మహాగణపతి లడ్డూ లూఠీ!
తాళాలు పగులగొట్టి తీసుకెళ్లిన స్థానిక నాయకులు
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి లడ్డూ ప్రసాదాన్ని స్థానిక నాయుకులు లూఠీ చేశారు. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఉత్సవ కమిటీ కంప్యూటర్ రూమ్‌లో ఉన్న ప్రసాదాన్ని విడతల వారీగా తాళాలు పగులగొట్టి మరీ ఎత్తుకెళ్లారు. ప్రసాద పంపిణీ సందర్భంగా కమిటీ సభ్యులు, వలంటీర్లు, స్థానికులకు పంపిణీ చేసేందు కు 23 బ్యాగుల్లో ప్రసాదాన్ని మంటపం వద్దనున్న కంప్యూటర్ రూమ్‌లో భద్రపర్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులంతా సాయంత్రం అక్కడి నుంచి వెళ్లిపోగానే స్థానిక నాయకులు ఆ ప్రసాదం కోసం ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు.
శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో తాళాలు పగులగొట్టి ఆరు బ్యాగుల ప్రసాదాన్ని తీసుకెళ్లారు. గమనించిన కొందరు స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో రూమ్‌కు మళ్లీ తాళాలు వేశారు. ఇదిలావుంటే... శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మరికొందరు స్థానిక నాయకులు వాహనంలో లడ్డూ బ్యాగులు తరలించారు. అదే సమయంలో అక్కడికి స్కార్పియోలో వచ్చిన పోలీసులు సైతం లడ్డూ బ్యాగులు తీసుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు.