సాక్షి, దహెగాం(ఆదిలాబాద్): పులి భయాందోళన సృష్టిస్తోంది. స్థిర ఆవాసం ఏర్పాటు చేసుకోని వ్యాఘ్రం నిత్యం వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయపెడుతోంది. గత రెండు వారాలు కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఎక్కువగా తారసపడుతుంది. అడవిని వదిలి మైదాన ప్రాంతాల్లోకి వస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతుంది. స్థిర ఆవాసం ఏర్పాటు చేసుకోవడం మరచిన పులి నిత్యం దహెగాం, పెంచికల్‌పేట్, బెజ్జూర్, సిర్పూర్(టి) మండలాల్లో సంచరిస్తుంది.
పెద్దవాగు దాటి మైదాన ప్రాంతాల్లోకి వస్తూ భయాందోళనకు గురిచేస్తోంది. గతేడాది నవంబర్, డిసెంబర్ మాసంలో జిల్లాలో ఇద్దరిని హతమార్చింది. అప్పటి నుంచి పులి ఉనికిని చాటుకుంటుంది. మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుంచి ఉమ్మడి జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్‌కు నిత్యం రాకపోకలు సాగిస్తోంది. ఈక్రమంలో కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో సంచరిస్తోంది. ఇక్కడ అడవులు నరకడం, దట్టమైన ప్రాంతం లేకపోవడంతో దారి తప్పుతున్న పులి నిత్యం మైదాన ప్రాంతాల్లోకి వస్తోంది. ఈక్రమంలోనే పశువులు, మనుషులపై దాడులకు పాల్పడుతోంది.
పెరిగిన సంచారం..
ఇటీవల కాలంలో పులి సంచారం ఎక్కువగా పెరిగింది. దహెగాం మండలంలోని చెడ్వాయి అటవీ ప్రాంతం నుంచి ఆదివారం పెద్దవాగు దాటి ఐనం, పొలంపల్లి, పెసరికుంట, మంచిర్యాల జిల్లా భీమిని మండలం చినగుడిపేట శివారుకు వెళ్లింది. ఈక్రమంలో పత్తి చేలలో పనులు చేసుకుంటున్న రైతులు పులిని గుర్తించి భయాందోళనకు గురయ్యారు. అటవీ అధికారులకు సమాచారం అందించడంతో అడుగుల ఆధారంగా ట్రేస్ చేసే పనిలో పడ్డారు.
అలాగే ఆదివారం రాత్రి బెజ్జూర్ మండలం చిన్నసిద్దాపూర్ సమీపంలో పులి సంచరిస్తుండడంతో రమేశ్, నగేశ్ అనే వ్యక్తుల కంటపడింది. కేకలు వేయడంతో వెనుదిరిగింది. సిర్పూర్(టి) రేంజ్ పరిధిలో గత రెండు వారాలుగా పులి కదలికలు ఉన్నాయి. ఇటిక్యాల పహాడ్, నవేగాం, హుడ్కిలి, జక్కాపూర్, లక్ష్మీపూర్, భూపాలపట్నం, చింతకుంట, హీరాపూర్, కేశవపట్నం, లింబుగూడ, రావన్‌పల్లి గ్రామాల సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచరించింది. ఈక్రమంలో తరచూ పశువులపై దాడులకు పాల్పడుతూ హతమార్చుతోంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
చిక్కదు.. దొరకదు
నిత్యం పశువులపై దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్న పులి అధికారులకు మాత్రం చిక్కడం లేదు. గతేడాది నవంబరులో దహెగాం మండలంలోని దిగిడ గ్రామానికి చెందిన సిడాం విగ్నేష్ అనే యువకుడిని పులి హతమార్చింది. అదే నెలలో పెంచికల్‌పేట్ మండలం కొండపల్లికి చెందిన యువతిని పైతం పత్తి చేనులో చంపింది. దీంతో పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసి లేగదూడలను ఎరగా పెట్టారు.
అయినా పులి బోన్ల వైపు రావడం లేదు. డివిజన్ పరిధిలో నాలుగు పులులు సంచరిస్తున్నట్లు అధికారులు గతంలోనే ప్రకటించారు. అయితే ఎప్పుడు ఏ పులి వస్తుందో తెలియకుండా ఉంది. సరిహద్దుకు అవతలి వైపు అటవీ అధికారులు అధునాత సాంకేతికతో పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడి అధికారుల సాయంతో పులిని బంధించేందుకు యత్నించినా దీనిపై అధికారులు
అంతగా దృష్టి సారించడం లేదు
పులి నుంచి అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించడం మినహా అధికారులు ఎలాంటి ప్రత్యేక చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో మరో ప్రాణనష్టం సంభవించక ముందే పులిని పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని రైతులు, అటవీ సమీప గ్రామాల ప్రజలు విన్నవిస్తున్నారు.
మహారాష్ట్ర నుంచి రాకపోకలు..
మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుంచి కాగజ్‌నగర్ కారిడార్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న పులి కవ్వాల్ అభయారణ్యంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచించారు. అందుకనుగుణంగా అటవీ అధికారులు భారీగా నిధులు ఖర్చు చేసినా పులి మాత్రం కవ్వాల్‌కు రావడం లేదు. మహారాష్ట్రతో సరిహద్దు ఉన్న కాగజ్‌నగర్ డివిజన్‌లోనే నిత్యం సంచరిస్తుంది. మహారాష్ట్రలోని వీరూర్, దాబా రేంజ్ పరి«ధి నుంచి ఇటీవల పులి రాకపోకలు ఎక్కువయ్యాయి. సిర్పూర్(టి)– వీరూర్ అటవీప్రాంతాల గుండా పులి ఆనవాళ్లను అధికారులు ట్రేస్ చేశారు.
చదవండి: Karimnagar: అత్తగారింట్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment