలంలో ఇంతతక్కువ మొత్తంలో రాయల్టీ చెల్లించిన క్వారీలు జిల్లాలోనే లేకపోవడం గమనార్హం. అయితే గనులశాఖ అధికారులు మాత్రం ఈ క్వారీలను పర్యవేక్షించిన దాఖలాల్లేవు. ప్రస్తుతం క్వారీని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఈ రెండు క్వారీల నుంచే దాదాపు రూ.2 కోట్లకు పైగా విలువ చేసే ఖనిజాన్ని తరలించుకు పోయినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు వాటిని చూసే సాహసం కూడా చేయడం లేదు. వీటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఏస్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయో తెలిసే అవకాశం ఉంది.
 
ఇన్‌చార్జి అధికారితోనే ఇబ్బందులు 
గనుల శాఖ అనంతపురం ఏడీగా పనిచేస్తున్న వెంకట్‌రావును ఆరు నెలల క్రితం అప్పటి కలెక్టర్‌ వీరపాండియన్‌ ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. దీంతో తాడిపత్రి ఏడీగా ఉన్న వెంకటేశ్వరరెడ్డికి అనంతపురం డివిజన్‌ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన వారం రెండు రోజులు మాత్రమే అనంతపురం డివిజన్‌లోని క్వారీ వ్యవహారాలు చూస్తున్నారు. అందువల్లే అక్రమ క్వారీలపై నిఘా ఉంచలేకపోతున్నారు. ఇద్దరు ఆర్‌ఐలు ఉన్నప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. 

రాయల్టీ ఎగవేత ఇలా.... 
ప్రతి నెలా తరలించే మెటల్‌ క్వారీ: 12 లక్షల క్యూ.మీ 
రాయల్టీ రూపంలో ఖజానాకు చేరాల్సిన మొత్తం : రూ.12 కోట్లు్ల 
క్వారీ నిర్వాహకులు నెలలో చెల్లిస్తున్న  మొత్తం: రూ.2 కోట్లు 
ఏడాదికి ప్రభుత్వానికి అందకుండా పోతున్న మొత్తం: రూ.120 కోట్లు
 

చర్యలు తీసుకుంటాం 
సోమందేపల్లి మండలంలోని రోడ్డు మెటల్‌ క్వారీలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతాం. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేసి ఉంటే చర్యలు తీసుకుంటాం. నిబంధనలు ఉల్లంఘించిన కొందరు క్వారీ నిర్వాహకులకు జరిమానా విధించాం. ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని నోటీసులు పంపాం. కొందరు  కోర్టులను ఆశ్రయించడం వల్ల వారికి నోటీసులు పంపలేదు. కోర్టు ఉత్తర్వులు రాగానే జరిమానా సొమ్మును పైసాతో సహా వసూలు చేస్తాం.   – వెంకటేశ్వరరెడ్డి, గనుల శాఖ ఏడీ   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement