అమ్మో పులి.. జంకుతున్న జనం | Tiger Tension In Adilabad And Khammam Agencies | Sakshi
Sakshi News home page

అమ్మో పులి.. జంకుతున్న జనం

Published Fri, Dec 18 2020 2:12 AM | Last Updated on Fri, Dec 18 2020 11:12 AM

Tiger Tension In Adilabad And Khammam Agencies - Sakshi

తెల్లవారకముందే నిద్ర లేచే పల్లె.. ఇప్పుడు సూరీడు నడినెత్తికొచ్చినా గడప దాటట్లేదు. పొద్దుగూకే వరకు పంట చేలల్లోనే గడిపే శ్రమజీవులు.. ఇప్పుడు పెందళాడే ఇంటికి చేరుకుంటున్నారు. పులి భయం పల్లెల్లో కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఇద్దరిని పొట్టన పెట్టుకుని.. రోజుకోచోట బయటపడుతున్న పులి జాడ అలజడి రేపుతోంది. ఏ క్షణంలో ఏ మూల నుంచి పంజా విసురుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటున్నారు. రైతులు, రైతుకూలీలు బయటకు అడుగుపెట్టలేని పరిస్థితుల్లో చేతికందిన పత్తి పంట ఇంటికి చేరనంటోంది. ఉమ్మడి ఆదిలాబాద్, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని అటవీ సమీప గ్రామాల్లో పులిదెబ్బకు ప్రజలదినచర్య, రోజువారీ కార్యకలాపాలు మారిపోయాయి. గుంపులుగా వెళ్లడం, పొలంలో పనిచేసే చోట డప్పు చప్పుళ్లు చేయడం, పులి బారిన పడకుండా ‘ముఖం మాస్కు’లు ధరించడం.. ఇంకా మరెన్నో జాగ్రత్తలతో బయట అడుగుపెడుతున్నారు.  ఈ పరిస్థితులపై‘సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌’..


చేలల్లో పత్తి విచ్చుకున్నవేళ.. రైతుల్లో ఆనందం అలముకోవాలి. కానీ, వారిలో భయాందోళన నెలకొంది.. చేతికొచ్చిన పంట ఇంటికి చేరాలి. కానీ, చేలల్లోనే రైతుల కోసం ఎదురుచూస్తోంది. ఎందుకంటే.. అడవిలో సంచరించాల్సిన పులి చేనుచెలకల్లో తిరుగుతోంది. కనబడినవారినల్లా పొట్టనపెట్టుకుంటోంది. కూలీలు వేకువజామునే బయలుదేరి ఉదయం ఆరుగంటలకల్లా పొద్దుతో పోటీపడి పత్తి చేలల్లో కనిపించేవారు. కానీ, పులి సంచారానికి భయపడి ఉదయం 10 గంటల తర్వాతే ఇంటి నుంచి బయలుదేరుతున్నారు. చీకటి పడిందంటే.. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని అటవీ సమీప ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో పులి సంచరించిన ప్రాంతాల్లో ‘సాక్షి’ పర్యటించింది. అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు స్థానికులతో మాట్లాడింది. 


సమయం ఉదయం పది గంటలు..
ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలం దిగిడ గ్రామంలో దిగాం. ఇక్కడే నవంబర్‌ 11న పులి దాడి చేసి సిడాం విగ్నేష్‌(21)ను పొట్టనబెట్టుకుంది. గ్రామ శివారులో కూలీలు గుంపులు, గుంపులుగా దారిలో మాకు ఎదురొస్తూ కనిపించారు. ఇంకొందరి చేతుల్లో ఉన్న డప్పులు అదేపనిగా మోగుతున్నాయి. మరికొందరు ప్లాస్టిక్‌ డబ్బాలతో చప్పుళ్లు చేస్తున్నారు. అసలు విషయమేమిటో కనుక్కుందామని.. అక్కడే ఉన్న కనక సాంబయ్య అనే కూలీని పలకరించగా... ‘పత్తి ఏరడానికి చేన్లకు పోతున్నాం. కా>నీ, పులి ఏడ నుంచి వచ్చి మీదపడ్తదో తెల్వక హడలిపోతున్నాం. సిడాం విగ్నేష్‌ని పొట్టనబెట్టుకుంది. అందుకే పులిని బెదరగొట్టడానికి డప్పుచప్పుళ్లు చేసుకుంటూ పొలాలకు పోతున్నం. మామూలుగానైతే వేకువజామున పత్తిచేలకు పోతం ’అని భయాందోళనతో చెప్పాడు. అక్కడ వారితో కొద్దిసేపు ముచ్చటించి మరో ఊరికి వెళ్లగా ఒక వ్యక్తి ఓ కుక్కను వెంటబెట్టుకొని వెళ్తూ కనిపించాడు. మరిచోట కొందరు యువకులు చేను చుట్టూ కాపాలా కాస్తుండగా కూలీలు పత్తి తీస్తున్న దృశ్యాన్ని ‘సాక్షి’గమనించింది. 

మాస్క్‌తో మస్కా..
మిట్ట మధ్యాహ్నం.. సూరీడు నెత్తిమీదికొచ్చా డు. ఎండ చురుక్కుమంటోంది. ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట్‌ మండలం కొండపల్లికి ‘సాక్షి’ చేరుకుంది. నవంబర్‌ 29న ఈ ఊరుకు చెందిన పసుల నిర్మల పత్తి చేనులో ఉండగా పులి దాడి చేసి చంపేసింది. గ్రామానికి దూరంగా ఉన్న పత్తి చేనులో ఓ చోట గుమిగూడి పత్తి తీస్తున్న కూలీలు కనిపించా రు. కొందరి తలలకు వెనుకభాగంలో మాస్కులు కనిపించాయి. ఎందుకలా అని అడిగితే, ‘రెండుకాళ్ల జీవాల మీద పులి సాధారణంగా దాడి చేయదు. నాలుగు కాళ్ల జంతువుల మీదే ఎక్కువగా పంజా విసురుతుంది. అయితే, మేం చేలల్లో వంగి పనిచేస్తున్నప్పుడు నాలుగు కాళ్ల జంతువని భ్రమించి దాడిచేసే ప్రమాదం ఉంది. తలలకు వెనుక వైపు మాస్కు ధరించి కనిపిస్తే.. అక్కడున్నది మనిషి అనుకొని దాడి చేయదు’ అని ఓ కూలీ చెప్పాడు.  

పులి.. కెమెరా ‘కంట’బడేనా?
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం కళ్లంపల్లిలో పత్తి చేనులో ప్లాస్టిక్‌ డబ్బాతో శబ్దం చేస్తూ ఓ యువకుడు కనిపించాడు. పులి జాడలను కనిపెట్టేందుకు కాటేపల్లి, ముక్కిడిగూడెం, బుడుగుఒర్రె, సుంపుటం, పాసినీళ్ల రోడ్ల వెంట ఏర్పాటు చేసిన కెమెరాలు కనిపించాయి. తాంసి(కె) శివా రు ప్రాంతాల్లో ఐదుచోట్ల అమర్చిన కెమెరాలను కనిపించాయి. ఈ పల్లె పెన్‌గంగా నదికి ఆనుకు ని ఉంటుంది. నదికి అవ తలి వైపు మహారాష్ట్ర భూ భాగం. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ పులుల అభయారణ్యం(టైగర్‌ జోన్‌) నుంచి తరచూ ఇటువైపు పులులు వస్తున్నాయని గ్రామస్తులు భయంభయంగా చెప్పారు. నెలకు ఒకటి రెండుసార్లు పులి కన్పిస్తోందని చెప్పారు. 

మంచె మీద మొనగాడు
మామూలుగానైతే కూలీలు కాలినడకన పొలం పనులకు వెళ్తుంటారు. కానీ, కొత్తగూడం జిల్లా గుండాల మండలం జగ్గయ్యగూడెంలో మాత్రం అందరూ కట్టకట్టుకుని ఒకే ట్రాక్టర్‌లో పొలం పనులకు వెళ్తుండటాన్ని ’సాక్షి‘గమనించింది. పాల్వంచ మండలం పాండురంగాపురంలో రైతులు ఊరేగింపు తీస్తున్నట్టుగా వెళ్తున్నారు. అందరి చేతుల్లోనూ కర్రలు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్లగా దారిలో పెంపుడు కుక్కను వెంటపెట్టుకుని పొలం వద్దకు వెళ్తున్న ఓ రైతు కనిపించాడు. మరోచోట చేనులో మంచె మీద ఒక యువకుడు చురుకుగా అటు, ఇటు చూస్తున్నాడు. పులి రాకను గమనించి కూలీలను అప్రమత్తం చేయడానికి ఇలా మంచె మీద ఉన్నట్టు ఆ యువకుడు ‘సాక్షి’కి వివరించాడు. గుండెలో దడను కళ్లల్లో కనిపించకుండా ఎంతో దైర్యంగా ఉన్నాడతడు. 

అదిగో పులి.. పోదాం ఇంటికి
సాయంత్రం నాలుగు గంటల వేళ.. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలంలోని తాంసి(కె) శివారులో కొందరు కూలీలు పత్తి చేలను వీడి అరుపులు, కేకలు వేస్తూ ఇళ్లకు వెళ్తుండటం ‘సాక్షి’కి గమనించింది. ప్రజ్వల్‌ అనే యుకుడిని పలకరించగా.. ‘ఒకసారి మా పశువుల మందపై పులిదాడి చేసి ఆవును చంపేసింది. అప్పటి నుంచి మందను అటవీలోకి తీసుకువెళ్లడం లేదు. పంట చేల సమీపంలోకే పశువులను మేత కోసం తీసుకెళ్తున్నాం’అని చెప్పాడు. చెబుతున్నప్పుడు అతడి కళ్లల్లో భయం స్పష్టంగా కనిపించింది.

సీతాయిగూడెంలో తాజాగా.. 
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతాయిగూడెం సమీపంలో గురువారం మిషన్‌ భగీ రథ వాటర్‌ ట్యాంక్‌ వద్ద పులి పాదముద్రలు కనిపించాయి. పులి అన్నపురెడ్డిపల్లి వెళ్లే రోడ్డు వరకు వచ్చి, తిరిగి అటవీ ప్రాంతం లోకి వెళ్లినట్లు భావిస్తున్నారు. 

పులుల సంఖ్య అధికం కావడం వల్లే...
ఒక్కసారిగా పులుల సంచారంతో కిన్నెరసాని, పాకాల, ఏటూరునాగారం అభయారణ్యాన్ని టైగర్‌ రిజర్వ్‌గా చేస్తారంటూ ఆయా జిల్లాల్లో చర్చలు జరుగుతున్నాయి. సహజంగా పులి దట్టమైన అడవి దాటి బయటకు రాదు. పులుల సంఖ్య పెరగడంతోనే అవి తమకు అనువైన ప్రాంతా న్ని వెతుక్కునేందుకు కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు నుంచి, మహారాష్ట్రలో ని చంద్రపూర్, తాడోబా, ఇంద్రావతి టైగర్‌ రిజర్వ్‌ల నుంచి మం చిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల మీదుగా ఈ పులులు కిన్నెరసాని అభయారణ్యానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

భయం గుప్పిట ఉన్న ప్రాంతాలివే

  • ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం తాంసి(కె), గొల్లఘాట్, పిప్పల్‌కోఠి గ్రామాలు 
  • ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలం దిగిడ, లోహా, కర్జి, రాంపూర్‌ పరిసర ప్రాంతాలు.. పెంచికల్‌పేట్‌ మండలం కొండపల్లి, గుండెపల్లి, అగర్‌గూడ, మెరెగూడ, లోడుపల్లి, కొండపల్లి, దరోగపల్లి, బొంబాయిగూడ పరిసర ప్రాంతాలు.. బెజ్జూర్‌ మండలం చిన్నసిద్దాపూర్, పెద్దసిద్దాపూర్, పాపన్నపేట, ఏటిగూడ, గబ్బాయి గ్రామాలు 
  • మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముక్కిడిగూడెం, కల్లెంపల్లి, సుంపుటం, రాజారాం, నాగారం, కాటేపల్లి, నీల్వాయి సమీప అటవీ ప్రాంతాలు 
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల్లో అటవీ ప్రాంతాలకు ఆనుకుని వందల గ్రామాలు ఉన్నాయి. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కిన్నెరసాని అభయారణ్యంలో ప్రవేశించాక మొదట గుండాల, ఆళ్లపల్లి, అశ్వాపురం, బూర్గంపాడు, పాల్వంచ, మణుగూరు, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి మండలాల్లో పులి సంచారం అధికంగా ఉంది. రోజుకో చోట పులి సంచారం వెలుగుచూస్తోంది. 
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement