ఇది రెడ్‌బుక్‌ పాలన: వైఎస్‌ జగన్‌ ధ్వజం | YS Jagan at the meeting of YSRCP leaders in Krishna district | Sakshi
Sakshi News home page

ఇది రెడ్‌బుక్‌ పాలన: వైఎస్‌ జగన్‌ ధ్వజం

Published Sat, Nov 30 2024 4:57 AM | Last Updated on Sat, Nov 30 2024 7:13 AM

YS Jagan at the meeting of YSRCP leaders in Krishna district

హామీల అమలు, వైఫల్యాలపై నిలదీస్తే దొంగ కేసులు  

కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ నేతల సమావేశంలో వైఎస్‌ జగన్‌ మండిపాటు 

రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి 

ప్రశ్నించే గొంతులను అణిచి వేయాలని చూస్తున్నారు 

సోషల్‌ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు 

పోస్టింగులు పెట్టినా, ఫార్వర్డ్‌ చేసినా కేసులు పెడుతున్నారు 

ఇదే పరిస్థితి ఎప్పుడూ ఉండదు.. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది 

ఈ సమయంలోనే మన పార్టీని గ్రామ స్థాయి వరకు మరింత పటిష్టం చేయాలి.. సంక్రాంతి తర్వాత పార్లమెంట్‌ నియోజకవర్గం యూనిట్‌గా జిల్లాల్లో పర్యటిస్తా 

‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ పేరుతో కార్యక్రమం.. ప్రతి బుధ, గురువారాల్లో జిల్లాల్లోనే కార్యకర్తలతో మమేకమవుతా 

కష్టకాలంలో పోరాట పటిమ సన్నగిల్లకూడదు  

ఈ సర్కారు అబద్ధాలు, మోసాలపై ప్రజల్లో కోపం రెట్టింపు అవుతోంది.. టీడీపీని సింగిల్‌ డిజిట్‌కు పరిమితం చేసే రోజును తప్పకుండా చూస్తాం

అబద్ధాలు చెప్పడం మనకు చేతగాదు. అతి నిజాయితీ, అతి మంచితనం మనకున్న సమస్యలు. కానీ రేపు మనమనుకుంటున్న ఈ సమస్యలే మళ్లీ మనల్ని అధికారంలోకి తెస్తాయి. ఆరు నెలలు తిరక్క మునుపే ఇవాళ పరిస్థితి చూస్తే.. ప్రతి ఇంట్లో ఒకటే చర్చ జరుగుతోంది. జగన్‌ కనీసం పలావు అయినా పెట్టేవాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు.. తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ పోయిందని చర్చ జరుగుతోంది.  – వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : ‘రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెడ్‌ బుడ్‌ రాజ్యాంగం నడుస్తోంది. ప్రజలకు మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి.. అని అడిగే పరిస్థితి టీడీపీకి లేదు. ఎక్కడ చూసినా వ్యవస్థలన్నీ కూప్పకూలిపోయిన పరిస్థితే కనిపిస్తోంది’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘మన ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య ఇప్పటికే ప్రతి ఇంట్లో పోలిక మొదలైంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది.. ఈ ఆరు నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎలా పని చేస్తోంది.. అన్న చర్చ ప్రతి ఇంట్లో  నడుస్తోంది’ అని స్థానిక సంస్థల ప్రజానిధులకు చెప్పారు. 

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మేయర్లతో సమావేశమయ్యారు. సంక్రాంతి తర్వాత పార్లమెంటు యూనిట్‌గా జిల్లాల బాట పడతానని, దాదాపు జనవరి ఆఖరు నుంచి ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతానని చెప్పారు. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటానని, ప్రతి పార్లమెంటును ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడకి వచ్చి బస చేస్తానన్నారు. 

బుధవారం మూడు నియోజకవర్గాల కార్యకర్తలతో, గురువారం మరో నాలుగు నియోజకవర్గాల కార్యకర్తలతో మమేకం అవుతానని చెప్పారు. పూర్తిగా కార్యకర్తలకే సమయం కేటాయిస్తానని, అక్కడే ఉంటూ వారితో మమేకమవుతూ, వారికి తోడుగా ఉంటూ వారికి మరింత దగ్గరయ్యే కార్యక్రమం చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..  

స్థానిక సంస్థల్లో ఎక్కడ చూసినా మనమే  
» రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎంపీపీల పరంగా, జెడ్పీటీసీ సభ్యుల పరంగా, మేయర్ల పరంగా జరిగిన స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో మన వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. 46 చోట్ల ఎన్నికలు జరిగితే 44  జెడ్పీటీసీ స్థానాల్లో మన పార్టీ గెలిచింది. ఎంపీపీలు, ఎంపీటీసీల స్థానాల్లో కూడా దేవుడి దయతో గొప్ప విజయాన్ని అందుకున్నాం. ఇవాళ స్థానిక సంస్థల్లో ఎక్కడ చూసినా మనమే కనిపిస్తాం. అయినా జనరల్‌ బాడీ మీటింగ్‌ ఎక్కడ జరిగినా మనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు. 

» మనం చెడు చేసి ప్రతిపక్షంలో కూర్చోలేదు. మీరంతా ప్రజాప్రతినిధులుగా ఎన్నికలప్పుడు తిరిగిన వాళ్లే. ప్రతి ఇంటికి, గడప గడపకూ మనం వెళ్లినప్పుడు ఏ ఇంటికి వెళ్లినా చిక్కటి చిరునవ్వుతోనే ప్రజలు అక్కున చేర్చుకున్నారు. కారణాలు ఏమైనా ఎన్నికలకు వచ్చే సరికి మనం అనుకున్న ఫలితాలు రాలేదు. మనందరికి తెలిసిన విషయం ఏమిటంటే.. జగన్‌ కుటుంబానికి అంతా మేలు చేశాడు. కానీ చంద్రబాబునాయుడు మాత్రం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు చేస్తానని చెప్పాడు. కాబట్టి ఆ ప్రలోభాలకు మొగ్గు చూపిన పరిస్థితులు మనం చూశాం.  

అతి నిజాయతీ.. అతి మంచితనం మనకున్న సమస్యలు  
» అబద్ధాలు చెప్పడం మనకు చేతగాదు. అతి నిజాయితీ, అతి మంచితనం మనకున్న సమస్యలు. జగన్‌ ఇవన్నీ చేయగలిగాడు.. చంద్రబాబునాయుడు వీటికన్నా ఓ రెండు మూడింతలు ఎక్కువ చెబుతున్నాడు.. అదీ మోడీతో కలిసి వస్తున్నాడు చేయగలుగుతాడేమోనని ఆశపడ్డారు. మన పరిపాలన కాలంలో మనం ఇంత చక్కగా బటన్లు నొక్కాం కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడేమోనన్న  ఆశ ప్రజలకు కలిగింది. దానివల్ల 10 శాతం మన ఓటు బ్యాంకు తగ్గింది. కానీ ఆరు నెలలు తిరక్క మునుపే ఇవాళ పరిస్థితి చూస్తే.. ప్రతి ఇంట్లో ఒకటే చర్చ జరుగుతోంది.  
» జగన్‌ కనీసం పలావు అయినా పెట్టేవాడు.. చంద్రబాబునాయుడు బిర్యానీ పెడతానన్నాడు.. తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ పోయిందని చర్చ జరుగుతోంది. కానీ రేపు మనమనుకుంటున్న సమస్యలే మళ్లీ మనల్ని అధికారంలోకి తెస్తాయి.   

అన్నింటా తిరోగమనమే  
» ఫీజులు ఇవ్వక పిల్లలు కాలేజీలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. జనవరి నుంచి ఫీజులు పెండింగ్‌. మన హయాంలో ప్రతి త్రైమాసికం అయిన వెంటనే ఒక నెల తనిఖీలకు గడువు ఇచ్చి, మరుసటి నెల ఇచ్చే పరిస్థితి. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజులు ఏప్రిల్లో వెరిఫికేషన్‌ చేసి మే నెలలో ఇచ్చాం. 

» ఇవాళ జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్, ఏప్రిల్, మే, జూన్‌ క్వార్టర్, జూలై, ఆగషు్ట, సెపె్టంబరు క్వార్టర్‌.. అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ జనవరి నాటికి సంవత్సరం ఫీజులు పిల్లలకు ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలే రూ.2,800 కోట్లు. మన హయాంలో ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన రూ.1,100 కోట్లు ఇచ్చేవాళ్లం. అవి కూడా బకాయిలే. వ్యవస్థని నడిపించే ఈ కార్యక్రమాలు కుప్పకూలుతున్న పరిస్థితి. దాదాపు రూ.3,900 కోట్లు కేవలం పిల్లల చదువులకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి.  

» ఆరోగ్యశ్రీకి సంబంధించి మార్చి నుంచి నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రూ.2,200 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవాళ పేదవాడు ఆసుపత్రి గడప ఎక్కా­లంటే, డాక్టర్లు ఉచితంగా వైద్యం అందిస్తారన్న నమ్మకం సన్నగిల్లింది. ఆరోగ్య ఆసరా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎక్కడుంది అనుకునే పరిస్థితికి ప్రజలు వచ్చారు. 108, 104 డయల్‌ చేసినా ఆంబులెన్స్‌ వస్తుందన్న పరిస్థితి లేదు. వాళ్లు స్ట్రైక్‌లు, ధర్నాలు చేస్తున్నారు.  

  

ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలపై నిలదీయండి  
» ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం’ కార్యక్రమాన్ని మొదలు పెట్టేలోగా జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్ధాయి వరకు వివిధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు, అన్ని కమిటీలు పూర్తి చేయాలని జిల్లా అధ్యక్షులకు ఇప్పటికే చెప్పాం. నా కార్యక్రమం మొదలైన తర్వాత మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ వ్యవస్థను బలోపేతం చేసే కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత బూత్‌ కమిటీల నుంచి గ్రామ కమిటీలు ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేపడతాం.  

» సంవత్సరం పూర్తయ్యే సరికి గ్రామంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ప్రశ్నిస్తూ ప్రతి ఇంట్లోంచి వాయిస్‌ రావాలి. చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాలను నిలదీయాలి. ఇది జరగాలంటే మండల, మున్సిపాల్టీ , వార్డు స్ధాయిలో మీరు చాలా కీలకమైన పాత్ర పోషించాలి. మండల, గ్రామ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే దిశగా మీరంతా అడుగులు ముందుకు వేయాలి.

అబద్ధాలు చెప్పలేదు.. చెప్పగలిగిందే చేశాం 
» మనం కుటుంబం మొత్తాన్ని ఒకటిగా చేసి మంచి చేశాం. మనం అబద్ధాలు చెప్పలేదు. మనం చేయగలిగింది మాత్రమే చెప్పాం. వాళ్లు మాత్రం ప్రతి ఇంటికి వెళ్లి ఇంట్లో ఎవరు కనిపించినా అబద్ధపు హామీలు ఇచ్చారు. ఇద్దరు పిల్లలు కనిపిస్తే.. నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని.. తల్లులు కనిపిస్తే నీకు రూ.18 వేలు అని.. కాస్త పెద్ద వయస్సులో 50 ఏళ్లు దాటిన అమ్మలు, అత్తలు కనిపిస్తే మీకు రూ.48 వేలు అని.. ఆ ఇంట్లో ఉద్యోగం వెతుక్కుంటున్న 20 ఏళ్ల పిల్లవాడు కనిపిస్తే నీకు రూ.36 వేలు అని.. అదే ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని.. చెప్పే పరిస్థితి చూశాం.  

» ‘వాళ్లు ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు సీఎం అయితే ఇవన్నీ జరగబోతున్నాయని ప్రలోభాలు పెట్టారు.. సాధ్యం కాని హామీలిచ్చారు.. అవి సాధ్యం కాదని తెలిసినా హామీలిస్తూ వాళ్లు ప్రచారం చేస్తున్నారు.. ప్రతి ఒక్కరినీ చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు’ అని చాలామంది నాకు చెప్పారు.  

చీకటి తర్వాత వెలుగు తప్పదు  
» కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత పగలు రాక తప్పదు. ఇది సృష్టి ధర్మం. కాబట్టి ఇది కచి్చతంగా గుర్తుపెట్టుకోండి. కష్టాల్లో ఉన్నప్పుడు పోరాటం చేయగలిగితే మనం తిరిగి నిలబడగలుగుతాం. కాలం గడిచే కొద్దీ ఈ భయాలు పోతాయి. మరో రెండు మూడు నెలల్లో అందరూ ధైర్యంగా రోడ్డు మీదకు వస్తారు. అందరిలో ఈ ధైర్యం రావాలి. 

ఎందుకంటే ప్రజల తరపున, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. ప్రజల తరఫున వారికి అండగా నిలవగలిగితే.. ప్రజలు మనతో పాటు నడుస్తారు. మీరందరూ ఎంపీపీ, జడ్పీటీసీ వంటి మండల స్థాయి నాయకులు.. మీరు ఇంకా ఎదగాలంటే ప్రతిపక్షంలో మీరు ఏ రకమైన పాత్ర పోషిస్తున్నారు అన్నదే నిర్ణయిస్తుంది.  

» కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. పలుమార్లు బెయిల్‌ పిటిషన్‌ వేస్తే.. రిజెక్ట్‌ అయ్యేది. ప్రతిపక్షంలో ఉంటూ రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌తో యుద్ధం చేశా. టీడీపీ, కాంగ్రెస్‌ రెండు పార్టీలు కలిసి నా మీద పిటిషన్లు వేశాయి. ఇంత మందితో యుద్ధం చేస్తున్నా.. నేను బెయిల్‌ పిటిషన్‌ వేసినప్పుడల్లా అన్న మాటేమిటంటే.. నేను బయటకు వస్తే ఇన్‌ప్లూయన్స్‌ చేస్తానని చెప్పే వారు. 

కేంద్రంలో, రాష్ట్రంలో వాళ్ల ప్రభుత్వాలే ఉన్నప్పటికీ నేను ప్రభావితం చేస్తానని బెయిల్‌ తిరస్కరించారు. ఇలా 16 నెలలు గడిపారు. కానీ ఏమైంది? ఆ తర్వాత బయటకు వచ్చా. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన సాగించాం. 

» నా కార్యక్రమం మొదలైన తర్వాత మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నాతో పాటు మీరూ, నేనూ ఇద్దరం కలిసి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేయాలి. ఇది మన ఎజెండా. గతంలో మనకు 151 స్థానాలు వచ్చాయి. ఈసారి తెలుగుదేశం పార్టీని సింగిల్‌ డిజిట్‌కు పరిమితం చేయాలి. 

కచ్చితంగా దేవుడు ఈ పని చేయిస్తాడన్న నమ్మకం ఉంది. ఏ మంచీ చేయకుండా కేవలం అబద్ధాలు, మోసం చేసినప్పుడు అది కోపం కింద మారుతుంది. ప్రజల్లో ఆ కోపం రెట్టింపు అవుతుంది. మన మీద ప్రేమ పెరుగుతుంది. ఆ రోజు మనం తప్పకుండా చూస్తాం. మోసమే పరమావధిగా ఉన్న వాళ్లను ప్రజలు ఏం చేస్తారో కూడా మనం చూస్తాం.    

ఈ రోజు నుంచి ఎన్నికలు అయ్యే వరకు.. అది రెండేళ్లయినా, మూడేళ్లయినా నేను మిమ్నల్ని కోరేది ఒక్కటే. మనలో పోరాట పటిమ సన్నగిల్లగూడదు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎల్లకాలం అధికారంలోనే ఉండం. కానీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం, ఎలా ప్రవర్తించాం అన్నది మాత్రమే మనల్ని పైకి తీసుకువస్తుంది. అది కచి్చతంగా గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిత్వం, విలువలు, విశ్వసనీయతలను మనం పడేస్తే మళ్లీ దక్కించుకోవడం కష్టం. కష్టకాలం అనేది మనకొక పరీక్ష.  

గ్రామ స్థాయిలో కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రతి ఒక్కరికీ ఫేస్‌ బుక్, ఇన్‌స్టా, వాట్సాప్‌ ఉండాలి. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని వీడియో తీసి అప్‌ లోడ్‌ చేయాలి. యూట్యూబ్‌లో కూడా పోస్ట్‌ చేయాలి. సంవత్సరం పూర్తయ్యే సరికి గ్రామంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ప్రశ్నిస్తూ ప్రతి ఇంట్లోంచి వాయిస్‌ రావాలి. అది మనం చేస్తూ, మన కార్యకర్తలతో చేయించాలి. 

సూపర్‌ సిక్స్‌ ఏమైంది? ఏమైంది సూపర్‌ సెవన్‌? మాకు చెప్పిన మాటలు ఏమయ్యాయి? అన్న దగ్గర నుంచి మొదలయ్యే ప్రశ్నల వర్షం.. ఏమైంది మా స్కూల్‌? ఏమైంది మా హాస్పిటల్‌? ఏమైంది మా పంటల కొనుగోలు పరిస్థితి? ఏమైంది మా ఆర్బీకే? అంటూ ప్రశ్నల పరంపర కొనసాగాలి. ఆ దిశగా అడుగులు  ముందుకు పడాలి.   

విద్య, వైద్యంతోపాటు చివరకు ధాన్యం కొనుగోలు పరిస్థితీ దయనీయంగా ఉంది. దళారీలు కొనేదాకా ప్రభుత్వం అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా లేదు. ధాన్యం కొనుగోలుకు ఎంఎస్పీ రూ.1,720 అయితే రైతులు కృష్ణా జిల్లాలోనే రూ.300 తక్కువకు అమ్ముకుంటున్నారు. ఆర్బీకేల ద్వారా దళారీల వ్యవస్ధను తీసేసి, ఈ–క్రాప్‌ చేసి పారదర్శకంగా మనం కొనుగోలు చేసినట్టు.. ఈ  ప్రభుత్వం కొనాల్సిన సమయంలో కొనుగోలు చేస్తే.. రైతులకు మద్దతు ధర వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం అలా చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఇలా ప్రతి వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది.  

రాష్ట్రంలో మరోవైపు రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. దొంగ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తూ పోస్టింగులు పెట్టినా, ఫార్వర్డ్‌ చేసినా కూడా కేసులు పెట్టే అధ్వాన పరిస్థితులు చూస్తున్నాం. ఒక వైపు మంచి చేయకపోగా.. మరోవైపు ప్రశ్నించే గొంతులను అణిచి వేయాలని చూస్తున్నారు. 

మామూలుగా ఆరు నెలలకు ఊహించిన దానికన్నా అధ్వానంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. ఎన్నికలు ఎప్పుడు వచి్చనా మంచిదే. వీళ్లు ఈ మాదిరిగా ఇన్నిన్ని అబద్ధాలు ఆడి, ఇన్ని మోసాలు చేసిన వీళ్ల పరిస్థితి రేపు ఎన్నికల్లో ఎలా ఉంటుంది అన్నది నేను చెప్పాల్సిన పనిలేదు.    – వైఎస్‌ జగన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement