Local Leaders
-
టీడీపీలో ప్రవాస వేదన
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ప్రవాస వేదన మొదలైంది. ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్న నేతలను కాదని, డబ్బు సంచులతో విమానం దిగుతున్న ప్రవాసాంధ్రుల(ఎన్ఆర్ఐ)కు పార్టీ అధినేత చంద్రబాబు పెద్దపీట వేయడం ఆ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. పార్టీ అధికారం కోల్పోయిన అనంతరం మూడున్నరేళ్లుగా పలువురు నాయకులు అన్నీ తామై సొంత డబ్బులు ఖర్చు చేసుకుని మరీ పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ పదవులు అనుభవించిన నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ప్రజా ప్రతినిధులు పలు చోట్ల మూడున్నరేళ్లుగా పత్తాలేకుండా పోయారు. \ అయినా సరే పార్టీనే నమ్ముకొని పనిచేసిన నాయకులు 2024 ఎన్నికల్లో పార్టీ టికెట్లపై ఆశలు పెంచుకున్నారు. ఎన్నికలు మరో ఏడాదిన్నరలో వస్తున్నాయనగా ఎన్ఆర్ఐలు డబ్బు సంచులతో హఠాత్తుగా ఊడిపడ్డారు. ఇది స్థానిక నాయకులకు మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో స్థానిక నేతలు, ఎన్ఆర్ఐల మధ్య విభేదాలు తీవ్రతరం అవుతున్నాయి. పార్టీని నమ్ముకున్న స్థానిక నేతలు అందుబాటులో ఉన్న కార్యకర్తలతో కలిసి పనిచేస్తున్నారు. విమానం దిగిన ఎన్ఆర్ఐలు మాత్రం నేరుగా కరకట్టలో చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆధిపత్యం చెలాయిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ అంటూ వారు ప్రచారం చేసుకుంటున్నారు. స్థానిక నాయకులకు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ వ్యవహారం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. పలు చోట్ల ఎన్ఆర్ఐ చిచ్చు తిరువూరు నియోజకవర్గంలో సైతం మాజీ ఎమ్మెల్యేను కాదని, ఓ ఎన్ఆర్ఐని టీడీపీ ఇన్చార్జిగా నియమించడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గన్నవరంలో టీడీపీ ఇన్చార్జిగా బచ్చుల అర్జునుడును నియమించినప్పటికీ, వచ్చే ఎన్నికల్లో అతనికి టికెట్ ఇవ్వకుండా, ఎన్ఆర్ఐల కోసం వెదుకుతున్నారని, నియోజకవర్గ పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది. ఇప్పటికే గ్రూపు తగాదాలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. తాజాగా ఉన్న గ్రూపులను కాదని, టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఎన్ఆర్ఐల కోసం వెదుకులాట ప్రారంభించడం హాట్ టాపిక్‌గా మారింది. పెనమలూరులో కూడా గ్రూపు తగాదాలను సాకుగా చూపి, ఎన్ఆర్ఐ ప్రయోగం చేసే దిశగా అధిష్టానం పావులు కదుపుతోందని ఆ పార్టీ వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి. కంట్లో నలుసుగా.. విజయవాడ ఎంపీ కేశినేని నానిని కాదని, ఎన్ఆర్ఐ అయిన ఆయన తమ్ముడి చిన్నిని పార్టీ అధిష్టానం ప్రోత్సహించడాన్ని సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. చిన్ని ప్రస్తుతం అన్నా క్యాంటీన్లు, కిస్మస్ కానుకల పేరుతో హడావుడి చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో గ్రూపులు కడుతున్నారు. ఆయన విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో పార్టీకి కంట్లో నలుసుగా మారారనే భావన టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే వరుస పరాజయాలను మూట కట్టుకున్న టీడీపీ పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోజు రోజుకు మరింత దిగజారుతోందన్న భావన సొంత పార్టీలోనే వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులుగా ఎన్ఆర్ఐలను తెచ్చే ప్రయత్నాలు పార్టీ పరిస్థితిని మరింతగా దిగజార్చడం తప్ప ఉపయోగం ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన వారిని కాదని, ఎన్ఆర్ఐలకు ప్రాధాన్యం ఇవ్వడం చంద్రబాబు నైజాన్ని మరోసారి గుర్తు చేస్తోందని పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. గుడివాడలో రావికి సెగ గుడివాడ నియోజకవర్గంలో వరుస పరాజయాలు ఇప్పటికే టీడీపీ క్యాడర్‌ను కుంగదీశాయి. ఓటమి పాలైనా కష్ట కాలంలో పార్టీకి అండగా నిలిచిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావుకు 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా, ఎసరు పెట్టే కార్యక్రమానికి అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టినట్లు చర్చ సాగుతోంది. దీనిని బలపరిచేలా గుడివాడలో ఓ ఎన్ఆర్ఐ క్రిస్మస్ కానుకలు పంచి, ఫౌండేషన్ ట్రస్టు ఏర్పాటు చేసి హడావుడి చేస్తున్నారు. చంద్రబాబు తనకే సీటు ఇస్తానని చెప్పారని, నియోజకవర్గంలో పనిచేసుకోవాలని సూచించారని రావి వెంకటేశ్వరావు చెబుతూ తన ఉనికి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు ఎన్ఆర్ఐ కూడా పార్టీ టికెట్ తనదేనని, చినబాబు సైతం హామీ ఇచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసేది తానేనని అంతర్గతంగా సన్నిహితుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ గ్రూపు తగాదాలతో టీడీపీ పరిస్థితి పూర్తిగా దిగజారింది. కష్ట కాలంలో పార్టీ జెండా మోసిన వారిని కాదని, తాజాగా వచ్చిన ఎన్ఆర్ఐకి పార్టీ అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. -
టీఆర్ఎస్ కారులో కయ్యం.. ఏందబ్బా ఇది!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. ఇప్పటికే కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో ముఖ్య నేతల మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. కాగా ఈ నెల 25వ తేదీ శుక్రవారం పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం మల్లెలమడుగులో చోటు చేసుకున్న సంఘటన జిల్లా రాజకీయాలనే కుదిపేసింది. ఇరువర్గాల మధ్య నెలకొన్న విభేదాలు 144 సెక్షన్ అమలుకు దారి తీసినా పరస్పర దాడులు మాత్రం తప్పలేదు. సాక్షాత్తు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో ఆయన వర్గీయులు, అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వర్గీయుల మధ్య తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. పాయం వెంకటేశ్వర్లుతో కలిసి అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వచ్చిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిని ‘రేగా’ అనుచరులతో పాటు పోలీసులూ అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోగా, పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. తనను అడ్డుకున్న పోలీసులతో పాయం వెంకటేశ్వర్లు విభేదించారు. దీంతో 144 సెక్షన్ అమలులో ఉన్న ప్రాంతంలో ఏఎస్ఐ మోహన్ విధులకు ఆటంకం కలిగించినందుకు పిడమర్తి రవితో పాటు మరో ఐదుగురిపై 188, 143, 353,ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు చందాలు వసూలు చేసి ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అనుమతి లేకున్నా వచ్చి తమపై దాడి చేశారంటూ ఆ పార్టీ ఎస్సీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు ఎన్నా అశోక్.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, తుళ్లూరి బ్రహ్మయ్య, గజ్జల లక్ష్మారెడ్డితో పాటు మరో ఎనమిది మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై 188,143,324,109 ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్.. మల్లెలమడుగులో జరిగిన ఘటన నేపథ్యంలో శనివారం ఉదయం సామాజిక మాధ్యమాల్లో రేగా కాంతారావు.. పొంగులేటి, పిడమర్తి రవిని విమర్శిస్తూ పెట్టిన పోస్టులు హాట్‌టాపిక్‌గా మారాయి. పిడమర్తి రవిని దళిత ద్రోహిగా అభివర్ణించిన ‘రేగా’ పినపాక నియోజకవర్గంలో పొంగులేటికి ఏం పని అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో కార్యకర్తల జోలికి వస్తే సహించబోమని హెచ్చరించారు. కాగా గత ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాజీ ఎంపీ పొంగులేటికి సన్నిహితుడు కావడం, వచ్చే ఎన్నికల్లోనూ పాయం ఇదే పార్టీ నుంచి పోటీకి సన్నద్ధమవుతుండడంతో ఇరువర్గాల మధ్య అంతర్గత పోరు మొదలైంది. ఆది నుంచి పాయం వెంకటేశ్వర్లుకు అండగా ఉంటున్న పొంగులేటిపై ‘రేగా’ విమర్శలకు కారణమిదే అనే ప్రచారం గులాబీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కాగా, నియోజకవర్గ స్థాయి యువతతో ఆదివారం రేగా కాంతారావు సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఏ అంశాలు చర్చిస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా.. ఈ వ్యవహారం ఇప్పటికే అధిష్టానం దృష్టికి వెళ్లింది. దీంతో రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణలు, మార్పులు ఎలా ఉంటాయోననే చర్చ మొదలైంది. నేనో సీనియర్ ఉద్యమకారుడిని. తెలంగాణ ఉద్యమంలో నేను పోషించిన పాత్ర మీ అందరికీ తెలుసు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా సేవలందించా. పినపాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అశ్వాపురంలో మాదిగ జేఏసీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ఆవిష్కరణకు నన్ను పిలిచింది. అదే కులానికి చెందిన బిడ్డగా ఈనెల 25న నేను ఆ విగ్రహావిష్కరణకు వెళ్తే పది మంది నాపై దాడి చేశారు. నాతో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును అడ్డుకున్న పోలీసులు మాపై కేసులు నమోదు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రోద్బ లంతోనే ఇదంతా జరిగింది. మాకు జరిగిన అవమానంపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తా. – పిడమర్తి రవి -
రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు
సాక్షి, అవనిగడ్డ(గుంటూరు) : దివిసీమలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. వరద గండి పూడుస్తున్న వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నేతలు విచక్షణా రహితంగా కర్రలో దాడిచేసిన ఘటన మంగళవారం మోపిదేవి మండలం బొబ్బర్లంకలో జరిగింది. ఎస్ఐ డి.సందీప్‌కుమార్ ఘటనా స్ధలికి వచ్చి దాడికి పాల్పడిన వారిని చెల్లా చెదురు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం ఐదు రోజుల క్రితం వచ్చిన వరదలకు బొబ్బర్లంక ప్రధాన రహదారికి గండి పడింది. మూడు రోజుల క్రితం వరద తగ్గుముఖం పట్టడంతో గండిపై తాడిచెట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు గండి పూడ్చమని చెప్పడంతో గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ గ్రామ కన్వీనర్ అరవింద్, అతని తండ్రి బసవ పున్నయ్య తూములు వేసి గండి పూడ్పించే పనులు చేస్తున్నారు. కర్రలతో దాడి చంద్రబాబు పర్యటనలో భాగంగా సాయంత్రం ఐదు గంటల సమయంలో గండివద్దకు వచ్చిన కొంతమంది టీడీపీ నాయకులు చంద్రబాబుకు గండి చూపిద్దామంటే ఎందుకు పూడ్పిస్తున్నారని వాగ్వాదానికి దిగారు. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చినపుడు వరద తగ్గగానే పూడ్పించ మన్నారని అందుకే పూడుస్తున్నామని బసవపూర్ణయ్య బదులిచ్చారు. పూడ్చమని చెప్పడానికి వాళ్లెవరూ అని ఇష్టారాజ్యంగా దుర్భాషలాడారు. ప్రజలకు ప్రయోజనానికి ఆదేశించినా నేతలను ఎందుకు తిడతారని అనడంతో మూకుమ్మడిగా బసవపూర్ణయ్యపై టీడీపీ నాయకులు బాల రామకృష్ణ, బాల భార్గవ్, బాల తేజ, వేములపల్లి సురేంద్ర, దొప్పలపూడి జగదీష్‌లు కలిసి కర్రలతో దాడిచేసి విచక్షణా రహితంగా కొట్టారు. కేకలు వేయడంతో సమీపంలో ఉన్న అతని కుమారుడు వైఎస్సార్సీపీ గ్రామ కన్వీనర్ అరవింద్ అడ్డుపడటంతో అతనిని కొట్టారు. అదే సమయంలో అటువైపు వెళుతున్న అవనిగడ్డ ఎస్ఐ సందీప్‌కుమార్ వచ్చి దాడిచేస్తున్న వారిని చెల్లా చెదురు చేయడంతో పారిపోయారు. బాబు మెప్పు కోసం దాడి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న ముమ్మనేని బసవపూర్ణయ్య, అరవింద్‌ని పరామర్శించారు. ఈ సందర్భంగా సింహాద్రి మాట్లాడుతూ తాడిపట్లెపై వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడటంతో గండి పూడుస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాలు విచక్షణా రహితంగా దాడిచేయడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు మెప్పు కోసం గూండాల్లా దాడి చేస్తారా అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, వైఎస్సార్సీపీ నాయకులకు భద్రత కల్పించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు, నాయకులు సింహాద్రి వెంకటేశ్వరరావు, మోహన శివరాజయ్య, లింగం జగదీష్ తదితరులు ఉన్నారు. -
పేదల భూములపై పెద్దల కన్ను..!
అవి పేద గిరిజనులకు ప్రభుత్వం ఫలసాయం కోసం ఇచ్చిన ఢీ పట్టా భూములు. క్రయవిక్రయాలు జరిపేందుకు అవకాశం లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా నేరం. ఆ భూములను కొందరు పెద్దలు గద్దల్లా తన్నుకుపోవాలని స్కెచ్ వేశారు. కబ్జా చేసేందుకు ఏడునెలల కిందట పావులు కదిపారు. దీనిని పసిగట్టిన స్థానిక ప్రజాప్రతినిధి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భూములను రక్షించారు. మళ్లీ అవే భూములను సొంతం చేసుకునేందుకు విశాఖపట్నం జిల్లాకు చెందిన ఓ మహిళ స్థానికులకు సొమ్ములు ఎరవేసి, అధికారుల కళ్లుగప్పే ప్రయత్నాలు చేస్తున్న అంశం మెంటాడ మండలంలోని కొండలింగాలవలసలో అలజడి రేపుతోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: మెంటాడ మండలంలోని కొండలింగాలవలస రెవెన్యూ పరిధిలో రెడ్డివానివలస–కొండమామిడివలస మధ్యన సర్వే నంబర్ 269లో 25.14 ఎకరాలు , 267/3లో 3.72 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని కాజేసుం దుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొందరు పెద్దలు రంగంలోకి దిగారు. అయితే, ఈ భూమిని గతంలో సమీప గ్రామాల గిరిజనులు సాగు చేసుకుని జీవించేందుకు ప్రభుత్వం ఢీ పట్టాలు మంజూరు చేసింది. సుమారు పదిమంది రైతులు ఆ భూమిని సాగుచేసేవారు. వారిలో ఇబ్బరు మినహా మిగిలినవారు చనిపోయారు. వారి వారుసులెవరూ ఆ భూములను సాగుచేయడంలేదు. ఈ ప్రాంతంలో ఎకరా భూమి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య రేటు పలుకుతోంది. ఈ విషయాన్ని పసిగట్టిన విశాఖకు చెందిన ఓ మహిళ రంగంలోకి దిగారు. ఆ ఇద్దరి నుంచి భూమిని కొనుగోలు చేయడంతో పాటు మిగిలిన భూమినంతటినీ దక్కించుకోవాలని పథకం వేశారు. ఈ ఏడాది జనవరిలో ఆ భూమిలో బోర్లు కూడా వేసి, చుట్టూ ఇనుప కంచె వేయడానికి సన్నాహాలు చేశారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు విశాఖ మహిళ దుశ్చర్యలను స్థానిక గిరిజనులతో కలిసి అడ్డుకున్నారు. అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. భూములు తమవిగా చెబుతున్న వారు సాగు చేస్తున్నట్లు ఆధారాలు ఉంటే తీసుకొని రావాలని అప్పటి తహసీల్దార్ రొంగలి ఎర్రినాయుడు వారికి నోటీసులు జారీ చేశారు. రెవెన్యూ అధికారులు మొత్తం భూమిని సర్వే చేశారు. 269,67/3 సర్వేనెంబర్లలో గల భూమిని ప్రభుత్వం భూమిగా గుర్తించారు. ఎవరూ ఆ భూముల జోలికి వెళ్లరాదని, నిబంధనలు అతిక్రమించి భూముల్లో ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అప్పటి తహసీల్దార్ రొంగలి ఎర్రినాయుడు ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. భూమిని చదును చేసిన జేసీబీని కూడా స్వాధీనం చేసుకొని ఆండ్ర పోలీసులకు అప్పగించించారు. మళ్లీ కథ మొదలు.. ఏడు నెలల పాటు ఈ భూముల గురించి పట్టించుకోని విశాఖ మహిళ మరలా తన ప్రయత్నాలను మొదలుపెట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకున్నారు. ఇదే సమయంలో తహసీల్దార్ ఎర్రినాయుడికి బదిలీకావడంతో ఆయన స్థానంలో కొత్త తహసీల్దార్‌గా నెల్లూరి మంగరాజు గత నెల 24న వచ్చారు. ఆయనకు విషయం తెలిసి, అర్ధమయ్యేలోగా భూములు పూర్తిగా సొంతం చేసుకోవాలని ప్రయత్నించారు. దీనికోసం కొందరు స్థానిక వ్యక్తులతో ఒప్పందం చేసుకున్నారు. వారికి కొంత సొమ్ము కూడా ఆ మహిళ ముట్టజెప్పారు. అయితే, ఆ సొమ్ములు పంచుకోవడంలో ఆ వ్యక్తుల మధ్య విభేదాలు తలెత్తడం వల్ల కొత్త వివాదం మొదలైంది. డబ్బుల కోసం ఆ మహిళను వారిలో కొందరు వేధించడం ప్రారంభించారు. చివరికి పోలీస్ స్టేషన్ వరకు వారి పంచాయితీ చేరింది. ఈ నేపధ్యంలో కొత్త తహసీల్దార్‌కు ఈ వివాదం గురించి తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఆయన ఈ భూములపై మరోసారి సర్వేయర్‌తో సర్వే చేయించడానికి సిద్ధమవుతున్నారు. చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వ భూములను కాపాడడం తహసీల్దార్‌గా నా బాధ్యత. కొండలింగాలవలస రెవెన్యూ పరిధిలో కొన్ని భూములకు సంబంధించి వివాదాలున్నట్టు నా దృష్టికి వచ్చింది. గత తహసీల్దార్ వాటిని సర్వే చేయించి ప్రభుత్వ భూములుగా గుర్తించి బోర్డులు పెట్టించారని తెలిసింది. నేను కొత్తగా వచ్చినందున కొంత అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా రెండు రోజుల్లో భూములను సర్వే చేయిస్తాం. రికార్డులు పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ భూములు తన్నుకుపోతుంటే మాత్రం చూస్తూ ఊరుకోం. – నెల్లూరి మంగరాజు, తహసీల్దార్, కొండలింగాలవలస -
‘పోడు’ బినామీలు
సాక్షి, ఆసిఫాబాద్: గిరిజనుల మాటున బడా బాబులు ‘పోడు’దందా సాగిస్తున్నారు. అనాది నుంచి ఆదివాసీలు అడవిని ఆధారం చేసుకుని సంప్రదాయ పోడు సాగు చేస్తున్నంత కాలం అటవీ ఆక్రమణలు పెరగలేదు. ఎప్పుడైతే అటవీ అధికారులపై గిరిజనేతర, స్థానిక లీడర్ల పెత్తనం మొదలైందో అప్పటి నుంచి అక్రమ కలప రవాణా, భూకబ్జాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గతంలో పెద్ద ఎత్తున పచ్చని అడవిని నరికి సుదూర ప్రాంతాలకు అక్రమంగా కలప రవాణా సాగించి కోట్లు గడించిన వారున్నారు. గత కొంత కాలంగా కలప రవాణా కాస్త తగ్గుముఖం పట్టడంతో అక్రమార్కుల కన్ను అటవీ భూములపై పడింది. కబ్జాలకు పాల్పడుతూ పెద్ద ఎత్తున అటవీ భూములు సాగు చేస్తూ గిరిజనుల ముసుగులో అటవీ హక్కు పత్రాలకు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి మండలానికో నేత.. జిల్లా వ్యాప్తంగా ఒక్కో మండలంలో ఒక్కో నేత స్థానికంగా ఉన్న పలుకుడిని ఉపయోగించుకుని పెద్ద ఎత్తున అటవీ భూములను చెరపడుతున్నారు. ప్రస్తుతం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా అటవీ అధికారులు ఈ కబ్జాల వివరాలు సేకరిస్తున్నారు. కాగజ్‌నగర్ మండలం సార్సాల ఘటనలో ఇదే తీరుగా పెద్ద మొత్తంలో భూ కబ్జాలకు పాల్పడడంతోనే చినికి చినికి గాలివానలా మారి దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. ఇందులో చిన్న చిన్న రైతుల కంటే పెద్ద తలల చేతిలోనే ఎక్కువ భూమి కబ్జాలో ఉన్నట్లు తేలింది. ఇక ఇదే మండలంలో పట్టణంలో ఉండే అనేక మంది పెద్ద ఎత్తున అటవీ భూములను సాగు చేస్తున్నవారు. తమ అవసరాల కోసం ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఏటా పోడు సాగు చేస్తూ లక్షలు గడిస్తున్నారు. రేగులగూడ, ఊట్పల్లి లాంటి గిరిజన గూడెల్లో ఎకరాకు అతి తక్కువగా ముట్టుజెప్పి గిరిజన భూములను సాగు చేస్తూ కొంత మంది వ్యాపారులు లక్షలు గడిస్తున్నారు. ఇక ఆసిఫాబాద్ మండలం మోవాడ్, సిరియన్ మోవాడ్ లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో భూములు కౌలు పేరిట తీసుకుని లబ్ధి పొందుతున్నారు. కెరమెరి మండలంలో ఓ నేత వందల ఎకరాల్లో అనేక గ్రామాల్లో ఏజెన్సీ భూములను చెరపట్టి రెవెన్యూ భూములుగా మార్చేపనిలో ఉన్నారు. కుమురం భీం ప్రాజెక్టు ముంపు ప్రాంతంతో పాటు ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న భూములను తన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఇప్పటికే బదాలింపు చేయించారు. ఇందుకోసం స్థానిక రెవెన్యూ అధికారులు కూడా సహకరించడంతో పెద్ద మొత్తంలో అటవీ భూమి పట్టాలుగా మారింది. జైనూర్ మండల కేంద్రానికి చెందిన కొంత మంది వడ్డీ వ్యాపారులు తమ అప్పుల కింద భూములను తాకట్టు పెడుతున్నారు. వాంకిడిలో కొంత మంది వ్యాపారులు పెద్ద ఎత్తున వివాదాస్పద భూములు కొనుగోలు చేస్తున్నారు. వీటిపై పంట రుణాలు పొందడంతో పాటు పెట్టుబడి సాయం అందుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం అందించడం మొదలైనప్పటి నుంచి పోడుకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ మరింత పెరిగిపోయింది. బెజ్జూరు లాంటి ప్రాంతంలోనూ గిరిజనేతరులు కొద్ది మంది పది ఎకరాల కంటే అధికంగా సాగు చేస్తున్నవారు ఉన్నారు. ఇలా అమాయక గిరిజనుల జీవనోపాధి కోసం మొదలైన పోడు రానురానూ ఓ వ్యాపారంగా మారుతోంది. మరోవైపు రెవెన్యూ, అటవీ సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చేందుకు సైతం కొంతమంది సమగ్ర భూ సర్వేలో పట్టాపాస్ పుస్తకాలు పొందేందుకు తప్పుడు పత్రాలు సృష్టించి మరీ తమ పేరున దరఖాస్తులు చేసుకుంటున్నారు. అమాయక గిరిజన రైతుల బలి.. బడా బాబులు అమాయక రైతుల ముసుగులో వందల ఎకరాలు కబ్జాలు చేస్తుండడంతో స్థానికంగా పోడు భూములపైనే ఆధారపడి జీవిస్తున్నవారికి అన్యాయం జరిగిపోయే పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ ముందుగా గిరిజనేతరుల కబ్జాలో ఉన్న అటవీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ వేస్తోంది. ఎవరి దగ్గర ఎన్ని ఎకరాలు ఉన్నాయో వివరాలు సేకరిస్తోంది. అయితే కేవలం పోడు భూములపైనే పొట్టపోసుకునే అనేక మందికి తమ భూములు కూడా ఎక్కడ పోతాయోనని జిల్లాలో జరుగుతున్న వరస ఘటనలతో భయాందోళన మొదలవుతుంది ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యామ్నాయ అటవీ పెంపకంలో భాగంగా కాగజ్‌నగర్, పెంచికల్పేట్, బెజ్జూరు, చింతలమానెపల్లిలో మొక్కలు నాటే పనిలో అటవీ అధికారులు ఉన్నారు. దీంతో చిన్న చిన్న రైతులు ఎకరం నుంచి మొదలై ఐదేకరాల లోపు ఉన్న వారు పోడు జీవనంగా బతికే వారికి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పోడుపై స్పష్టమైన విధానం ప్రకటించి అర్హులను గుర్తించి న్యాయం చేయాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. -
తమ్ముడు.. కుమ్ముడు...!
సోమందేపల్లి మండలం సర్వే నంబర్ 64లో రోడ్డు మెటల్ క్వారీకి గనులశాఖ అధికారులు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి కుమార్తె బీకే రోజా పేరుతో అనుమతులు ఇచ్చారు. ఇక్కడ 20,500 క్యూబిక్ మీటర్లు మాత్రమే తవ్వుకోవాలని సూచించారు. అయితే ఈ క్వారీలో దాదాపు 90 వేల క్యూబిక్ మీటర్లకుపైగా అక్రమంగా తవ్వకాలు జరిపారు. 2018 నవంబర్ 1న క్వారీని పరిశీలించిన రాష్ట్ర గనులశాఖ అధికారులు దీన్ని గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించడం, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారని తెలిసి రూ.98 లక్షలు జరిమానా విధించారు. అయితే బీకే కుటుంబం జరిమానా చెల్లించకపోగా... నేటికీ తవ్వకాలు జరుపుతూ రోడ్డు మెటల్‌ను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటోంది. అనుమతులు ఉండవు.. తవ్వేస్తారు. రాయల్టీ చెల్లించరు.. రవాణా చేస్తారు. లీజు ఒకచోట పొంది మరో ప్రాంతంలో తవ్వేస్తారు. ఎవరూ పట్టించుకోరు. కొండలను పిండిచేసి రూ.కోట్లు వెనకేసుకున్నారు. అయినా ప్రభుత్వానికి పైసా చెల్లించరు. జిల్లాను పట్టి పీడించిన మైనింగ్ మాఫియా దెబ్బకు ‘అనంత’లోని గనులు, కొండలు నామ రూపాల్లేకుండా పోయాయి. ఇవన్నీ తెలిసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో...గత ఐదేళ్లలో టీడీపీ నేతలు సహజ వనరులన్నీ దోచేశారు. అక్రమార్జనకు అలవాటుపడిన వారంతా నేటికీ దందా నడిపిస్తూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న క్వారీలు- 320 గ్రానైట్ క్వారీలు- 120 రోడ్ మెటల్ క్వారీలు- 200 పర్యావరణ అనుమతులున్న క్వారీలు- 120 సాక్షి, పెనుకొండ/అనంతపురం టౌన్: కరువుకు చిరునామాగా మారిన జిల్లాలో సహజవనరులకు మాత్రం కొదవలేదు. అందుకే గత ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు వీటిపైనే కన్నేశారు. మనీ కోసం మైనింగ్ మాఫియా నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపి రూ.కోట్లు సంపాదించారు. క్వారీలు, గనులను అనుక్షణం పర్యవేక్షించాల్సిన భూగర్భ గనుల శాఖ అధికారులు కళ్లుమూసుకోవడంతో ఇష్టానుసారం చెలరేగిపోయారు. యథేచ్ఛగా అక్రమ క్వారీలు, అనుమతులు లేని క్రషర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు. అయినా అధికారులు మాత్రం చర్యలు తీసుకోలేకపోయారు. 120 క్వారీలకే అనుమతులు జిల్లా వ్యాప్తంగా 320లకుపైగా క్వారీలుండగా...వీటిలో 120 గ్రానైట్ క్వారీలు, 200 రోడ్డు మెటల్ క్వారీలున్నాయి. ప్రతి క్వారీకి పర్యావరణ అనుమతులు తప్పని సరి. లేని వాటిని సీజ్ చేయాలని కేంద్ర పర్యావరణ అధికారులు భూగర్భ గనుల శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. అయితే జిల్లాలో 120 క్వారీలకు మాత్రమే పర్యావరణ అనుమతులున్నాయి. మిగిలిన వాటికి అనుమతులు లేకున్నా... ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. తీసుకున్న లీజు ప్రాంతంలో కాకుండా సమీపంలోని ప్రాంతంలో తవ్వకాలు చేపడుతున్నారు. అయినా గనులశాఖ అధికారులు మాత్రం అక్రమ తవ్వకాలను గుర్తించలేకపోతున్నారు. గనులశాఖకే ప్రత్యేకంగా విజిలెన్స్ విభాగం ఉన్నప్పటికీ ఆమ్యామ్యాలకు అలవాటుపడిన వారంతా కళ్లుమూసుకుని చోద్యం చూస్తున్నారు. ప్రతినెలా 12 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్ తరలింపు జిల్లాలోని రోడ్డు మెటల్ క్వారీల నుంచి ప్రతి నెలా 12 లక్షల క్యూబిక్ మీటర్లకుపైగా మెటల్‌ను తరలిస్తున్నారు. ఈలెక్కన ప్రతి క్వారీ నిర్వాహకుడు రాయల్టీ చెల్లించి పర్మిట్లు తీసుకుంటే... ప్రతినెలా రోడ్డు మెటల్ క్వారీలనుంచే ప్రభుత్వానికి దాదాపు రూ.12 కోట్లకుపైగా ఆదాయం రావాల్సి ఉంది. అయితే క్వారీ నిర్వాహకులు మాత్రం 2 లక్షల క్యూబిక్ మీటర్లకు కూడా రాయల్టీ చెల్లించలేదు. దీంతో ప్రతి నెలా ప్రభుత్వం దాదాపు రూ.10 కోట్లకుపైగా.... ఏడాదికి దాదాపు రూ.120 కోట్లకు పైగా ఆదాయం కోల్పోతోంది. గనులశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో క్వారీ నిర్వహకులు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తక్కువ పర్మిట్లకు రాయల్టీ చెల్లించి అక్రమంగా రోడ్డు మెటల్‌ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు సైతం అక్రమ వ్యాపారాన్ని అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఎల్.నారాయణ చౌదరి దందా ఎక్కువే మాజీ మంత్రి పరిటాల సునీత సమీప బంధువు ఎల్.నారాయణ చౌదరి 2015లో సోమందేపల్లి మండలంలోని సర్వే నంబర్లు 509లోని 3 హెక్టార్లు, 2 హెక్టార్లు చొప్పున రెండు రోడ్డు మెటల్ క్వారీలకు లీజు తీసుకున్నాడు. 2016–17 సంవత్సరంలో క్యూబిక్ మీటరుకు కూడా రాయల్టీ చెల్లించలేదు. 2017–18లో మాత్రం ఒక క్వారీకి 6,500 క్యూబిక్ మీటర్లకు గానూ రూ.6.50 లక్షలు, మరో క్వారీ తరఫున 1,300 క్యూబిక్ మీటర్లకు రూ.1.30 లక్షలు చెల్లించాడు. 2015 నుంచి ఇప్పటి వరకు మొత్తంగా రూ.8 లక్షల్లోపే రాయల్టీ చెల్లించాడు. క్వారీలో మాత్రం నేటికీ తవ్వకాలు చేపడుతూనే ఉన్నారు. ఈ మూడేళ్లకాలంలో ఇంతతక్కువ మొత్తంలో రాయల్టీ చెల్లించిన క్వారీలు జిల్లాలోనే లేకపోవడం గమనార్హం. అయితే గనులశాఖ అధికారులు మాత్రం ఈ క్వారీలను పర్యవేక్షించిన దాఖలాల్లేవు. ప్రస్తుతం క్వారీని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఈ రెండు క్వారీల నుంచే దాదాపు రూ.2 కోట్లకు పైగా విలువ చేసే ఖనిజాన్ని తరలించుకు పోయినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు వాటిని చూసే సాహసం కూడా చేయడం లేదు. వీటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఏస్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయో తెలిసే అవకాశం ఉంది. ఇన్చార్జి అధికారితోనే ఇబ్బందులు గనుల శాఖ అనంతపురం ఏడీగా పనిచేస్తున్న వెంకట్రావును ఆరు నెలల క్రితం అప్పటి కలెక్టర్ వీరపాండియన్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. దీంతో తాడిపత్రి ఏడీగా ఉన్న వెంకటేశ్వరరెడ్డికి అనంతపురం డివిజన్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన వారం రెండు రోజులు మాత్రమే అనంతపురం డివిజన్లోని క్వారీ వ్యవహారాలు చూస్తున్నారు. అందువల్లే అక్రమ క్వారీలపై నిఘా ఉంచలేకపోతున్నారు. ఇద్దరు ఆర్ఐలు ఉన్నప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. రాయల్టీ ఎగవేత ఇలా.... ప్రతి నెలా తరలించే మెటల్ క్వారీ: 12 లక్షల క్యూ.మీ రాయల్టీ రూపంలో ఖజానాకు చేరాల్సిన మొత్తం : రూ.12 కోట్లు్ల క్వారీ నిర్వాహకులు నెలలో చెల్లిస్తున్న మొత్తం: రూ.2 కోట్లు ఏడాదికి ప్రభుత్వానికి అందకుండా పోతున్న మొత్తం: రూ.120 కోట్లు చర్యలు తీసుకుంటాం సోమందేపల్లి మండలంలోని రోడ్డు మెటల్ క్వారీలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతాం. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేసి ఉంటే చర్యలు తీసుకుంటాం. నిబంధనలు ఉల్లంఘించిన కొందరు క్వారీ నిర్వాహకులకు జరిమానా విధించాం. ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని నోటీసులు పంపాం. కొందరు కోర్టులను ఆశ్రయించడం వల్ల వారికి నోటీసులు పంపలేదు. కోర్టు ఉత్తర్వులు రాగానే జరిమానా సొమ్మును పైసాతో సహా వసూలు చేస్తాం. – వెంకటేశ్వరరెడ్డి, గనుల శాఖ ఏడీ -
స్థానికేతరులు గెలిస్తే మంత్రి పదవి ఖాయం
సాక్షి, వెంకటగిరి (నెల్లూరు): వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందిన స్థానికేతరులకే సీఎం, మంత్రి, చైర్మన్ పీఠాలు దక్కుతాయనే సెంటిమెంట్ ప్రతి సారి రుజువైంది. స్థానికులైతే మాజీ ఎమ్మెల్యేలుగానే మిగిలిపోతారు. 1978లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోటకు చెందిన నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి చక్కెర శాఖ మంత్రి, ఆర్టీసీ చైర్మన్ పదవులను అలంకరించారు. 1983లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోటకు చెందిన నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ చైర్మన్ పదవి పొందారు. 1989 ఎన్నికల్లో విజయం సాధించిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తొలుత రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో అత్యున్నతమైన ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. 2004 ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందిన నేదురుమల్లి రాజ్యలక్ష్మి రాష్ట్ర ప్రాథమిక విద్య, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీసీ తరఫున పోటీలో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి గతంలో పలు దఫాలుగా మంత్రిగా పనిచేశారు. స్థానికులకు అచ్చిరాని వైనం వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పాదిలేటి వెంకటస్వామిరెడ్డి, కమతం షణ్ముగం, ఓరేపల్లి వెంకటసుబ్బయ్య, అల్లం కృష్ణయ్య, వీబీ సాయికృష్ణ యాచేంద్ర, వీవీఆర్కే యాచేంద్రతో పాటు వరుసగా రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కె.రామకృష్ణకు ఎలాంటి మంత్రి పదవి గానీ, ప్రభుత్వ పదవులు దక్కలేదు. -
దేవరకొండ బీజేపీ అభ్యర్థిపై స్థానిక నేతల దాడి
-
టీఆర్ఎస్ నేతల బాహాబాహీ
కవాడిగూడ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పేద ముస్లింలకు కానుకగా ప్రభుత్వం అందజేస్తున్న దుస్తుల పంపిణీలో టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది.సాక్ష్యాత్తు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సమక్షంలోనే ఇరు వర్గాల నేతలు పరస్పరదాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిలో ఒక నాయకుడిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే... రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు బడీమసీదు వద్ద మసీదు కమిటీ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి నాయిని, ఎమ్మెల్సీ సలీం, స్థానిక టీఆర్ఎస్ నేత షరీఫుద్దీన్‌ను ఆహ్వానించారు. నాయిని వేదిక వద్దకు వచ్చే సమయంలో జనం గుమిగూడటంతో షరీపుద్దీన్ వారిని పక్కకు జరగాలని కోరాడు. అక్కడే నిలుచుని ఉన్న స్థానిక నాయకుడు అబ్రార్ హుస్సేన్ ఆజాద్ పక్కకు జరగాలని చెప్పడంతో ఆగ్రహించిన అబ్రార్ హుస్సేన్ షరీపుద్దీన్‌తో వాగ్వివాదానికి దిగాడు. ఇరువురి మధ్య మాటామాట పురడగంతో పరస్పర దాడులకు దిగారు. అక్కడే బందోబస్తు నిర్వహిస్తున్న ముషీరాబాద్ సీఐ టీ.శ్రీనా«థ్‌రెడ్డి జోక్యం చేసుకొని అబ్రార్ హుస్సేన్‌ను స్టేషన్‌కు తరలించాడు. అనంతరం తోపులాట మధ్యే హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి చేతుల మీదగా దుస్తుల పంపిణి కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమంల్జో ముఠా గోపాల్ , శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహాగణపతి లడ్డూ లూఠీ!
తాళాలు పగులగొట్టి తీసుకెళ్లిన స్థానిక నాయకులు హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి లడ్డూ ప్రసాదాన్ని స్థానిక నాయుకులు లూఠీ చేశారు. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఉత్సవ కమిటీ కంప్యూటర్ రూమ్‌లో ఉన్న ప్రసాదాన్ని విడతల వారీగా తాళాలు పగులగొట్టి మరీ ఎత్తుకెళ్లారు. ప్రసాద పంపిణీ సందర్భంగా కమిటీ సభ్యులు, వలంటీర్లు, స్థానికులకు పంపిణీ చేసేందు కు 23 బ్యాగుల్లో ప్రసాదాన్ని మంటపం వద్దనున్న కంప్యూటర్ రూమ్‌లో భద్రపర్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులంతా సాయంత్రం అక్కడి నుంచి వెళ్లిపోగానే స్థానిక నాయకులు ఆ ప్రసాదం కోసం ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో తాళాలు పగులగొట్టి ఆరు బ్యాగుల ప్రసాదాన్ని తీసుకెళ్లారు. గమనించిన కొందరు స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో రూమ్‌కు మళ్లీ తాళాలు వేశారు. ఇదిలావుంటే... శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మరికొందరు స్థానిక నాయకులు వాహనంలో లడ్డూ బ్యాగులు తరలించారు. అదే సమయంలో అక్కడికి స్కార్పియోలో వచ్చిన పోలీసులు సైతం లడ్డూ బ్యాగులు తీసుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. -
‘గులాబీ’కి అలకల ముల్లు
ప్రస్తుత ఎన్నికల్లో మెజారిటీ అసెంబ్లీ సీట్లే లక్ష్యంగా ఇతర పార్టీల సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను పార్టీలోకి చేర్చుకుంటున్న టీఆర్ఎస్లో అసంతృప్తుల సెగ తగులుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న నాయకులకు.. వరుస వలసలతో ఆందోళన పెరుగుతోంది. టీఆర్ఎస్కు మొదటి నుంచి పట్టున్న వరంగల్ జిల్లాలో పార్టీకి అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన నేతలే ఉన్నారు. ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా... 2004 కాంగ్రెస్, 2009లో టీడీపీతో పొత్తులతో అవకాశం రాలేకపోయిన నియోజకవర్గ ఇన్చార్జిలు సైతం ఉన్నారు. స్వతంత్రంగా పోటీ చేస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటిస్తుండడంతో... ఇప్పటివరకు అవకాశం రాని వారిలో ఆశలు కలుగుతున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి, పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్న వారు ఇదే ఉద్దేశంతో ఉన్నారు. సాధారణ ఎన్నికల తరుణంలో ఇప్పుడు ఇతర పార్టీల నేతలు వరుసగా వస్తుండడం టీఆర్ఎస్ సీనియర్ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. ఇతర పార్టీల నేతలను తీసుకోవడంతో పార్టీ బలపడడం సంగతి ఎలా ఉన్నా... తమను కనీసం సంప్రదించకపోవడంతో పాత నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ అనుచరులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. తెలుగుదేశం చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ ఇటీవల టీఆర్ఎస్లో చేరారు. ఆమె రాకను వ్యతిరేకిస్తూ నియోజకవర్గ ఇన్చార్జి బి.కిషన్‌నాయక్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. మరో నేత బూక్యా రామారావు అసంతృప్తితో కాంగ్రెస్‌లో చేరారు. మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉన్న వారు సత్యవతి రాథోడ్ రాకతో అసంతృప్తితో ఉన్నారు. స్థానిక ఎన్నికల బీఫారంల పంపిణీలో సొంత వర్గానికే ప్రాధాన్యమివ్వడంతో మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉన్న వారు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిత్వం కోసం తీవ్ర పోటీ ఉంది. నియోజకవర్గ ఇన్చార్జి అచ్చ విద్యాసాగర్ 2009లో ఓడిపోయారు. అప్పటి నుంచి ఇన్చార్జిగా పని చేస్తున్నారు. రాష్ట్ర నేతలు గుడిమళ్ల రవికుమార్, నన్నపునేని నరేందర్, బొల్లం సంపత్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు టికెట్‌పై ఆశతో పని చేసుకుంటూ వచ్చారు. వీరిలో ఏ ఒక్కరికి వచ్చినా అందరూ సహకరించుకోవాలనే అవగాహనకు వచ్చారు. మాజీ మంత్రి కొండా సురేఖ ఇటీవల టీఆర్ఎస్లో చేరడంతో పరిస్థితి ఒక్కసారిగా మారింది. టికెట్ ఆశించిన వారంతా ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారు. ఇదే అదనుగా టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్‌లోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వరంగల్ నగరపాలక సంస్థలో పద వుల విషయంలో వీరికి హామీ ఇచ్చేలా కాంగ్రెస్ నుంచి ప్రతిపాదనలు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2004 ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి గెలిచిన టీఆర్ఎస్ నేత జి.విజయరామారావు మంత్రిగా పనిచేశారు. 2008 ఉపఎన్నికల్లో ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో మళ్లీ తన దృష్టి అంతా స్టేషన్ఘన్పూర్పైనే పెట్టారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న 2012లో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల్లో రాజయ్య చేతిలో పరాజయం పాలైన టీడీపీ సీనియర్ నేత కడియం శ్రీహరి 2013లో టీఆర్ఎస్ చేరారు. అప్పటి నుంచి ఈ నియోజకవర్గం టీఆర్ఎస్లో మూడు గ్రూపులు అయ్యాయి. మూడు వర్గాల మధ్య నిత్యం ఘర్షణలు చోటుచేసుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ప్రకటించిన తర్వాత జి.విజయరామారావు కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి కడియం శ్రీహరి, రాజయ్య వర్గాల మధ్య పోరు జరుగుతూనే ఉంది. వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే ఉద్దేశంతో టీఆర్ఎస్లో చేరిన కడియం శ్రీహరి... మళ్లీ ఎమ్మెల్యేగానే పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉండడంతో ఇటీవల రెండు వర్గాలు ఏకంగా కొట్టుకునే పరిస్థితి వచ్చింది. వరంగల్ జిల్లాకు సంబంధించి 2004 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆరు అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన మొదటి సాధారణ ఎన్నికలు కావడంతో పార్టీకి మంచి ఊపు వచ్చింది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు దూరమయ్యారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ జిల్లాలోని 12 స్థానాల్లో ఏడు చోట్ల పోటీ చేసింది. కేవలం ఒకే ఒక స్థానం గెలుచుకుంది. రానున్న ఎన్నికల సందర్భంగా పార్టీలో చేరికలు పెరిగిన నేపథ్యంలో నియోజకవర్గవర్గాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు దేనికి దారితీస్తాయోనని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సీఎం తీరుపై మండిపాటు
సాక్షి, చిత్తూరు: రెండున్నర సంవత్సరాలుగా సీఎం కుర్చీలో ఉన్న పీలే రు శాసనసభ్యుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాలో పార్టీ నాయకులకు, కిందిస్థాయి శ్రేణులకు నియోజకవర్గాల స్థాయిలో నామినేటెడ్ పదవులు కట్టబెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. కేవలం పార్టీ పదవులు కట్టబెట్టడానికి మాత్రమే పరిమితమయ్యా రు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతల్లో అసహనం మొదలయింది. తిరుపతి నియోజకవర్గంలో తుడ చైర్మన్ పదవిపై ఇద్దరు ఆశతో ఉన్నా ఆ దిశగా సీఎం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. శ్రీకాళహస్తిలో ఆలయ చైర్మన్ పోస్టుకు ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నా వారి ఆశ నిరాశగానే మిగిలింది. జిల్లాలోని కాణిపాకం దేవస్థానానికి కూడా పాల కమండలిని, చైర్మన్‌ను నియమించలేదు. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకాలు కూడా చేపట్టలేదు. పీలేరు నియోజకవర్గంలో కొన్ని, పలమనేరు, చంద్రగిరి, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లో మినహా ఇంకెక్కడా మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకాలు చేపట్టలేదు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. జిల్లాలోని పలు దేవాలయాలకు పాలకమండళ్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు ఆరు నెలల కిందట మంత్రి సీ.రామచంద్రయ్య సూచనల మేరకు పాలకమండళ్ల నియామకాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులు కూడా అలాగే ఉన్నాయి. తిరుపతి గంగమ్మగుడి దేవస్థానం పాలకమండలి నియామకం కూడా గ్రూప్ తగాదాలతో పెండింగ్‌లో ఉంచారు. పార్టీ పదవులతో బుజ్జగింపు సీఎం సొంత జిల్లాలో కేవలం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న అమాసకు డీసీసీబీ చైర్మన్ కట్టబెట్టడం మినహా కొత్తగా ఇంకెవరికీ పదవులు ఇవ్వలేదు. పార్టీ పరంగా ఊరూరికీ పీసీసీ పదవులు ఇస్తూ అందరినీ సంతృప్తిపరచాలని చూస్తున్నారు. చిత్తూరు జిల్లాలో దాదాపు పదిమందికి పీసీసీ కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల పదవులు కట్టబెట్టారు. గతంలో ఎంఆర్‌సీరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి పీసీసీ ఆఫీస్ బేరర్స్‌గా ఉండగా వీరికి పీసీసీ కార్యదర్శి పదవులు ఇచ్చారు. శ్రీకాళహస్తి నాయకులు కోలా ఆనంద్‌కు, తిరుపతి మాజీ కౌన్సిలర్ టీకే బ్రహ్మానందంకు, ఐకేపీ మహిళా సంఘాల నాయకురాలు శ్రీదేవికి , మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్‌కు, పీఆర్పీ మాజీ నాయకులు ఊకా విజయకుమార్‌కు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే కుమారుడు హరికృష్ణకు పీసీసీ కార్యదర్శి పదవులు కట్టబెట్టారు. ఇలా నియోజకవర్గానికి ఒక పీసీసీ కార్యదర్శి లెక్కన రాష్ట్ర స్థాయి పార్టీ పదవులు ఇచ్చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఏదైనా ప్రభుత్వ నామినేటెడ్ పదవి వస్తుందనుకున్న వారికి ఇలా పార్టీ పదవులతో సరిపెట్టడంతో వారు సన్నిహితుల వద్ద వాపోతున్నారు. సీఎం తనకు కావాల్సిన వారికి పదవులు ఇచ్చుకోవడం, నిజంగా పార్టీకోసం కష్టపడిన వారిని విస్మరించడం మినహా ఈ రెండున్నర సంవత్సరాల్లో చేసిందేమి లేదని, అడిగితే ముఖాన పార్టీ పదవులు విధిలిస్తున్నారని, ఇవి తమకెందుకని కొందరు జిల్లా స్థాయి నాయకులు మండిపడుతున్నారు. నియోజకవర్గాల్లో కింది క్యాడర్‌ను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జిలు బుజ్జగించినా పార్టీలో కొనసాగే పరిస్థితి కనపడడం లేదు. ముఖ్యంగా నామినేటెడ్ పదవులు దక్కుతాయన్న ఆశ లేకపోవడంతో రాజకీయ భవిష్యత్ కోసం ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. -
బలమా?.. బలహీనతా?
నాగర్‌కర్నూల్, న్యూస్‌లైన్: ఇటీవల బీజేపీలో చేరిన సీనియర్ రాజకీయ నాయకుడు, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీలో చేరిన కొద్దిరోజుల్లోనే పార్టీ నేతల తో మనస్పర్ధలు కొని తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. నాగం రాకతో నియోజకవర్గంలో బీజేపీ వె లిగిపోతుందని ఆశించిన కార్యకర్తలకు నిరాశే మిగులుతుందా? ఇటీవలి పరిణామాలు ముఖ్యం గా మంగళవారం నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన తె లంగాణ విలీన దినోత్సవసభ అవుననే చెబుతున్నా యి. రెండున్నర దశాబ్దాలుగా టీడీపీలో నెంబర్. 2 స్థానంలో వెలుగొంది తెలంగాణ అంశంపై పార్టీ అధినేతతో విభేదించి సొంతంగా నగారా సమితిని స్థాపించి అనతి కాలంలోనే దాన్ని బీజేపీలో విలీనం చేసిన విషయం తెలిసిందే.. నాగం రాకను స్థానిక నేతలు వద్దనలేక రారమ్మని ఆహ్వానించలేక అధిష్టానం నిర్ణయానికి తలొగ్గారు. స్వతంత్రుడిగా ఉన్నా.. పార్టీలో ఉన్నా వ్యక్తిగత ఎజెండా అమలు చేయడం, సొంత క్యాడర్‌ను ప్రోత్సహించడం ఆనవాయితీగా వస్తున్నదే. జాతీయ పార్టీ అయిన బీజేపీలో ఇదికొంత ఇబ్బందికరమైన అంశంగా మారింది. విలీనమా? విమోచనా? జేఏసీ పేరున నాగం నిర్వహించిన సభ బీజేపీలో అంతర్గత స్పర్ధలకు అద్దంపట్టింది. ముఖ్యంగా బీజేపీ నేతలు నిజాంపాలన నుంచి విమోచన దినంగా చెబుతుండగా.. నాగం మాత్రం విలీన దినోత్సవం అనడం, ‘తెలుగు భాషోన్మాదులు’ ఉర్దూ, దక్షిణ కల్చర్ నాశనం చేశారని అనడం బీజేపీ శ్రేణుల్లో విస్మయం కలిగించింది. వేదికపై మాట్లాడేందుకు ఏ ఒక్క బీజేపీ నేతకు అవకాశం దొరికినా ఆ విషయం బట్టబయలయ్యేదని పలువురు అంటున్నారు. సభ సొంత ఇమేజ్ కోసమేనా? బీజేపీలో చేరిన నాగం నాగర్‌కర్నూల్‌లో జరిగిన విలీన దినోత్సవం సభ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు చెబుతుండగా, ఇదంతా వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికేనని పలువురు భావిస్తున్నారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి నగారా సమితిని స్థాపించినా దాన్ని ఎక్కువకాలం నడపడం ఇబ్బందిగా మారడం, పెద్దగా గుర్తింపు కూడా లభించకపోవడంతో జాతీయ పార్టీ బీజేపీలో చేరిన నాగం తనస్థాయికి తగిన హోదా, అనుభవానికి తగిన బాధ్యతలు అప్పగించడం లేదన్న అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. దీంతోపాటు మరికొన్ని విషయాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డితో కూడా కొంత గ్యాప్ వచ్చినట్లు సమాచారం. జాతీయ పార్టీలో చేరి మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించి.. తెలంగాణ విషయంలో వేగంగా మారిన రాజకీయాలు, కాంగ్రెస్‌లో జైపాల్‌రెడ్డి రానున్నాడనే వార్తలు నాగం పోటీని మరింత సందిగ్ధంలోకి నెట్టేశాయి. దీంతో తిరిగి నాగర్‌కర్నూల్‌పైనే నాగం దృష్టి సారించినట్లు పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగర్‌కర్నూల్‌లో సొంత ఇమేజ్‌ని మరింత పెంచుకోవడానికి నాగం యత్నిస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీలో చేరడంతో ఇప్పటివరకు నాగంకు అండగా ఉన్న ముస్లిం ఓట్లలో కూడా చీలిక వచ్చినట్లు, ఆ గ్యాప్ భర్తీ చేసుకునేందుకే భాషోన్మాదులు అనడం, ఉర్దూ భాషను అణిచివేశారని చెప్పడం వెనక రహస్యం దాగి ఉందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం ప్రతి సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌లో విమోచన దినోత్స వం నిర్వహించేవారు. ఆర్డీఓ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలపై పతాకాలు ఎగురవేసేవారు. కాగా, నాగం రాకతో ఈ ఏడాది పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశించిన బీజేపీ శ్రేణులకు నిరాశే ఎదురైంది. బహిరంగ సభలో ఎ క్కడా బీజేపీ ప్రస్తావన లేకపోవడం, ఫ్లెక్సీలలో వేదికలపైనా పార్టీ వారికి ప్రాధాన్యం లేకపోవడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహంగా సభాస్థలి నుంచి వెనుదిరి గారు. పీఆర్ అతిథిగృహంలో మోడీ జన్మదినం సందర్భంగా కూడా కేక్ కట్‌చేసి ఒక్కడే మాట్లాడి ముగించారు. మరో బీజేపీ నేత ఎవరికీ అవకాశం ఇవ్వకపోవ డం పట్ల కూడా ఆ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం, ఆవేదన కలిగించినట్లు తెలిసింది.