బాధితుడిని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే సింహాద్రి. బాధితుడు బసవపున్నయ్య
సాక్షి, అవనిగడ్డ(గుంటూరు) : దివిసీమలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. వరద గండి పూడుస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ నేతలు విచక్షణా రహితంగా కర్రలో దాడిచేసిన ఘటన మంగళవారం మోపిదేవి మండలం బొబ్బర్లంకలో జరిగింది. ఎస్‌ఐ డి.సందీప్‌కుమార్ ఘటనా స్ధలికి వచ్చి దాడికి పాల్పడిన వారిని చెల్లా చెదురు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం ఐదు రోజుల క్రితం వచ్చిన వరదలకు బొబ్బర్లంక ప్రధాన రహదారికి గండి పడింది. మూడు రోజుల క్రితం వరద తగ్గుముఖం పట్టడంతో గండిపై తాడిచెట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు గండి పూడ్చమని చెప్పడంతో గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ గ్రామ కన్వీనర్ అరవింద్, అతని తండ్రి బసవ పున్నయ్య తూములు వేసి గండి పూడ్పించే పనులు చేస్తున్నారు.
కర్రలతో దాడి
చంద్రబాబు పర్యటనలో భాగంగా సాయంత్రం ఐదు గంటల సమయంలో గండివద్దకు వచ్చిన కొంతమంది టీడీపీ నాయకులు చంద్రబాబుకు గండి చూపిద్దామంటే ఎందుకు పూడ్పిస్తున్నారని వాగ్వాదానికి దిగారు. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చినపుడు వరద తగ్గగానే పూడ్పించ మన్నారని అందుకే పూడుస్తున్నామని బసవపూర్ణయ్య బదులిచ్చారు. పూడ్చమని చెప్పడానికి వాళ్లెవరూ అని ఇష్టారాజ్యంగా దుర్భాషలాడారు. ప్రజలకు ప్రయోజనానికి ఆదేశించినా నేతలను ఎందుకు తిడతారని అనడంతో మూకుమ్మడిగా బసవపూర్ణయ్యపై టీడీపీ నాయకులు బాల రామకృష్ణ, బాల భార్గవ్, బాల తేజ, వేములపల్లి సురేంద్ర, దొప్పలపూడి జగదీష్‌లు కలిసి కర్రలతో దాడిచేసి విచక్షణా రహితంగా కొట్టారు. కేకలు వేయడంతో సమీపంలో ఉన్న అతని కుమారుడు వైఎస్సార్‌సీపీ గ్రామ కన్వీనర్ అరవింద్ అడ్డుపడటంతో అతనిని కొట్టారు. అదే సమయంలో అటువైపు వెళుతున్న అవనిగడ్డ ఎస్‌ఐ సందీప్‌కుమార్ వచ్చి దాడిచేస్తున్న వారిని చెల్లా చెదురు చేయడంతో పారిపోయారు.
బాబు మెప్పు కోసం దాడి
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న ముమ్మనేని బసవపూర్ణయ్య, అరవింద్‌ని పరామర్శించారు. ఈ సందర్భంగా సింహాద్రి మాట్లాడుతూ తాడిపట్లెపై వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడటంతో గండి పూడుస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ గూండాలు విచక్షణా రహితంగా దాడిచేయడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు మెప్పు కోసం గూండాల్లా దాడి చేస్తారా అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, వైఎస్సార్‌సీపీ నాయకులకు భద్రత కల్పించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు, నాయకులు సింహాద్రి వెంకటేశ్వరరావు, మోహన శివరాజయ్య, లింగం జగదీష్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment