ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో సంచారం
ప్రస్తుతం తిరుగుతున్న పులులు జానీ, ఎస్–12గా గుర్తింపు
పశువులపై దాడి చేసి చంపేస్తున్న వైనం..
అవి టైగర్ జోన్ వెలుపల జనావాసాల్లోకి వస్తుండటంపై ఆందోళన
పత్తి తీసే పనులు సాగడం లేదంటున్న గిరిజన రైతులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏటా శీతాకాలంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న పులులు.. ఉమ్మడి ఆదిలాబాద్ వాసుల్లో అలజడి రేపుతున్నాయి. జనావాసాలకు సమీపంలో సంచరిస్తూ.. పశువులపై దాడి చేసి చంపి తింటున్నాయి. ప్రస్తుతం జానీ, ఎస్–12గా పిలుస్తున్న రెండు పులులు తిరుగుతున్నట్టు గుర్తించారు. ఇలా పులుల రాకను అటవీ అధికారులు, పర్యావరణవేత్తలు స్వాగతిస్తుండగా.. అడవి సమీప ప్రాంతాల ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. పత్తి పంట చేతికొచ్చే వేళ పొలాలకు వెళ్లలేకపోతున్నామని గిరిజన రైతులు వాపోతున్నారు.
అక్కడ సరిపోక..
మ హారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యాలలో పులుల సంఖ్య పెరిగింది. అక్కడి ఇరుకు ఆవాసం వల్ల ఆ పులులు తెలంగాణ వైపు వస్తున్నాయి. వాటిలో మగపులులే అధికమని అధికారులు చెప్తున్నారు. గత నెల రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, కుంటాల, సారంగాపూర్, మామడ, పెంబి మండలాల్లో ఎనిమిదేళ్ల మగపులి(జానీ) సంచరిస్తున్నట్టు గుర్తించారు. సుమారు రెండేళ్ల వయసున్న మరో మగ పులి (ఎస్ 12) మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, బెల్లంపల్లి అటవీ ప్రాంతంలో తిరుగుతోంది. ఇంకో పులి కెరమెరి మండలంలోని లక్మాపూర్, కరంజివాడ ప్రాంతాల్లో కనిపించి వెళ్లిపోయింది.
ఇక్కడ కోర్ ఏరియాలోకి వెళ్లలేక..
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ జోన్ల నుంచి వస్తున్న పులులు.. కవ్వాల్‌లోని కోర్ ఏరియాకు చేరుకోవాలంటే, 200 కిలోమీటర్లకుపైగా నడవాలి. ఇది వాటికి పెద్ద సమస్య కాకపోయినా.. మధ్యలో జాతీయ రహదారులు, బొగ్గు గనులు, సాగునీటి ప్రాజెక్టులు, పోడు సాగు, పంట పొలాలు పులుల రాకకు ఆటంకంగా మారాయి. రహదారుల వెంట అండర్ పాస్‌లు, ఓవర్ పాస్‌లు ఏర్పాటు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. అయితే ఆ పులులు అడవి అంచుల్లోనే సంచరిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు కవ్వాల్ బయట కాగజ్‌నగర్ డివిజన్‌లో ఐదు పెద్దవి, నాలుగు చిన్నవి కలిపి 9 పులులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
మనుషులపై దాడులతో కలకలం
రాష్ట్రంలోకి వస్తున్న పులులు.. పశువులు, మనుషులపై దాడి చేస్తున్నాయి. 2020 నవంబర్‌లో 18 రోజుల వ్యవధిలో ఏ2 అనే మగపులి ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడకు చెందిన సిడాం విగ్నేశ్ (21)పై, పెంచికల్‌పేట మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల (18)పై పొలాల్లో దాడిచేసి చంపేసింది. గత ఏడాది నవంబర్‌లో మరో పులి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్‌కు చెందిన రైతు సిడాం భీము (69)పై దాడి చేసి ప్రాణాలు తీసింది. నాటి ఘటనల నేపథ్యంలో.. ఇప్పుడు అటవీ అధికారులు ఏజెన్సీ ప్రజలను అప్రమత్తం చేశారు.
కోర్ ఏరియాలోకి వెళ్లేలా చూస్తున్నాం..
టైగర్ జోన్ వెలుపల సంచరించే కొత్త పులులు కోర్ ఏరియాలోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నాం. వేటగాళ్లు ఉచ్చులు వేయకుండా, స్థానికులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పులి దాడి చేసిన పశువుల యజమానులకు వెంటనే పరిహారం ఇస్తున్నాం. పులి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం.
– శాంతారామ్, ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్టు టైగర్, కవ్వాల్ టైగర్ రిజర్వు
పులుల సంచారంతో భయంగా ఉంది
పులి భయంతో పత్తి తీసే పనులు సాగడం లేదు. మా చేన్ల వైపు పులి రాకుండా అటవీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే రైతులు చాలా నష్టపోతారు.
– ఆత్రం జైతు, భుర్కరెగడి గ్రామం, నిర్మల్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment