‘పోడు’ బినామీలు | Local Leaders Doing Dry Land Mafia In Adilabad | Sakshi
Sakshi News home page

‘పోడు’ బినామీలు

Published Fri, Jul 5 2019 10:30 AM | Last Updated on Fri, Jul 5 2019 10:32 AM

Local  Leaders  Doing Dry Land Mafia In Adilabad - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌: గిరిజనుల మాటున బడా బాబులు ‘పోడు’దందా సాగిస్తున్నారు. అనాది నుంచి ఆదివాసీలు అడవిని ఆధారం చేసుకుని సంప్రదాయ పోడు సాగు చేస్తున్నంత కాలం అటవీ ఆక్రమణలు పెరగలేదు. ఎప్పుడైతే అటవీ అధికారులపై గిరిజనేతర, స్థానిక లీడర్ల పెత్తనం మొదలైందో అప్పటి నుంచి అక్రమ కలప రవాణా, భూకబ్జాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గతంలో పెద్ద ఎత్తున పచ్చని అడవిని నరికి సుదూర ప్రాంతాలకు అక్రమంగా కలప రవాణా సాగించి కోట్లు గడించిన వారున్నారు. గత కొంత కాలంగా కలప రవాణా కాస్త తగ్గుముఖం పట్టడంతో అక్రమార్కుల కన్ను అటవీ భూములపై పడింది. కబ్జాలకు పాల్పడుతూ పెద్ద ఎత్తున అటవీ భూములు సాగు చేస్తూ గిరిజనుల ముసుగులో అటవీ హక్కు పత్రాలకు డిమాండ్‌ చేస్తున్నారు. 

ప్రతి మండలానికో నేత..
జిల్లా వ్యాప్తంగా ఒక్కో మండలంలో ఒక్కో నేత స్థానికంగా ఉన్న పలుకుడిని ఉపయోగించుకుని పెద్ద ఎత్తున అటవీ భూములను చెరపడుతున్నారు. ప్రస్తుతం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా అటవీ అధికారులు ఈ కబ్జాల వివరాలు సేకరిస్తున్నారు. కాగజ్‌నగర్‌ మండలం సార్సాల ఘటనలో ఇదే తీరుగా పెద్ద మొత్తంలో భూ కబ్జాలకు పాల్పడడంతోనే చినికి చినికి గాలివానలా మారి దేశవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. ఇందులో చిన్న చిన్న రైతుల కంటే పెద్ద తలల చేతిలోనే   ఎక్కువ భూమి కబ్జాలో ఉన్నట్లు తేలింది. ఇక ఇదే మండలంలో పట్టణంలో ఉండే అనేక మంది పెద్ద ఎత్తున అటవీ భూములను సాగు చేస్తున్నవారు.

తమ అవసరాల కోసం ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఏటా పోడు సాగు చేస్తూ లక్షలు గడిస్తున్నారు. రేగులగూడ, ఊట్‌పల్లి లాంటి గిరిజన గూడెల్లో ఎకరాకు అతి తక్కువగా ముట్టుజెప్పి గిరిజన భూములను సాగు చేస్తూ కొంత మంది వ్యాపారులు లక్షలు గడిస్తున్నారు. ఇక ఆసిఫాబాద్‌ మండలం మోవాడ్, సిరియన్‌ మోవాడ్‌ లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో భూములు కౌలు పేరిట తీసుకుని లబ్ధి పొందుతున్నారు. కెరమెరి మండలంలో ఓ నేత వందల ఎకరాల్లో అనేక గ్రామాల్లో ఏజెన్సీ భూములను చెరపట్టి రెవెన్యూ భూములుగా మార్చేపనిలో ఉన్నారు. కుమురం భీం ప్రాజెక్టు ముంపు ప్రాంతంతో పాటు ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న భూములను తన కుటుంబ సభ్యుల పేర్ల మీద ఇప్పటికే బదాలింపు చేయించారు. ఇందుకోసం స్థానిక రెవెన్యూ అధికారులు కూడా సహకరించడంతో పెద్ద మొత్తంలో అటవీ భూమి పట్టాలుగా మారింది.

జైనూర్‌ మండల కేంద్రానికి చెందిన కొంత మంది వడ్డీ వ్యాపారులు తమ అప్పుల కింద భూములను తాకట్టు పెడుతున్నారు. వాంకిడిలో కొంత మంది వ్యాపారులు పెద్ద ఎత్తున వివాదాస్పద భూములు కొనుగోలు చేస్తున్నారు. వీటిపై పంట రుణాలు పొందడంతో పాటు పెట్టుబడి సాయం అందుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం అందించడం మొదలైనప్పటి నుంచి పోడుకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్‌ మరింత పెరిగిపోయింది.

బెజ్జూరు లాంటి ప్రాంతంలోనూ గిరిజనేతరులు కొద్ది మంది పది ఎకరాల కంటే అధికంగా సాగు చేస్తున్నవారు ఉన్నారు. ఇలా అమాయక గిరిజనుల జీవనోపాధి కోసం మొదలైన పోడు రానురానూ ఓ వ్యాపారంగా మారుతోంది. మరోవైపు రెవెన్యూ, అటవీ సరిహద్దుగా ఉన్న ప్రాంతాల్లో అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చేందుకు సైతం కొంతమంది సమగ్ర భూ సర్వేలో పట్టాపాస్‌ పుస్తకాలు పొందేందుకు తప్పుడు పత్రాలు సృష్టించి మరీ తమ పేరున దరఖాస్తులు చేసుకుంటున్నారు.

అమాయక గిరిజన రైతుల బలి..
బడా బాబులు అమాయక రైతుల ముసుగులో వందల ఎకరాలు కబ్జాలు చేస్తుండడంతో స్థానికంగా పోడు భూములపైనే ఆధారపడి జీవిస్తున్నవారికి అన్యాయం జరిగిపోయే పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ ముందుగా గిరిజనేతరుల కబ్జాలో ఉన్న అటవీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్‌ వేస్తోంది. ఎవరి దగ్గర ఎన్ని ఎకరాలు ఉన్నాయో వివరాలు సేకరిస్తోంది. అయితే కేవలం పోడు భూములపైనే పొట్టపోసుకునే అనేక మందికి తమ భూములు కూడా ఎక్కడ పోతాయోనని జిల్లాలో జరుగుతున్న వరస ఘటనలతో భయాందోళన మొదలవుతుంది

ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యామ్నాయ అటవీ పెంపకంలో భాగంగా కాగజ్‌నగర్, పెంచికల్‌పేట్, బెజ్జూరు, చింతలమానెపల్లిలో మొక్కలు నాటే పనిలో అటవీ అధికారులు ఉన్నారు. దీంతో చిన్న చిన్న రైతులు ఎకరం నుంచి మొదలై ఐదేకరాల లోపు ఉన్న వారు పోడు జీవనంగా బతికే వారికి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పోడుపై స్పష్టమైన విధానం ప్రకటించి అర్హులను గుర్తించి న్యాయం చేయాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement