( ఫైల్ ఫోటో )
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ప్రవాస వేదన మొదలైంది. ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్న నేతలను కాదని, డబ్బు సంచులతో విమానం దిగుతున్న ప్రవాసాంధ్రుల(ఎన్‌ఆర్‌ఐ)కు పార్టీ అధినేత చంద్రబాబు పెద్దపీట వేయడం ఆ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. పార్టీ అధికారం కోల్పోయిన అనంతరం మూడున్నరేళ్లుగా పలువురు నాయకులు అన్నీ తామై సొంత డబ్బులు ఖర్చు చేసుకుని మరీ పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ పదవులు అనుభవించిన నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ప్రజా ప్రతినిధులు పలు చోట్ల మూడున్నరేళ్లుగా పత్తాలేకుండా పోయారు. \
అయినా సరే పార్టీనే నమ్ముకొని పనిచేసిన నాయకులు 2024 ఎన్నికల్లో పార్టీ టికెట్లపై ఆశలు పెంచుకున్నారు. ఎన్నికలు మరో ఏడాదిన్నరలో వస్తున్నాయనగా ఎన్‌ఆర్‌ఐలు డబ్బు సంచులతో హఠాత్తుగా ఊడిపడ్డారు. ఇది స్థానిక నాయకులకు మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో స్థానిక నేతలు, ఎన్‌ఆర్‌ఐల మధ్య విభేదాలు తీవ్రతరం అవుతున్నాయి. పార్టీని నమ్ముకున్న స్థానిక నేతలు అందుబాటులో ఉన్న కార్యకర్తలతో కలిసి పనిచేస్తున్నారు. విమానం దిగిన ఎన్‌ఆర్‌ఐలు మాత్రం నేరుగా కరకట్టలో చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆధిపత్యం చెలాయిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ అంటూ వారు ప్రచారం చేసుకుంటున్నారు. స్థానిక నాయకులకు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ వ్యవహారం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.
పలు చోట్ల ఎన్‌ఆర్‌ఐ చిచ్చు
తిరువూరు నియోజకవర్గంలో సైతం మాజీ ఎమ్మెల్యేను కాదని, ఓ ఎన్‌ఆర్‌ఐని టీడీపీ ఇన్‌చార్జిగా నియమించడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గన్నవరంలో టీడీపీ ఇన్‌చార్జిగా బచ్చుల అర్జునుడును నియమించినప్పటికీ, వచ్చే ఎన్నికల్లో అతనికి టికెట్ ఇవ్వకుండా, ఎన్‌ఆర్‌ఐల కోసం వెదుకుతున్నారని, నియోజకవర్గ పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది. ఇప్పటికే గ్రూపు తగాదాలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. తాజాగా ఉన్న గ్రూపులను కాదని, టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఎన్‌ఆర్‌ఐల కోసం వెదుకులాట ప్రారంభించడం హాట్ టాపిక్‌గా మారింది. పెనమలూరులో కూడా గ్రూపు తగాదాలను సాకుగా చూపి, ఎన్‌ఆర్‌ఐ ప్రయోగం చేసే దిశగా అధిష్టానం పావులు కదుపుతోందని ఆ పార్టీ వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి.
కంట్లో నలుసుగా..
విజయవాడ ఎంపీ కేశినేని నానిని కాదని, ఎన్‌ఆర్‌ఐ అయిన ఆయన తమ్ముడి చిన్నిని పార్టీ అధిష్టానం ప్రోత్సహించడాన్ని సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. చిన్ని ప్రస్తుతం అన్నా క్యాంటీన్లు, కిస్మస్ కానుకల పేరుతో హడావుడి చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో గ్రూపులు కడుతున్నారు. ఆయన విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో పార్టీకి కంట్లో నలుసుగా మారారనే భావన టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే వరుస పరాజయాలను మూట కట్టుకున్న టీడీపీ పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోజు రోజుకు మరింత దిగజారుతోందన్న భావన సొంత పార్టీలోనే వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులుగా ఎన్‌ఆర్‌ఐలను తెచ్చే ప్రయత్నాలు పార్టీ పరిస్థితిని మరింతగా దిగజార్చడం తప్ప ఉపయోగం ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన వారిని కాదని, ఎన్‌ఆర్‌ఐలకు ప్రాధాన్యం ఇవ్వడం చంద్రబాబు నైజాన్ని మరోసారి గుర్తు చేస్తోందని పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
గుడివాడలో రావికి సెగ
గుడివాడ నియోజకవర్గంలో వరుస పరాజయాలు ఇప్పటికే టీడీపీ క్యాడర్‌ను కుంగదీశాయి. ఓటమి పాలైనా కష్ట కాలంలో పార్టీకి అండగా నిలిచిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావుకు 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా, ఎసరు పెట్టే కార్యక్రమానికి అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టినట్లు చర్చ సాగుతోంది. దీనిని బలపరిచేలా గుడివాడలో ఓ ఎన్‌ఆర్‌ఐ క్రిస్మస్ కానుకలు పంచి, ఫౌండేషన్ ట్రస్టు ఏర్పాటు చేసి హడావుడి చేస్తున్నారు. చంద్రబాబు తనకే సీటు ఇస్తానని చెప్పారని, నియోజకవర్గంలో పనిచేసుకోవాలని సూచించారని రావి వెంకటేశ్వరావు చెబుతూ తన ఉనికి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు ఎన్‌ఆర్‌ఐ కూడా పార్టీ టికెట్ తనదేనని, చినబాబు సైతం హామీ ఇచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసేది తానేనని అంతర్గతంగా సన్నిహితుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ గ్రూపు తగాదాలతో టీడీపీ పరిస్థితి పూర్తిగా దిగజారింది. కష్ట కాలంలో పార్టీ జెండా మోసిన వారిని కాదని, తాజాగా వచ్చిన ఎన్‌ఆర్‌ఐకి పార్టీ అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment